"హా(!" ఖంగుతిన్నట్టుగా అన్నాను. "అయినా ఈ పత్రానికి ప్రతికూలంగా ప్రతివాదనలన్నీ నేను ఇంకా వివరించనే లేదు."
"వివరించు బంగారూ! నీ తనివి తీరా అన్నీ వివరించు. ఈ క్షణం నుండి నువ్వు కేవలం నా మేనల్లుడివి మాత్రమే కావు. నా సహోద్యోగివి. ఊ, చెప్పు చెప్పు. వింటున్నా!"
"మనం మొట్టమొదట తేల్చుకోవలసిన విషయం ఏంటంటే ఈ జోకుల్, ఈ స్నెఫెల్స్, ఈ స్కార్టారిస్ ఈ పదాలకి అర్థం ఏంటి? ఈ పదాలు నేనెప్పుడూ విన్లేదు."
"ఓహ్! అదా? చాలా సులభం. ఆ మధ్యన లీప్జిగ్ లో ఉండే నా మిత్రుడు ఆగస్టస్ పీటర్మన్ ఓ మ్యాపు పంపించాడు. ఈ సందర్భంలో అది సరిగ్గా పనికొస్తుంది. అలమరలో రెండవ్ అరలో, మూడవ అట్లాస్ తీసుకురా. అక్షర క్రమంలో Z అక్షరం కింద, చిత్రం 4 చూడు."
సూచనలు అంత కచ్చితంగా ఉన్నప్పుడు పొరబాటు జరిగే అవకాశం తక్కువ. లేచి వెళ్లి ఆయన చెప్పిన అట్లాస్ పట్టుకొచ్చాను. అట్లాస్ తెరుస్తూ ఆయన అన్నాడు -
"ఐస్లాండ్ కి చెందిన అత్యుత్తమైన మ్యాప్ ఇదుగో. హండర్సన్ తయారు చేసిన మాప్ ఇది. నీ సమస్యలన్నిటికి ఈ మ్యాప్ సమాధానం చెబుతుంది."
నేను మ్యాప్ మీదకి వంగి పరిశీలించడం ప్రారంభించాను.
"ఓ సారి ఈ అగ్నిపర్వత ద్వీపాన్ని చూడు," ప్రొఫెసర్ మామయ్య వివరుస్తూ వచ్చాడు. "ఐస్లాండిక్ భాషలో అగ్నిపర్వతాలని జోకుల్ అంటారు. ఆ పదానికి హిమానీనదం (glacier) అని అర్థం ఉంది. ఐస్లాండ్ పర్వతాలు ఉండే ఎత్తులో, అక్కడి ఉష్ణోగ్రతకి, ఆ అగ్నిపర్వతాల లోంచి వచ్చే పదార్థం హిమానీనదాల రూపంలోనే బయటికి ప్రవహిస్తుంది. అందులో ఐస్లాండ్ లో విస్ఫోటం చెందే అగ్నిపర్వతాలని జోకుల్ అంటారు."
"సరే. బావుంది. మరి స్నెఫెల్స్ మాటేమిటి?" అడిగాను.
ఈ ప్రశ్నకి బదులు రాదన్న ధీమాతో అడిగాను, కాని పొరబడ్డాను. మామయ్య ఇలా బదులిచ్చాడు-
"ఐస్లాండ్ పశ్చిమ తీరం వెంట నా వేలిని అనుసరిస్తూ రా! రాజధాని రైక్జావిక్ కనిపిస్తోందా? తీరం అంతా వ్యాపించి ఉన్న అసంఖ్యాకమైన మంచు లోయలని దాటుతూ రా. అరవై ఐదు డిగ్రీల అక్షాంశ రేఖ వద్ద ఆగు. అక్కడ ఏం కనిపిస్తోంది?"
"తొడ ఎముక ఆకారంలో (ఒక కొసలో మోకాలి ఎముక తగిలించినట్టున్న) ఓ ద్వీపకల్పం కనిపిస్తోంది నాకు."
"చాలా చక్కని ఉపమ సుమా! సరే ఆ మోకాలి ఎముక వద్ద ఏమైనా కనిపిస్తోందా?"
"ఆ(! సముద్రం లోంచి పైకి పొడుచుకు వస్తున్న ఓ పర్వతం."
"సరిగ్గా చెప్పావ్! అదే స్నెఫెల్."
"స్నెఫెల్ అంటే అదా?"
"ముమ్మాటికీ అదే. ఐదు వేల అడుగులు ఎత్తున్న పర్వతం. ప్రపంచం ఇలాంటి పర్వతం మరొకటి లేదు. దాని మధ్యలో ఉండే పర్వత బిలం భూమి కేంద్రం వరకు చొచ్చుకుపోతుంది."
0 comments