మామూలుగా మనందరిలో మేలుకున్న స్థితిలో అనుక్షణం ’నేను’ అన్న భావన ఎప్పుడూ నేపథ్యంలో ఉంటుంది. ఆ భావనని కలిగించే శక్తులని గురించి, కారణాల గురించి మనం ఎప్పుడూ పట్టించుకోం. కారణాలు ఏమైతేనేం? ’నేనున్నాను!’ అదీ మన ధీమా!
మన మనసులలో పరస్పర విరుద్ధమైన ఆలోచనలు కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా ఆ ఆలోచనలన్నీ ఆ ’నేను’ అన్న ఒక్క వ్యక్తిలోనే కలుగుతున్నాయనే మనకి అనిపిస్తుంది.
కాని మెదడులో సమూలమైన మార్పులు వచ్చిన కొన్ని పరిస్థితులలో మనలో ఎప్పుడూ అనుభవమయ్యే ఒక్క ’నేను’ కి బదులు ఎన్నో ’నేను’ లు ఉన్న భావన కలుగుతుంది. అలాంటి పరిణామాలకి ఉదహరణే ’మెదడు విభజన ప్రయోగాలు’.
ఈ ప్రయోగాల గురించి చెప్పుకునే ముందు మెదడు గురించి కొంచెం చెప్పుకోవాలి. మనిషి మెదడు రెండు విభాగాలుగా, గోళార్థాలుగా విభజించబడి ఉంటుందని అందరికీ తెలుసు. ఒక్కొక్క గోళార్థం కొన్ని ప్రత్యేక క్రియలని శాసిస్తుంది. ఈ రెండు గోళార్థాలని కలుపుతూ ఒక పెద్ద నాడీ తీగల కట్ట ఉంటుంది. దీని పేరు కార్పస్ కల్లోసం. ఈ కార్పస్ కల్లోసం ఉండే 200-250 మిలియన్ తీగల ద్వార సమాచారం ఒక గోళార్థం నుండి రెండో గోళార్థానికి చేరుతూ ఉంటుంది. ( కార్పస్ కల్లోసం కాకుండా ఆంటీరియర్ కమ్మిషర్ అనే మరో తీగల కట్ట ద్వారా కూడా మెదడు గోళార్థాల మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది.)
కుడి ఎడమైతే?
మనలో అధిక శాతం (90%) మంది కుడి చేతి వాటం వారే అయ్యుంటారు. తినటం, తాగటం, రాయటం మొదలైన సామాన్య దైనిక చర్యలన్నీ వీళ్లు కుడి చేత్తోనే చేస్తారు. అంటే వాళ్లు కుడి చేతి ప్రాధాన్యత (వాటం) (right-hand dominant) గల వారు అని చెప్పుకుంటాం. అలాగే ఎడమ చేయి ఎక్కువగా వాడే వారిని ఎడమ చేతి ప్రాధాన్యత (వాటం) (left-hand dominant) గల వారిగా చెప్పుకుంటాం. కొంత మంది రెండు చేతులతోను సమానమైన ఒడుపుని ప్రదర్షిస్తారు. భారత కథలో అర్జునుడు అలాంటి సామర్థ్యం గల వాడని మనం చదువుకుంటాం.
మెదడులో కుడి భాగం ఎడమ వైపు ఉండే కండరాలని శాసిస్తుంది. అలాగే మెదడులో ఎడమ భాగం కుడి వైపున ఉన్న కండలని శాసిస్తుంది. మెదడులో ఎడమ వైపున ఉండే ఇంద్రియాల (ఎడమ కన్ను, ఎడమ చేయి) మొదలైన నుండి వచ్చే సమాచారం కుడి మెదడుని చేరుతుంది. అలాగే కుడి వైపు నుండి వచ్చే సమాచారం ఎడమ మెదడుని చేరుతుంది. కనుక మెదడులో ఒక సగం దెబ్బతింటే శరీరంలో అవతలి సగంలో క్రియలు దెబ్బతింటాయి.
కుడి చేతి వాటం గల 99% లో భాషా సంబంధమైన క్రియలు ఎక్కువగా ఎడమ మెదడులోనే జరుగుతాయి. ఎడమ చేతి వాటం గల వారిలో కూడా 70-80% మందిలో భాషా సంబంధమైన క్రియలు ఎడమ మెదడులోనే జరుగుతాయి. 1860-1870 ప్రాంతాల్లో పాల్ బ్రోకా, వెర్నికీ అనే న్యూరాలజిస్టులు, మెదడులో ఎడమ పక్క రెండు ప్రత్యేక ప్రాంతం దెబ్బ తిన్న రోగుల్లో భాషా సంబంధమైన క్రియలు దెబ్బ తినడం గమనించారు. కుడి పక్క దెబ్బ తిన్న వారిలో భాషా సంబంధమైన సమస్యలు పెద్దగా లేవు. ఈ రెండు ప్రాంతాలకి బ్రోకా ప్రాంతం అని, వెర్నికీ ప్రాంతం అని వాటిని కనుక్కున్న వారి పేర్లే పెట్టారు.
బ్రోకా ప్రాంతం
వెర్నికీ ప్రాంతం
:) !!!
_ vasu.Bojja