కల్లోలతా సిద్ధాంతం - పార్ట్ 10
1980 లలో అమెరికన్ ప్రభుత్వం వాన్ నాయ్మన్ ఊహించిన లక్ష్యసాధన కోసం పెద్ద యెత్తున నిధులు కేటాయించింది. ఆ రోజుల్లో వాతావరణ నిర్ణయ విభాగం మేరీలాండ్ లో ఉండేది. అందులో ఓ పెద్ద సూపర్ కంప్యూటర్లో వాతావరణాన్ని సిములేట్ చేసే ప్రోగ్రామ్‌లు నడిచేవి. అయితే ఈ నమూనాకి లారెంజ్ వాడిన నమూనాకి అట్టే పోలిక లేదు. లారెంజ్ నమూనాలో కేవలం 12 సమీకరణాలే ఉన్నాయి. కాని అధునిక ధరావ్యాప్త నమూనాలో 500,000 సమీకరణాలు ఉంటాయి. లారెంజ్ వాడిన రాయల్‌మక్‌బీ కంప్యూటర్ సెకనుకి 60 గుణకారాలు చేస్తుంది. కాని వాతావరణ కార్యాలయం వాడే "కంట్రోల్ డాటా సైబర్ 205" సూపర్ కంప్యూటర్ సెకనుకి కొన్ని మిలియన్ల క్రియలు చేస్తుంది. సాటిలైట్ల నుండి, విమానాల నుండి, ఓడల నుండి ఇలా భూమి నలు మూలల నుండి వచ్చే సమాచారాన్ని పోగుచేసి అద్భుతంగా వాతావరణ నిర్ణయం చేస్తుంది. ఆ విధంగా అమెరికాకి చెందిన "జాతీయ వాతావరణ కేంద్రం" ప్రపంచంలో రెండవ గొప్ప వాతావరణ కేంద్రంగా పేరు తెచ్చుకుంది.
అయితే మొదటి స్థానం అమెరికాకి కాదు ఇంగ్లండుకి దక్కింది. "ఐరోపా మాధ్యమితి వాతావరణ నిర్ణయ కేంద్రం" లండన్‌కి దగ్గర్లో రీడింగ్ అన్న ఊళ్ళో ఉంది. అనేక రకాల చెట్ల నీడలో నిలుచుంది ఆ భవంతి. నానా దేశాల దాతృత్వంతో నడుస్తోంది ఆ కేంద్రం. యూరప్‌లో అన్ని రంగాల్లోనూ సమైక్యతా భావం పటిష్టం అవుతున్న రోజులవి. కఠినమైన వాతావరణ నిర్ణయ లక్ష్యం కోసం తమ శక్తి యుక్తులన్నీ కూడదీసి శ్రమించాలని నిర్ణయించుకున్నాయి ఐరోపా దేశాలు. వాతావరణ నిర్ణయంలో ఈ కేంద్రం అగ్రస్థానంలో ఉండడానికి కారణాలు రెండు. మొదటిది చేవ, తెగువ బలంగా ఉన్న కుర్రకారు సిబ్బంది. రెండవది "క్రే" సూపర్ కంప్యూటర్. అమెరికన్ సూపర్ కంప్యూటర్ కన్నా ఇది ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉండేది.
పెద్ద పెద్ద కంప్యూటర్ల వినియోగం వాతావరణ నిర్ణయంతోనే ఆగిపోలేదు. విమానాల ప్రొపెల్లర్ రూపకల్పనకి సంబంధించిన ద్రవ ప్రవాహాల పరిశోధన దగ్గర్నుండి, ఆర్థిక రంగంలో విత్త ప్రవాహ అధ్యయనం వరకు నానా రకాల సమస్యలలోను కంప్యూటర్ శక్తిని వాడుకోవడం జరిగింది. అసలు 1970, 80ల నాటికి ఆర్థిక రంగంలో భవిష్యత్ నిర్ణయానికి, వాతావరణ రంగంలో భవిష్యత్ నిర్ణయానికి మధ్య పోలిక కొట్టొచ్చినట్టు కనిపించింది. చిత్ర విచిత్రమైన సమీకరణాల జాలాలని కంప్యూటర్‌లో ప్రోగ్రామ్ చేసి నడిపించి భవిష్యత్ ఒరవడులు ఎలా ఉంటాయో పరిశీలించేవారు. పరిణామం మరీ ప్రకృతి విరుద్ధంగా ఉంటే సమీకరణాలలో తగు సవరణలు చేసుకుని, ప్రోగ్రాములు మార్చుకుని కృషి కొనసాగించేవారు. అయితే ఆర్థిక రంగంలో మాత్రం భవిష్యత్ నిర్ణయ ప్రయత్నం దారుణంగా విఫలమయ్యేది. అయినా కూడా ఎందుచేతనో ఈ రంగం తీరు తెన్నులు తెలిసిన వారు కూడా ఈ కంప్యూటర్ జాతకాలని నమ్మేవారు. పారిశ్రామిక ప్రగతి గురించి, నిరుద్యోగ శాతాల గురించి కంప్యూటర్ అంచనా వేసిన అంకెలని రెండు, మూడు దశమ స్థానాల వరకు ధీమాగా పేర్కొనేవారు. ఈ అర్థంలేని అంచనాల కోసం ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు బోలెడంత డబ్బు తగలేసేవి. ఆ అంచనాలని ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకునేవి. మరి "వినియోగదారుల ఆశాభావం" వంటి అనిర్దుష్ట రాశులని అంకెలతో వ్యక్తం చెయ్యడం ఎలా సాధ్యం? అలాంటి అనిర్దుష్ట రాశులకి డబ్బు, లాభం వంటి పరమ నిర్దుష్ట రాశులతో గల లంకె ఏమిటో చెప్పడం ఎలా సాధ్యం? ఈ అసాధ్యాలని, సాధ్యం చేస్తోంది, లేదా చేస్తున్నట్టు అనిపిస్తుంది కనుకనే ఆ కంప్యూటర్ జాతకాలకి అంత గిరాకి. కాని అలాంటి అంచనాలు ఎంత పెళుసైనవో, అవిశ్వసనీయమైనవో లోతుగా అర్థం చేసుకున్న వారు బహుకొద్ది మంది.
అంతవరకు కేవలం ఒక కళగా పరిగణించబడే వాతావరణ సమస్య కంప్యూటర్ రాకతో ఒక కచ్చితమైన శాస్త్రంగా రూపుదిద్దుకోసాగింది. అసలు ఏమీ లేని దానికన్నా కాస్త ఒప్పుతప్పులతో కూడుకున్న ఈ కంప్యూటర్ అంచనాలు ఎంతో మేలని, వాటి వల్ల ఏటా బిలియన్ల డాలర్లు ఆదా అవుతున్నాయని యూరోపియన్ కేంద్రం వ్యవహారాల బట్టి తేలింది. అయితే ఆ భవిష్యత్ నిర్ణయం రెండు మూడు రోజులని దాటి పోలేక పోయింది. భవిష్యత్తులో అంతకన్నా ఎక్కువ దూరం చూడాలంటే కంప్యూటర్ ఎంతో చిలక జోస్యమూ అంతే! ఎందుకంటే ప్రాంతీయ వాతావరణ నిర్ణయం చేయాలన్నా ధరావ్యాప్తంగా సమాచారం అవసరమవుతుంది. ఒక చోట జరిగిన నిర్ణయ దోషం చకచక ఇతర ప్రాంతాలకి వ్యాపించి, వర్తిస్తుంది. వాతావరణం మరీ పెళుసైన వ్యవహారం అని మొదట్నుంచి తెలిసిందే!
మరికొంత వచ్చే టపాలో...
రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి.
marvelous.