ఆ తప్పుడు అవగాహన మన విద్యావిధానాలలో ఎన్నో రకాలుగా ప్రతిబింబిస్తుంది. దాని పర్యవసానాలని మనం ఎన్నో రకాలుగా అనుభవిస్తున్నాం. శాస్త్రరంగంలో ముఖ్యంగా శాస్త్ర సృజనలో మనం వెనుకబడడానికి కూడా ఆ తప్పుడు అవగాహనే కారణం అని నా నమ్మకం.
మన దృష్టిలో జ్ఞానం అనేది పుస్తకాలలో, హార్డ్ డిస్కులలో, ట్యూషన్ మాస్టర్ల బుర్రల్లో, ఇంటర్నెట్లో ఇలా నానారకాల మాధ్యమాలలో విస్తరించి ఉన్న ఒక జడ రాశి. చదువు అనే ప్రక్రియలో ఆ రాశిని వీలైనంత మేరకు మన తలలోకి, లారీలోకి బస్తాలని ఎక్కించినట్టు, ఎక్కించుకోవడం జరుగుతుంది. ఎంత ఎక్కించుకుంటే అంత లాభం! భవిష్యత్తులో ఆ వ్యక్తి అంత ప్రయోజకుడు అవుతాడు.
ఇంటి చివరి బడి నుండి, ఐ.ఐ.టి.ల వరకు ఈ ధోరణే ఎన్నో రకాలుగా కనిపిస్తుంది. విజ్ఞానం వేగంగా పెరిగిపోతోంది కనుక రాష్ట్ర స్థాయి లో కూడా సైన్స్ సిలబస్ బాగా పెంచేస్తారు. ఇక పల్లెల్లో సరైన స్కూలు భవనం ఉంటే గొప్ప అనే పరిస్థితుల్లో పిల్లవాణ్ణి క్వాంటం మెకానిక్స్ చదవమంటే ఎక్కడికవుతుంది? తన పరిసరాలకి, జీవితానుభవానికి, ఆ పుస్తకాల్లోని చదువుకి ఎక్కడా సంబంధం కనిపించదు. అక్కడ హైదరాబాద్ లో కొందరు “నిపుణులు” కూడబలుక్కుని “పిల్లలకి ఇవన్నీ తెలిస్తే బావుంటుంది” అని నిర్ణయించేసి సిలబస్ రూపొందిస్తారు. ఆ నిపుణులు తప్ప విద్యావ్యవస్థలో తక్కిన వారంతా (టిచర్లు, పిల్లలు, ట్యూషన్ మాస్టర్లు, తల్లిదండ్రులు మొ||) ఆ సిలబస్ ని మింగలేక కక్కలేక తలమునకలవుతుంటారు!
కొన్ని ప్రఖ్యాత JEE కోచింగ్ సెంటర్లలో సబ్జెక్టుకి పది వేల లెక్కల చొప్పున (మొత్తం 30,000 లెక్కలన్నమాట!) చెయ్యిస్తారని ఆ సెంటర్లలో చదువుకున్న పిల్లలు చెప్తుంటారు. పదో క్లాసు లెక్కల ట్యూషన్లలో ’ముఖ్యమైన లెక్కలని’ ఇంపోజిషన్ రాయించడం నేను కళ్ళారా చూశాను. ఇలాంటి చదువుకి, కట్టెలుకొట్టడం, నీళ్లు తోడడం లాంటి పనులకి పెద్దగా తేడా ఉన్నట్టు కనిపించదు. చదువులో ఆనందించదగ్గ సారం, అంతర్యాన్ని పోషించదగ్గ రసం అంటూ ఏదైనా ఉంటే దాన్ని జాగ్రత్తగా వేరు చేసి, అవతల పారేసి, ఇక మిగిలిన పిప్పిని శ్రద్ధగా పిల్లలకి మేపుతారు – భవిష్యత్తులో పనికొస్తుందని!
(కొంచెం అసందర్భంగా అనిపించినా, ఈ సందర్బంలో గుర్తొస్తున్న ఒక సినిమా సన్నివేశాన్ని చెప్పకుండా ఉండలేకున్నాను. ’నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ’వండర్ వర్ల్డ్’ కి వెళ్తున్న బ్రహ్మానందం తీసుకునే “ముందుజాగ్రత్త” లంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి మన చదువులు.)
ఐ.ఐ.టి.లో కూడా నిజానికి పరిస్థితి అంత వేరుగా ఏమీ లేదు. మొదటి సంవత్సరం అన్ని బ్రాంచిల పిల్లలకి గ్రహగతులని గణితసమీకరణాలతో ఎలా సాధించాలో నేర్పిస్తారు. (దీనికి, ఒక సగటు ఇంజినీరు చేయబోయే పనికి, ఏంటి సంబంధం?) అలాగే మొదటి సంవత్సరంలో అన్ని బ్రాంచిల విద్యార్థులకి భౌతిక శాస్త్రంలో సాపేక్ష సిద్ధాంతాన్ని నేర్పిస్తారు. (ఇంజినీరుకి సాపేక్ష సిద్ధాంతంతో ఏం పని? అని అడిగాను ఒక సహోద్యోగిని. సాటిలైట్ కమ్యూనికేషన్లలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పనికొస్తుంది! అని వచ్చింది సమాధానం!) కాని ఐ.ఐ.టి.లో ఒక సద్విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలకి లభించే అపారమైన స్వేచ్ఛ. పిల్లలకి స్ఫూర్తి దాయకమైన ఎన్నో అనుభవాలని ఇక్కడ పొందే అవకాశాలు ఉంటాయి. ఆ స్వేచ్ఛలో, ఆ స్ఫూర్తిని ఆసరాగా చేసుకుని పిల్లలు వాళ్ళకేంకావాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ధోరణి వెనుక “జ్ఞానం ఒక జడ పదార్థం” అన్న భావన కనిపిస్తుంది. అంతే కాదు ఆ జ్ఞానాన్ని నేర్చుకునే వ్యక్తి కూడా ఓ జడ పాత్ర! ఆ జడ పదార్థాన్ని, ఈ జడ పాత్రలోకి కూరే కార్యక్రమాన్నే చదువు అంటారు!
కాని ఈ కూరుడు కార్యక్రమం నూటికి తొంభై సార్లు విఫలం అవుతుంది. కాని ఆ విషయాన్ని విద్యాప్రణాళిక యొక్క సూత్రధారులు ఒప్పుకోవడానికి ఇష్టపడరు.
1. ఈ కూరుడు పద్ధతి చదువు అంటే వెగటు పుట్టేలా చేస్తుంది. ఉద్యోగమనే బహుమతి పొందడానికి చదువు ఒక తప్పనిసరి శిక్ష అన్నట్టు ఉంటుంది.
2. విద్యార్థులు (మంచి గ్రేడ్లు ఉన్న వాళ్లు కూడా) ఒక సెమిస్టర్ లో చదివింది (సూక్ష్మాలు కాదు, మౌలిక విషయాలు కూడా) తదుపరి సెమిస్టర్ లోనే మర్చిపోవడం ఎన్నో సార్లు చూశాను. మరి కూరింది అంతా ఏమయ్యింది?
3. ప్రొఫెసర్లు సాపేక్షతా సిద్ధాంతం ఆదిగా ఇంజినీరింగ్ చదువుని బలోపేతం చెయ్యాలని ఏరికోరి ఎన్నో నేర్పిస్తే, ఆ ఇంజినీరు ఠక్కున ఎం.బీ.ఏ. కి మారిపోతాడు.కూరినదంతా గంగలో కలిసింది.
4. మరో విచిత్రమైన పరిణామం. నేను చూసిన ఇంజినీరింగ్ విద్యార్థులలో చాలా మంది (ఎన్నో కోర్సులు చేసి, మంచి గ్రేడ్లు సంపాదించిన వారు కూడా) చివరి సంవత్సరంలో బాహ్యప్రపంచాన్ని ఎదుర్కునే ఆత్మవిశ్వాసం లేదని వాపోతూ ఉంటారు. అంతే కాదు ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి వాళ్లకి ఒక విషయం బాగా తెలుస్తూ ఉంటుంది.
అంతవరకు వారు చూసినది ఓ పరిమితమైన, కృత్రిమ ప్రపంచం - కోర్సులు, టెక్స్ట్ బుక్కులు, మాస్టర్లు, పరీక్షలు.. ఇది వాస్తవంతోను, వాస్తవంలో ఎదురయ్యే సవాళ్లతోను పెద్దగా సంబంధం లేని ప్రపంచం. ఆ ప్రపంచం నుండి బయటపడి ఒక్కసారి వాస్తవాన్ని ఎదుర్కునే అవకాశం దగ్గర పడేసరికి, ఆ కృత్రిమ ప్రపంచానికి, యదార్థానికి మధ్య ఉండే అగాధమైన వారడిని గుర్తిస్తారు విద్యార్థులు. దాంతో భయం పట్టుకుంటుంది.
ఇలా ఎందుకు జరుగుతుంది? అన్ని విషయాలు వీళ్ల బుర్రల్లోకి కూరినా ఆత్మవిశ్వాసం లేకపోవడం ఏంటి?
కనుక మనకి మరో సారి కనిపించేది ఏంటంటే, జ్ఞానం అనేది ఓ జడపదార్థం కాదు. జ్ఞానం అంటే యదార్థంతో సమర్థవంతంగా తలపడగల సత్తా. అది ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం లేకపోవడం ఉండదు. భవిష్యత్తుని ఎదుర్కునే సన్నాహం అంటే నానా విషయాలని తలనిండా పట్టించుకోవడం కాదు; యదార్థంతో తలపడే సత్తాని పెంచుకోవడం. ఆ సత్తాని పెంచుకోవడమే విద్య యొక్క అసలు లక్ష్యం.
పుస్తకాల వల్ల, పరీక్షల వల్ల ఆ సత్తా పెరగక పోతే దాన్ని పెంచుకోవడానికి ఏంటి మార్గం? యదార్థంతో తలపడే సత్తా పెరగాలంటే, యదార్థంతో మళ్లీ మళ్లీ తలపడాలి. యదార్థాన్ని ప్రత్యక్షంగా చూడాలి, అనుభవించాలి. విద్యార్థి అలా యదార్థంతో, యదార్థ సమస్యలతో పోరాడుతున్నప్పుడు, ఆ పోరాటం మధ్యలో, ఆ సందర్భానికి తగిన విషయాలు (మాత్రమే!), సకాలంలో, అక్కడికక్కడ నేర్పించాలి. దీన్నే “just in time” learning అంటుంటారు. అందుకేనేమో గీతాపాఠం యుద్ధభూమిలో జరిగింది... క్లాస్ రూమ్ లో కాదు!
కనుక వీలైనన్ని విషయాలని వంటిబట్టించడం భవిష్యత్తుకి సరైన సన్నాహం కాలేదు. ఓ కొత్తసమస్య ఎదురైనప్పుడు దానికి కావలసిన జ్ఞానాన్ని తనకై తాను వెతికి, శోధించి, సాధించగల శక్తిని పెంచుకోవడమే సరైన సన్నాహం. (అంతకి మించి ఎవరూ ఏమీ చెయ్యలేరు కూడా). చదువు పూర్తయ్యాక విద్యార్థి తనతో బాహ్యప్రపంచంలోకి తీసుకుపోయేది తట్టెడు విషయాలు కాదు. శోధించి జ్ఞానాన్ని సాధించే సత్తా మాత్రమే బయటి ప్రపంచంలో తనకి బాసటగా నిలుస్తుంది.
(“చేపని అందించకు, చేపని ఎలా పట్టాలో నేర్పించు.” – జీసస్ క్రైస్ట్).
ఈ గ్రహింపు మన విద్యావ్యవస్థల్లో మెల్లమెల్లగా పెరుగుతోంది. అందుకే ప్రాజెక్ట్ ల ద్వారా నేర్చుకునే పద్ధతి పెరుగుతోంది. (కాని కొన్ని సంస్థల్లో దీన్ని కూడా ఒక కుటీరపరిశ్రమగా, కొన్ని సార్లు ఇంకా అధ్వానంగా ఓ స్మగ్లింగ్ రాకెట్ గా, మార్చుతున్నారు. అది వేరే విషయం.)
“పుస్తకాలు చదివి పరీక్షలు రాసే” పద్ధతి కన్నా “ప్రాజెక్ట్” పద్ధతి మరింత మెరుగైనదే అయినా మరో ముఖ్యమైన సత్యాన్ని విస్మరిస్తే ఈ ప్రాజెక్ట్ పద్ధతి కూడా విఫలం కాక తప్పదు.
ఎందుకంటే...
“జ్ఞానం జడ పదార్థం కానట్టే, విద్యార్థి కూడా జడ పాత్ర కాడు:”
కనుక ఆ పాత్రలో మనం ఏం కావలిస్తే అది (పుస్తకాల ద్వారా అయినా, ప్రాజెక్ట్ ల ద్వారా అయినా) పొయ్యడానికి వీలుపడదు. కొన్నిటిని ఆ పాత్ర ఆవురావురని జుర్రుతుంది. కొన్నిటిని విసిరికొడుతుంది. ఎందుకంటే అదో సజీవమైన, సచేతనమైన పాత్ర!. ఏది పడితే అది ఆ పాత్ర స్వీకరించదు.
ఉదాహరణ 1: నాకు ’లా’ కి సంబంధించిన సాహిత్యం ఎప్పటికీ అర్థం కాదేమో. మేం రాసిన సాంకేతిక విషయాన్ని లాయరు పేటెంట్ కింద తిరగ రాసి వినిపిస్తే ఏదో కొత్త భాష వింటున్నట్టుగా ఉంటుంది. గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. నా బోటి వాడు తలక్రిందులు తపస్సు చేసినా లాయరు కాలేడు.
ఉదాహరణ 2: ఐదేళ్ల పిల్లవాడికి ప్రేమకథలు చెప్తే అర్థం కాదు. తదనుగుణమైన అంశం వాడి అంతర్యంలో ఇంకా వికసించలేదు. కనుక దాని ఆనవాళ్లు బాహ్యప్రపంచంలో కనిపించినా వాటిని గుర్తించలేకపోతాడు, వాటికి స్పందించలేడు.
ఒక జ్ఞానం మనకి జీర్ణం కావాలంటే, దానికి సంబంధించిన శక్తి మనలో ఉండాలి. కనుక ఒకరకంగా జ్ఞానం అనేది మనలోనే ఉన్న ఒక తత్వం అన్నమాట. అయితే అది మామూలుగా ప్రచ్ఛన్నంగా ఉంటుంది కనుక దాన్ని గుర్తించం. మనలో ముందే ఉన్నదాన్నే బోలెడు బాహ్య యంత్రాంగపు (విద్యాసంస్థలు, టిచర్లు, ఫీజులు, పరీక్షలు, పోటీలు...) భారమైన ఆసరాని ఉపయోగించి ఏళ్ల తరబడి చదువుకుంటాం, తెలుసుకుంటాం.
’నిన్ను నీవు తెలుసుకో’ అని అధ్యాత్మికత చెప్తుంది. ఆత్మజ్ఞానమే అన్నిటికన్నా మహోన్నతమైన జ్ఞానం అంటుంది. ఆత్మజ్ఞానం అన్నిటికన్నా మహోన్నత జ్ఞానం కావడమే కాదు, అది తప్ప మరో జ్ఞానమే లేదని అనుకోవాల్సి ఉంటుంది! మన అంతర్యంలో ముందే ఉన్నది తప్ప మనకేదీ అర్థం కాదు కనుక, మన అంతర్యాన్ని తెలుసుకోవడమే చదువు. మన అంతర్యం ప్రపంచంలో ఉన్న కొన్ని ప్రేరణలకి సులభంగా స్పందిస్తుంది, ఆ ప్రేరణలని సులభంగా అర్థం చేసుకోగలుగుతుంది. ఆ ప్రేరణలతో, ఆ ప్రేరణలు ఉన్న రంగంతో, సులభంగా వ్యవహరించగలుగుతుంది. మన అంతర్యంలో ఏముందో తెలుసుకుంటే మన చదువు సార్థకం అయినట్టే.
అందుచేత చదువు అనేది ఒక జడ పదార్థానికి, జడ పాత్రకి సంబంధించిన విషయం కాదు. ఓ సజీవ, సంచలిత, నిత్యనూతన యదార్థానికి, అ యదార్థాన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకుని, దానికి స్పందించగల, మనలోనే ఉన్న ఒక సత్తాకి సంబంధించిన విషయం.
విద్యార్థి అంతర్యంలో ఏముందో – అంటే అతడి స్వభావం – తెలీకుండా జరిపే చదువు సంపూర్ణం కాలేదు, సఫలం కాలేదు. ఎప్పుడూ సిలబస్ మీద, పుస్తకాల మీద, స్కూలు భవనాలు, పరీక్షలు, మొ|| బాహ్య విషయాల మీద ధ్యాస పెట్టే మన విద్యా విధాన సూత్రధారులకి విద్యార్థుల స్వభావం అనేది అప్రస్తుత విషయంలా అనిపిస్తుంది. ఆ విస్మృతి యొక్క విధ్వంసాత్మక ఫలితాలు మనమంతా అనుభవిస్తున్నాం.
వ్యక్తి యొక్క స్వభావం తన చదువుకే కాదు, ఆ తరువాత చేయబోయే వృత్తితో కూడా లోతుగా ముడివడి ఉంది.
ఉదాహరణ: నాకు తెలిసిన వ్యక్తి ఓ విద్యాసంస్థలో పని చేస్తూ, ఒక దశలో ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. పని చాలా సులభమే. జీతం కూడా బాగా ఉండేది. కంపెనీలో మంచి పేరు కూడా వచ్చింది. కాని మనసుకి నచ్చని పనిని రోజూ తిట్టుకుంటూ చేసేవాడు. కొన్నేళ్ల తరువాత ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. మళ్లీ విద్యారంగంలో, మరింత తక్కువ జీతంతో చేరాడు. ఆనందంగా ఉన్నాడు.
చదువు, వృత్తి స్వభావానికి అనుగుణంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది, ధన్యం అవుతుంది. అలంటి చదువు, వృత్తి మనిషికి మనుగడనే కాదు, ఆంతరికమైన పురోగతిని ఇస్తాయి. జీవన సాఫల్యాన్ని ఇస్తాయి.
సారాంశం:
1. జ్ఞానం జడ పదార్థం కాదు. విషయాలని అంతులేకుండా తలకెక్కించుకోవడం భవిష్యత్తుకి సన్నాహం కాలేదు.
2. జ్ఞానం అంటే యదార్థంతో సమర్థవంతంగా తలపడే సత్తా. శోధించి జ్ఞానాన్ని సాధించే సత్తా. దాన్ని పెంచుకోవడానికి యదార్థంతో తలపడాలి.
3. విద్యార్థి కూడా జడ పాత్ర కాడు. అందులో ఏది పడితే అది ప్రవేశపెట్టడానికి వీలుకాదు.
4. చదువుకోవడం అంటే మన అంతర్యంలో ఏముందో తెలుసుకోవడమే. మనలో లేనిది మనకి బయట కనిపించినా దాన్ని అర్థం చేసుకోలేం.
5. వ్యక్తి తనని తాను తెలుసుకునే ప్రయత్నం చదువులో ఓ ముఖ్యభాగం కావాలి.
6. చదువు, వృత్తి మన స్వభావాన్ని అనుసరించి ఉంటే జీవన సాఫల్యం కలుగుతుంది.
ఎందుకు చదువంటే ఇంత క్లిష్టతరం చేసుకున్నారో నాకు అర్ధం కావటల్లేదు. మొదట బ్రతకటానికి కావాల్సిన మినిముం స్కిల్ల్స్ ఏమిటి.(క్షమించండి నాకు సరియిన తెలుగు కుదరటల్లేదు). అన్ని ఆలోచించాలి.వాటికి తగినట్లు పాఠాలు సరి చెయ్యాలి. ప్రభుత్వం చెయ్యాల్సిన పని మొదటిది.
రెండవది చదువుకునే పిల్లలలో కొందరికి ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఆ కెపాసిటీ ని గుర్తించి వారికి తగినట్టు లెవెల్ లో పాఠాలు చెప్పాలి.
ఇదంతా ఉహా గానం కాదు. జరుగుతున్నవే. ఒక హై స్కూలు లో మొదటి సంవత్సరం గ్రేడ్ పిల్లలు వంద
మంది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ క్లాసు schedules ఉంటాయి. సమయాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ క్లాసు రూమ్స్ లో వాళ్ళు ఉంటారు. ఇక్కడ జరిగినదేమిటి అంటే పిల్లల్ని వాళ్ళ వాళ్ళ తెలివితేటల్ని బట్టి విడ తీసారు. వాళ్ళు చెయ్య గలివేవి వాళ్లకు నేర్పుతున్నారు.
అన్దరికి ఒకే విధంగా పాఠాలు చెప్పలేము.అందరి తెలివితేటలు ఒక సబ్జెక్టు లో ఒకవిదమ్గానే ఉండవు.
క్షమించండి ప్రతుత్తరం ఇవ్వకుండా ఉండలేక పొయ్యాను.
రామకృష్ణారావు
Excellent post sir.
The best article I have seen ever on the Education system.
nice
very nive
చాలా బాగుంది సార్.....మీరు చాలా మంచి పని చేస్తూన్నారు.....సార్ ఉస్మానియా స్కాలర్స్ గా మేము "క్యాంపస్ వాయిస్" అనే మాస పత్రిక తెస్తున్నాము...దాంట్లో "శాస్త్ర సాంకేతికం" అనే కాలం ఉంచాము....ఈ కాలం ఉదేష్యం గ్రామీన ప్రాంతాలనుంచి యూనివర్సిటీకి వచ్చిన విద్యర్థులకు సైన్స్ గురించి పరిచయం చేయదం దీని ఉదేష్యం....మీకు వీలైతే క్యాంపస్ వాయిస్ కు రాయండి.
Mee Viluvaina Apaara medhaa sampatti velugu andaru artham chesukuni vaari manchi Jeevitha darulni vesukuntarani Ashistunnanu...Chaduvu-Chadavatam leda Chadivinchatam dwara Kakunda Taanuga Nerchukovatam ani meeru cheppina vidhanam chala Bagundi..Dhanyavadamulu