నేను ఒక్క మాట అంటే ఆయన తల మీద ఒత్తిడి చేస్తున్న వెయ్యేనుగుల భారం కాస్తంత తగ్గే అవకాశం ఉంది. కాని ఆ మాట అనడానికి నాకు మనసు రావడం లేదు.
నేనేం హౄదయం లేని వాణ్ణి కానండోయ్. కాని ఆ క్షణం నా నోరు ఎందుకు మూతబడిపోయింది? మా మామయ్య పడే అవస్థని చూస్తూ కూడా అలా నిర్లిప్తంగా ఎందుకు ఉండిపోయాను?
"లేదు, లేదు. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు," నాలో నేనే అనుకున్నాను. "బయలుదేరాలన్న ఆలోచన గనక ఆయనకి వస్తే ఇక ఆయన్ని ఆపగల శక్తి ఈ భూప్రపంచం మీద లేదు. ఆయన మనసొక అగ్నిపర్వతం. చరిత్రలో ఇక ఏ భౌగోళిక శాస్త్రవేత్త సాధించినది సాధించడానికి ఆయన ప్రాణాలకైనా తెగిస్తాడు. మౌనంగా ఉండడమే శ్రేయస్కరం. ఏదో అనుకోకుండా తెలిసొచ్చిన రహస్యాన్ని నాలోనే దాచుకుంటాను. ఆ రహస్యం గాని బయటపడిందంటే అది ప్రొఫెసర్ లీడెంబ్రాక్ చావుకి కూడా దారితీయగలదు! కావలిస్తే ఆయనంతకి ఆయన్నే ఆ రహస్యాన్ని కనుక్కోనివ్వండి. కాని నేను మాత్రం తెలిసి తెలిసి ఆయన వినాశనానికి దారి తీసే పని చెయ్యను."
అలా నిర్ణయించుకున్నాక ఇక మెదలకుండా చేతులు కట్టుకుని కూర్చున్నాను. కాని కొద్ది గంటల్లో ఏం జరుగబోతుందో ఆ క్షణం ఊహించలేకపోయాను.
ఇంతలో మార్కెట్టుకి బయలుదేరబోయిన మార్తా వీఢి తలుపుకి తాళం వేసి ఉండడం గుర్తించింది. ద్వారంలో ఉండే పెద్ద తాళం లేదు. ఎవరు తీసి ఉంటారబ్బా? రాత్రి షికారుకి వేళ్లి తిరిగి వచ్చినప్పుడు మా మామయ్యే తీసి ఉండాలి.
అలా కావాలని చేసి ఉంటారా? లేక పొరపాట్న జరిగిందా? ఇంట్లో అందరూ పస్తులుండాలని ఆయన ఉద్దేశమా? ఇది మారీ దారుణంగా ఉందే! నాకు, మార్తాకి ససేమిరా ఇష్టం లేని విషయం గురించి మేమెందుకు పస్తులు ఉండాలి? కొన్నేళ్ళ క్రితం మా మామయ్య ఒకసారి తన ఖనిజ విశ్లేషణలో పడి నలభై ఎనిమిది గంటల పాటు ఏమీ తినకుండా పని చేశారు. ఆయన చేసిన ఆ వైజ్ఞానిక నిరాహార దీక్షలో మేం కూడా విధిలేక పాలు పంచుకోవాల్సి వచ్చింది. నేనైతే ఆ సందర్భంలో అనుభవించిన తీవ్రమైన కడుపునొప్పి ఒకసారి గుర్తొచ్చింది. ఎదిగే వయసులో ఉన్న కుర్రాణ్ణి ఇలా ఆకాలి బాధకి గురి చేస్తే ఇంకేం జరుగుతుంది?
ముందు రాత్రి ఎలాగో ఉపవాసం ఉన్నాం. కాని ఉదయం టిఫిను దగ్గర కూడా ఉపవాసం తప్పేట్టు కనిపించడం లేదు. కాని ఆకలిని జయించి నా పరువు నిలబెట్టు కోవాలని అనుకున్నాను. అలా ఇంట్లో బందీగా పడి ఉండటం నాకు ఇంకో కారణం వల్ల కూడా చాలా బాధ కలిగిస్తోంది. నిర్బంధిత ప్రేమికుడి బాధని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదనుకుంటాను.
మా మామయ్య చేసే మానసిక పరిష్రమ నిరాఘాటంగా సాగుతోంది. ఆయన మనసు ఏవో సుదూర లోకాల్లో తేలిపోతోంది. పృథ్వికి ఎంతో దూరంగా విహరిస్తున్న ఆయన మనసు, పార్థివమైన తాపత్రయాలని కూడా మర్చిపోయినట్టుంది.
మధ్యాహం కావస్తోంది. కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయి. ప్రమాదాన్ని పసిగట్టని మార్థా ముండు రాత్రి మిగిలిన వన్నీ ఊడ్చేసింది. కనుక ఇక ఎంట్లో తినడానికి ఒక గింజ కూడా లేదు. అయినా కిక్కురు మనకుండా కూర్చున్నాను. పరువు నిలబెట్టుకోవాలిగా మరి!
గడియారం రెండు కొట్టింది. ఇక భరించ లేకపోయాను. అనవసరంగా ఆ రహస్య పత్రానికి మరీ ఎక్కువ ప్రాముఖ్యత నిస్తున్నానేమో అనిపించింది.
మా మామయ్య దాన్ని ఏదో ఒక పొడుపుకథ లాగా తీసుకుంటాడని అనుకున్నాను. దాన్ని ససేమిరా నమ్మడని అనుకున్నాను. మరీ అంతగా ఆయన సాహస యాత్ర మీద బలుదేరతాను అని గొడవ చేస్తే, ఇద్దరం కలిసి ఇంట్లో ఆయన్ని బలవంతంగా కట్టి పడేయగలం అనుకున్నాను. అయినా అసలు నేను చెప్పినా, మానినా కాసేపు ఉంటే రహస్యాన్ని ఆయనకి ఆయనే కనుక్కోగలడేమో.
మీ వర్ణన అద్భుతం, అమోఘం .తెలుగులో ఈరేంజ్ లో సైన్సును,కాల్పనిక విజ్ఞాన సాహిత్యాన్ని అందిస్తున్న(వివరిస్తున్న) మీకు ధన్యవాదాలు.
కృతజ్ఞతలు...