శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

గ్రీకుల మూలతత్వాలే మన పంచభూతాలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, December 19, 2010
అనాక్సీమినీస్ కాలంలోనే పెర్షియన్లు అయోనియా తీరం మీద దండెత్తారు. తిరగబడ్డ అయోనియన్లని పెర్షియన్లు ఉక్కుపాదంతో తొక్కేశారు. అలాంటి విషమ పరిస్థితుల్లో వైజ్ఞానిక సాంప్రదాయం కాస్త బలహీనమైనా కొంత రసాయనిక పరిజ్ఞానం పశ్చిమదిశగా వ్యాపించింది. అయోనియాకి కాస్త దూరంలో సామోస్ అనే దీవి మీద జీవించే పైథాగొరాస్ (క్రీ.పూ. 582-497) క్రీ.పూ.529 లో సామోస్ వదిలి దక్షిణ ఇటలీ ప్రాంతానికి ప్రయాణించాడు. అక్కడ అతడు చేసిన బోధనలు ఎన్నో తరాల వారిని ప్రభావితం చేశాయి.

పైథాగొరాస్ బోధనల చేత ప్రభావితుడైన వారిలో ముఖ్యుడు ఎంపిడోకిలిస్ (క్రీ.పూ. 490-430) అనే గ్రీకు తాత్వికుడు. ఇతగాడు సిసిలీకి చెందిన వాడు. విశ్వ పదార్థాలన్నిటికీ మూల పదార్థం ఏమిటి? అన్న ప్రశ్న ఎంపిడోకిలిస్ ని కూడా వేధించింది. తన పూర్వీకులు ఇచ్చిన సమాధానాలలో ఏది నిజమో అతడు తేల్చుకోలేకపోయడు. కనుక గత పరిష్కారాలన్నిటిని సమన్వయ పరిచే పరిష్కారం ఒకటి ఆలోచించాడు.

అలాంటి మూలపదార్థం ఒక్కటే కావలసిన అవసరం ఏముంది? అలాంటివి నాలుగు ఉండొచ్చుగా? హెరాక్లిటస్ సూచించిన అగ్నికి, అనాక్సీమినిస్ సూచించిన గాలికి, థేల్స్ సూచించిన నీటికి, ఎంపిడోకిలిస్ మట్టిని జతచేశాడు.

తదనంతరం గ్రీకు తాత్వికులందరిలోకి మహోన్నతుడైన అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322) ఈ ’నాలుగు మూలతత్వాల సిద్ధాంతాన్ని సమ్మతించాడు. అయితే ఆ మూలతత్వాలు, వాటి పేర్లకి సంబంధించిన భౌతిక పదార్థాలు, రెండూ ఒక్కటే నని అరిస్టాటిల్ ఎప్పుడూ అనుకోలేదు. “నీరు” అన్న పేరు గల మూలపదార్థం, మనం తాకితే తడిగా అనిపించే భౌతిక పదార్థం నీటితో సమానం కాదు. భౌతిక పదార్థం నీటికి, “నీరు” అన్న పేరు గల మూలపదార్థం అత్యంత సన్నిహితంగా ఉంటుంది అంతే.

ఈ మూలతత్వాలు రెండు పరస్పర విరుద్ధ లక్షణాల జతల సంయోగాలని అనుకున్నాడు అరిస్టాటిల్. ఆ లక్షణాలలో ఒక జత: వేడితనం-చల్లదనం. రెండవ జత: తడి-పొడి. ఒకే వస్తువుకి పరస్పర విరుద్ధ లక్షణాలు ఉండలేవు. కనుక ఏ వస్తువుకైనా మొదటి జత లక్షణాలలో ఒకటి, రెండవ రెండవ జత లక్షణాలలో ఒకటి ఉంటాయి. అంటే మొత్తం నాలుగు సంయోగాలు అన్నమాట. ఒక్కొక్క సంయోగం ఒక్కొక్క మూలతత్వాన్ని నిర్వచిస్తుంది. ఉదాహరణకి “వేడి, పొడి” లక్షణాలు కలిస్తే అది అగ్ని అవుతుంది. అలాగే “వేడి, తడి” కలిస్తే గాలి. “చల్ల, పొడి” కలిస్తే భూమి. “చల్ల, తడి” కలిస్తే నీరు.

ఇక్కడితో ఆగక అతడు మరో మెట్టు ముందుకు వేశాడు. ప్రతీ మూలతత్వానికి దాని స్వంత స్వాభావికమైన లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకి కింద పడడం భూమి లేదా మట్టి యొక్క తత్వం. అలాగే పైకి ఎగయడం అగ్ని యొక్క తత్వం. కాని ఖగోళ వస్తువులకి చెందిన పదార్థం మాత్రం భూమి మీద ఉన్న పదార్థాల కన్నా చాలా భిన్నంగా ఉన్నట్టు తోచింది. అవి కింద పడనూ పడవు, పైకి పోనూ పోవు. అవి ఎల్లకాలం భూమి చుట్టూ మారని వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతూ ఉంటాయి.

కనుక దివి లోకం అంతా ఈ నాలుగు తత్వాలకి భిన్నమైన మరేదో ప్రత్యేక తత్వంతో నిర్మించబడి ఉండాలని ఊహించాడు అరిస్టాటిల్. ఆ తత్వానికి “ఈథర్” అని పేరు పెట్టాడు. ఈథర్ అంటే ప్రకాశించేది అని అర్థం. మరి ప్రకాశం అనేది దివి సీమలో కనిపించే వస్తువుల ప్రథమ లక్షణం. దివి సీమ అంతా అద్భుతమైన నిత్యతతో వెలుగారుతూ ఉంటుంది కనుక ఈ ఈథర్ అనే పదార్థం శాశ్వతమై, పరిపూర్ణమై, అమోఘమై, అవినాశమై వెలుగొందుతూ ఉంటుందని, ఇక్కడ మనకి కనిపించే నాలుగు తత్వాల కన్నా ఈ తత్వం చాలా భిన్నమైనదని ఊహించాడు అరిస్టాటిల్.

(గ్రీకులు బోధించిన “మూల తత్వాలు” (elements) అన్న భావనలనే మన దేశంలో పంచ భూతాలు అని పిలుచుకుంటాం. గ్రీకులు మొదటి నాలుగు తత్వాలు, పంచ భూతాలు మొదటి నాలుగు భూతాలకి సరిసమానం. అవి పృథ్వి (మట్టి), ఆపస్ (నీరు), అగ్ని, వాయువు (గాలి). పంచభూతాల్లో చివరిదైన ఆకాశం, గ్రీకులు చెప్పిన “ఈథర్” తో సరిసమానం అనుకోవాలి. – అనువాదకుడు).

ఆ విధంగా ప్రపంచంలోని వస్తువులన్నీ ఈ నాలుగు తత్వాలతో కూడుకుని ఉన్నాయన్న భావన రెండు వేల ఏళ్ల పాటు రాజ్యం చేసింది. ఆధునిక విజ్ఞానం ఈ భావనలకి ఎప్పుడో తిలోదకాలు వదిలేసినా, సామాన్య పరిభాషలో ఈ భావాలు తరచు ఎన్నో సందర్భాల్లో దొర్లుతూనే ఉంటాయి. ఉదాహరణకి “పంచ భూతాల సాక్షిగా” అంటాం. అంటే మన చుట్టూ ఎప్పుడూ ఉండే మట్టి, గాలి మొదలైన వాటి సమక్షంలో అని ఉద్దేశం. గ్రీకులు బోధించిన ఐదవ మూలతత్వం అయిన ఈథర్ నే లాటిన్ లో “quint essentia” (పంచమ తత్వం) అంటారు. అది మచ్చలేని, నిత్య పదార్థం కనుక ఇంగ్లీష్ లో quintessence అన్న పదానికి అమలిన, అద్భుత సారం అన్న అర్థం వచ్చింది.

(సశేషం...)

25 comments

  1. gaddeswarup Says:
  2. 'మనిషి లో ఐదు ప్రాణాలు ఉంటాయని ఈ ఐదు ప్రాణాలు పంచ భూతాల్లో కలిసి పోతాయని అంటారు.'
    from http://baala-siksha.blogspot.com/2009/04/blog-post_4587.html
    'పంచ ప్రాణాలు బాసే వేళ ' ఎలా వచ్చిందో?
    "పంచ ప్రాణాలు బాసే వేళలో
    నించు-మన ప్రెమ నీ కన్నీళ్ళలో"
    (ఆరుద్ర ప్రెమలేఖలు సినిమాలో)

     
  3. స్వరూప్ గారు:

    నాకు తెలిసిన సమాచారం ఇది. నా రిఫరెన్స్: Perfect Health by Deepak Chopra.

    పంచ ప్రాణాలు అన్న భావన ఆయుర్వేదంలో వస్తుంది. శరీరం వాత, పిత్త, కఫం అనే మూడు దోషాలతో కూడుకుని ఉంటుంది. వీటిలో ఒక్కొక్కదాంట్లో మళ్లీ ఐదు రకాలు ఉంటాయి. వాతానికి మరో పేరే ప్రాణం. అందులో ఐదు రకాలు.
    ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అన్నవి పంచ ప్రాణాలు. ఈ ఐదింటికి శరీరంలో వాటి వాటి ప్రత్యేక క్రియలు ఉంటాయట.

    ఇక పంచభూతాలు – మట్టి, నీరు... మనకి తెలిసినవే.

    మరణం సంభవించినప్పుడు వట్టి పంచప్రాణాలేం ఖర్మ, పంచ కఫాలు, పంచ పిత్తాలు, ఏడు ధాతువులు (అస్తి, మజ్జ ...మొ||) – సమస్తం ప్రకృతిలో అంటే పంచభూతాల్లో కలిసిపోవాలి. కనుక కేవలం పంచప్రాణాలు మాత్రం పంచభూతాల్లో కలిసిపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు.

    ఇక్కడ ఒక disclaimer: ఏదో ఇలా తర్కం ఉపయోగిస్తున్నా గాని, ఆ పదాలకి అర్థం నాకూ తెలీదు నాకూ ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అసలు ప్రాణం అంటే ఏంటి? చలనానికి కారణం అవుతుంది కనుక అది నాడులలోని ionic current అనుకోవాలా? పిత్తం అంటే ఏంటి? జీర్ణానికి కారణం అవుతుంది కనుక అదో digestive juice అనుకోవాలా? అలాగే మట్టి, నీరు మొదలైనవి భూతాలు (elements,), అంటే మౌలిక పదార్థాలు ఎందుకు అయ్యాయి? అవి సంకీర్ణ పదార్థాలు కదా? విశ్వం అంతా వీటితోనే కూడుకుని ఉంటుంది అన్న మాటకి అర్థం ఏంటి?

    ఈ ప్రశ్నలకి సమాధానాలు లేవు. సమాధానాలు లేకపోతే పోయె. అసలు ప్రశ్నలు కూడా ఎవరూ వెయ్యకుండా confident గా తరతరాలుగా వీటిని వల్లిస్తూ వస్తున్నాం! సాంప్రదాయక విషయాల గురించి, ముఖ్యంగా సాంప్రదాయక విజ్ఞానం గురించి మాట్లాడుకోవాలంటే ఇదే చిక్కు. ఆ మాటలకి అర్థం ఎవరికీ తెలీదు. చెప్పేవాళ్లు చెప్తుంటారు, వినేవాళ్లు వింటుంటారు.

    అదే బ్లాగ్ లో మరో చోట “పాతాళ లోకాల” (అతల, వితల, సుతల...మొ||) గురించి చెప్తూ పాతాళ లోకాలు సముద్ర తీర దేశాలు కావచ్చు అని ఉంది. పాతాళానికి సముద్ర తీరాలకి ఏంటి సంబంధం?

    అలాగే భువర్లోకం, సువర్లోకం మొదలైన “దేవ లోకాల” గురించి చెప్తూ దేవతలు అంటే aliens అని చెప్తే పిల్లలకి అర్థం కావచ్చు అని ఉంది!!!

    Aliens కి దేవతలకి సంబంధం ఏంటి? ఏదో అడిగారు కదా పిల్లలకి ఇష్టం వచ్చినట్టు సమాధానాలు చెప్పడం మంచిదేనా? నేనైతే నా తరువాతి తరం వారికి ఇలాంటి విషయాల గురించి ఇలా చెప్తాను: “మన పూర్వీకులు ఇవన్నీ చెప్పారు. కాని ఈ పదాలకి అర్థం నాకు స్వానుభవంలో, కచ్చితంగా తెలీదు. ఏదో మాటలు తెలుసుగాని వాటి అర్థం లోతుగా, నిర్ద్వంద్వంగా తెలీదు. నాకే తెలీని విషయాన్ని ఏదో తెలిసినట్టుగా మీకు మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం నాకు ఇష్టం లేదు. నాకు తెలీనంత మాత్రాన మీకు తెలియకూడదని లేదు. మీరు పెద్దయ్యాక మీ అంతకు మీరు ఈ విషయాలని అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. మీకైనా అర్థమైతే చాలా సంతోషం...”

     
  4. Anonymous Says:
  5. శ్రీనివాస్ గారు, మీరు మద్రాస్ లో ఉన్నారు గదా మీకు వీలైనపుడు శ్రీ జగ్గి వాసుదేవ్ లాంటి వారిని కల్సి ఇటువంటి ప్రశ్నలు అడిగేది. ఆయన చెన్నయ్, కోయంబత్తుర్ లో ఎక్కువగా ఉంటారు కదా. నేను అనుకోవటం మీకు తప్పక సమాధానం ఆయన ఇవ్వగలరు

     
  6. gaddeswarup Says:
  7. "ఈ ప్రశ్నలకి సమాధానాలు లేవు. సమాధానాలు లేకపోతే పోయె. అసలు ప్రశ్నలు కూడా ఎవరూ వెయ్యకుండా confident గా తరతరాలుగా వీటిని వల్లిస్తూ వస్తున్నాం! సాంప్రదాయక విషయాల గురించి, ముఖ్యంగా సాంప్రదాయక విజ్ఞానం గురించి మాట్లాడుకోవాలంటే ఇదే చిక్కు. ఆ మాటలకి అర్థం ఎవరికీ తెలీదు. చెప్పేవాళ్లు చెప్తుంటారు, వినేవాళ్లు వింటుంటారు."
    I find that this is an interesting phenomenon and may vary from culture to culture and to some extent shape the way we think. Eventhough I am an agnostic, sometimes I am automatically reminded of that Arudra song in the evenings because it seems to evoke some feelings though it may not make much sense logically. There is an interesting discussion in the Economist on the topic:
    http://www.economist.com/debate/debates/overview/190

     
  8. Anonymous Says:
  9. This comment has been removed by the author.  
  10. Anonymous Says:
  11. This comment has been removed by the author.  
  12. Anonymous Says:
  13. This comment has been removed by the author.  
  14. Anonymous Says:
  15. అసలు ఏ వస్తువైనా ఎలా ఏర్పడుతుంది???
    చెట్టు ఎలా పెరుగుతుంది?విత్తగానే మొలక రాదుగా...
    భూమిలో వేడి,నీరు విత్తు మొలకెత్తడానికి సహాయపడి..అది మొలకెత్తగానే భూమి ద్వారా పోషకాలు గ్రహించి,
    నీటిని స్వీకరించి ఎదుగుతుంది....ఇప్పుడు దానికి ఉష్ణం సూర్యుడి ద్వారా లభిస్తుంది.గాలి ఉపయోగం ఇక చెప్పాల్సిన
    అవసరం ఉందా....ఆకాశం అంటే అంతరిక్షమో,మబ్బులో కాదు...దానికి ఖచ్చితమైన అర్ధం ఇంగ్లీష్ లో స్పేస్....తెలుగులో
    ఖాళీ ప్రదేశంగా చెప్పుకోవచ్చు....పరమాణువుల మధ్యవున్న ఖాళీ నుండి... అణువుకి,అణువుకి మధ్యనున్న ఖాళీనీ...
    మీకు మీరు చూస్తున్న కంప్యూటర్ కీ మధ్యనున్న ఖాళీని కూడా ఆకాశమే అంటారు...మరి దీని ఉపయోగం ఏంటట??
    ఈ ఆకాశమనే ఖాళీనే గనుక అణువుల మధ్యన లేకపోతే మనిషి ఓ చిన్న బంతిలా ఉంటాడు...ఆకారాన్ని కల్పిస్తుంది కాబట్టి
    అది ఆకాశం...శ్రీ విష్ణు సహస్రనామాల్లో భగవంతుడ్ని కీర్తిస్తూ ఉండే రెండో పేరు విష్ణుః .... విష్ణుః అంటే విశ్వమంతా వ్యాపించివున్న
    ఆకాశం అని అర్ధం.....

    .జీవులు,వస్తువులు పంచభూతాలతో కాక మరి దేనితో ఏర్పడ్డట్టు???
    జీవి మరణించాక ఆయా భూతాలు వాటి మూలతత్వాల్లో ఐక్యమవుతాయి అంటే...
    జీవి మరిణించిన తర్వాత మిగిలన పదార్ధం లేదా శవం...కాస్త జీవం కలిగివుంటుంది...
    ఏదైనా చచ్చిన ప్రాణిని గమనించండి....మొదట వేడి దానిలో నీటిని లాగేస్తుంది....అది ఎండిపోతుంది...
    లేదా కుళ్లిపోతుంది....హైవేల మీద చచ్చిన ప్రాణులని చూడండి...అవి క్రమంగా భూమిలా ఎలా మారతాయో
    అర్ధం అవుతాయి....సముద్రం..ఆవిరి...వర్షం..నది...సముద్రం... నీరు సైకిల్ చర్య ఎలా వుంటుందో పదార్ధం సైకిల్ చర్య కూడా అలాగే ఉంటుంది.
    చిన్నలాజిక్.....మీకిదంతా తెలియనిదీ కాదు,తెలియదనీ కాదు......

     
  16. Anonymous Says:
  17. This comment has been removed by the author.  
  18. Anonymous Says:
  19. This comment has been removed by the author.  
  20. Anonymous Says:
  21. అశ్వం అంటే అర్ధం కిరణం...
    సప్త కిరణములు :
    సుషుమ్న,హరికేశ,విశ్వకర్మ,విశ్వశ్రవ,సంయద్వను,అర్యావసు,స్వరత్.
    తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత....

     
  22. Anonymous Says:
  23. సమాధానాలున్నాయి..ప్రశ్నలు ఎవర్ని ఎవరు వెయ్యాలి?మీ దగ్గరికి వచ్చి చెప్పల్సిన అవసరం ఎవరికుంది?
    సమాధానాలు వాటికవే ఆకాశంలోంచి ఊడిపడవు.
    తెలుసుకోవాలనుకున్నప్పుడు ప్రయత్నం చేయాలి...లేదా సంపూర్ణంగా తెలిసిన ఙ్ఞానులను ఆశ్రయించాలి.
    జిఙ్ఞాస ఉంటే తెలుసుకోవాలి...లేదా మన పని మనం చేసుకోవాలి.
    ఒక శాస్త్రం గురించి అధ్యయనం చెయ్యకుండా దాన్ని విమర్శించడం చదువుకున్నవారు
    చేయవలసిన పని కాదు...పూర్తిలోతుల్లో దిగితే గానీ ఏ శాస్త్రమూ అర్ధం కాదు..అలా కాకుండా
    మన తాతలు,బామ్మలు..తెలిసీ తెలియకుండా రాస్తే పుస్తకాల్లో అచ్చయిన వ్యాసాలు చదివి విమర్శించ
    ప్రయత్నిస్తే...దానికి మన చుట్టూచేరిన మనలాంటి ఓ పది మంది చప్పట్లు కొట్టచ్చు...అది ప్రతిభగా మనం
    పొరబడొచ్చు....కానీ వాస్తవం వేరుగా ఉంటుంది..
    ఒక్క సంస్కృతపదానికి అర్ధం సరిగా తెలియకుండా ఆ సంస్కృతపదాల్లోని భావనని ఎలా విమర్శిస్తున్నారో
    నాకైతే అర్ధం కావడం లేదు....

    ...ఓ చిన్న శ్లోకాన్ని ఉదాహరణగా చెప్తాను...ఏమైనా అర్ధమైతే మిగతావి తెలుసుకునే ప్రయత్నం చేయండి....
    సూర్య స్తుతి:
    సప్తాశ్వరధ మారూఢం శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం.
    ఇది వేల సం II రాసిన శ్లోకం.
    భావం:
    ఏడు గుఱ్ఱాలు పూనిన రధమెక్కి తెల్లటి పద్మాన్ని ధరించి వస్తున్న సూర్యుడికి నమస్కారం.
    అర్ధం పర్ధం లేకుండా వుంది కదూ...అర్ధంకానిది ప్రతిదీ అర్ధం పర్ధం లేకుండానే వుంటుంది.
    గుఱ్ఱానికి అర్ధం కిరణం, పద్మం అంటే వెలుగుఇప్పుడు అర్ధాన్ని ఆస్వాదించండి.
    ఏడు రంగులకిరణాలతో కలిసిన తెల్లటి కాంతితో వెలుగునిస్తున్న సూర్యుడికి నమస్కారం.

     
  24. Anonymous Says:
  25. This comment has been removed by the author.  
  26. Anonymous Says:
  27. గుఱ్ఱానికి అర్ధం కిరణం, పద్మం అంటే వెలుగుఇప్పుడు అర్ధాన్ని ఆస్వాదించండి.

    Interesting, I didn't know such meanings.

     
  28. Anonymous Says:
  29. అశ్వం సంస్కృత ఆంధ్ర నిఘంటువులో నానార్ధాలు చూడండి.
    పద్మం (అల్లిగోరికల్) ప్రతీక - కాంతి అన్ని వైపులకు సమానంగా పద్మంలా
    వికసించినట్టు వ్యాపిస్తుంది.

     
  30. Anonymous Says:
  31. పైన మీరుదహరించినవన్నీ సంస్కృత పదాలు వాటికి ఒకటికన్నా ఎక్కువ అర్ధాలున్నాయి.. తెలిస్తే చిక్కుముడి వీడుతుంది.

    వాతం అంటే గాలి,పిత్తం అంటే అగ్ని,కఫం అంటే జలం.

    ప్రాణం అంటే ఆహారం,శ్వాస,దృష్టి,శబ్ధము,భావాలు ఇలా అన్నిటిని లోనికి స్వీకరించే శక్తి.
    అపానం అంటే భావాలతో సహా అన్నిటినీ బయటికి విడిచే శక్తి.
    ఉదానం అంటే శరీరం దాన్ని ఆకారాన్ని కోల్పోకుండా తెరిచిన గొడుగులో చువ్వల్లా నొక్కిపట్టివుంచే శక్తి.
    వ్యానం అంటే శరీరమందు రక్తప్రసరణ చేసే శక్తి.
    సమానం అంటే నడకలో,కూర్చోవటం,ఈత మొదలైవాటిలో పడిపోకుండా ఉంచే బాలన్స్.
    వేదం అంటే ఙ్ఞానం అని అర్ధం...పరం అంటే సూక్షం అని...హంస అంటే వాయువు అని అర్ధాలు..ఇవి సంకేత పదాలు.
    అల్లిగోరికల్ భాషలో వేదాలు రాసారు...
    మాతృ నుండి మదర్..పితృ నుండి ఫాదర్...బ్రాతృ నుండి బ్రదర్...సిస్టర్ నుండి సోదరి వచ్చాయి...
    సెప్టెంబరు సప్త నుండి..అక్టోబర్ అష్ట నుండి నవంబర్ నవ నుండి....డిసెంబర్ దశ నుండి వచ్చాయి....మొదట పదినెలలు మాత్రమే వారికివున్నాయి మరి.
    దానిలో చివరి నాలుగు ఇవి.....మిగతావి + కొత్తగా చేర్చిన వాటికి పేర్లు మార్చబడ్డాయి.....

     
  32. మీ విరణలు నన్ను ఇంకా అయోమయంలో పడేశాయి!
    “వాతం అంటే గాలి,పిత్తం అంటే అగ్ని,కఫం అంటే జలం.” అన్నారు.
    సరే వాతం = గాలి అనుకుందాం. ప్రాణాపాన మొదలైనవి ఈ వాతంలో రకాలు అనుకుంటే (సజాతీయ భేదం) అవన్నీ ఐదు రకాల గాలులు కావాలి.

    మరి -

    “ప్రాణం అంటే ఆహారం,శ్వాస,దృష్టి,శబ్ధము,భావాలు ఇలా అన్నిటిని లోనికి స్వీకరించే శక్తి.” అన్నారు.
    ఒక “గాలి” ఇవన్నీ మన శరీరం లోపలికి తీసుకోవడం ఏమిటి?

    “అపానం అంటే భావాలతో సహా అన్నిటినీ బయటికి విడిచే శక్తి.” అన్నారు.
    అలాగే ఒక గాలి ఇవన్నీ పైకి వదలడం ఏంటి?

    “ఉదానం అంటే శరీరం దాన్ని ఆకారాన్ని కోల్పోకుండా తెరిచిన గొడుగులో చువ్వల్లా నొక్కిపట్టివుంచే శక్తి” అన్నారు.
    గాలి వల్ల శరీరం యొక్క ఆకారం నిలవడం ఏంటి? అదేమైనా గాలి బుడగా?

    “వ్యానం అంటే శరీరమందు రక్తప్రసరణ చేసే శక్తి.” అన్నారు.
    రక్తప్రసరణలో ఒక చోట (ఊపిరి తిత్తుల్లో) వాయు వినియమం (gas exchange) జరుగుతుంది. అంత వరకు బాగానే ఉంది. కాని గాలి వల్ల రక్తప్రసరణ జరగడం ఏంటి?

    “సమానం అంటే నడకలో,కూర్చోవటం,ఈత మొదలైవాటిలో పడిపోకుండా ఉంచే బాలన్స్.” అన్నారు. బాలన్స్ చెయ్యడానికి గాలి ఉపయోగపడడం ఏంటి? బాలన్స్ ని శాసించేది vestibular system.
    (http://www.scholarpedia.org/article/Vestibular_system) ఇక్కడ ఈ గాలి ప్రసక్తి ఎలా వస్తుంది?

    ఇక్కడే వస్తుంది చిక్కు. మీరు ఏ వివరణ అయినా ఇవ్వండి. It should make sense. అంతే కాక మనకి తెలిసిన వాస్తవాలతో అది సరిపోవాలి. ఇలాంటి వివరణలు కొన్ని ఆయుర్వేదం మీద రాయబడ్డ ఇంగ్లీష్ పుస్తకాల్లో చూశాను. ఆ వివరణల్లో, నిర్వచనాల్లో ఏవైనా అర్థం ఉందా అన్న విమర్శే ఉండదు. వాటి మీద పది కోణాల నుండి చూస్తూ చర్చ ఉండదు. అందుకే అది ఊరికే విని ఊరుకోవడం తప్ప serious గా తీసుకోవడం కష్టం అవుతుంది.

     
  33. Anonymous Says:
  34. సముద్రంలో ఉన్నది నీరే..నదుల్లో,కాలువల్లో..మురికి కాలువల్లో,మేఘాల్లో,వర్షంలో ఉన్నది నీరే..
    వాటికి అన్ని పేర్లెందుకు.....అలా ఎందుకుండాలి? అని ప్రశ్నించడం ఎంత వరకు..సమంజసం?
    వాతం అనేది ఆయుర్వేద వైద్య పరిభాష....ప్రాణం అంటే గాలి అని మీరు అనుకున్నారా? లేక ఎవరైనా చెప్పారా?
    ప్రాణవాయువు ప్రపంచమంతా నిండివుంది...ప్రాణం పోయినప్పుడు మాత్రమే శరీరం వాయువుని లోపలికి పీల్చుకునే శక్తిని కోల్పోతుంది.....ప్రాణమూ..వాయువు ఒకటే ఐతే దానికి రెండుపదాలు కలపాల్సిన అవసరం మనకి లేదు...ఆ వాయువు వల్ల ప్రాణం నిలబడుతుంది.....ఆక్సిజన్ వల్ల మంట వెలిగినట్టు...దానికి మంట..ఆక్సిజన్ రెండు ఒకటే అనుకుంటాను అంటే దానికెవరేం చెయ్యగలరు?

    ఐనా ఒకవేళ మీరన్నట్టు గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లాక ఆ గాల్లో ఆక్సిజన్ ని మాత్రమే అవి గ్రహిస్థాయి(ఆక్సిజన్ కూడా గాలే ఐనప్పటికీ దానికో పేరుంది........ఆ ఆక్సిజన్ లోపలికి వెళ్లి రక్తంలో కలుస్తుంది.....రక్తంలో మనం తిన్న ఆహారం + శరీరం తన పోషణ కోసం తయారుచేసుకున్న స్రావాలుంటాయి(ఇవన్నీ ఆహారం నుండి అందిన పోషణ వల్ల కేవలం ఆహారం అలా మారడం ద్వారా తయారవుతాయి)-.ఇవన్నీ కలిసి శక్తిగా మారతాయి....ఆ శక్తి కొన్ని పనులు చేస్తుంది.....అది చేసే పనులని బట్టి వాటికి కొన్ని పేర్లు పెట్టారు....శక్తికి నాశనం లేదని...అది రూపాంతరం చెందుతుందని మీకు తెలియదని నేననుకోను.....
    అలా మార్పులు చెందే శక్తికి పేర్లు పెట్టినప్పుడు(కైనటిక్,ధెర్మో,మెకానికల్,కెమికల్ ఎనర్జీ),....లోపల అలాంటి శక్తే అది చేసే క్రియలని బట్టి ఆ శక్తికి పేర్లెందుకు పెట్టకూడదు?
    ఒక శక్తి ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం...
    విద్యుత్ ని నీటి ద్వారా,అణువిచ్ఛేదనం ద్వారా,గాలి ద్వారా సృష్టిస్తున్నాం.....
    విద్యుత్ అనే ఓ శక్తి....ఓ చోట వెలుగునిస్తుంది...ఓ చోట టి.వి. చూపిస్తుంది....రేడియో మోగిస్తుంది....ఫాన్ తిప్పుతుంది....రైలుని నడిపిస్తుంది.
    ఇప్పటికీ..ఇంకా అయోమయంలో వుంటే చేసేదేమీలేదు.

    అంటే గాలిని ఊపిరితిత్తులు పీల్చుకున్నప్పుడెలా వుందో...అలాగే శరీరమంతా అదే విధంగా యధాతధంగా తిరుగుతూవుంటూదని అంచనా వేసారన్నమాట.........అంటే శరీరంలో గాలి వేరు గానూ...ఆహారం వేరుగాను...ద్రవం వేరుగాను...తిరిగేలా శరీరనిర్మాణం ఉంటుందని ఎలా ఊహించారో నాకు అర్ధం కావటంలేదు....శరీరంలో ఇక శక్తి అనేది తయారవదు అనే కదా మీ వాదనకి అర్ధం..... రక్తంలో కలిసిన తర్వాత కూడా గాలి అదే గాలిలా వుంటుందని ఎలా అనుకున్నారో నాకైతే అర్ధంకాలేదు.....రక్తంలో ద్రవాలతో కలిసినప్పుడు అవి మొత్తం కలసి శక్తిని ఉత్పత్తి చేస్తాయి...దాన్ని గాలి అనకూడదు...... కాబట్టే...మన పెద్దలు వాటికి పేర్లు పెట్టుకున్నారు....తప్పైతే..మీ ఆధునిక ఙ్ఞానానికి అందని వాటిని కనుక్కున్న వారిని క్షమించండి.....

    మనం ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి స్థిరపడిపోయి...అవతలి వాడి అభిప్రాయం నా పరిధిలోకే రాదు..
    వాడనుకునే ఙ్ఞానం a.b.c.d. స్థాయిలో కూడాలేదు అనుకుంటే అలాంటి తప్పుకి ఎవరు బాధ్యులు?..
    పైన నేను చర్చించిన విషయాల్లో....మిగతా విషయాలన్నీ ఒదిలేసి...ఖచ్చితంగా మీరు అయోమయంలో పడే దాన్నే భలే ఎంచుకున్నారు....
    ఆలోచిస్తే అర్ధమయ్యే విషయాలని..వ్యంగ్యంగా ప్రశ్నించటం మనకి ఖచ్చింతంగా మంచి చేయదు.....

     
  35. Anonymous Says:
  36. మీ ఇద్దరూ మంచి పట్టు వున్న వారిలా వున్నారు, సంభాషణ ఆసక్తికరంగా వుంది. కొత్తవిషయాలు తెలుసుకోగలుగు తున్నాను. ధన్యవాదాలు.

     
  37. Anonymous Says:
  38. అదిత్య గారు, వ్యంగంగా వున్నా, వంకరటింకరగావున్నా, సూటిగా వున్నా ప్రశ్న ప్రశ్నే. మీరు సీరియస్గానే జవాబివ్వడం ద్వారా, దాన్ని సీరియస్ సంభాషణ కింద మరల్చొచ్చు, ఆచార్య.

     
  39. ఆదిత్య గారూ మీరు ఓర్పుగా చెప్పిన విశేషాలు చాలా బాగున్నాయి. కృతజ్ఞతలు. మనుషుల్లో ఎన్ని structures balancing gadgets ఉన్నా ప్రాణం లేకపోతే అవన్నీ వృధా. ప్రాణం అనేది ముఖ్యం. మిగతావి అన్నీ దాని మూలాన వచ్చేవే.

     
  40. Anonymous Says:
  41. @Snkr
    ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పవల్సిన అవసరం ప్రపంచానికి లేదు..
    తెలుసుకుని తీరాలి అని ప్రశ్నించడానికీ...తెలియజెప్పల్సిందే అని ప్రశ్నించడానికి
    తేడా వుంది........
    ప్రతిదీ నీరేగా అని...మురికినీటిని తాగలేంగా...అలాగే..వ్యంగ్య ప్రశ్నలకి సమాధానాలిస్తూ
    కాలం వ్యర్ధం చేసుకోవల్సిన అవసరం ఎవరికీ ఉండదనుకుంటాను....
    ప్రపంచానికి ప్రశ్న సంధించి ఇంట్లో కూర్చుంటే? అది ప్రయత్నం అనరు.
    తెలుసుకోవటం తప్పని సరైతే....శోధించాలి..తపించాలి.....

    @శ్రీనివాస..
    తత్వాలనీ...భూతాలనీ...ఇలా వివిధ రకాల పేర్లతో వ్యవహరించే..వాటిని...
    జాగ్రత్తగా పరిశీలించాక....వాటి అర్ధాలు తెలుసుకున్న తర్వాత...అలోచించి
    ఒక అవగాహనకి వచ్చాక...అప్పుడు ప్రశ్నించండి...

     
  42. chakri Says:
  43. చాల ఆసక్తి కరంగా సాగుతోంది చర్చ.
    పూర్వికులు తత్వార్థ పదాలని ఉపయోగించి చెప్పినందువల్ల, మనకి తెలిసిన ఒకే సూటి అర్థం తో విషయం బోధ పడక అయోమయం తప్పదు. కాని అందులోని తత్వార్థాన్ని గ్రహిస్తే అర్థం చేసుకోవటం సులువవుతుంది. దేనిలోనైన "తత్వాన్ని" గ్రహించాలి.
    శరీరం పంచభూతాలతో నిర్మితమైంది అంటే.. ఆ తత్వాలతో అని.

     
  44. ఆదిత్యగారు, శ్రీనివాసగారు Thank you both for the insight given through this discussion

     
  45. Bhattacharya Says:
  46. భారత దేశ ప్రాచీనత మీకేమీ తెలీదని అర్థం అయింది

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts