ఈ ప్రస్తావనని ఎలా తీసుకు రావాలా అని అదను కోసం ఎదురు చూస్తుంటే అంతలో ప్రొఫెసరు మామయ్య తటాలున లేచి, టోపీ పెట్టుకుని, బయటకి నడవబోయాడు. ఈ సారి బయటికి వెళ్లేది కొంపతీసి మళ్లీ మమ్మల్ని లోపల పెట్టి తాళం వెయ్యడానికి కాదుగద!
"మామయ్యా!" గట్టిగా అరిచాను.నా కేక ఆయనకి వినిపించినట్టు లేదు."లీడెంబ్రాక్ మామయ్యా" ఈ సారి కూత మరి కొంచెం పెద్దది చేసాను."ఆ!" నిద్రలోంచి ఉలిక్కిపడి మేలుకున్న వాడిలా ఉంది ఆయన స్పందన."మామయ్యా, ఆ తాళం చెవి!" "ఏ తాళం చెవి? ముందు తలుపుదా?""అయ్యో లేదు, లేదు!" ఆదుర్దాగా అన్నాను. "ఆ పత్రంలో దాగిన రయషాన్ని బట్టబయలు చెయ్యగల తాళం!"ఆ కళ్లజోడు మీదుగా ఓ సారి నాకేసి నిశితంగా చూశాడు మావయ్య. నా ముఖ కవళికలలో తనకి ఏం కనిపించిందో ఏమో. గట్టిగా నా జబ్బ పట్టుకుని మౌనంగా, ఆత్రంగా నా కళ్లలోకి చూశాడు. ఆ కళ్లో ఒకే ఒక నిశిత ప్రశ్న. ఒక్క మాట కూడా లేకుండా వేసిన ప్రశ్నలో అంత ధాటి ఉంటుందని అప్పుడే తెలిసింది.
నేను అవును అన్నట్టుగా తల పైకి కిందకి ఆడించాను.
ఆయన కాదు అన్నట్టుగా తల అటు ఇటు ఊపాడు. నేను నిజమే అన్నట్టుగా మారో సారి తలాడించాను.
ఆయన కళ్లలో ఓ మెరుపు మెరిసింది.
అసలే ఉద్విగ్న భరితమైన తరుణాన్ని మా మౌన సంవాదం మరింత ఉద్విగ్న భరితం చేసింది. నోరు విప్పి ఏదైనా చెప్పాలన్నా చాలా భయంగా ఉంది. ఎందుకంటే నోరు జారి ఏదైనా అన్నానంటే ఆనందం పట్టలేక మా మామయ్య నన్ను కావలించుకుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తే ఏం అఘాయిత్యం జరుగుతుందో నని నా భయం. కాణి ఇక పరిస్థితి విషమిస్తోందని తెలిసి తడబడుతూ అన్నాను:
"అవును ఆ రహస్యమే. ఇందాక పొరపాట్న...""ఏమిటి నువ్వనేది?" నమ్మలేనట్టుగా అన్నాడు."అదుగో, కావాలంటే అది చదువుకో" అంటూ ఇందాక నేను రాసిన కాగితాన్ని అందించాను."కాని ఇందులో ఏం లేదే!" కాగితాన్ని చుట్ట చుట్టి అవతల పారేస్తూ అన్నాడు."లేదు లేదు. అది అర్థం కావాలంటే వెనుక నుండి ముందుకి చదవాలి." నేనా వాక్యం పూర్తి చేశానో లేదో మామయ్య ఒక్కసారి అరిచాడు. కాదు గర్జించాడు. ఏదో అపురూపమైన సత్యం ఆయన చిదాకాశంలో మెరుపులా మెరిసింది. ఒక్క క్షణంలో ఆయన వాలకం పూర్తిగా మారిపోయింది!"వార్ని, సాక్నుస్సెం!" అరిచాడు. "వాక్యాన్ని తిరగ రాసి మమ్మల్ని బోల్తా కొట్టించాలి అనుకున్నావా?"ఆయన కళ్లు ఆ కాగితాన్ని వేగంగా చదువుతున్నాయి. కళ్లు చెమర్చాయి. పత్రాన్ని మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు చదివాడు.అందులో ఇలా వుంది - In Sneffels Joculis craterem quem delibat Umbra Scartaris Julii intra calendas descende, Audax viator, et terrestre centrum attinges. Quod feci, Arne Saknussemm.
పై లాటిన్ వాక్యాన్ని ఉజ్జాయింపుగా తర్జుమా చెయ్యాలంటే -
"ఓ యాత్రికుడా! జూలై నెల ఆదిలో స్కార్టారిస్ నీడ పడే స్నెఫెల్స్ లోని జోకుల్ కి చెందిన పాతాళ బిలం లోకి అవరోహించు. భూమి కేంద్రాన్ని చేరుకుంటావు. ఆ యాత్రని నేను చేశాను, ఆర్నే సాక్నుస్సెం!"
అది చదివిన మా మామయ్య లేడెన్ జాడీ తగిలి షాక్ తగిలిన వాడిలా ఎగిరి పడ్డాడు. ఇక ఆయన ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని పట్టఆడ్నికి రెండు చేతులు చాలవు. ఆ గదిలో ఆయన చేసిన తాండవాన్ని చూడడానికి రెండు కళ్లూ చాలవు. రెండు చేతులతో కాసేపు తల పట్టుకున్నాడు. తన పుస్తకాలని దోతులుగా పేచాడు. ఎదురుగా ఉన్న ఏదో వస్తువుని ఓ సారి కాల్తో తన్నాడు. మరో వస్తువు మీద చేత్తో గుద్దాడు. ఆ విధంగా చిత్రవిచిత్ర చేష్టలెన్నో చేసి ఇక సత్తువ లేక మెత్తని తన మడత కుర్చీలో చతికిల పడ్డాడు.
"టైము ఎంతయ్యింది?" కాసేపు మౌనం తరువాత అడిగాడు.
"మూడు గంటలు" సమాధానం చెప్పాను.
"నిజంగానా? భోజనం వేళ దాటిపోయిందే. ఆ ధ్యాసే లేదనుకో. పద పద. ఆకలి చంపేస్తోంది. భోజనం తరువాత...""ఆ(! తరువాత?" కొంచెం ఆదుర్దాగానే అడిగాను."భోజనం తరువాత నా పెట్టె సర్దు.""ఏంటీ?""నీ పెట్టె కూడా." విసుగు వేసట తెలీన ఆ నిర్విరామ శ్రామికుడు, మృగ రాజు తన గుహలోకి ప్రవేశిస్తున్నట్టు, భోజనాల గదిలోకి ప్రవేశించాడు.
0 comments