1950 లలో అమెరికా లో, న్యూ జర్సీ రాష్ట్రంలో, ప్రిన్స్టన్ విష్వవిద్యాలయంలో జాన్ వన్ నాయ్మన్ అనే గొప్ప భౌతిక శాస్త్రవేత్త అధ్వర్యంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రూపుదిద్దుకోసాగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ రహస్య సంకేతాలని భేదించడం, అమెరికా మిసైళ్ల గతులని లెక్కించడం మొదలైన ప్రయోజనాల కోసం ఈ కంప్యూటర్ని తయారు చేస్తున్నారు. కాని వాతావరణ శాస్త్రంలో కూడా కంప్యూటర్కి ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి నాయ్మన్ గుర్తించకపోలేదు.
అందుచేత ప్రకౄతి ధర్మాలని గణిత సమీకరణాలుగా వ్యక్తం చేయొచ్చు. ఆ సమీకరణాలతో లెక్కలు కట్టి రేపు ఏం జరుగుతుందో అంచనా వేయొచ్చు. లెక్కలు మరీ జటిలం అయితే కంప్యూటర్లు వాడుకోవచ్చు. తగినంత పెద్ద కంప్యూటర్ ఉంటే ఎంత పెద్ద లెక్కనైనా లెక్క చెయ్యకుండా ఇట్టే పరిష్కరించొచ్చు. విజ్ఞాన రంగానికి పునాదిగా ఉన్న ఆలోచనా సరళి ఇది. కాని ఇందులో చిన్న దోషం ఉంది. ఓ అనాధారిత నమ్మకం మీద ఈ ఆలోచన ఆధారపడి ఉంది. సామాన్యంగా ఆ దోషాన్ని ఎవరూ గుర్తించరు. ఆ దోషం ఏమిటో చూద్దాం.
ఒక వ్యవస్థ యొక్క ప్రస్తుత స్థితి తెలిస్తే దాని భవిష్యత్తును నిర్ణయించగలం అంటున్నాం. బాగానే ఉంది. కాని ఆ ప్రస్తుత స్థితిని తెలుసుకోవడం ఎలా? దాందేవుంది? ప్రయోగాలు చేసి కొలుస్తాం, అంటారు మీరు. కాని ఒక రాశిని ప్రయోగాత్మకంగా కొలిచినప్పుడు ‘ప్రయోగ దోషం’ అని ఒకటి ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ధర్మామీటరు పెట్టి ఉష్ణోగ్రత కొలుస్తాం. మామూలు పాదరసం ధర్మామీటరు సహాయంతో 101 డిగ్రీలనో, 101.1 డిగ్రీలనో చెప్పగలం. కాని 101.05647 డిగ్రీలని చెప్పలేం కదా? అదే డిజిటల్ ధర్మామీటర్ అయితే రెండు దశాంశ స్థానాల వరకు కచ్చితంగా చెప్పొచ్చు. కాని అంతకు మించి చెప్పలేం. అంతకు మించి చెప్పలేనంత మాత్రాన కొంపలేం అంటుకుపోవోయ్ అని మీరు అనొచ్చు. నిజమే 101.985 జ్వరం ఉన్నవాడికి 98 అని ధర్మామీటరు చెప్తే ఇబ్బంది గాని, 102 అని చెప్తే పెద్ద చిక్కేం ఉండదు. చికిత్స లో మర్పే ఉండదు. అంటే ప్రయోగ దోషం ఉన్నా అది తగినంత ‘చిన్నది’ అయితే ఆ సమస్య ఉండదు అని అర్థం. కొంపలు అంటుకుపోవని తాత్పర్యం.
అలాగే ఇప్పుడు హాలీ తోకచుక్కనే తీసుకుందాం. ఈది 76 ఏళ్లకి ఒకసారి వస్తుంది. 1910లో ఓ సారి కనిపించింది. కనుక మళ్లీ 1986లో కనిపించింది. 1910లో దాన్ని చూసినప్పుడు దాని స్థితిని అంచనా వెయ్యడంలో చిన్న దోషం జరిగింది అనుకుందాం. ఆ సమాచారం ప్రకారం 1986 నాటికి దాని స్థితిని అంచనా వేసినప్పుడు అందులో చిన్న దోషమే వస్తుంది. అంటే ఆదిలో చిన దోషం ఉంటే అంతంలో కూడా చిన్న దోషమే ఉంటుందన్నమాట. ఈ మూల సూత్రం ప్రయోగాత్మక భౌతిక శాస్త్రం అంతటికీ పునాది. పూర్తిగా దోషరహితమైన ప్రయోగ ఫలితాలు ఉంటే గాని సిద్ధాంతీకరించలేం అనుకుంటే ఇక విజ్ఞాన శాస్త్రం ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేదు. చిన్న కారణాలకి పర్యవసానంగా వచ్చే ఫలితాలు కూడా చిన్నవే అయ్యుంటాయి అన్నది మనకి తెలిసినంత వరకు ప్రకౄతి సహజమైన విషయం. కనుక ఆ నాటి వాతావరణ పరిశోధకులు కూడా ఆ నమ్మకంతోనే ముందుకు సాగారు.
సైన్సుని తెలుగులో రాయాలనే సరదా ఉన్నా, తెలుగులో రాసిన సైన్సుని చదవాలని సరదా ఉన్నా నా బ్లాగులు కూడ చూడండి. మనం అంతా ఒకరికొకరు పరిచయం చేసుకొంటే కలిసి ఏదైనా మంచిపని చెయ్యవచ్చు.
lolakam.blogspot.com