ఏది జీవం? ఏది అజీవం - బోస్
ఆ విధంగా భౌతిక శాస్త్రవేత్తల నుండి ఎంతో మన్నన లభించినా, జివక్రియాశాస్త్రవేత్తల నుండి అలాంటి ఆదరాభిమానాలు దొరకలేదు. ఎందుకంటే బోస్ పరిశోధనలు కేవలం విద్యుదయస్కాంత తరంగాలకి, భౌతిక శాస్త్రానికి పరిమితమైతే బావుంటుంది. కాని తగుదునమ్మా అని ఇప్పుడు కొత్తగా జీవపదార్థం మీద ప్రేరణల ప్రభావం గురించి, జీవ, జీవరహిత పదార్థాల మధ్య సాన్నిహిత్యం గురించి మట్లాడి తనకి సంబంధం లేని రంగంలోకి అడుగుపెడుతున్నాడు! ఈ దుడుకుతనం జీవక్రియాశాస్త్రవేత్తలకి (physiologists) బొత్తిగా నచ్చలేదు. హెర్జియన్ తరంగాలని జివపదార్థం మీద ప్రసరించినప్పుడు, లోహపు ప్రతిస్పందనకి, జీవపదార్థపు ప్రతిస్పందనకి మధ్య పోలికలు కనిపించాయి. ఈ ఫలితాలన్నీ ఏకరువు పెడుతూ బోస్ జీవక్రియాశాస్త్రవేత్తల ముందు ఒక పేపరు చదివినప్పుడు హర్షధ్వానాలు కాక నిష్టూరంతో కూడిన నిశ్శబ్దమే అతడి ప్రసంగానికి ప్రతిస్పందన అయ్యింది.
ఈ కాలంలోనే బోస్ ఆలోచనలు ఓ కొత్త దిశలో పయనింసాగాయి. లోహంలోను, జంతుధాతువు లోని ఒకే విధమైన ప్రతిస్పందన కనిపించినప్పుడు ఈ రెండు ధృవాలకి మధ్యస్థంగా ఉండే వృక్ష ధాతువులో కూడా మరి అలాంటి ప్రతిస్పందనే కనిపించాలని అతడికి అనిపించింది. అయితే ఆ ప్రయోగం కొంచెం సాహసమే అనుకోవాలి ఎందుకంటే, మొక్కలలో నాడీ మండలం ఉండదు కనుక ప్రేరణలకి ప్రతిస్పందించే గుణం వాటికి ఉండదని సాంప్రదాయక అభిప్రాయం. ముందుగా తన తోటలో ఓ చెట్టు ఆకులు కోసుకొచ్చి వాటి మీద విద్యుదయస్కాంత తరంగాలు ప్రసరించి చూశాడు. మునుపటి ప్రయోగాలలో కనిపించిన ఫలితాలే మళ్లీ కనిపించడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ సారి సందు చివర కూరగాయల అంగడికెళ్లి కొన్ని కారట్లు, తెల్ల ముల్లంగులు కొనుక్కు వచ్చాడు. చైతన్య రహితంగా కనిపించే ఈ దుంపల్లో కూడా చక్కని ప్రతిస్పందన కనిపించింది. మొక్కల మీద క్లోరోఫామ్ ప్రయోగించినప్పుడు జంతువుల్లో కనిపించిన ప్రభావం లాంటిదే కనిపించింది. మొక్కలకీ మత్తెక్కుతంది అన్నమాట! క్లోరోఫామ్ తో ఓ పెద్ద పైన్ చెట్టుకి “మత్తెక్కించి” దాన్ని ఉన్న చోట నుండి కూకటి వేళ్లతో పెకలించి, మరో చోట పాతిపెట్టి, అది సజీవంగా ఉండగలదని నిరూపించాడు బోస్.
రాయల్ సొసయిటీకి అధ్యక్షుడుగా ఉన్న సర్ మైకేల్ ఫోస్టర్ ఒక రోజు ఉదయాన బోస్ ప్రయోగశాలని సందర్శించాడు. బోస్ లోగడ తను తీసుకున్న కొలతల గ్రాఫులు కొన్ని చూపించాడు.
“ఓస్! ఇదేముంది బోస్! అర్థ శతాబ్దంగా మనందరికీ ఈ గ్రాఫుల గురించి తెలుసు,” అన్నాడు సర్ ఫోస్టర్.
“ఇంతకీ ఈ గ్రాఫులు ఏమని అనుకుంటున్నారు?” బోస్ నెమ్మదిగా అడిగాడు.
“ఇంకేముంది? ఇది కండరం యొక్క ప్రతిస్పందనే కదా?” కొంచెం చిరాగ్గా అడిగాడు సర్ ఫోస్టర్.
“క్షమించాలి. ఇది లోహపు తగరం యొక్క ప్రతిస్పందన,” అన్నాడు బోస్.
“ఏంటి నువ్వనేది?” నిర్ఘాంతపోయాడు సర్ ఫోస్టర్. “తగరమా? నువ్వు చెప్పేది తగరం గురించా?”
బోస్ తన ప్రయోగాల గురించి ఓపిగ్గా వివరించాడు. బోస్ ఆవిష్కరణల గురించి శుక్రవారం సాయంత్రపు ప్రసంగాల సందర్భంలో మాట్లాడమని వెంటనే ఆహ్వానించాడు. మే 10, 1901 నాడు నాలుగేళ్లుగా చేసిన ప్రయోగాలన్నిటినీ క్రోడీకరిస్తూ, వివరంగా ప్రసంగించాడు బోస్. ప్రసంగం చివర్లో విజ్ఞానానికి, తత్వ చింతనకి ముడి పెడుతూ ఇలా అన్నాడు:
“జీవరహిత, మరియు జీవసహిత పదార్థంలో ప్రేరణకి ప్రతిస్పందనల చరిత్రల యొక్క అనురచనలని ఈ సాయంకాలం మీ ముందు ప్రదర్శించాను. ఆ రెండు రచనలు ఎంత సన్నిహితంగా ఉన్నాయో చూశారా? రెండింటికీ తేడా చెప్పడం కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో భౌతిక పదార్థం ఇక్కడ అంతం అవుతుందని, జీవపదార్థం ఇక్కడ ఆరంభం అవుతుందని గిరి గీసి చెప్పడం ఎలా సాధ్యం? అలాంటి కఠోర విభజన రేఖలు అసలు లేవు.
“ఈ స్వతస్సిద్ధమైన అనురచనలకి మౌన సాక్షిగా ఉంటూ, విశ్వంలో సర్వత్ర – నీరెండలో మిలమిలలాడే ధూళి కణం లోను, భూమి మీద కిటకిటలాడే జీవసముద్రం లోను, రోదసిలో రగిలే ప్రచండ భాను హిరణ్యతేజం లోను – అన్నిటా ఆవరించి ఉన్న ఆ అద్భుతమైన ఏకత్వాన్ని పొడచూసినప్పుడు, ముప్పై శతాబ్దాల క్రితం పవిత్ర గంగా నదీ తీరంలో, ’విశ్వంలో అనంతంగా, అనవరతంగా వ్యాపించిన వైవిధ్యంలోని ఏకత్వాన్ని పొడగన్న వారికే సనాతన సత్యం సొంతం అవుతుంది – మరొకరికి కాదు, మరొకరికి కాదు,’ అని ఘోషించిన నా పూర్వీకుల మాటల్లో సారం కాస్తంత అర్థమవుతోంది.”
(సశేషం...)
విశ్వంలో సర్వత్ర – నీరెండలో మిలమిలలాడే ధూళి కణం లోను, భూమి మీద కిటకిటలాడే జీవసముద్రం లోను, రోదసిలో రగిలే ప్రచండ భాను హిరణ్యతేజం లోను – అన్నిటా ఆవరించి ఉన్న ఆ అద్భుతమైన ఏకత్వాన్ని పొడచూసినప్పుడు,
మహాద్భుతం... బోస్ అనంతరం జీవశాస్త్రంలో భారతీయుల దోహదం ఎందుకు వెనకపట్టు పట్టింది? ఆయనకు సాధ్యమైంది తర్వాతి తరాల భారతీయులకు ఎందుకు సాధ్యం కాలేదు. మూలకారణాలను ఇక్కడే మరో వ్యాసంలో చెబుతారా? ఇది సైన్స్ సంబంధిత వ్యాసమే కాబట్టి ప్రచురించవచ్చు.
మీ సైట్ కలకాలం కొనసాగాలి.
అభినందనలు..
రాజు
చందమామ,
blaagu.com/chandamamalu
krajasekhara@gmail.com