ఆ పత్రాలని తిరిగ్ మెండెల్ కే తిప్పి కొట్టాడు. మెండెల్ నిరుగారి పోయాడు. (1865-1869) ప్రాంతాల్లో మెండెల్ తన పత్రాలని కాస్తో కూస్తో పేరున్న పత్రికల్లో ప్రచురించగలిగాడు. కాని అత్యుత్తమ పత్రికలలో మాత్రం అవి స్థానాన్ని సంపాదించలేకపోయాయి.
ప్రముఖుల ఆమోదం, సిఫారసు లేకపోవటం వల్ల అవి మూలన పడ్డాయి.
ఈ పరిణామానికి మెండెల్ ఎంతగా క్రుంగిపోయాడంటే ఇత మొక్కలతో తన ప్రయోగాలని పూర్తిగా నిలిపేశాడు. 1868 లో తను ఉంటున్న ఆశ్రమానికి అధికారి అయ్యాడు. శేష జీవితం అంతా ఆ ఆశ్రమ వాసానికి అంకితం చేసి దైవచింతనలో కాలం వెళ్లబుచ్చాలని నిశ్చయించుకున్నాడు. తన భావాలాని ఏ నాటికైనా గుర్తింపు వస్తుందో లేదో నన్న బెంగతోనే చివరికి 1884 లో కన్నుముషాడు. ఆ గుర్తింపు తను ఊహించనంత పెద్ద ఎత్తులో వస్తుందని పాపం అతడికి తెలీదు. ఫాన్ నగెలీ 1891 లో కన్ను మూశాడు. తను చేసింది ఎంతపెద్ద పొరబాటో తెలీకుండానే పోయాడు. వైజ్ఞానిక రంగంలో అతడు ఎంత సాధించినప్పటికీ మెండెల్ విషయంలో పొరబాటు చేసిన అపవాదే అతడికి చివరికి అతడికి మిగిలింది.
మెండెల్ పత్రాలు ప్రచురితం అయిన ముప్పై ఏళ్ల దాకా ఎవరూ ఆ పరిశోధనలని పట్టించుకోలేదు.
2. డీ వ్రీస్ - ఉత్పరివర్తనలు ( mutations)
భౌతిక లక్షణాల అనువంశికత ప్రతీసారి మనం ఇంతవరకు చూసినంత యాంత్రికంగా, నిర్దిష్టంగా జరగదు. మొక్కల, జంతువుల సంతతి ఎప్పుడూ కచ్చితంగా తమ తల్లిదండ్రుల పోలికలోనే పుట్టాలని నియమం ఏం లేదు.
మొక్కల్లో, జంతువుల్లో అప్పుడప్పుడు తల్లిదండ్రులతో, తోబుట్టువులతో సంబంధం లేనట్టుగా సంతతి పుట్టటం కనిపిస్తుంది. అది చూస్తే అనువంశికతని కాపాడే యంత్రాంగం ఎక్కడయినా దెబ్బ తిన్నదా అనిపిస్తుంది.
ఇక కొన్ని సార్లయితే ఎక్కడో పొరబాటు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తుంది. పుట్టిన మొక్క యొక్క, జంతువు యొక్క రూపం వికారంగా ఉంటుంది. రెండు తలల దూడలు మొదలైనవి ఆ వికారాలకి ఉదాహరణలు. అలాంటి జీవాల ఆయుష్షు కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వైపరీత్యాలని ఒకప్పుడు స్పోర్ట్స్ (ఆటలు) అనేవారు. ఈ సందర్భాలలో ప్రకౄతి ఏదో వికృతమైన ఆటలు ఆడుతోందని ఇక్కడ ఉద్దేశం.
వెనకటి రోజుల్లో అలాంటి వికారమైన పుట్టుక దేవతల ఆగ్రహానికి సంకేతం అనుకునేవారు. ఆ పుట్టుక ప్రకృతి విరుద్ధం కనుక ప్రకృతికి విరుద్ధమైన తదితర సంఘటనలు కూడా ఏవైన జరుగుతాయేమోనని ఎదురుచూసేవారు. ఏం ఉపద్రవం జరుగుతుందోనని భయపడేవారు. అందుకే ఈ sports ని monsters (వికటకాయులు) అని కూడా పిలిచేవారు. ఈ మొన్స్తెర్స్ అనే పదం లాటిన్ లో "శకునం" లేదా "హెచ్చరిక" అన్న అర్థం గల పదం నుండి వచ్చింది.
ఈ వికృతులని ఎక్కువగా పెంపుడు జంతువులలో గమనించేవారు. కాని రైతులు, గొర్రెల కాపర్లు మాత్రమే వాటిని గమనించేవారు. పైగా అలా పుట్టిన జంతువులు తొందరగా చచ్చిపోతూ ఉండేవి. ఇక మానవ శిశువులు ఎవరైనా వికారంగా పుడితే అది ఎవరికీ తెలీకుండా గోప్యంగా ఉంచేవాళ్లు. ఆ శిశువుల ఆయుర్దాయం కూడా తక్కువగానే ఉండేది.
0 comments