సాపేక్షలోకంలో సంచరిస్తూ సుబ్బారావు ఎన్నో అందమైన అనుభవాలు పొందాడు. ఎన్నో అధ్బుతాలు చూశాడు. కాని ఆ అనుభవాలకి వివరణలు ఇవ్వడానికి ఇందాకటి ప్రొఫెసర్ లేడే చాలా విచారించాడు. రైలు ప్రయాణీకులకి వయసు పైబడకుండా బ్రేక్ మాన్ ఎలా ఆపగలుగుతున్నాడో ఇప్పటికీ తనకి అర్థం కాలేదు. రాత్రి నిద్రలోకి జారుకున్నప్పుడు ఆ లోకం కలలోనైనా కనిపిస్తుందని ఎన్నో సార్లు ఎదురుచూశాడు. కాని తనకి ఏవో పీడకలలే వచ్చాయి. నిన్ననుగాక నిన్న తన బ్యాంక్ లెక్కల్లో ఏవో సాపేక్షమైన దోషాలు దొర్లాయని బ్యాంకు మేనేజరు తిట్టి ఉద్యోగం నుండి ఊడపీకినట్టు పీడకల... మనశ్శాంతి కోసం ఓ వారం సెలవు పెట్టి ఏ సముద్ర తీరంలోనో సేద తీరాలని అనుకున్నాడు. టెకెట్టు కొనుక్కుని మర్నాడే రైలెక్కాడు.
రైలు ముందుకి దూసుకుపోతుంటే ఊళ్లోని ఇళ్లు, బళ్లు వెనక్కు పోతున్నాయి. ఊరు దూరం అవుతోందనడానికి చిహ్నంగా పచ్చని పచ్చిక బయళ్లు రంగప్రవేశం చేస్తున్నాయి. ఏమీ తోచక పక్కనే ఉన్న దినపత్రికని తిరగేశాడు. “ఉగ్రవాదుల దాడుల ద్వారా పాకిస్తాన్ ఈ సారి ఏదైనా ఘాతుకానికి పాల్పడితే మాత్రం తగిన సమాధానం చెప్తాం’ అంటోంది భారత ప్రభుత్వం. ఈ ’వార్త’ గతంలో ఎన్నో సార్లు చదివినట్టు అనిపించింది. చదువుతూనే తూగొచ్చింది... మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.
ఈ సారి మళ్లీ బయటికి చూసేసరికి బయట దృశ్యం పూర్తిగా మారిపోయింది. టెలిఫోన్ స్తంభాలన్నీబాగా దగ్గరదగ్గరగా వచ్చి చూడడానికి ఓ కంచెలా ఉన్నాయి. చెట్ల కాండాలు బాగా చిక్కిపోయి, పైన గుబుర్లు కుంచించుకుపోయి టెలిఫోన్ స్తంభాల్లా కనిపిస్తున్నాయి. అంతలో ఉన్నట్లుండి మునుపటి ప్రొఫెసర్ ఎదురుగా దర్శనమిచ్చాడు. ఎప్పుడు ఎక్కణ్ణుంచి ఊడిపడ్డాడో తెలీదు. తను శ్రద్ధగా పేపర్ చదువుతూ పరాకుగా సమయంలో కంపార్ట్ మెంట్ లోకి దూరి ఉంటాడు.
“మనం ఉన్నది సాపేక్షలోకం కదూ?” ఉత్సాహంగా అడిగాడు సుబ్బారావు.
“అరె! గుర్తుపట్టేశారే? ఎలా చెప్పగలిగారు?” అడిగాడు ప్రొఫెసర్.
“ఈ మధ్యనే ఓ సారి వచ్చాను. కాని అప్పుడు మీరు లేరు.”
“అయితే ఇకనేం. ఇక్కడి వింతలన్నీ నాకు చూబిద్దురు గాని. ఈ లోకంలో మీరే నా గైడు.”
“నేనా? నాకే ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. విషయం అర్థం కాక స్థానికులని అడిగితే వాళ్ల వివరణలు నన్ను ఇంకా అయోమయంలో పడేశాయి. నాకు అద్భుతంగా కనిపిస్తున్న వాటిని వాళ్లు చాలా మాములుగా తీసుకుంటున్నారు,” వాపోతూ అన్నాడు సుబ్బారావు.
“అవును మరి,” అన్నాడు ప్రొఫెసర్. “వాళ్లంతా ఇక్కడి వాళ్లు. ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్లు. వాళ్లకి ఇవన్నీ చాలా సహజంగా కనిపిస్తాయి. కాని వాళ్లని మీరు జీవించే ప్రపంచం లోకి తీసుకెళ్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. అక్కడ ప్రతి ఒక్కటి వాళ్లకి ఓ నిత్యాద్భుతంగా కనిపించొచ్చు.”
“మిమ్మల్ని ఓ ప్రశ్న అడగనా?” అడిగాడు సుబ్బారావు. “కిందటి సారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఓ బ్రేక్ మాన్ కనిపించాడు. రైలు ఆగినప్పుడు, బయల్దేరినప్పుడు రైల్లో వాళ్ల వయసు పెరిగే వేగం తగ్గుతుందని, ఊళ్లో వాళ్ల కన్నా ప్రయాణీకులు అందుకే యవ్వనంగా ఉండిపోతున్నారని అన్నాడు. ఇందులో మహత్యం ఏంటో కాస్త సెలవిస్తారా?”
(సశేషం...)
నేను ఆ సమాధానం కోసమే ఎదురుచూస్తున్నా...సాపేక్ష సిద్దాంతం ప్రకారం కాలం నెమ్మదించడం ఒక స్థిర ప్రామాణిక వ్యవస్థలోంచి (inertial frame) గమనించే సాపేక్ష వేగం (relative velocit-v) మీద ఆధారపడుతుంది, కాని వ్యాసంలో చెప్పినట్టు రైలు నెమ్మదించినపుడు కూడా కాలం నెమ్మదిస్తుందంటే వ్యత్యాసం సాపేక్ష వేగంలో మార్పుపై (∆v) కూడా ఆధారపడుతుందా..?
ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతంలో v ఎప్పుడూ = ౦. అందులో కాలం ఎంత నెమ్మదిస్తుంది అన్నది కేవలం V మీద ఆధారపడుతుంది (కిందటి పోస్ట్ లో ఇచ్చిన సూత్రాల అనుసారం). V లో మార్పులు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ ప్రామాణిక వ్యవస్థ (intertial frame) కాదు. కాని సామాన్య సాపేక్షతా సిద్ధాంతంలో (general theory of relativity) V లో మార్పులు (త్వరణాలు - accelerations) కూడా పరిగణించడం జరుగుతుంది.
త్వరణం చెందుతున్న వ్యవస్థకి, గురుత్వ క్షేత్రంలో ఉన్న వ్యవస్థకి మధ్య అభిన్నతని సామాన్య సాపేక్షతా సిద్ధాంతం చెప్తుంది. తీవ్రమైన గురుత్వ క్షేత్రంలో ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. ఎందుకంటే అక్కడ కాలం నెమ్మదిస్తుంది. ఇక నల్లబిలం (black hole) పరిసరాల్లో అయితే కాలమే ఆగిపోతుంది. ఈ విషయాలన్నీ ఈ పుస్తకంలో ముందు ముందు వస్తాయి.
అయితే V లో మార్పులకి, కాల వ్యవధిలో మార్పులకి మధ్య సంబంధం తెలిపే సూత్రం, సమ వేగం విషయంలో కన్నా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అందుకు సామాన్య సాపేక్ష సిద్ధాంతపు గణితం తెలియాలి. నాకా వివరాలు తెలీవు. అందులో ఎవరైనా నిపుణులు కనిపిస్తే అడగండి.