"అవును. భూమి లోపలికి పోతున్నప్పుడు ప్రతీ 70 అడుగులకి ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరుగుతుంది అన్న సంగతి బాగా తెలిసిందే. భూమి వ్యాసార్థం 1500 లీగ్ లు కనుక, భూమి కేంద్రంలో ఉష్ణోగ్రత 360,032 డిగ్రీలు ఉంటుంది. అంత వేడి వద్ద మనకి తెలిసిన పదార్థాలన్నీ వాయురూపంలో ఉంటాయి. వేడికి బాగా తట్టుకోగల బంగారం, ప్లాటినం వంటి లోహాల దగ్గర్నుండి, కఠిన శిలల వరకు ఆ వేడి వద్ద ఘన రూపంలోగాని, ద్రవ రూపంలో గాని ఉండే అవకాశమే లేదు. కనుక అలాంటి మాధ్యమంలోంచి మనిషి ముందు పోయే అవకాశమే ఉండదు."
"అయితే ఏక్సెల్! నీ అభ్యంతరం అంతా వేడి గురించా?"
"లేకపోతే ఏంటి? భూమి లోపలికి ముప్పై మైళ్లు వెళ్లేసరికే భూమి పైపొర (crust) యొక్క సరిహద్దు వద్దకి వచ్చేస్తాం. అక్కడి ఉష్ణోగ్రతే 2372 డిగ్రీలకి మించి ఉంటుంది."
"అలాంటి పరిసరాలలోకి ప్రవేశించడం అంటే భయంగా ఉందా?" అడిగాడు మామయ్య.
"ఆ నిర్ణయాన్ని నీకే వొదిలేస్తున్నాను," బింకంగా అన్నాను.
"సరే, నా నిర్ణయం చెప్తున్నా విను." ఫ్రొఫెసర్ స్వరం గంభీరంగా మారిపోయింది. "నీకు గాని, మరివరికైనా గాని భూగోళం అంతరంగంలో ఏం జరుగుతోందో కచ్చితంగా తెలీదు. దాని వ్యాసార్థంలో 1/12,000 వంతు గురించి కూడా మనకి కచ్చితంగా తెలీదు. విజ్ఞానం నిరంతరం పునర్నవీకరించ బడుతూ ఉంటుంది. నిన్నటి సిద్ధాంతం నేడు భూస్థాపితం అవుతుంది. ఫోరియర్ రంగప్రవేశం చేసిన దాకా గ్రహాల మధ్య ఉండే అంతరిక్షం యొక్క ఉష్ణోగ్రత నిరంతరం తరిగిపోతూ ఉంటుంది అనుకునేవారు కాదూ? మరి అంతరిక్షం లో కనిష్ఠ ఉష్ణోగ్రత -40 డిగ్రీల ఫారెన్హీట్ (***) కి తక్కువగా ఉండదని
ప్రస్తుతం మనకి తెలుసు. మరి భూమిలో అంతరంగ ఉష్ణోగ్రత విషయంలో కూడా అలాంటిదే జరగచ్చేమో? బహుశ ఒక లోతులో గరిష్ఠ విలువని చేరుకున్న ఉష్ణోగ్రత ఇక ఆపై అదే విలువ వద్ద ఉంటుందని ఎందుకు అనుకోకూడదు?"
(*** ఇది తప్పు. సమకాలీన విజ్ఞానం ప్రకారం అంతరిక్షపు లోతుల్లో ఉష్ణోగ్రత -270 డిగ్రీల సెల్షియస్ వరకు పోగలదు. - అనువాదకుడు).
మామయ్య చెప్పిండి కేవలం ఒక అభిప్రాయమే కనుక, ఒక పూర్వభావనే కనుక ఇక దానికి అభ్యంతరం చెప్పడానికేం ఉండదు.
"భూమి అంతరంగ ఉష్ణోగ్రత 360,000 ఫారన్హీట్ వద్ద ఉంటే, లోపన మరిగే ద్రవ రూపంలో ఉండే పదార్థం నుండీ పుట్టే వాయువుల పీడనం వల్ల, భూమి పైపొర పెటేలుమని పేలిపోతుందని ప్వాసాన్ వంటి సమాన గణితజ్ఞుడు ఏనాడో అన్నాడు."
"అది కేవలం ప్వాసాన్ అభిప్రాయం అని ఎందుకు అనుకోకూడదు మామయ్యా?"
"సరే ఒప్పుకుంటున్నాను. ఈ అభిప్రాయాన్ని ఇంకా ఎంతో మంది గొప్ప భౌగోళిక శాస్త్రవేత్తలు వెలిబుచ్చారు. భూమి అంతరంగంలో ఉన్నవి వాయువులు కావు, ద్రవం కాదు, మరే ఇతర భార ఖనిజాలూ కావు. అవేవైనా అయ్యుంటే భూమి భారం మనకి తెలిసినట్టు ఉండదు."
"అంకేలతో గారడీ చేసి ఎట్నుంచి ఎటైనా వాదించొచ్చులే మామయ్యా."
"కాని మనకి తెలిసిన వాస్తవాలనే ఓసారి చూడు. భూమి రూపొందిన నాటి నుండి అగ్నిపర్వతాల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఒప్పుకుంటావా? కేంద్రంలో అధిక ఉష్ణం ఉంటే ఉండొచ్చు గాక. కాని తగ్గుతూ వస్తోందని అనుకోవడంలో తప్పులేదుగా?"
"మామయ్యా, నువ్విలా ఊహాగానంలోకి దిగితే ఇక నేను చెప్పేందేం ఉండదు."
"అయితే నా భావాలకి మద్దతుగా మరో ప్రముఖుడి భావాలని కూడా పేర్కొంటాను. 1825 లో మనింటికి హంఫ్రీ డేవీ అనే ఓ ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త వచ్చాడు గుర్తుందా?"
"ససేమిరా లేదు. ఎందుకంటే నేను పుట్టింది అప్పటికి పందొమ్మిది ఏళ్ల తరువాత గనుక!"
"సరేలే. హాంబర్గ్ వెళ్లే దారిలో ఒకసారి హంఫ్రీ డేవీ మనింట్లో బస చేశాడు. ఇద్దరం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తూ కూర్చున్నాం. ఆ సమయంలో మా చర్చ భూమి కేంద్రం యొక్క ద్రవ్య స్థితి మీదికి మళ్లింది. భూమి అంతరంగం ద్రవ్య స్థితిలో ఉండటం అసంభం అని ఇద్దరం ఒప్పుకున్నాం. ఆ వాదనని విజ్ఞానం ఎప్పుడూ వ్యతిరేకించలేక పోయింది."
"ఏమిటా వాదన?" ఆశ్చర్యంగా అడిగాను.
0 comments