"కాని అది అసంభవం!" అరిచినంత పని చేశాను. అసలు ఆ ఆలోచనకే నా ఒళ్లు గగుర్పొడుస్తోంది.
"అసంభవమా?" ఎదురు ప్రశ్న వేశాడు ప్రొఫెసర్ మామయ్య. "ఎందుకో కొంచెం సెలవిస్తావా?"
"ఎందుకంటే... ఎందుకంటే ఆ బిలం లావా తోను, రగిలే రాతి కణికల తోను నిండి ఉంటుంది కనుక."
"బహుశ అది అంతరించిపోయిన అగ్నిపర్వతం అయితేనో?"
"అంతరించి పోయిన అగ్నిపర్వతమా?"
"అవును. భూమి మీద ప్రస్తుతం సక్రియంగా ఉన్న అగ్నిపర్వతాల సంఖ్య కేవలం ౩౦౦ మాత్రమే. కాని అంతరించిపోయిన అగ్నిపర్వతాల సంఖ్య చాలా ఎక్కువ. ఈ స్నెఫెల్స్ అలాంటి పర్వతమే. చరిత్ర తిరగేస్తే 1219 లో ఈ పర్వతం ఓ సారి విస్ఫోటం చెందింది. ఆ తరువాత క్రమంగా స్థబ్దుగా మారిపోయింది. ఇప్పుడది సక్రియ అగ్నిపర్వతాలలో ఒక్కటని ఎవరూ అనుకోరు."
అలాంటి బలమైన వాదనలకి నా వద్ద సమాధానం లేకపోయింది. కనుక పత్రంలో మరి కాస్త అయోమయంగా ఉన్న భాగాల మీదకి నా దృష్టి మళ్లించాను.
"మరైతే ఈ స్కార్టారిస్ అన్న పదానికి అర్థమేమిటి? దానికి జులై కి చెందిన ’కాలెండ్’లకి సంబంధం ఏమిటి?"
మామయ్య కొద్ది నిముషాలు ఆలోచనలో పడ్డాడు. ఒక్క క్షణం నాలో ఓ ఆశాదీపం వెలిగి అంతలోనే ఠక్కున ఆరిపోయింది. మామయ్య సమాధానం చెప్పడానికి గొంతు సవరించుకున్నాడు.
"నీకు అయోమయంగా అనిపించింది నాకు స్పష్టంగా కనిపిస్తోంది. సాక్నుస్సెం తన రహస్యాన్ని ఎంత యుక్తిగా దాచుకున్నాడో ఈ పదం తెలుపుతోంది. స్నెఫెల్స్, లేదా స్నెఫెల్, లో ఎన్నో పర్వత బిలాలు ఉన్నాయి. ఇందులో భూమి కేంద్రం వరకు పోయే బిలం ఏదో కచ్చితంగా చెప్పాలి. దానికి ఈ ఐస్లాండ్ పండితుడు ఏం చేశాడో తెలుసా? జులై యొక్క ’కాలెండ్’ లు దగ్గర పడుతుంటే, అంటే జూన్ నెల చివరి రోజుల్లో, స్కార్టారిస్ అనే పర్వత శిఖరం యొక్క నీడ ఈ ప్రత్యేక పర్వతబిలం యొక్క ముఖద్వారం మీద పడుతుంది. ఇంతకన్నా నిర్ద్వంద్వంగా ఈ విషయాన్ని తెలపడం సాధ్యం కాదు. ఒకసారి స్నెఫెల్ శిఖరాన్ని చేరుకున్నామంటే ఇక అక్కణ్ణుంచి ఎలా వెళ్ళాలో స్పష్టంగా తెలుస్తుంది."
ఇక చేసేదేమీ లేదు. నా అభ్యంతరాలు అన్నిటికీ మామయ్య సమాధానాలు చెప్పాడు. రహస్య పత్రం గురించి ఆయన అవగానలో దోషాలు ఎంచడం ఇక అయ్యేపని కాదని అనిపించింది. కనుక ఇక ఆ విషయం జోలికి పోలేదు. కాని పత్రం మాట అటుంచి యాత్రకి సంబంధించిన వైజ్ఞానిక అభ్యంతరాలు ఉన్నాయి. ఆ ప్రస్తావనే తెచ్చాను.
"సరే ఒప్పుకుంటాను. సాక్నుస్సేం సందేశంలో సందేహం లేదని ఒప్పుకుంటాను. అందులోని సమాచారం అంతా నమ్మదగ్గదేనని కూడా ఒప్పుకుంటాను.
ఆ మహా పండితుడు స్నెఫెల్స్ దిగువలో, జులై కాలెండ్స్ మొదట్లో, స్కార్టారిస్ శిఖరపు నీడ పర్వత బిలం యొక్క ముఖద్వారాన్ని తాకడం స్వయంగా చూశాడనే ఒప్పుకుంటాను. భూమి కేంద్రానికి తీసుకుపోగల పర్వత బిలాల గురించి ఆ రోజుల్లో చలామణిలో ఉన్న ఏవో ప్రాచీన గాధల గురించి అతడు విని ఉంటాడని ఒప్పుకుంటాను. కాని ఆ యాత్ర తానే స్వయంగా చేసి, క్షేమంగా తిరిగొచ్చాడంటే మాత్రం ... ఉహు(. ససేమిరా నమ్మను. అతనా యాత్ర చెయ్యలేదంటాను."
"ఎందుకో?" మామయ్య ప్రశ్నలో వ్యంగ్యం ధ్వనిస్తోంది.
"వైజ్ఞానిక సిద్ధాంతాల సహాయంతో చూస్తే ఆ యాత్ర అసంభవం, ఆచరణీయం కాదనే అనిపిస్తోంది."
"వైజ్ఞానిక సిద్ధాంతాలా? అయ్యో! అవి అడ్డొచ్చాయేం పాపం?" అమాయకంగా అడుగుతున్నట్టు అడిగాడు మామయ్య. ఆ మాటల్లో వెక్కిరింత ఉంది.
అయినా ధైర్యం చెప్పుకుపోయాను.
0 comments