ఫ్రాన్స్ గాల్ బోధించిన శీరోవిజ్ఞానం నచ్చక ఆ గందరగోళాన్ని సరిదిద్దమని నెపోలియన్ చక్రవర్తి జాన్ పియర్ ఫ్లోరెన్స్ (Jean Pierre Flourens) అనే శాస్త్రవేత్తని నియమించినట్టు ఇంతకు ముందు ఒక పోస్ట్ లో చెప్పుకున్నాం (http://scienceintelugu.blogspot.com/2010/07/phrenology.html) . ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ ఫ్లోరెన్స్ ఓ జివక్రియా శాస్త్రవేత్త (physiologist).
1825 ప్రాంతాల్లో ఫ్లోరెన్స్ ప్రయోగాత్మక పద్ధతిలో నాడీ మండలం మీద పరిశోధనలు జరపడంలో మంచి పురోగతి సాధించాడు. మెదడులో వివిధ ప్రాంతాల్లో వివిధ క్రియలు పొందుపరచబడి ఉన్నాయని బోధించిన గాల్ భావనలని ప్రయోగం చేసి పరీక్షించ దలచుకున్నాడు. అయితే అలాంటి పరీక్షలు మనుషులలో చెయ్యడం అసంభవం. అసలు మానవ కళేబరాల పరిచ్ఛేదమే చాలా కాలం వరకు మతపరమైన కారణాల వల్ల నిషిద్ధమై ఉండేది. ఇక బతికున్న మనుషుల మెదళ్ల మీద ప్రయోగాలు చేసే ప్రసక్తే రాదు. కనుక జంతువుల నాడీమండలం మీద క్రమబద్ధమైన ప్రయోగాలు ప్రారంభించాడు ఫ్లోరెన్స్.
తన ప్రయోగాలలో వాడిన జంతువుల మెదళ్ల లోంచి వివిధ అంగాలని తొలగించి, దాని పర్యవాసానాలని పరిశీలించడం మొదలెట్టాడు. ఉదాహరణకి మస్కిష్క గోళార్థాలు (cerebral hemispheres) ని తొలగిస్తే జ్ఞానేంద్రియాల (దృష్టి,, వినికిడి, మొదలైనవి), కర్మేంద్రియాల (చేతులు, కాళ్లు మొదలైనవి కదిలించే) వృత్తులు దెబ్బతిన్నట్టు కనిపించింది. అలాగే చిన్నమెదడు (cerebellum) ని తొలగిస్తే ఆ ప్రాణి యొక్క సమతూనిక (balance) దెబ్బ తిన్నది. అలాగే మెడుల్లా అబ్లాంగటా అనే ప్రాంతాన్ని నాశనం చేస్తే, జంతువు ప్రాణాలే పోయాయి. ఈ ప్రాథమిక వృత్తులు కాకుండా స్మృతి (memory), ప్రజ్ఞానం (cognition) మొదలైనవి మెదడులో ఎక్కడున్నాయో తెలుసుకోడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఈ వృత్తులు మెదడులో ఒక ప్రత్యేక స్థానంలో లేవు. ఈ లక్షణాలు మెదడు సమస్తం పలచగా (diffuse) విస్తరించి ఉన్నట్టు కనిపించింది. మెదడులో క్రియలు ప్రత్యేక స్థానాలలో కాక ఇలా అంతటా విస్తరించి ఉన్నాయనే భావనని ’అఖిల క్షేత్ర సిద్ధాంతం’ (aggregate field view) అంటారు.
శిరోవిజ్ఞానంలో మెదడులో కరుణ, అసూయ, ఉత్సుకత మొదలైన మానసిక ప్రవృత్తులు ఎక్కడ పొందుపరచబడి ఉన్నాయో వివరంగా బోధిస్తారు. కాని ఫ్లోరెన్స్ ప్రయోగాల ప్రకారం మెదడు క్రియల విస్తరణలో అంత కచ్చితమైన స్థానికత ఏమీ లేదని అర్థమయ్యింది. ఆ విధంగా గాల్ చెప్పిన కథలన్నీ కల్లలని ప్రయోగాత్మకంగా నిజమయ్యింది.
కాని విషయం అక్కడితో అయిపోలేదు. మెదడులో క్రియలు స్థానికంగా పొందుపరచబడి ఉన్నాయా లేక, మెదడు అంతా సార్వత్రికంగా వ్యాపించి ఉన్నాయా అన్న వివాదం అంత సులభంగా తేలలేదు. రెండు పక్షాలని సమర్ధిస్తున్నట్టుగా ప్రయోగాత్మక ఆధారాలు పోగవ్వసాగాయి.
ఉదాహరణకి మూర్చ రోగుల విషయంలో బ్రిటిష్ న్యూరాలజిస్ట్ జాక్సన్ చేసిన పరిశీలనలు మెదడులో క్రియలు స్థానికంగా పొందుపరచబడి ఉన్నాయన్న భావననే సమర్థిస్తున్నాయి.
http://en.wikipedia.org/wiki/Jean_Pierre_Flourens
(సశేషం...)
ఇంతకుముందొకసారి ఒక ప్రశ్న అడిగాను మీరు చూసారో లేదోనని మరొకసారి తాజా టపాలో అడుగుతున్నా, మన శరీర సమతూనిక చిన్నమెదడు నియంత్రిస్తుంది కదా, మనం ఏదైనా వాహనం నడుపుతున్నప్పుడు వాహన సమతూనిక కూడా చిన్నమెదడే నియంత్రిస్తుందా?
అవును చిన్నమెదడు సమతూనికని నియంత్రిస్తుంది. అయితే ఈ పనిని అది దానంతకి అది ఒంటరిగా చెయ్యలేదు. సమతూనికకి సంబంధించిన సమాచారాన్ని చిన్న మెదడుకి vestibular system (సమతూనికా వ్యవస్థ?) నుండి అందుతుంది. ఈ vestibular system లో ఓ ముఖ్యభాగం మన చెవులలో ఉండే అర్థవృత్తాకార కాలువలు (semicircular canals). మనం గిర్రున తిరిగినప్పుడో, ఠక్కున వంగినప్పుడో ఈ అర్థవృత్తాకారపు కాలువలు వేగంగా కదులుతాయి. కాని వాటిలో ఉండే ద్రవం, జడత్వం (inertia) వల్ల కాస్త ఆలస్యంగా కదులుతుంది. అందువల్ల ఆ ద్రవం ఆ కాలవలలో ఉండే కొన్ని కేశకణాలకి (hair cells) ప్రేరణ నిస్తాయి. అప్పుడా కేశకణాలు జరుగుతున్న కదలిక గురించి మెదడుకి సందేశం పంపిస్తాయి. ఆ సమాచారం చిన్నమెదడుకి చేరి, అందుకు తగ్గ చర్యలు తీసుకునేలా మెదడులోని మోటార్ కార్టెక్స్ కి సందేశం పంపిస్తుంది.
ఇది కాకుండా శరీరం జరిపే వివిధ చలనాలని చిన్నమెదడు సామరస్యంగా నిర్వహిస్తుంది (coordinate చేస్తుంది).
మీ జవాబుకి ధన్యవాదాలు.