శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

సాలీడుకి జ్యామితి తెలుసా?

Posted by నాగప్రసాద్ Sunday, June 7, 2009
అతగాడు భావుకుడు. కవి తాను అల్లుకున్న అందమైన భావజాలంలో విహరించినట్టు తాను అల్లుకున్న అందమైన ఆకాశ హర్మ్యంలో హాయిగా కొలువు ఉంటాడు. అతడు శాస్త్రవేత్త. శాస్త్రజ్ఞుడు తాను రూపొందించిన సైద్ధాంతిక నిర్మాణం నుండి విశ్వాన్ని దర్శించినట్టు, అతడు తాను పేనుకున్న మేలిమి మస్లిన్ భవంతి నుండి నిశ్చింతగా ప్రపంచాన్ని తిలకిస్తూ ఉంటాడు. కళాకారుడి కుంచే విసురులని మించిపోతాయి అతడు గీసే దారాల దారులు. అతడే అసలు స్పైడర్ మాన్!

కీటక ప్రపంచంలో సాలీడుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనం బూజులు అని దులిపి పారేసే అంశాలే అటు శాస్త్రవేత్తలకి, ఇటు చిన్న పిల్లలకి కూడా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే నిత్యాద్భుతాలు. రోజూ పరిపాటిగా చూస్తుంటాం గనుక అలవాటు పడిపోతాం గాని, ఆ అలవాటు పడిపోవటం అనే దురలవాటుని మానుకుని అటు శాస్త్రవేత్త లాగానో, ఇటు చిన్న పిల్లవాడి లాగానో ఓ సారి సాలిగూడు కేసి పరిశీలనగా చూస్తే, దాన్ని నేసిన "సాలెవాడి" సత్తా ఏమిటో అర్థం అవుతుంది.

సాలె పురుక్కి అంత ప్రత్యేకతని ఆపాదించే విషయం (స్పైడర్ మాన్ లో కూడా మనను భలే ఆకట్టుకునే విషయం) అది వెలువరించే పట్టుదారం. అసలు జంతు ప్రపంచం లోనే సాలెపురుగు దారం ఓ అద్భుత సృష్టి. చూడటానికి పలుచగా, నాజూకుగా కనిపిస్తుంది గాని ఆ దారాన్ని తక్కువ అంచనా వేయకండెం. శాస్త్రీయ అంచనాల ప్రకారం ఈ దారం స్టీలు తాళ్ళ కన్నా గట్టిది. సాలె పురుగు దారాన్ని ఉపయోగించి పెన్సిలు మందం ఉన్న ఒక కట్టగా అల్లితే ఆ తాడు కదిలే బోయింగ్ 747 విమానాన్ని ఆపగలదని అంచనా!

సాలీడు దాని దైనిక జీవితం లో ఈ తాడుని ఎన్నో విధాలుగా ఉపయోగించు కుంటుంది. దాంతో తన గూడు అల్లుకుంటుంది. తన గుడ్లని పదిలంగా దాచుకోవటానికి సంచీలు కుట్టుకుంటుంది. దాని జాలంలో చిక్కుకున్న ఆహారాన్ని నుజ్జు చేస్తుంది. ప్రమాద పరిస్థితులలో ఆ దారాన్ని ఆధారంగా పట్టుకుని కిందకి దూకి పారిపోతుంది. ఆ ఒక్క దారంతో అంత గ్రంధాన్ని నడిపించగల గొప్ప "సూత్ర" దారి సాలీడు.

ఆ దారాన్ని సుక్ష్మంగా పరిశీలిస్తే ఫిబ్రిన్ అనే ప్రోటీన్ యొక్క గొలుసు కట్టు నిర్మాణం కనిపిస్తుంది. సాలీడు దారంలో ఫిబ్రిన్ ప్రోటీన్ అణువులు ఎంతో క్రమబద్ధంగా అమరి ఉండటం కనిపిస్తుంది. దారం యొక్క పటుత్వంలోని రహస్యం క్రమబద్ధమైన ఆ అణువిన్యాసం లోనే ఉంది.

దుపంట్ అనే కెమికల్ ఇంజినీరింగ్ కంపెని ఫిబ్రిన్ ని రికంబినంట్ డీ.ఎన్.ఎ. టెక్నాలజీ ని ఉపయోగించి తయారు చేసి, సాలీడు దారాన్ని పోలిన దారాన్ని కృత్రిమంగా తయారు చెయ్యగలిగింది. అలాంటి దారానికి వాస్తవ ప్రపంచంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆ కంపెనీ విశ్వాసం.

మరి అలాంటి అపురూపమైన దారంతో అంతటి సంక్లిష్టమైన, సౌష్టవమైన గూడు ఎలా నిర్మించ గలుగుతోంది? సాలీడుకి జ్యామితి తెలుసా? ఏ ఆర్కిటెక్ట్ సహాయమూ లేకుండా, మేస్త్రీలని పురమాయించ కుండా, కూలి వాళ్ళని పెట్టుకోకుండా ఒంటరిగా అంతటి ఇంటిని ఎలా కట్టు కుంటోంది?

సాలీడు చలనాన్ని సుక్ష్మంగా పరిశీలించిన శాస్త్రవేత్తలు దాని గమనంలో ఒక క్రమాన్ని, ఒక వ్యూహాన్ని గుర్తించారు. అయితే అన్ని సాలీళ్ళు ఒకే రకమైన ఇళ్ళు కట్టుకుంటాయని లేదు. వాటికీ రకరకాల రుచులు, అభిరుచులు ఉన్నాయన్న మాట! అరానియాస్ దయాదేమాతాస్ అనే జాతి సాలీడు సైకిల్ చక్రం లాంటి కొంచెం సరళమైన గూడుని అల్లుకుంటుంది. ఆ నిర్మాణంలో క్రమం ఇలా ఉంటుంది.

ఆ నిర్మాణంలో మొట్ట మొదటి మెట్టుగా నిలువుగా నిశ్చలంగా ఉన్న రెండు ఆధారాల మధ్య ఓ దారాన్ని బట్టలు ఆరేసుకునే దండెం లా అడ్డుగా వేలాడ దీయటం. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. ఒక పక్కన నించుని దారాన్ని గాల్లోకి వెలువరించినా, ఆ దారాన్ని రెండవ పక్కకి చేరవేసేదేలా? ఒక గట్టు నుండి అవతలి గట్టుకి స్పైడర్ మాన్ లా గెంతు తుందా? కాదు. దారం యొక్క ఒక కొసని పట్టుకునే ఉంటూ, అవతలి కొసని అలా గాలికి వొదులుతుంది. దారం యొక్క అవతలి కొస గాలికి ఊగి ఊగి అకస్మాత్తుగా అవతలి గట్టుని తాకింది అంటే, దారం జిగురుగా ఉంటుంది కనుక అవతలి గట్టుని తాకిన చోట అతుక్కుపోతుంది . దాంతో మొదటి దశ పూర్తవుతుంది. "దండెం" సిద్ధం అయ్యింది.

అలా ఏర్పడ్డ దండెం మీద దొమ్మరి వాడిలా అటు ఇటు నడిచి మరిన్ని పేటల దారాన్ని దానికి జోడించి, అ దండెం ని బలపరుస్తుంది. దండెం బాగా బలపడిన తరువాత "తోరణాలు" కట్టుకునే సమయం వచ్చింది అన్నమాట! కాస్త వొదులుగా ఉండే దారాన్ని దండెం రెండు కోసల నుండి తోరణంలా వేలాడేలా ఏర్పాటు చేస్తుంది. అప్పుడు తోరణం యొక్క కనిష్ట బిందువు నుండి మరో దారాన్ని నిలువుగా కిందికి వేలాడదీసి "Y " ఆకారపు నిర్మాణాన్ని తయారు చేస్తుంది. ఆ "Y " నిర్మాణంతో తక్కిన సాలెగూడు నిర్మాణం సాఫీగా సాగిపోవడానికి ఒక చట్రం వంటిది ఏర్పడింది అన్నమాట. ఆ "Y " లోని మధ్య బిందువే పూర్తిగా తయారైన సాలెగూటికి కేంద్రం అవుతుంది.

కేంద్రం, చట్రం ఏర్పడ్డ తరువాత పని ముమ్మరంగా సాగిపోతుంది. ముందుగా కేంద్రాన్ని పరిధితో సంధిస్తూ వ్యాసార్థాలు లాంటి పలు దారాలని వేస్తుంది. వ్యాసార్థాల రచన పూర్తయ్యాక కేంద్రం నుండి సుళ్ళు తిరుగుతూ పరిధి వైపుగా సాగే సర్పిలం (spiral) లాంటి బాటను వేసుకుంటూ పోతుంది. సర్పిలం పూర్తి అయ్యిందంటే ఇక పాలు పొంగించు కోవచ్చు నన్నమాట!

తీరుగా తయారైన ఇంట్లో చక్కగా కొలువు తీరి, రాత్రంతా ఆహారం కోసం ఎదురు చూస్తూ గడుపుతుంది సాలీడు. తన వలలో చిక్కుకున్న క్రిమికీటకాలని తన బాహువుల్లో బంధించి సంహరిస్తుంది. అలా రాత్రంతా సాగిన దారుణ మారణ కాండతో ముందు రోజు కట్టుకున్న ఇల్లు బాగా దెబ్బ తింటుంది. దెబ్బ తిన్న ఇంటిని నిశ్చింతగా ఆరగిస్తుంది సాలీడు! మొట్ట మొదట నిర్మించిన దండెం ని మాత్రం విడిచిపెడుటుంది. ఆ దండెమే మళ్ళీ సాయంకాలం ఆరంభం అయ్యే గృహనిర్మాణ కార్యక్రమానికి పునాది రాయి అవుతుంది.

- చక్రవర్తి

మరింత సమాచారం కోసం:
http://www.xs4all.nl/~ednieuw/Spiders/InfoNed/webthread.html
http://www.xs4all.nl/~ednieuw/Spiders/Info/SilkBoeing.html

5 comments

 1. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిన్న ప్రచురించిన ఇదే పోస్టును తొలగించడమైనది. కాబట్టి పాఠకులు అన్యథా భావించవద్దని మనవి. అలాగే మా ప్రయత్నాన్ని ప్రోత్సహించిన యోగి గారికి, చాణక్య గారికి, శ్రీనివాస పప్పు గారికి, అరుణ పప్పు గారికి, శ్రీకర్ గారికి ధన్యవాదాలు.

  #
  యోగి Says:
  Posted on June 6, 2009 1:22 PM
  #

  మీరు చాలా బాగా రాస్తున్నారు! I appreciate and encourage you!!

  #
  చాణక్య Says:
  Posted on June 6, 2009 1:48 PM
  #

  Very nice job....

  #
  శ్రీనివాస్ పప్పు Says:
  Posted on June 6, 2009 7:59 PM
  #

  Nice job, continue...

  #
  అరుణ పప్పు Says:
  Posted on June 6, 2009 10:09 PM
  #

  సైన్సునింత పొయెటిగ్గా చెప్పొచ్చని ఇప్పుడే తెలిసింది. మీ శైలి బాగుంది.

  #
  శ్రీకర్ Says:
  Posted on June 7, 2009 1:01 AM
  #

  Excellent. Keep it up. Could you please share your mail ID.

   
 2. Aruna Says:
 3. Wav...
  మహీధర నళినీ మోహన్ గారి పుస్తకాల్లో గబ్బిలాల గురించి ఆసక్తి గా చదివాను. మళ్ళీ అంత బాగ వున్న వ్యాసం ఇదే.
  Thank you. Keep writing.

   
 4. బావుంది.

   
 5. నేను సైతం,
  ఒక అప్రిసియేషన్.
  ఈ దెబ్బతో సాలీడు ఫాన్స్ పెరిగిపోతారు.

   
 6. nice information keep continue

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email