ఆధునిక యుగంలో ఉత్తర, దక్షిణ ధృవ ప్రాంతాలు గొప్ప అంతర్జాతీయ వైజ్ఞానిక పరిశోధనా లక్ష్యాలుగా పరిణమించాయి. అలాంటి అంతర్జాతీయ వైజ్ఞానిక సహకారం 1882-1883 కాలంలో మొదలయ్యింది. ఆ సంవత్సరాన్ని ’అంతర్జాతీయ ధృవ సంవత్సరం’ గా చాటి ఎన్నో దేశాలు ధృవాల సమిష్టి పర్యటనలోను, పరిశోధనలోను పాల్గొన్నాయి.
ఆ పరిశోధనలో ధృవాల వద్ద ప్రత్యేక ఆకర్షణలైన రంగురంగుల అరోరా బోరియాలిస్ ప్రదర్శనలని, భూమి అయస్కాంత క్షేత్రాన్ని, ఇలా ఎన్నో ఆసక్తికరమైన భౌతిక పరిస్థితులని సమిష్టిగా పరిశోధించాయి. తరువాత 1932-1933 సంవత్సరాన్ని కూడా రెండవ అంతర్జాతీయ ధృవసంవత్సరంగా చాటారు. 1950 లో అమెరికా దేశానికి చెందిన భౌగోళిక శాస్త్రవేత్త లాయిడ్ బెర్క్నర్ (మొట్టమొదటి బర్డ్ అంటార్కిటిక్ పర్యటనా బృందంలో ఇతడు పాల్గొన్నాడు) మూడవసారి అంతర్జాతీయ సంవత్సరాన్ని ప్రకటిస్తే బావుంటుందని సూచించాడు. ఈ ప్రతిపాదనకి ’అంతర్జాతీయ సమిష్టి వైజ్ఞానిక సదస్సు’ ఉత్సాహంగా స్పందించింది. ఈ సారి శాస్త్రవేత్తలు అత్యంత శక్తివంతమైన అధునాతన వైజ్ఞానిక పరికరాలతో, తేలని చిక్కు ప్రశ్నలతో ధృవ యాత్రకి సిద్ధం అయ్యారు. కాస్మిక్ కిరణాల గురించి, వాతావరణంలో పైపొరల గురించి, సాగర గర్భం గురించి, అంతరిక్ష యాత్రల గురించి ఎన్నో ప్రశ్నల పరిశోధనకి పూనుకున్నారు.
చివరికి ఓ ’అంతర్జాతీయ భూభౌతిక సంవత్సరం’ (International Geophysical Year, IGY) ప్రకటించబడింది. ఈ సారి జులై 1, 1957 కి డిసెంబర్ 31, 1858 నడిమి కాలాన్ని ఎంచుకున్నారు. ఆ దశలో ప్రత్యేకించి సూర్యబిందువుల (sunspot) కి సంబందించిన చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆ కాలాన్ని ఎంచుకున్నారు. ఈ బృహత్ ప్రయత్నంలో నానా దేశాలు వాటి శత్రుత్వాలని మరచి ఉత్సాహంగా పాల్గొన్నాయి. అమెరికా, రష్యా దేశాలు కూడా వాటి చిరకాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఓ మహత్తర వైజ్ఞానిక లక్ష్యసాధనలో చెయ్యి కలిపాయి.
సమాజం దృష్టిలో అంతర్జాతీయ భూభౌతిక సంవత్సరం వల్ల కలిగిన అతి ముఖ్యమైన ఫలితాలు అమెరికా, రష్యాలు పంపిన కృత్రిమ ఉపగ్రహాలు. కాని విజ్ఞాన పరంగా ఆ ఏడాది మరెన్నో చక్కని పరిణామాలు జరిగాయి. వాటిలో ఒకటి విస్తృతంగా జరిగిన అంతర్జాతీయ అంటార్కిటికా పర్యటన. అమెరికా దేశం అంటార్కిటికాలో ఏడు కేంద్రాలని స్థాపించింది. మంచు లోపలికి మైళ్ల లోతుకి తవ్వి అక్కడ మంచులో చిక్కుకున్న గాలి బుడగలని (ఇవి కొన్ని మిలియన్ సంవత్సరాలకి పూర్వానివి అయ్యుండొచ్చు), బాక్టీరియా అవశేషాలని సేకరించింది. మంచు నేలలో కొన్ని వందల అడుగుల లోతు నుండి పైకి తీసిన బాక్టీరియా మళ్లీ ప్రాణం పొసుకుని మామూలుగా ఎదిగాయి.
జనవరి 1958 లో సోవియెట్ బృందం అంటార్కిటికా ఖండంలో బాగా లోపలికి ’Pole of Inaccessibility’ అని ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. దక్షణ ధృవం నుండి 600 మైళ్ల దూరంలో ఉన్న స్థావరం వద్ద రికార్డు స్థాయిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 1960 లో ఆగస్టు నెలలో, అంటార్కిటికాలో శీతా కాలం నడుస్తున్న సమయంలో కార్బన్ డయాక్సయిడ్ కూడా గడ్డ కట్టేటంత తక్కువ ఉష్ణోగ్రత
-127 oC నమోదు అయ్యింది. ఆ తరువాతి దశాబ్దంలో ఏడాది పొడవునా పని చేసే వైజ్ఞానిక స్థావరాలు డజన్ల కొద్దీ అంటార్కిటికా మీద స్థాపించబడ్డాయి.
ఈ దశలోనే అంటార్కిటికా పర్యటనా చరిత్రలో ఓ కొత్త విజయం సాధించబడింది. వివియన్ ఎర్నెస్ట్ ఫుక్స్, మరియు ఎడ్మండ్ పర్సివల్ హిలరీ ల నేతృత్వంలో బ్రిటిష్ పర్యటనా బృందం చరిత్రలో మొట్టమొదటిసారిగా అంటార్కిటికా ఖండాన్ని ఒక కొస నుండి అవతలి కొసకి దాటింది. (అయితే ఈ ప్రయత్నంలో వాళ్లు ప్రత్యేక వాహనాలు, అధునాతన వైజ్ఞానిక సదుపాయాలు వాడుకున్నారన్న విషయం గమనించాలి.) ఎడ్మండ్ హిలరీ పేరు మనం మరో సందర్భంలో కూడా తలచుకుంటాం. టెన్సింగ్ నార్కే అనే షేర్పాతో కలిసి ఇతడు 1953 లో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించాడు.
IGY సాధించిన వైజ్ఞానిక విజయాల కారణంగా, ప్రపంచ దేశాలు తమ శత్రుత్వాన్ని విస్మరించి ప్రదర్శించిన సుహృద్భావం కారణంగా 1959 లో పన్నెండు దేశాలు కలిసి ఓ ఒప్పందానికి వచ్చాయి. అంటార్కిటికా భూమిని సైనిక వ్యవహారాలకి దూరంగా ఉంచాలని ఆ ఒప్పందంలోని సారాంశం. అప్పట్నుంచి అంటార్కిటికా కేవలం వైజ్ఞానిక, పర్యటనా వ్యవహారాలకి మాత్రమే వేదిక అయ్యింది.
చాలా మంచి సమాచారం ఇస్తున్నారు సర్. ద్రువాల మీద భారతదేశం నుంచి ఏమైనా పరిశోధనా కేంద్రాలు ఉన్నాయా? ఉంటే ఆ వివరాలు తెలియజేయగలరు.
లక్ష్మీనారాయణ గారు:
అవును. కొంత సమాచారం ఉంది. వీలైనంత త్వరలో రాయడానికి ప్రయత్నిస్తాను.
Ggfcchvggg