శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

పాల పుంత పిలుస్తోంది - 1 వ భాగం

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, August 23, 2009
12 జనవరి, సోమవారం, 2342

తారాంతర నౌకాశ్రయం, శ్రీ హరికోట, ఇండియా

"పండుగ నాళ్ళన్నీ ఉన్న ఊళ్లోన్నే దండుగ చేసే కన్నా, సరదాగా అలా (ఇంచుమించు) కాంతివేగంతో రోదసిలో దూసుకుపోతూ పాలపుంత అంచుల్ని తాకి రావాలన్న తీరని కోరికతో, మా ఈ ప్రత్యేక యాభై శాతం పండుగ స్పెషల్ డిస్కవుంట్ ఆఫర్ని సద్వినియోగం చేసుకుని, పాలపుంత పొలిమేరలకి తరలించుకుపోయే మా ఈ లిమిటెడ్ స్టాప్ సర్వీస్ ని ఎంచుకున్న యాత్రిక మహాశయులకి ’తారావళీ సూపర్ ట్రావెల్స్’ తరపున స్వాగతం... సుస్వాగతం!" తారానౌక గైడ్ ఉత్సాహంగా గుక్క తిప్పకుండా చెప్పుకుపోతున్నాడు.

"తారావళీ సూపర్ ట్రావెల్స్ గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. నాలుగు కా.సం. ల దూరంలో..."

"కా.సం. అంటే?" - ఓ బాలసందేహం అడిగాడో బాలయాత్రికుడు.

"కాసం అంటే కాంతి సంవత్సరం బాబూ! స్వీట్ బాయ్!," కుర్రాడి నెత్తిన మెత్తగా టప్ మని కొట్టి సాగిపోయాడు. "కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం అన్నమాట. 4 కా.సం.ల దూరంలో ఉన్న ప్రాక్సిమా సెంటారీ దగ్గర్నుండి, 4000 కా.సం. ల దూరంలో ఉన్న రో-కాసియోపియా వరకు మాకు రమారమి లక్షన్నర బ్రాంచీలు ఉన్నాయని అంచనా. అయితే కచ్చితంగా ఎన్ని బ్రాంచీలు ఉన్నాయో మా సీ.ఈ.ఓ. తారానాథ్ గారికే తెలీదనుకోండి."

"అదేంటి? మీకెన్ని బ్రాంచీలు ఉన్నాయో మీకే తెలీదా? విడ్డూరంగా ఉందే," - ఓ సీ.ఈ.ఓ. టైపు యాత్రికుడి సందేహం.

"ఎలా తెలుస్తుండి మరి కవరేజ్ ఏరియా ఇంత ఉన్నప్పుడు? నిన్ననే ఓ తార సూపర్నోవాగా పేలిపోయి దాని చుట్టూ ఉండే ఓ డజను బ్రాంచీలు బుగ్గయిపోయాయి. క్రితం నెల ఇలాగే ఓ క్లింగాన్ బృందానికి నౌకలో మర్యాదలు సరిగ్గా జరగలేదని వాళ్ల తారా వ్యవస్థలో ఉండే యాభై మూడు బ్రాంచీలని లేజర్ బ్లాస్టర్లతో పేల్చేసారు. ఇంత పెద్ద విశ్వంలో మన్లాంటోళ్లు బోలెడు మంది..."

"చూడు బాబూ... ఇంతకీ నీ పేరు ఏంటన్నావ్?" -వోణికే స్వరంతో ఓ వృద్ధ యాత్రికుడు.

" సూర్యం సార్! ఈ అపూర్వమైన యాత్రలో నేనే మీ టూర్ గైడ్ ని. ఈ తారానౌకకి హోమ్ పేజ్ లాంటి వాణ్ణి. ఏం కావలసినా నన్ను అడగండి. మీకు తగ్గ సేవలు అందేలా నేను చూస్తాను. తారావళీ సూపర్ ట్రావెల్స్ తరపున..."

"కొంచెం మంచి నీళ్లు ఇప్పించు తండ్రీ. నోరు తడారిపోతోంది," - ఆదుర్దాగా అదే వృద్ధ యాత్రికుడు.

"ఎవడ్రా అక్కడ? సారుకి నీళ్లు," కేకేశాడు సూర్యం.

ఓ తెల్లని పిల్ల రోబో సున్నితంగా అడుగులు వేసుకుంటూ ప్లాటినం కప్ లో నీళ్లు పట్టుకుని లోపలికి వచ్చాడు.

"ఏంటి నువ్వు?" బాల యాత్రికుడు మళ్లీ సందేహం అడిగాడు.

"నాపేరు కాస్మో!" శ్రావ్యంగా జవాబిచ్చాడు రోబో పిల్లాడు.

"చక్కగా తెలుగు మాట్లాడతాడు. వాడికి తీరిక ఉన్నప్పుడు ఇద్దరూ ఆడుకోవచ్చు, సరేనా?" సందేహ నివృత్తి చేశాడు సూర్యం.

ఇంతలో మంచి నీళ్లు తాగిన వృద్ధ యాత్రికుడు మళ్లీ,
"బుగ్గయ్యాయి అంటున్నావు, పేలుళ్లు అంటున్నావు. అన్నిటికీ తెగించే ఈ యాత్రకి పూనుకున్నాం అనుకో. అయినా ప్రాణాలతో తిరిగొచ్చే అవకాశం ఏవైనా ఉందా?"

"అయ్యో సార్! ఎంత మాట. అసలు ఈ తారానౌక గురించి మీకు కొంచెం చెప్పాలి. దీని పేరు ’తోకచుక్క’. పేరలా పెట్టారే గాని అసలు తోకచుక్కలు దీని తోకతో కూడా పోలవు. అసలు తోకచుక్కల రేంజ్ ఏపాటి? కుయ్పర్స్ బెల్ట్ నుండి కొట్టుకొస్తుంటాయి. మహా అయితే ఒర్ట్ మేఘంలో పుట్టుకొసాయి. అంటే ఎంత? ఒక్క టంటే ఒక్క కా.సం.! మరి ఈ ’తోకచుక్కో? మీరు ఊ అనండి! గెలాక్సీ మొత్తాన్ని కొలుచుకొస్తుంది. ఒకటా రెండా, లక్ష కాంతి సంవత్సరాలు!"

"అవును బాబూ, తెలీక అడుగుతాను," ఈ సారి మరో వృద్ధ యాత్రికుడి సందేహం. "కాంతికే అన్ని సంవత్సరాలు పడితే, మరి మేమేమో వయసు అయినవాళ్లం..."

"ఓ అదా? మీ సందేహం అర్థమయ్యింది. మామూలు నాసిరకం వ్యోమనౌకలతో అయితే ఆ ఇబ్బందులన్నీ పడాలి. కాని మా తారానౌక ’హైపర్ డ్రైవ్’ టెక్నాలజీ మీద పని చేస్తుంది. బాగా దూరం వెళ్లాలనుకోండి. ’హైపర్ జంప్’ చేసి ఓ 10-100 కా.సం. లు సునాయాసంగా జింకలా గెంతేయొచ్చు నన్నమాట. అలా కాకుండా దగ్గరి దగ్గరి గమ్యాలనుకోండి. ఇక్కణ్ణుంచి ఏ మార్స్ కో, టైటన్ కో, అయో కో వెళ్ళాలంటే, ’అయాన్ డ్రైవ్’ పెట్టి కాంతి వేగంలో పదో వంతు పై పెచ్చు వేగంతో దూసుకుపోవచ్చు. అందుకే ఈ చిన్న చిన్న ట్రిప్పులలో మాకు పెద్దగా మిగిలేది ఏవీ ఉండదండి. దూరాలైతేనే మాకు కొంచెం బిజినెస్..."

"మీ బిజినెస్ మాట దేవుడెరుగు. ముందు ఎక్కడిదాకా పోతున్నామో చెప్పరాదూ?" - ఓ అసహన యాత్రికుడు.

"ఇదుగో ఆ రూటు విషయానికే వస్తున్నా. మన మొదటి స్టాపు ప్రాక్సిమా సెంటారీ అన్నమాట. ఇదుగోండి ఈ హోలో మ్యాపులో చూడండి."

ఎదురుగా హోలో టేబుల్ మీద ఓ త్రిమితీయ మ్యాప్ ప్రత్యక్షం.

" అంటే ఇక్కడ ముక్కు మూసుకుని, ఠక్కున ప్రాక్సిమా సెంటారీ పక్కల్లో తేల్తామని కాదండి. సౌరమండలం అంచుల వరకు కొంచెం నెమ్మదిగా అయాన్ డ్రైవ్ మీద నడిపిస్తాం. దారిలో గ్రహాల వద్ద కొంచెం స్లో డౌన్ అవుతాం లెండి. అక్కడి విశేషాలు చూసుకుంటూ నెమ్మదిగా సాగిపోతాం. సౌరమండలం శివార్లలో హైపర్ డ్రైవ్ కి మారి ప్రాక్సిమా సెంటారి కి బయలుదేరుతాం. ఎలాగూ ప్రాక్సిమా సెంటారీ దాకా వెళ్తున్నాం గనక, ఆ ఇరుగు పొరుగున ఆల్ఫా సెంటారీ తారా వ్యవస్థలోని తారలు కూడా చూస్తాం అన్నమాట."

"ఊ(! ఆ తర్వాత?"

"ఆ తరువాత మనం ఉండే ఈ ఓరియాన్ భుజం వెంట వరుసగా ఎన్నో తారల వద్ద ఆగుతూ ఆగుతూ భుజం కొస దాకా వెళ్తాం."

"ఓరియాన్ భుజం అంటే?" - బాల యాత్రికుడు.

"ఓరియాన్ భుజం అంటే... మనం ఉండే ఈ పాలపుంత గెలాక్సీని ఓ చెట్టుగా ఊహించుకుంటే, ఓరియాన్ భుజం ఓ కొమ్మ. ఆ కొమ్మ మధ్యన ఎక్కడో, కాండానికి దూరంగా, ఉన్నాం మనం. కనుక కాండం వైపు కాకుండా, కొమ్మ కొస వైపుకి వెళ్తున్నాం. కొమ్మ కొస వద్ద ఉండే M30 అనే తారా వ్యవస్థ దాకా వెళ్తే అక్కడ ఓ మాంచి వ్యూయింగ్ పాయింట్ ఉంటుంది. అక్కణ్ణుంచి ’సాజిటేరియస్’ అనే బుల్లి ఉపగెలాక్సీని చూడొచ్చు. సాజిటేరియస్ దర్శనం చేసుకుని, భోజనం చేసి, ఇక తిరిగి ఇంటికి బయల్దేరడమే!"

"భోజనం అంటే గుర్తొచ్చింది. మీల్స్ స్టాప్ లు ఎక్కడో చెప్పలేదు?" - కొంచెం వలంగా ఉన్న ఓ కుర్ర యాత్రికుడు.

"అంతరిక్షంలో మీల్సేంటి సార్? కొద్దిగా ఆకలేస్తే అది బ్రేక్ ఫాస్ట్, ఎక్కువేస్తే లంచి, డిన్నరూనూ. మీకు ఏం కావాలన్నా నన్ను పిలవండి. లేదా మా కాస్మోని కేకెయ్యండి."

"ఇక సందేహాలేమీ లేకపోతే చప్పున బయల్దేరుదాం. కాప్టెన్ బృహస్పతి గారు తొందరపడుతున్నారు. అందరూ మీమీ సీట్లని ఆక్రమించండి. భూమి నుండి కనీసం ఓ వెయ్యి కిలోమీటర్లు దూరం రానిదే ఎవరూ సీట్లలోంచి లేవకూడదు. బయట ఏం జరుగుతోందో మీ ఎదురుగా ఉన్న పానెల్స్ మీద చూడొచ్చు. మరొక్క విషయం..."

యాత్రికుల కేసి సందేహంగా ఓ సారి చూశాడు సూర్యం.

"ఎవరికీ గుండె సమస్యల్లాంటివి లేవు కద?"

(సశేషం)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email