ఓ అద్భుత యాత్రకి సన్నాహం
ఆ మాట నా చివిన పడగానే సన్నగా వెన్నులో చలి మొదలయ్యింది. తూలి కిందపడకుండా తమాయించుకున్నాను. శాస్త్రీయ వాదనలు తప్ప మామూలు మనుషులు మాట్లాడుకునే మాటలు ప్రొఫెసర్ లీడెన్బ్రాక్ తలకెక్కవు. అలాంటి అమానుష, తలతిక్క యాత్ర ఎందుకు శ్రేయస్కరం కాదో నిరూపించటానికి ఎన్నో చక్కని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. భూమి కేంద్రానికి చొచ్చుకుపోవడమా? వట్టి పిచ్చి! అయినా కాసేపు నా వాదనాపటిమకి కళ్లెం వేసుకుని నిగ్రహించుకున్నాను. ఇది శాస్త్ర చర్చకి సమయం కాదు. ముందు కడుపులో ఏదైనా పడాలి. అయితే భోజనం వస్తున్న సూచనలు ఎక్కడా కనిపించలేదు.
ఖాళీ పాత్రలు ఎదుట వేసుకుని కోపం వెళ్లగక్కితే లాభం లేదు. ముందు భోజనం ఏర్పాట్ల సంగతి చూడాలి. ఆ దిశ నుండి ముందు మెల్లగా నరుక్కుంటూ వచ్చాను. పాపం మాట విన్నాడు. మార్తాకి విముక్తి లభించింది. ఆమె బజారుకి వెళ్లి పచార్లు తెచ్చింది. గంటలో నా ఆకలి తీరింది. ఈ ప్రాథమిక సమస్య తీరిన తరువాత ఇక ముందున్న పెను సమస్యతో తలపడొచ్చు.
మామయ్య చాలా హుషారుగా భోజనం చేస్తున్నాడు. ఎవరికీ అర్థం గాని ఏవో లోతైన జోకులు వేశాడు. భోజనం తరువాత తన గదికి రమ్మని పిలిచాడు.
నేను వెళ్లాను. బల్లకి ఒక చివర ఆయన, మరో చివర నేను కూర్చున్నాము.
"ఆక్సెల్," మృదువుగా అన్నాడు. "నువ్వు చాలా తెలివైనవాడివని నాకు తెలుసు. బాగా అలిసిపోయి ఇక ప్రయత్నం మానుకుందామని అనుకుంటున్న సమయంలో నాకు గొప్ప మేలు చేశావు. అసలు నేను ఎక్కడ పొరబడ్డాను? పోనీ ఆ సంగతి వదిలేద్దాం. నువ్వు చేసిన ఈ ఆవిష్కరణకి చెందిన ఘనతలో నువ్వూ పాలుపంచుకుంటావు."
"ఇదే మంచి అదను," మనసులో అనుకున్నాను. " మంచి మూడ్ లో ఉన్నాడు. ఆ ఘనత సంగతేంటో ఇప్పుడే మాట్లాడాలి."
"అన్నిటి కన్నా ముఖ్యంగా," ఇంకా చెప్పుకుంటూ వచ్చాడు మామయ్య, " ఈ విషయాన్ని పూర్తిగా రహస్యంగా ఉంచాలి. అర్థమయ్యిందా? ఇంత గొప్ప విజయానికి వైజ్ఞానిక ప్రపంచంలో నన్ను చూసి అసూయపడని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ యాత్ర ని తామే చేద్దాం అని అనుకునేవాళ్లకి ఆ యాత్ర పూర్తిచేసి మనం తెచ్చే వార్తే మొదటి వార్త కావాలి."
"అసలు ఈ యాత్ర చెయ్యాలనుకునేటంత ధైర్యం ఉన్నవాళ్లు ఈ భూమి మీద ఎక్కడైనా ఉంటారంటావా?" సూటిగా అడిగాను.
"నిశ్చయంగా! అంత గొప్ప పేరు వస్తుందంటే ఎవరికి చేదు? ఆ పత్రం, అందులోని రహస్యం బట్టబయలు అయ్యిందంటే ఓ పెద్ద భౌగోళిక శాస్త్రవేత్తల పటాలం ఆర్నె సాక్నుస్సెం అడుగుజాడలలో బయలుదేరుతుంది."
"ఏమో మరి. నాకైతే అలా అనిపించడం లేదు," నా అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. "ఆ పత్రంలోని సమాచారం ఎంత వరకు నిజమో మనకి ఎలాంటి ఆధారాలు లేవు."
"ఏంటి నువ్వనేది ఆ పుస్తకం సంగతి వొదిలేయ్. అందులోని పత్రానికి కూడా ఆధారాలు లేవంటావా?"
"సరే. ఆ వాక్యాలు రాసింది సాక్నుస్సేం అని ఒప్పుకుంటాను. కాని ఆ యాత్ర అతను స్వయంగా చేశాడని నమ్మకం ఏంటి? ఆ పాత పత్రంలో అమాయకులని తప్పుదారి పట్టించడానికి అలా రాసి ఉండొచ్చు కదా?"
ఆ చివరి మాట అంటూనే నాలుక కరచుకున్నాను. మామయ్య దవడ కండరం బిగుసుకుంది. దట్టమైన ఆయన కనుబొమ్మలు ప్రమాదకరంగా ముడివడ్డాయి. ఏం ముంచుకు రానుందో అని కొంచెం భయపడ్డాను. అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ జరగలేదు.
"అదేంటో చూద్దాం" అన్నాడు. ఆయన పెదాల మాత్రం ఓ విచిత్రమైన చిరునవ్వు విరిసింది.
0 comments