శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.
సరే చివరికి ఆ సూక్ష్మదర్శిని వచ్చింది. దాని కోసం ఎదురుచూసే సమయంలో పిల్లలు మరికొన్ని అధ్యయనాలు కూడా చేశారు. పార్శిలు చూడగానే దాన్ని తెరవాలనే ఉత్కంఠ ఎక్కువయ్యింది. జాగ్రత్తగా పార్శిలు విప్పి, దాన్ని ఎలా వాడాలో చెప్పే ఆదేశాలు చదివారు. ఉతక్క ముందు, ఉతికిన తరువాత ఉన్ని దారాలు ఎలా ఉంటాయో చూడడానికి ఆ దారాలు కొన్ని తెచ్చి సూక్ష్మదర్శినిలోకి ఎక్కించారు. ఉన్ని దారాలని గొలుసుకట్టుగా కలిపే కొన్ని సంధులు ఉంటాయి. ఉతికినప్పుడు మరి ఎందుచేతనో ఆ దారాలలోని భాగాలు ఒకదాని మీద ఒకటి జారి (టెలిస్కోప్ లోని భాగాలలా) దారం కుంచించుకుపోతుంది. ఉన్నిని చూశాక లినెన్, పత్తి, రేయాన్ ఇలా మరిన్నిరకాల దారాలతో నేయబడ్డ బట్టని కూడా తెచ్చి అలాగే సూక్ష్మదర్శినిలో చూశారు. బట్ట కనిపించే తీరు అందులో దారం అల్లబడ్డ తీరు మీద ఆధారపడుతుందని గుర్తించారు. ఇలా మెల్లగా పిల్లల ధ్యాస నేత మీదకి మళ్ళింది. వాళ్ళంతకు వాళ్ళు ఏదైనా బట్టని నేయాలనుకున్నారు. అందుకి చిన్న చిన్న పరికరాలు ఏవైనా ఉన్నాయా అని ఆలోచించారు. మళ్ళీ ఉత్తరాలు వ్రాశారు. కొంత కాలానికి ఆ పరికరాలు కూడా రానే వచ్చాయి. ముడి ఉన్నితో కాస్తంత బట్టని నేయడానికి కావలసినంత సరంజామా అమరింది. ఉన్నితో పని చెయ్యడం సులభం కనుక దాన్ని ఎంచుకున్నారు. పైగా స్క్లూలు సమీపంలోనే ఉండే ఓ గొర్రెల కాపరి దగ్గర్నుండి ముడి ఉన్ని కూడా సంపాదించగలిగారు. దాన్ని ఉతికి, ఆరేసి, ఏకులు చేసి, బట్టగా నేశారు. ముడి ఉన్నిని బట్టగా మార్చడానికి ఎంత శ్రమ అవసరమవుతుందో తెలుసుకోవాలని క్లాసులో ఎవరికో అనిపించింది. దశల వారీగా సాగే ఈ ప్రయాసలో ఒక్కొక్క దశకి ఎంతెంత సమయం పడుతుందో జాగ్రత్తగా నోట్సు తీసుకుంటూ వచ్చారు. ఆ ప్రయత్నంలో అనుకోకుండా మనుష్యఘడియలు (man - hours) అన్న భావనని వాళ్ళంతకు వాళ్ళే కనుక్కున్నారు. ఈ భావన అర్థశాస్త్రంలో చాలా ముఖ్యమైన భావన అని మనందరికీ తెలిసిందే.

ఓ చిన్న చదరపు ఉన్ని బట్ట నెయ్యడానికి డెబ్బై రెండు మనుష్య ఘడియలు పట్టింది. అంత చిన్న బట్టకి డెబ్బై రెండు గంటలా? ఇక ఇలా అయితే మొత్తం సూటుకి కావలసిన బట్ట నెయ్యడానికి ఇంకెంత సమయం పడుతుందో? ఈ సమస్యకి సమాధానాన్ని కనుక్కోవడానికి బోలెడంత అంకగణితాన్ని వాడాల్సి వచ్చింది. ముఖ్యంగా క్రమమైన ఆకారం లేని తలాల విస్తీర్ణం కనుక్కునే సమస్యని సాధించాల్సి వచ్చింది. ఆ విధంగా సూటుకి కావలసినంత బట్టని నెయ్యడానికి ఎంత సమయం పడుతుందో తెలిసింది. మరి అలాంటప్పుడు అమెరికా ఖండానికి యూరప్ నుండి మనుషులు వలస వచ్చిన తొలిరోజుల్లో తమ బట్టలు తాము నేసుకోడానికి ఎంత శ్రమపడేవారో ఆలోచిస్తే అమితాశ్చర్యం కలుగుతుంది. ఇవన్నీ చూశాక సమర్థవంతంగా పనులు చెయ్యడానికి ప్రత్యేకీకరణ ఎంత అవసరమో, శ్రమని తగ్గించే పరికరాల వల్ల ఎంత ఉపయోగమో పిల్లలకి అర్థమయ్యింది.

ఈ బట్ట నేసే ప్రాజెక్టు తో బయలుదేరి పిల్లలు ఎన్నో దిశలలో పురోగమించారు. నేసిన బట్టకి రంగు వేద్దాం అనుకున్నారు. కనుక సహజ వర్ణాలని ఎలా తయారుచేస్తారు, ఎలా వాడుతారు మొదలైనా విషయాల గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఈ రంగుల్లో చాలా మటుకు మొక్కల నుండి వచ్చేవే కనుక కథ వృక్షశాస్త్రం మీదకి మళ్ళింది. తరువాత కొన్ని రంగులు తయారుచేసి వాటిని పరీక్షించారు. ఇతర రకాల ఉన్ని బట్ట మీదకి కూడా వారి ధ్యాస మళ్ళింది. వాళ్ళు కష్టపడి తయారుచేసిన ఉన్ని బట్ట, అంగళ్ళలో కొనుక్కుని వేసుకునే ఉన్ని దుస్తుల్లోని బట్టలా లేదు. ఎక్కడొస్తోంది తేడా? ఉన్ని ఎన్ని రకాలు? అప్పట్నుంచి ఉన్ని బట్టలు వేసుకున్న ప్రతీ ఒక్కర్ని పట్టుకుని అది ఎలాంటి ఉన్ని అని అడిగి తెలుసుకోవడం మొదలెట్టారు? వాకబు చెయ్యగా ఎన్నో రకాల ఉన్ని ఉందని తెలిసింది. ఉన్నిని ఏఏ జంతువులు ఇస్తాయి, అవి ప్రపంచంలో ఎక్కడెక్కడ దొరుకుతాయి మొదలైన విషయాలు క్లాసులో ఎవరో కనుక్కుని వచ్చారు. ఈ సందర్భంలో కొన్ని రకాల ఉన్ని, ఇతర రకాల ఉన్ని కన్నా ఎందుకు ఖరీదెక్కువ అన్న ప్రశ్న బయల్దేరింది. దాని గురించి ఇంకా చర్చించి, చదివి వాళ్ళు అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఉన్ని ఖరీదు అది ఇచ్చే జంతువు మీద, దాన్ని సాకడానికి అయ్యే ఖర్చు మీద, అలా వచ్చిన ఉన్నిని నెయ్యడానికి అయ్యే ఖర్చు మీద, నేసిన చోటి నుండి అమ్మే చోటికి రవాణా చేసే ఖర్చు మీద, ఆధారపడుతుంది అన్న విషయం అర్థమయ్యింది. అలా బోలెడంత అసలుసిసలైన అర్థ శాస్త్రం, కొసరుగా కొంచెం భౌగోళిక శాస్త్రం వాళ్ళ అధ్యయనంలో చోటు చేసుకున్నాయి.

అదే సమయంలో వాళ్ళకి ఉన్నికి, వోర్ స్టెడ్ (worsted) లకి మధ్య తేడా (ఆ తేడా ఏంటో నాకూ తెలీదు) మీదకి, నేసే ప్రక్రియ మీదకి, నేత పరిశ్రమ మీదకి ఆసక్తి మళ్ళింది. మరింత మేలైన నేత యంత్రాలు ఉంటే నేసిన బట్ట ఖరీదు ఎలా తగ్గుతుందో అర్థం చేసుకోగలిగారు. ఇంతకీ అంత ఉపయోగకరమైన యంత్రాలని కనుక్కున్నదెవరు? ఈ సమాధానాలు తేల్చుకోడానికి జిల్లా గ్రంథాలయం నుండి పుస్తకాలు అరువు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ ఒక్క ఏడాదిలో క్లాసులో ఉన్న ముప్పై ఐదు మంది పిల్లలు కలిసి ఏడొందలు పుస్తకాలు అరువు తెచ్చుకున్నారని వాళ్ళ టీచరు డా. గార్డన్ చెప్పింది.

తొలి దశల్లో ఎన్నో యంత్రాలని ఇంగ్లండ్ లోనే కనుక్కున్నారని తెలుసుకున్నారు పిల్లలు. ఏమిటి దానికి కారణం? ఇంగ్లండ్ లో అప్పటికే కొంతవరకు శ్రమ విభజన సాంప్రదాయం నెలకొంది. కనుక పారిశ్రామిక పద్ధతిని అవలంబించడానికి ఆ దేశం సిద్ధంగా ఉంది. మరి పరిశ్రమలంటే ఎలా ఉంటాయి? ఆ విషయాన్ని తెలుసుకోడానికి న్యూ జర్సీలో బట్టల మిల్లుకి వెళ్ళారు. తొలి పరిశ్రమల గురించి, అందులో శ్రామికుల పరిస్థితుల గురించి చదివారు. నిరుద్యోగం మీద యంత్రాల ప్రభావం ఎలా ఉంటుందో చర్చించుకున్నారు. దగ్గర్లోనే ఉన్న చిన్న ఊళ్ళో యంత్రాల ప్రభావం ఎలా ఉందో పరిశీలించారు. అలా చర్చ మెల్లగా శ్రామికుల యూనియన్ల వైపు, శ్రామికుల హక్కుల వైపు మళ్ళింది.

అయితే ఇందులో ప్రతీ దశలోను పిల్లలంతా పాల్గొన్నారని కాదు. అంతేగాక ఆ ఏడాది పొడవునా పిల్లలు ఇది మాత్రమే చేశారనీ కాదు. ఈ ప్రశ్నలని శోధించే ప్రయత్నంలో మరెన్నో ఇతర ప్రశ్నలని శోధిస్తూ పోయారు. ఉదాహరణకి తొలి నేత యంత్రాల గురించి అధ్యయనాలు చేసింది కొంత మంది పిల్లలే. కాని వాళ్ళు తెలుసుకున్న విషయాలని వచ్చి తక్కిన వారితో పంచుకునేవారు. ఆ విధంగా కొత్త విషయాలు తెలుసుకున్న వారు ఆ విషయాలని అందరితోనూ పంచుకోవడం జరిగింది.

అలాంటిదే మరో ప్రాజెక్టు కూడా ఈ పిల్లలు చేపట్టారు. కాస్త పెద్ద పిల్లలు స్కూలుకి ప్రత్యేకంగా ఓ వార్తాపత్రిక రూపొందించారు. ఆ పత్రిక కొన్ని వారాలకొకసారి వెలువడుతుంది. " ఈ చిన్న పత్రికని ప్రచురించడానికి ఇంత కాలం పడుతుంటే మరి రోజూ అంత లావుపాటి దినపత్రికలని ఎలా ప్రచురిస్తారు?" అని ఓ పిల్లవాడికి సందేహం వచ్చింది. ఆ ప్రశ్న క్లాసుకి నచ్చింది. ఆ విషయం లోకి ఇంకా లోతుగా శోధించాలని అనుకున్నారు. కొన్ని ఉత్తరాలు రాశాక ఓ పెద్ద వార్తాపత్రికా కార్యాలయాన్ని సందర్శించడానికి అవకాశం దొరికింది. టైప్సెట్టింగ్, ప్రింటింగ్ వంటి ప్రక్రియలు ఎలా జరుగుతాయో తెలుసుకున్నారు. దాంతో ఇంకా ఉత్సాహం పెరిగి ఈ ప్రక్రియల చరిత్రలోకి కూడా కొంత తవ్వి తెలుసుకున్నారు. అలాగే వ్రాత మీదకి, వ్రాత పరికరాల మీదకి కూడా ధ్యాస మళ్ళింది. మొట్టమొదటి లిపి గురించి, వ్రాతకి ఉపయోగించే తాళపత్రాలు మొదలైన మాధ్యమాల గురించి కూడా తెలుసుకున్నారు. కొంత కాలం పోయాక వాళ్ళంతకు వాళ్ళే ఓ పూర్తి పుస్తకాన్ని రాసి, టైపు చేసి, బైండు చెయ్యాలని నిశ్చయించుకున్నారు. వ్రాత యొక్క, ముద్రణ యొక్క, పుస్తకాల తయారీ యొక్క సంపూర్ణ చరిత్ర గురించి పుస్తకం వ్రాయాలనుకున్నారు. ఇది చాలా పెద్ద పని. స్కూలు సంవత్సరం ముగిసే సమయానికి ఆ బృహత్ యత్నం పూర్తి కాలేదు. చాలా మంది పిల్లలు అదనంగా మరో వారం ఉండి ఆ పుస్తకాన్ని పూర్తి చెయ్యడానికి ప్రయత్నించారు. డా. గార్డన్ వాళ్ళు రాసిన పుస్తకం నాకు చూపించింది. అమూల్యమైన సమాచారంతో, చక్కని శైలితో, అందమైన బొమ్మలతో, బలమైన బైండింగ్ తో పిల్లల చేతిలో అద్భుతంగా ఊపిరిపోసుకుందా పుస్తకం. ఆధునిక కాగితంతో మొదలుపెట్టి వ్రాత అనే ప్రక్రియ యొక్క పుట్టుపూర్వోత్తరాలని క్షుణ్ణంగా శోధిస్తుందా పుస్తకం.

ఈ కథల వల్ల పిల్లలు ఎలా నేర్చుకుంటారు అన్న విషయం గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ప్రపంచాన్ని విభాగాలుగా విభజించకుండా సమగ్రంగా దర్శిస్తారు. కనుక ఒక విషయం నుండి మరో విషయానికి సహజంగా గంతు వెయ్యగలరు. పూర్తిగా భిన్నంగా కనిపించే విషయాల మధ్య సంబంధాలని పొడచూడగలరు. మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో సాగే క్లాసుల్లో ఇలాంటి అవకాశం ఎంతో అరుదుగా మాత్రమే వస్తుంది. అజ్ఞాతంలోకి మనం ఊహించను కూడా ఊహించలేని క్రొంగొత్త బాటలని వేసుకుంటూ ధైర్యంగా ముందుకి సాగిపోతారు. అంటే పిల్లలకి ట్రోజన్ యుద్ధం గురించి, పురావస్తు పరిశోధనల గురించే నేర్పించదలచుకుంటే ముందు స్క్యూబా డైవింగ్ మొదలెట్టాలనా? ససేమిరా కాదు. చాలా మంది పిల్లలకి అది శ్రేయస్కరం కాదు. పైగా పిల్లలు వాళ్ళ లక్ష్యాలని వాళ్ళు ఎంచుకుంటూ, వాళ్ళ ఆసక్తిని అనుసరిస్తూ ముందుకి సాగిపోతుంటే ఇంకా వేగంగా పురోగమిస్తారు. మనం ప్రణాళికా బద్ధంగా వాళ్ళకి నేర్పించాలని ఎంత చూసినా అంతగా పురోగమింపజేయలేము.

పిల్లల్ని వాళ్ళకి ఇష్టం వచ్చింది నేర్చుకోమని వదిలేస్తే ఓ చిన్న రంగంలో నిష్ణాతులై, పరిమిత పరిజ్ఞానం గల నిపుణులుగా మారే ప్రమాదం ఉందని కొందరు కోపంగా వ్యతిరేకించారు. క్రికెట్ స్కోర్లు, సినిమా కబుర్లు వంటి పనికిమాలిన చెత్త మాత్రమే నేర్చుకుంటారన్న భయం వ్యక్తం చేస్తారు. కాని అలా జరగదు. మన విశ్వవిద్యాలయాలు అలాంటి పటిష్టమైన సంకుచితమైన కోటలలో బందీలుగా ఉండే అలాంటి నిపుణులతో నిండిపోయాయి. కాని పిల్లలు, ఆరోగ్యంగా సక్రమంగా ఎదిగే పిల్లలు, అలా నేర్చుకోరు. వాళ్ళ చదువు వారిని జీవితంలో అనేక దిశలలో పురోగమింపజేస్తుంది. నేర్చుకుంటున్న కొద్దీ వాళ్ళ ఉత్సాహం మరింత బలపడుతుంది. మనం చేయవలసిందల్లా వారి ఆకలికి తగ్గ పోషణని అందివ్వడమే.

పోషణని అందివ్వడం అంటే, వాళ్ళకి కూర్చోబెట్టి తినిపించడం కాదు. ఆ ఆహారాన్ని వాళ్ళ అందుబాటులో ఉంచడం. ఆహారం మంచిదైతే, అందులో తగినంత పోషణ ఉంటే, వైవిధ్యం ఉంటే, ఏం తినాలో ఎంత తినాలో వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు.

ఇది "how children learn" by John Holt, పుస్తకంలోని ఒక భాగం యొక్క అనువాదం.

రచయిత: డా. వి.శ్రీనివాస చక్రవర్తి.

2 comments

  1. భావన Says:
  2. చాలా మంచి ప్రయత్నం. నిజమే కదా.. ఏదో గుడ్డెద్దు చేలో పడినట్లు చదివేస్తూ పోతాము మనం. నేను మాకు దగ్గర లో న్యూ హేంప్ షైర్ లో మిల్ ఫర్డ్ అనే వూరు లో ఇలాంటి స్కూల్ వుందని ఒకటి విన్నాను. వాళ్ళు రచయత చెప్పినట్లు గానే కూరగాయలు పండించటం తో మొదలు పెట్టి అన్నీ నేర్చుకుంటారు అట. చాలా మంచి వ్యాసం. మాకు అందించినందుకు ధన్యవాదాలు.

     
  3. well said naga,
    good work

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email