రోజర్ స్పెరీ (1981 నోబెల్ బహుమతి గ్రహీత), మైకేల్ గజనీగా అనే ఇద్దరు నాడీశాస్త్రవేత్తలు శస్త్రచికిత్సతో కార్పస్ కల్లోసం తెగకోయబడ్డ రోగుల ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలించారు. ఈ పరిశోధనలనే ’మెదడు విభజన ప్రయోగాలు’ (split-brain experiments) అంటారు.
(వాడా పరీక్ష: మెదడు మీద శస్త్ర చికిత్స చేసే ముందు, మెదడులో ఏ గోళార్థం భాషకి ప్రధానంగా ఉందో తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడు న్యూరోసర్జన్ మెదడులో భాషా ప్రాంతాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడతాడు. మెదడులో ఏ గోళార్థం భాషకి ప్రధానంగ ఉందో తెలుసుకునే పరీక్షనే వాడా పరీక్ష అంటారు. ఈ పరీక్షలో సోడియం అమిటాల్ అనబడే వేగంగా పనిచేసే మత్తుందుని కుడి కెరాటిడ్ ధమనిలో గాని, ఎడమ కెరాటిడ్ ధమనిలో గాని ఇంజెక్ట్ చేస్తారు. కుడి కెరాటిడ్ ధమని కుడి మెదడుకి, ఎడమ కెరాటిడ్ ధమని ఎడమ మెదడుకి రక్తసరఫరా చేస్తుంది. కనుక ఈ పరీక్షలో కుడిమెదడుని గాని, ఎడమ మెదడుని గాని తాత్కాలికంగా "నిద్రపుచ్చవచ్చు". ఎడమ మెదడులో భాషా సామర్థ్యం ఉన్నవారిని, ఎడమ మెదడుని నిద్రపుచ్చి మాట్లాడమంటే మాట్లాడలేరు. కాని కుడి మెదడుని నిద్రపుచ్చి మాట్లాడమంటే మాట్లాడగలరు, ప్రశ్నలకి జవాబులు చెప్పగలరు. అయితే ఒకటి. కుడి మెదడు ఎడమ వైపు కండరాలని శాసిస్తుంది. కనుక ఆ పరిస్థితిలో ఎడమ పక్క శరీరభాగాలని కదిలించలేరు.)
శస్త్ర చికిత్స తరువాత ఈ రోగులు ముందు చాలా ’మామూలుగా’ నే అనిపించారు. నడిచేవారు, చదివేవారు, మాట్లాడేవారు, ఆడేవారు... అన్నీ మామూలుగానే చేసేవారు. అయితే కొంత సున్న్నితమైన ప్రయోగాలు చేసే మొదడులో ఒక గోళార్థానికి కొంత సమాచారం, రెండవ గోళార్థానికి మరి కొంత సమాచారం అందేట్టుగా ఏర్పాటు చేసినప్పుడే వాళ్ల ప్రవర్తనలో కొన్ని విడ్డూరమైన విషయాలు బయటపడ్డాయి.
ఇప్పుడు ఒక "సగటు" (భాషా సామర్థ్యం ఎడమ పక్క ఉన్న) మెదడు విభజన రోగి, ఒక కుర్చీలో కూర్చుని ఎదురుగా మానిటర్ తెర మీద ఉన్న ఓ బిందువు మీద దృష్టి సారించాడు అనుకుందాం. ఇప్పుడు ఆ బిందువుకి కుడి పక్కగా ఓ చెంచా బొమ్మ ప్రత్యక్ష మవుతుంది. చెంచాకి చెందిన సమాచారం దృశ్య నాడి ద్వార ఎడమ మెదడుని చేరుతుంది. ఎడమ మెదడుకి భాష తెలుసు కనుక, చిత్రాన్ని ఎడమ మెదడు చూసింది కనుక, ఆ చిత్రం ఏమిటి అని రోగిని అడిగినప్పుడు రోగి ’చెంచా’ అని సమాధానం చెబుతాడు.
కాని చెంచా బొమ్మని బిందువుకి ఎడమ పక్కగా ప్రదర్శించి ఉంటే, చెంచాకి చెందిన దృశ్య సమాచారం ఇప్పుడు కుడి మెదడుని చేరుతుంది. ఇప్పుడు ఆ మనిషిని ఏం కనిపిస్తోందని అడిగితే, ఏమీ కనిపించడం లేదని అంటాడు! కాని అదే మనిషిని ఎదురుగా ఉన్న వస్తువుని (అదేమిటో చెప్పకుండా) తన ఎడమ చేతో అందుకోమంటే, కచ్చితంగా అందుకుంటాడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే కుడి మెదడుకు చెంచా ’కనిపిస్తోంది.’ ఆ కుడి మెదడే ఎడమ చేతిని శాసిస్తుంది కూడా. కనుక తనకి కనిపించే వస్తువుని, తను శాసించగలిగే చేతితో అందుకోగలుగుతుంది కుడి మెదడు. కాని ఏం కనిపిస్తోందని అడిగిన ప్రశ్న అర్థం కావాలంటే భాష అర్థం కావాలి. అది అర్థమయ్యేది ఎడమ మెదడుకి. అయితే ఎడమ మెదడుకి చెంచా సంగతి తెలీదు. అందుకే ఏం కనిపిస్తోందని రోగిని అడిగితే ఏమీ లేదంటాడు. అంతే కాదు. బిందువుకి ఎడమ పక్క ఉన్న చెంచాని ఎడమ చేత్తో పట్టుకున్నాక, చేతిలో ఏముంది అని అడిగితే రోగి చెప్పలేకపోతాడు. ఎందుకంటే మళ్లీ ఈ ప్రశ్న కూడా ఎడమ మెదడుకీ అర్థమవుతుంది. కాని చెంచాని ఎడమ చేత్తో పట్టుకున్నప్పుడు ఆ స్పర్షా సంబంధమైన సమాచారం ఎడమ మెదడుకి చేరడం లేదు, కుడీ మెదడుకి మాత్రమే చేరుతోంది. ఈ సందర్భంలో చెంచా గురించిన సమాచారం కుడి మెదడుకి అందుతోంది. కనుకనే అందుకు సాక్ష్యంగా చెంచాని అందుకునేలా ఎడమ చేతిని శాసించగలుగుతోంది. కాని భాషతో అడిగిన ప్రశ్న మాత్రం దానికి అర్థం కాదు. కనుక భాష తెలీనంత మాత్రాన కుడి మెదడు ’తెలివి తక్కువది’ కాదండోయ్!
మెదడు విభజన రోగులతో మరో విశేషమైన ప్రయోగం కూడా చేస్తారు. ఆ ప్రయోగంలో రోగికి అసహజమైన చిత్రాలు ప్రదర్శిస్తారు. ఉదాహరణకి కింద చిత్రం లో ఉన్న "అర్థ నారి" చిత్రం లాంటివి. ఇందులో ఎడమ పక్కన ఉన్నది స్త్రీ ముఖం, కుడి పక్కన్న ఉన్నది పురుష ముఖం. రోగి తన దృష్టిని చిత్రంలో కనిపించే ముఖం మీది ’బొట్టు’ మీద నిలిపితే స్త్రీ ముఖం గురించిన సమాచారం కుడి మెదడుకి, పురుష ముఖం గురించిన సమాచారం ఎడమ మెదడుకి చేరుతుంది. ఇప్పుడు రోగిని ’ఎదురుగా కనిపిస్తున్న చిత్రాన్ని వేలితో సూచించు’ అని అడుగుతారు. రోగి సాధారణంగా ఎడమ వైపు ఉన్న స్త్రీ ముఖాన్ని (ముఖ భాగాన్ని) ఎడమ చేత్తో సూచిస్తాడు. అలా కాకుండా ఎదుట కనిపిస్తున్నది స్త్రీ ముఖమా, పురుష ముఖమా అని అడిగితే, అది పురుష ముఖమే నని ముఖత: చెప్తాడు. అంటే చేసే పనిని బట్టి, ఎడమ మెదడుది కాని, కుడి మెదడుది కాని పైచేయి అవుతుంది అన్నమాట. ఈ సందర్భంలో భాషతో ప్రమేయం లేనప్పుడు గుర్తించే క్రియలో ఎడమ మెదడుకి ప్రాధాన్యత వస్తుంది.
0 comments