అధ్యాయం 1
ప్రొఫెసర్ గారిల్లు
మే 24, 1863
ప్రొఫెసర్ లీడెంబ్రాక్ తటాలున తన ఇంట్లోకి దూసుకొచ్చాడు. ఆ ఇల్లు హాంబర్గ్ లో పాత బస్తీలో, ఒక చిన్న సందులో ఉంది.
వంట ఇంకా పూర్తి కాలేదని బెంబేలు పడుతోంది ఆయా మార్తా. భోజనాన్ని ఒవెన్ లో పెడుతూ తన అదౄష్టాన్ని బేరీజు వేసుకుంటోంది.
“ఇలాంటి సమయంలో ఆ పెద్ద మనిషి ఇంటి కొస్తే అంతే!’’ మనసులోనే అనుకున్నాను.
“ఓరి దేముడా! ఈ మనిషి అప్పుడే ఇంటికి వచ్చేశాడా?” నిట్టూర్చింది మార్తా. ఆమె భయపడినట్టే అయ్యింది.
“అయ్యో మార్తా! వంట ఇంకా అయ్యుండదే. గడియారం ఇప్పుడే ఒంటిగంట కొట్టింది. రెండు కి గాని వంట సిద్ధం కాదు,’’ అన్నాన్నేను ఆదుర్దాగా.
“మరి ఈయన ఈరోజు ఇంత త్వరగా ఎందుకొచ్చినట్టు?” అనడిగింది మార్తా.
“ఏమో ఆయన్నే అడుగుదాం.”
“అదేదో నువ్వే అడుగు బాబూ. నేను పోయి దాక్కుంటాను,’’ పడక గదిలోకి మెల్లగా జారుకుంది.
నేను ఒంటరిగా వంట గదిలో మిగిలాను.
మా ప్రొఫెసర్ మామయ్య అసలే ముక్కోపి. ఈ సమయంలో ఇక్కడ ఉండటం అంటే సముద్ర తీరంలో నించుని సునామీని సాదరంగా ఆహ్వానించినట్టే! మెల్లగా నేను కూడా మేడ మీది గదిలోకి జారుకోవడానికి ప్రయత్నించాను.
ఇంతలో తుఫాను తోసినట్టు వీధి తలుపు తెరుచుకుంది. బలమైన పదఘట్టనలతో ఎవరో లోపలికి వస్తున్న చప్పుడు. ముందు గది లోంచి ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ లా దూసుకుపోతూ, తన చేతి కర్రని ఒక మూలకి విసిరేస్తూ, కళ్ల జోడు బల్ల మీద విసిరేస్తూ, తన శరీరాన్ని స్టడీ రూం లోని సోఫా లో విసిరేస్తూ, “ఒరేయ్, ఏక్సెల్!’’ అని గావు కేక పెట్టాడు.
పర్జన్య గర్జన లాంటి ఆ కేకకి నేను ఇంకా తేరుకోనే లేదు. అంతలోనే “ఎక్కడున్నావ్ రా?” అంటూ మరో రంకె వినిపించింది.
లోక విఖ్యాత భౌగోళిక శాస్త్రవేత్త, ఇంటి యజమాని, మా మామయ్య, గురువు దైవం అయిన ప్రొఫెసర్ లీడెంబ్రాక్ గదిలోకి తోక ముడుచుకున్న పిల్లిలా ప్రవేశించాను.
ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ జొహానియం లో పనిచేస్తాడు. ఈయన క్లాసులు విచిత్రంగా ఉంటాయి. క్లాసు చెపుతూ ఉన్నట్టుండి ఏదో భావావేషం పెల్లుబికి పూనకం వచ్చిన వాడిలా ఘోషిస్తూ పోతాడు. అది విద్యార్థులు వేగంగా నేర్చుకోవడం లేదన్న బాధా అంటే కాదు. అసలు వాళ్లు పాఠం వింటున్నరా లేదా అన్న పట్టింపు కూడా ఆయనకి వుండదు. పోని ఆయన పడే శ్రమ వల్ల ఏదైనా స్థూల లాభం ఒరుగుతుందా అన్న లక్ష్యం కూడా ఆయనకి లేదు. ఆయన దౄష్టిలో ఇవన్నీ చాలా చిన్న విష్యాలు. ఈ రకమైన బోధనని జర్మను తాత్వికులు ‘’ఆత్మాశ్రయ’’ బోధన అంటారు. అంటే తన కోసం, తన సంతౄప్తి కోసం తను చెప్పుకునే బోధన. ఆయన అహంభావి. అయితే మనసు విజ్ఞానపు ఊట. కాని అందులోంచి జ్ఞానం రాబట్టడం అంత సులభం కాదు. ఆయన వైజ్ఞానిక పిసినారి!
జర్మనీ లో ఇలాంటి ప్రొఫెసర్లు అరుదు.
కాని దురదౄష్టం ఏంటంటే మా మామయ్యకి కాస్త వాక్పటుత్వం తక్కువ. మాట తడపడుతుంది. ఊరికే తత్తరపడతాడు. ఇంట్లో ఎలా మాట్లాడినా ఫరవాలేదు. కాని బయట ప్రసంగించినప్పుడు మాట తడబడితే కష్టం. అయితే ఒకటి. ఖనిజ శాస్త్రం లో పెద్ద పెద్ద గ్రీకు, లాటిన్ పారిభాషిక పదాలు ఉంటాయి. ఎంత వాణీ కటాక్షం ఉన్న వాడికైనా అవి సులభంగా లొంగవు. కవితా ఛందస్సులో ఇంపుగా ఇమడవు. అంత పెద్ద శాస్త్రాన్ని విమర్శించడానికి నేనెంతటి వాణ్ణి కాని, ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. రాంబోహెడ్రల్ స్ఫటికాలు, రెటినాస్ఫాల్టిక్ రెసిన్లు, గెహ్లెనైట్లు, ఫస్సాయైట్లు, మాలిబ్డెనైట్లు, మెగ్నీషియం టంగ్స్టనైట్లు, జిర్కోనియం టైటనైట్లు వంటి ఖనిజ రాజాల పేర్లు ఉచ్ఛరించాలంటే ఎంతడి సహస్రావధానికైనా మనసు పొరబడదా, మాట తడబడదా, నాలుక మడతబడదా?
చాలా మంచి వివరణ