ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు రైట్ రైతు. ఈ గొర్రె ఇక కంచె దాటి బయటికి పారిపోయే సమస్యే ఉండదు, కనుక దాన్ని వెంబడించి పట్టుకునే తిప్పలు కూడా ఉండవు. ఈ గొర్రె యొక్క సంతతిలో మరిన్ని పొట్టి కాళ్ల గొర్రెలు కనిపించాయి. కొన్నేళ్లలో అలాంటి పొట్టి కాళ్ల గొర్రెల మందల్నే తయారుచేశాడు రైట్ రైతు.
కొంత కాలం తరువాత ఆ సంతతి అంతరించిపోయింది అనుకుంటుండగా నార్వేలో అలాంటి పొట్టి కాళ్ల వికారం ఒకటి కనిపించింది. వాటి నుండి గొర్రెల మందల్ని సాకారు. కాని ఎందుచేతనో అలాంటి పరిణామాలేవీ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించలేకపోయాయి.
ఇదిలా ఉండగా 1886 లో డచ్ వృక్ష శాస్త్రవేత్త హ్యూగో డీ వ్రీస్ కి ( 1848-1935 ) ఓ ఆసక్తికరమైన విషయం కంటపడింది.
గతంలో ప్రిం రోజ్ అనే అమెరికన్ మొక్కని నెదర్లాండ్స్ లో ప్రవేశపెట్టటం జరిగింది. ఒకరోజు ఓ నిర్జన ప్రాంతంలో ఈ మొక్కల తోట ఒకటి డీ వ్రీస్ కంటపడింది. ఒకే మొక్క యొక్క విత్తుల నుండి ఆ తోట అంతా పుట్టుకొచ్చి ఉంటుంది. అయినా కూడా మొక్కల్లో కొన్ని ఆసక్తికరమైన తేడాలు గుర్తించగలిగాడు డీ వ్రీస్.
కొంచెం ప్రత్యేకంగా, తేడాగా ఉన్న మొక్కలు sports , అంటే వైపరీత్యాలు అన్నమట. కాని అవి కూడా బాగా పెరిగి వర్ధిల్లుతున్నాయి. అలాంటి వాటిని కొన్ని తవ్వి తిసి తన పెరట్లో నాటుకున్నాడు. మెండెల్ బఠాణీ మొక్కల్తో చేసిన ప్రయోగాల్లాంటివే ఇతడు ప్రిం రోజ్ మొక్కల్తో ప్రారంభించాడు. (అయితే ఆ సమయంలో డీ వ్రీస్ కి మెండెల్ గురించి ఏమీ తెలీదు.)
ప్రిం రోజ్ మొక్కల సంతతి కూడా అధికశాతం విత్తులు వచ్చిన మొక్క పోలికలోనే ఉండేవి. కాని అరుదుగా మాత్రం సంతతి మొక్క చాలా తేడాగా ఉండేది. అనువంశికతలో అలాంటి హఠాత్ పరిణామానికి mutation (ఉత్పరివర్తన) (అంటే లాటిన్ లో మార్పు) అని పేరు పెట్టాడు డీ వ్రీస్.
అప్పట్నుంచి వికారాలు, వైపరీత్యాలు, monsters, sports మొదలైన పరిభాష పోయి mutation అన్న మాటే స్థిరపడింది.
మొక్కల తరాల పరిణామంలో మెండెల్ గమనించిన సూత్రాలే డీ వ్రీస్ కూడా గమనించాడు. మొక్కల మీద జాగ్రత్తగా కొలతలు తీసుకుంటూ ఎంత శాతం మొక్కల్లో ఏ లక్షణాలు ఉంటాయో నమోదు చేసుకున్నాడు. మెండెల్ లాగానే ఇతడు కూడా ప్రతీ భౌతిక లక్షణాన్ని శాసిస్తూ రెండు ఫాక్టర్ లు ఉంటాయని గుర్తించాడు. వీటిలో ఒకటి పరాగంలోను, మరొకటి అండాశయంలోను ఉంటుందని కూడా అర్థం చేసుకున్నాడు. ఈ రెంటి మధ్య జరిగే యాదృచ్ఛికమైన కలయికల వల్ల సంతతి లక్షణాలు నిర్ణయింపబడ్డాయి.
1900 లో డీ వ్రీస్ "అనువంషికతా ధర్మాలు" అన్న గ్రంథ రచనకి పూనుకున్నాడు.
డీ వ్రీస్ కి తెలియకుండా మరిద్దరు వృక్షషాస్త్రవేత్తలు కూడా అవే అనువంశికతా ధర్మాలని కనుక్కున్నారు, వాళ్లిద్దరూ కూడా 1900 కల్లా వాళ్ల ఆవిష్కరణలని ప్రచురించటానికి సిద్ధం అయ్యారు. వాళ్ల పేర్లు - జర్మన్ వృక్షషాస్త్రవేత్త కార్ల్ ఎరిక్ కారెన్స్ ( 1864-1933 ), మరియు ఆస్ట్రియన్ వృక్షషాస్త్రవేత్త ఇరిక్ ట్షెర్మాక్ ఫాన్ సైసెనెక్ (1871-1962).
ఈ ముగ్గురు వృక్షషాస్త్రవేత్తలూ తమ రచనలని ప్రచురించే ముందు ఈ రంగంలో అంతకు ముందు ఎవరైనా ఏదైనా కృషి చేశారా అని సమీక్షించారు. ముగ్గురికీ మెండెల్ రాసిన పత్రాలే తారసపడ్డాయి. తాము కనుక్కున్న సూత్రాలే మెండెల్ కూడా కనుక్కున్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అయితే తేడా ఏంటంటే మెండెల్ అవన్నీ 40 ఏళ్ల క్రితమే కనుక్కున్నాడు.
1900 లో ముగ్గురు వృక్షషాస్త్రవేతలు - డి వ్రీస్, కారెన్స్, ట్షర్మాక్ ఫాన్ సైసెనెక్ లు తమ ఆవిష్కరణలని ప్రచురించారు. కాని ముగ్గురూ ఘనత అంతా మెండెల్ దేనని వినమ్రంగా ఒప్పుకున్నారు. అందుకే నేడు మనం మెండెల్ అనువంశికతా సూత్రాలు అని చెప్పుకుంటున్నాం. ఈ పరిణామాలన్నీ చూడటానికి మెండెల్ జీవించి లేకపోయినా, తన ఖ్యాతి మత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.
(మెండెల్ కథ సమాప్తం)
0 comments