శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

కేయాస్ థియరీ - పార్ట్ 3

Posted by V Srinivasa Chakravarthy Tuesday, June 9, 2009
1. గోరొంతలు కొండంతలు అయితే…

అక్కడి ఆకాశంలో కారుమబ్బులు ఉండవు. అక్కడి భూమి మీద మిట్టపల్లాలు ఉండవు. ఛుర్రు మనిపించే రవ్వలు రువ్వడు రవి. ‘నిలు’ అంటే నిలిచిపోతాడు అనిలుడు. అక్కడి మధుమాసంలో మావిచిగుళ్లు ఉండవు. గ్రీష్మంలో మార్తాండ తాండవం కనిపించదు. శీతాకాలపు చలి పెట్టే గిలిగింతలు ఉండవు. వర్షాలు, వాగులు, వరదలు – అసలివేవీ ఉండవు. అదో విచిత్రమైన వాతావరణం. కృత్రిమమైన వాతావరణం. మనిషి ఊహలో ప్రాణం పోసుకుంటున్న వాతావరణం. గుడ్డులోంచి పిట్ట బయటపడుతున్నట్టు కంప్యూటర్ లో మెల్లమెల్లగా రూపం పోసుకుంటున్న వాతావరణం.

ఆ కంప్యూటర్ ఎడ్వర్డ్ లారెంజ్ కి చెందింది. మసాచుసెట్స్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎం. ఐ. టి.) లో తన ఆఫీస్ గదిలో ఇంచుమించు సగ భాగం ఆ కంప్యూటరే ఆక్రమించింది. కుంభకర్ణుడి లాంటి ఆ మహా కంప్యూటర్ పేరు రాయల్ మక్బీ. ఇప్పటి పెంటియంలలా కిమ్మనకుండా పని చేసుకుపోయే తత్వం కాదు దీనిది. దాని రొదతో లారెంజ్ చెవులు హోరెత్తిపోతున్నాయి. అయినా పాపం ఓపిగ్గా అది ఇవ్వబోయే ఫలితాల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. కంప్యూటర్ లో తను సిములేట్ చేసే వాతావరణం నిజం వాతావరణాన్ని పోలి ఉందంటే తన కలలు ఫలించినట్టే. స్త్రీ మనసులా ఒక పట్టాన అంతు బట్టని వాతావరణ రహస్యం ఇన్నాళ్ళకి తన చేతి కి చిక్కినట్టే.

1960 లో తన రాయల్ మక్బీ కంప్యూటర్ మీద వాతావరణాన్ని సిములేట్ చేసే ప్రోగ్రాం రాశాడు లారెంజ్. వేవేల చదరపు కి.మీ.ల విస్తీర్ణత గల భూమి ఉపరితలం మీద, వందలాది కి.మీ. ల మందం ఉన్న వాతావరణపు పొరలో, ఉష్ణోగ్రత, వాయుపీడనం మొదలైన ఎన్నో శక్తులు ఆడించే బరు బృహన్నాటకం అసలు వాతావరణం. దాని పరిణామాన్ని అంచనా వెయ్యడం అసాధ్యం అంటే ఆశ్చర్యం లేదు. కాని ఆ నిజం వాతావరణం అంత విచిత్రంగాను, అనిశ్చితంగాను ఉంది లారెంజ్ సిముల్లేట్ చేస్తున్న కృత్రిమ వాతావరణం. ఈ వార్త వాళ్ల డిపార్ట్ మెంటు అంతా పొక్కింది. సహోద్యోగులు, పీజీలు కంప్యూటర్ చుట్టూ మూగి పందేలు కాసేవారు. ప్రోగ్రాం ఏం చెబుతుంది? ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటుందా? రేపు వర్షం పడొచ్చా? అది చెదురు మొదురు జల్లా, పెను తుఫాను అవుతుందా? ప్రోగ్రాం నడక ఎంత పరిశీలించినా ఇక ముందు ఒరవడి ఇలా ఉంటుంది అని చెప్పటం కష్టం అవుతోంది. అందుకే పందేల ఆట మహా జోరుగా సాగుతోంది.

‘క్షణ క్షణముల్ జవరాండ్ర చిత్తముల్’ అన్నట్లు, ఎట్నుంచి, ఎటుపోతుందో చెప్పలేని అనిశ్చిత పరిణతి గల వాతావరణం అంటే లారెంజ్ కి చిన్నప్పట్నుంచి ఒక విధమైన ఆకర్షణ. ఒకసారి జరిగిన ఒరవడి మళ్లీ జరగకుండా ఊహించరాని మారుదలతో కూడుకున్న వాతావరణపు గతులని ఎప్పటికైనా భేదించాలని అతడి జీవితాశయం. దాని కల్లోలిత గతుల మాటున ఉన్న లయలని వినాలని అతడి ఆశ. దాని అనిశ్చిచిత పరిణామం వెనుక నిశ్చయమైన రహస్య ధర్మాలేవైనా ఉన్నాయేమో తెలుసుకోవాలని అతడి ఆకాంక్ష.

మరికొంత వచ్చే టపాలో...

రచయిత: డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి.

1 Responses to కేయాస్ థియరీ - పార్ట్ 3

  1. Anonymous Says:
  2. శాస్త్రవేత్త,సుకవి ఐతే.....మహా అద్భుతమైన వివరణ సాధ్యపడుతుంది.ఏమి బిగి! ఏమి జిగి!....Mind blowing explanation.ఆహా!,ఏమి మా భాగ్యము!!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts