అరసెంటీమీటర్ వ్యాసంలో అందమంతా కూరినట్టుండే తెల్లని గుళిక ముత్యం. గురజాడవారి కవితాక్షరసుమాలని ముత్యాలసరాలు అంటాం. ముద్దొచ్చే చేతిరాత నుండి ముద్దుల వరకు ముత్యాలతో పోలుస్తాం. ముత్యాన్ని చూస్తున్న కవికి అందం, ప్రేమ, మంచితనం, జీవనానందసారం వగైరాలు గుర్తొస్తాయేమో. కాని అదే ముత్యాన్ని చూస్తున్న శాస్త్రవేత్తకి ’అర్థం చేసుకోరూ!’ అని ఆహ్వానిస్తున్న ఓ అపురూపమైన ప్రకృతి ప్రక్రియే కనిపిస్తుంది. ఇంతకీ ఈ ముత్యం ఎక్కడ పుడుతుంది? ఎలా పుడుతుంది?
ముత్యాలు ఆలుచిప్పల్లో దొరుకుతాయని అందరం చిన్నప్పుడు వినే ఉంటాం. కాని ఎలా ఏర్పడుతాయో నేనెప్పుడూ విన్లేదు. అసలు ఆ ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు... నిన్న ఓ పుస్తకం తిరగేస్తుంటే ముత్యం nucleation పద్ధతి వల్ల ఏర్పడుతుందని కనిపించింది. వాతావరణంలోని తేమ ఒక ధూళి కణం చుట్టూ ఘనీభవించి, పేరుకున్నప్పుడు వర్షపు చినుకు ఏర్పడినట్టు... విషయం ఆసక్తికరంగా అనిపించి కాసేపు నెటాన్వేషణ చేశాను. ఇదుగో వివరాలు.
ఆలుచిప్ప (oyster) మోలస్క్ అనే ఒక రకమైన అకశేరుక (invertebrate) జాతికి చెందినది. (అయితే ముత్యం కేవలం ఆలుచిప్పలోనే కాదు, clam అనబడే మరో రకం జలచరంలో కూడా ముత్యాలు ఏర్పడతాయి. కాని అది మరింత అరుదుగా జరుగుతుంది.) ఆలుచిప్పలో ముత్యం ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలంటే ముందు ఆలుచిప్ప అంతరంగ నిర్మాణం (చిత్రం చూడండి) గురించి తెలుసుకోవాలి. నోరు, కడుపు, గుండె, పేగులు, మాంటిల్ మొదలైన ముఖ్య భాగాలని చిత్రంలో చూడొచ్చు.
ఆలుచిప్పలో రెండు విభాగాలు, రెండు చిప్పలు ఉంటాయని అందరికీ తెలిసిందే. రబ్బరుబాండు లాంటి ఎలాస్టిక్ లిగమెంట్ తో ఈ రెండు చిప్పలూ బలంగా బంధించబడి ఉంటాయి. ఆ చిప్పలు కలిసే చోట చిన్న ఎడం ఉంటుంది. అదే ఆలుచిప్ప ’నోరు’. అందులోంచి అది ఆహారం లోనికి తీసుకుంటుంది.
ఆలుచిప్ప ఎదుగుతున్నప్పుడు దాని పైన ఉండే గవ్వ (shell) కూడా పెరుగుతుంది. ఆ గవ్వకి కావలసిన పదార్థం అందులోపల ఉండే మాంటిల్ అనబడే గుజ్జు లాంటి పదార్థం నుండి వస్తుంది. ఆలుచిప్ప ’తినే’ ఆహారంలో ఉండే ఖనిజాలని ఈ మాంటిల్ వెలికి తీసి దాంతో పై తొడుగు అయిన గవ్వని పెంచి పోషిస్తుంది.
ఆలుచిప్పలో ముత్యం ఏర్పడం ధూళి కణం చుట్టూ వర్షపు చుక్క ఏర్పడడాన్ని పోలి ఉంటుందని పైన చెప్పుకున్నాం. మరో పోలిక చెప్పాలంటే, మన చర్మంలో ఒక చెక్కపేడు గుచ్చుకుంటే దాని చుట్టు రక్తం గడ్డ కడుతుంది, చిన్న బొబ్బలా ఏర్పడుతుంది. ఆలుచిప్పలో కూడా ఏదైన అపరిచిత వస్తువు ప్రవేశిస్తే, ఆత్మరక్షణార్థం ఆలుచిప్ప ఆ వస్తువు చుట్టూ నేకర్ (nacre) అనే ఓ ప్రత్యేకపదార్థంతో పూత వేస్తుంది. ఆ పూతే పెరిగి పెద్దదై ముత్యంలా ఏర్పడుతుంది.
ఈ ప్రక్రియని అర్థం చేసుకున్న సాంకేతిక నిపుణులు కృత్రిమమైన ప్రేరణలిచ్చి ముత్యం వేగంగా తయారయ్యేలా చేస్తారు. మాంటిల్ ధాతువు లో అక్కడక్కడ కోతలు కోసి, అందులో ఓ అపరిచిత వస్తువుని ప్రవేశపెడితే, ఆలుచిప్ప దాని చుట్టూ ఓ ముత్యాన్ని రూపొందిస్తుంది.
మంచి ముత్యాలు సహజంగానే చక్కని గోళాకారంలో ఉంటాయి. ఇవి చాలా విలువైనవి. కాని అన్ని ముత్యాలూ అలా తీరుగా గోళాకారంలో ఏర్పడవు. కొన్ని కచ్చితమైన ఆకారం లేకుండా చలివిడి ముద్దల్లా ఉంటాయి. వీటిని baroque ముత్యాలు అంటారు. నాణ్యతలో చూస్తే కృత్రిమ సంస్కారాల చేత తయారుచెయ్యబడ్డ ముత్యాలు (cultured pearls), సహజ ముత్యాలు (natural pearls) రెండూ ఒక్కటే. కాని కృత్రిమ ముత్యాలని అధిక సంఖ్యలో తయారుచెయ్యొచ్చు కనుక, సహజ ముత్యాలు మరి కొంచెం అరుదు కనుక, కృత్రిమ ముత్యాల వెల కాస్త తక్కువగా ఉంటుంది. ఇక రంగుల విషయానికి వస్తే ముత్యాలు తెలుపు, నలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ ఇలా నానా రంగుల్లోను వస్తాయి.
చాలా విషయాలు తెలియచేశారు.కృతజ్ఞతలు
muthyalaki sahajamgaane randram vuntumda? leka vaatini dandagaa kuttetappudu randram pedataara?
mutyaalaki sahajamgaa randhram vundadu.
కానీ sir ఆల్చిపా లు ఎక్కడ ఉంటాయో చెప్పలేదు