వెసేలియస్ - వైద్య లోకపు గెలీలియో
1514 లో, డిసెంబర్ 21, బెల్జియం లోని బ్రసెల్స్ నగరంలో పుట్టాడు ఆండ్రియాస్ వెసేలియస్. వాళ్ల కుటుంబంలో అప్పటికే నలుగురు డాక్టర్లు ఉన్నారట. ఐదో డాక్టర్ కావాలని కుర్రవాడైన వెసేలియస్ కి తెగ ఉత్సాహంగా ఉండేది. కనుక వైద్య నేర్చుకోడానికి పారిస్ వెళ్ళాడు.
ఆ రోజుల్లో పారిస్ లో వైద్య విద్యాలయాల్లో వ్యవహారం మహా ఛాందసంగా, సాంప్రదాయ బద్ధంగా ఉండేది. గాలెన్ చెప్పిందే వేదం. మంగలివాళ్లు శవాలు కోస్తుంటే అల్లంత దూరంలో వైద్యులు పవిత్రంగా నించుని సూచనలు ఇస్తుండేవారు. ఈ వ్యవహారం వెసేలియస్ కి ససేమిరా నచ్చలేదు. అదే చెప్పుకున్నాడు ఒక చోట -
"సామూహిక ప్రదర్శనల్లో ఓ మంగలివాడు శవాలని కోసి ఏదో పై పైన చూపిస్తుంటే, నేను, నా తోటి విద్యార్థులు దాన్ని చూసి మురిసిపోయే భాగ్యానికి రాజీ పడి వుంటే, శరీరనిర్మాణ శాస్త్రంలో నా పరిజ్ఞానం ఒక్క అంగుళం కూడా ముందుకి సాగేది కాదు. అందుచేత స్వయంగా నేను రంగ ప్రవేశం చెయ్యక తప్పలేదు."
పారిస్ లో చదువుకునే రోజుల్లో వెసేలియస్ మీద ప్రత్యేక ప్రభావాన్ని చూపిన టీచరు జాకోబిస్ సిల్వియస్. ఇతడు మంచి పరపతి గల శరీరనిర్మాణ శాస్త్ర నిపుణుడు. దూరం నుంచి గుడ్లప్పగించి చూడడం కాకుండా స్వహస్తాలతో జంతు శరీరాలని ఎలా పరిచ్ఛేదించాలో నేర్పించడం ఇతడి ప్రత్యేకత. కాని విచారకరమైన విషయం ఏంటంటే ఎన్ని "కోసినా" ఇతడు చివరికి ఇతడు కూడా చివరికి గాలెన్ భక్తుడే. ఇతడు కూడా గాలెన్ బోధనల మత్తులో పడ్డవాడే. ఆ కారణం చేతనే ఇతగాడు పోనుపోను వెసేలియస్ కి ఒక తలనొప్పిగా దాపురిస్తాడు.
పారిస్ వైద్య విద్యార్థుల చదువు క్లాసుల్లో కన్నా శ్మశానాలలోనే సజావుగా సాగేదని చెప్పాలి. సమాధులు తవ్వి మాంచి సిసలైన మనిషి ఎముకలని వెలికి తీయడంలో వెసేలియస్ ది అందె వేసిన చెయ్యి. ఈ ఎముకల వేటలో తోటి విద్యార్థులకి తనే ముఠానాయకుడు. అయితే ఈ ఎముకల వేట తరతరాల సాంప్రదాయంగా వస్తూ ఆ వల్లకాటినే ఇల్లు చేసుకున్న అక్కడి కుక్కల ముఠాకి, ఈ వైద్య విద్యార్థుల ముఠాకి మధ్య అడపాదపా కాటిలో కాట్లాటలు తప్పేవి కావు.
1537 లో వెసేలియస్ పాడువా నగరానికి తరలాడు. అక్కడ పాడువా విశ్వవిద్యాలయంలో శస్త్రచికిత్స ఆచార్యుడిగా చేరాడు. శస్త్రచికిత్సలో పాఠాలు చెప్పడం, మానవ కళేబరాలని కోసి విద్యార్థులకి, తోటి బోధకులకి ప్రదర్శనలివ్వడం - ఇవీ అతడి బాధ్యతలు. శవాలని కోసే పని మంగలివారికి అప్పజెప్పకుండా స్వయంగా తనే చేసి చూపించేవాడు. ఈ ప్రయోజనం కోసం ఉరితీయబడ్డ నిందితుల శరీరాలని వినియోగించేవాడు.
ఈ అనుభవాన్నంతటినీ చొప్పించి ఉద్యోగంలో చేరిన మరుసటేడే ’ట్యాబ్యులే అనటామికే’ అన్న పుస్తకాన్ని ప్రచురించాడు. అంతకు ముందెవ్వరూ చెయ్యనంత క్షుణ్ణంగా సవిరంగా మానవ దేహం అందులో చిత్రీకరించబడింది. పుస్తక రచన సాగుతుండగా వెసేలియస్ కి ఒక విషయం బాగా అర్థం కాసాగింది. గాలెన్ బోధించిన శరీరశాస్త్రంలో ఎన్ని లొసుగులున్నాయో తెలుస్తోంది. మరి అంత ప్రతిభావంతుడు ఒక్క శరీరనిర్మాణ శాస్త్రంలో మటుకు అన్ని పొరబాట్లెలా చేశాడా అన్నది అతడికి అంతుబట్టలేదు.
1540 లో బొలోనా విశ్వవిద్యాలయం నుండి శావపరిచ్ఛేదనలో ప్రదర్శనలిమ్మని వెసేలియస్ కి పిలుపు వచ్చింది. మూడు మానవ శరీరాలు, ఆరు శునక శరీరాలు, తదితర జంతువులతో రెండు వారాల పాటు పండగలా సాగిన ఆ ప్రదర్శనకి మంచి స్పందన వచ్చింది.
బొలోనాలో ఉన్నప్పుడే ఓ పూర్తి మానవ అస్తిపంజరాన్ని విడి ఎముకల నుండి తనని ఆహ్వానించిన అధికారులకి గౌరవంగా సపర్పించుకున్నాడు. అలాగే ఓ వానరం అస్తిపంజరాన్ని కూడా సమర్పించుకున్నాడు. ఈ రెండు అస్తిపంజరాలని పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తుంటే ఒక రోజు ఎంతో కాలంగా తనని వేధిస్తున్న ఓ ప్రశ్న మబ్బులా విడిపోయింది.
(సశేషం...)
వెసీలియస్ వారి జీవితచరిత్ర ఎప్పుడో మూడు దశాబ్దాలక్రితం ఒక చిన్నపుస్తకంలో ఒక చిరువ్యాసం చదివి అబ్బురపడ్డాను.మరలా ఇన్నాళ్ళకు వారి గురించి సవివరంగా,సచిత్రంగా చదివి తెలుసుకునే అవకాశమిస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
నా చుట్టూ ఉన్న వాళ్లు ఒక పక్క ’నీకు వేరే పనేం లేదా?’ అంటున్నా, అసలీ వ్యాసాలు ఎవరైనా చదువుతున్నారా అన్న అనుమానం మరో పక్క ఇబ్బంది పెడుతున్నా, పట్టువదలని విక్రమార్కుడిలా రాసుకొస్తున్నాను. వివిధ వైజ్ఞానిక రంగాలకి సంబంధించిన చరిత్ర, కొన్ని ప్రాథమిక భావనలు తెలుగులో వీలైనంత త్వరగా (ఉచితంగా, ఇంటర్నెట్ లో) లభ్యం అయితే బావుంటుందని ఉంది. ఆ పునాది మీద మరింత హెచ్చు తరగతికి చెందిన శాస్త్రీయ సాహిత్యాన్ని ప్రతిష్ఠించొచ్చు.
మీ లాంటి వాళ్ల ప్రోత్సాహం సంతోషం కలిగిస్తుంది. ధన్యవాదాలు.