ఓ మగువ తెగువ
ఆ విధంగా మా సంభాషణ సమాప్తమయ్యింది. మా మాటల పర్యవసానాలని ఊహించుకుంటూంటే వెన్నులో చలి పుట్టుకొస్తోంది. ఆ దిగ్భ్రాంతి లోనే మెల్లగా మామయ్య గదిలోంచి బయటకి నడిచాను. హాంబర్గ్ పురవీధుల్లోని ప్రాణవాయువు అంతా పోగుచేసినా ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి స్థితి. అలా పరధ్యానంగా నడుచుకుంటూ ఎల్బే నదీ తీరానికి చేరుకున్నాను. స్టీమర్లోంచి అక్కడ యాత్రికులు దిగుతూ ఉంటారు. ఊరిని హాంబర్గ్ రైల్వేతో కలుపుతుంది ఈ స్టీమర్.
ఇందాక నేను విన్నది సత్యమని నిర్ధారించుకునేది ఎలా? ప్రొఫెసర్ లీడెన్బ్రాక్ వజ్రసంకల్పానికి ఎదురుచెప్పలేక లొంగిపోతున్నానా? ఈ బ్రహ్మాండమైన భూగోళం యొక్క కేంద్రంలోకి చొచ్చుకు పోవాలన్న ఆయన ఇచ్ఛకి చచ్చినట్టు తలవంచాల్సిందేనా? ఇవన్నీ పిచ్చివాడి ప్రేలాపనలా? లేక వాస్తవంతో విజ్జోడైన వివేకవంతుడి విభ్రాంతా? ఇందులో సత్యం పాలు ఎంత? దోషం ఎక్కడ వస్తోంది?
పరస్పర విరుద్ధమైన భావాలతో మనసంతా కల్లోలంగా ఉంది. ఏది సరైన మార్గమో తేల్చుకోలేని అయోమయ స్థితి...
ఇప్పుడంటే కొంచెం ఉత్సాహం చల్లబడింది గాని ఆ సమయంలో ముందుకి సాగిపోవలన్న సంకల్పమే బలపడింది. ప్రశాంతంగా ఆలోచిస్తే మళ్లీ మనసు మారిపోతుందేమో. ఉన్నపళాన బయలుదేరితేనే మంచిది. వెంటనే మూటా ముల్లె సర్దుకుని ఆ బరువుని భుజానికి ఎత్తుకోవడమే తక్షణ కర్తవ్యంగా తోచింది.
కాని ఓ గంట గడిచాక ఈ అప్రాకృతికమైన ఉత్సాహం కాస్త సద్దుమణిగింది. నాడులు కాస్త తేలికపడ్డాయి. ఎక్కడో పాతాళంలో పూడుకుపోయిన నా స్వరం పైకి పెల్లుబికింది.
"ఇది అసంభవం!" గట్టిగా రంకె వేశాను. "ఈ యాత్రకి అర్థం లేదు. బుద్ధి ఉన్న వాడెవడూ ఇలాంటి పథకానికి ఒప్పుకోడు. అసలు ఇదంతా వట్టి కల. పీడకల."
ఎల్బే నదీ తీరం వెంట నడుచుకుంటూ మెల్లగా ఊరు దాటాను. రేవు కూడా దాటి, అల్టోనా బాటని చేరుకున్నాను. ఎందుకో మనసులో ఉన్న తలంపు నిజం కాబోతుందని అనిపించింది. అల్లంత దూరంలో హాంబర్గ్ కి తిరిగి వస్తున్న నా ముద్దుల గ్రౌబెన్ కనిపించగానే మనసు తేలికపడింది.
"గ్రౌబెన్!" అంత దూరం నుండే అరిచాను.
రహదారి మీద ఎవరో అపరిచిత వ్యక్తి తనని పేరు పెట్టి పిలవడం విని కాస్త భయపడి ఉంటుంది. మరో పది గజాలు నడిచి ఆమెని చేరుకున్నాను.
"ఏక్సెల్!" ఉత్సాహం పట్టలేక పోయింది గ్రౌబెన్. "ఏయ్! ఏంటి నా కోసమే వస్తున్నావా? "
నా ముఖం చూడగానే దాచుకున్న దిగులు సులభంగా ఆమెకి తెలిసిపోయింది.
"ఏంటలా వున్నావ్?" చెయ్యి చాచి అందిస్తూ అడిగించి.
"ఏం చెప్పమంటావు?" దిగులుగానే అడిగాను.
రెండు నిముషాలలో జరిగిందంతా తనకి పూస గుచ్చినట్టు చెప్పాను. అంతా విని కాసేపు తను ఏమీ మాట్లాడలేదు. ఆమె గుండె కూడా వేగంగా కొట్టుకుంటోందో లేదో మరి నాకు తెలీదు. ఆమె చెయ్యి మాత్రం నా చెయ్యిలా వణకడం లేదు. ఏం మాట్లాడకుండా ఇద్దరం ఓ నూరడుగులు నడిచాం.
చివరికి తనే అంది, "ఏక్సెల్!"
"ఏంటి గ్రౌబెన్?"
"అదో మరపురాని యాత్ర అవుతుంది అనిపిస్తోంది."
0 comments