మామూలుగా చూస్తే లారెంజ్ చేసినది సబబే ననిపిస్తుంది. ఆ రోజుల్లో వాతవరణ సాటిలైట్లు సెంటిగ్రేడులో వెయ్యో వంతు నిర్దుష్టతతో సముద్రాల ఉష్ణోగ్రత కొలవగలిగితే చాలా గొప్ప. కనుక కొలవబడ్డ ఫలితాల్లోనే అంత దోషం ఉన్నప్పుడు అంత కన్నా చిన్న దశమ స్థానాలతో పనేముంది అనుకోవడం సమంజసమే అనిపిస్తుంది. పోనీ ఏ నాలుగో స్థానంలోనో, ఐదో స్థానంలోనో కాస్తంత దోషం ఉంటే, ఫలితాల్లో కూడా కాస్తంత దోషం మాత్రమే వస్తుందని ఆశిస్తాం. లారెంజ్ చిత్రం 1 లోని గ్రాఫులని కాస్త క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆ గ్రాపుల్లో ఒక దాన్ని ఒక పారదర్శక ప్లాస్టిక్ కాగితం మీద అచ్చు వేసి, ఆ కాగితం రెండవ గ్రాఫు మీద అమర్చి రెంటి మధ్య తేడా ఎక్కడొస్తోందో పరిశీలనగా చూశాడు. పటంలో ఇంచు మించు సగం వరకు రెండు గ్రాఫులు చాలా దగ్గర దగ్గరగా నడుస్తున్నాయి . కాని మధ్య నుండి వేరుపడటం మొదలెట్టాయి. గణిత శాస్త్రంలో అందరూ అనుకునేట్టు “ఆరంభంలో చిన్న దోషం ఉంటే అంతంలో కూడా చిన్న దోషం ఉంటుంది” అన్న సూత్రం ఇక్కడ దారుణంగా వమ్మవుతోంది. మరి ఎందుచేతనో లారెంజ్ పరిశోధిస్తున్న ఈ వాతావరణ నమూనాలో, ఆ నమూనాని వర్ణించే సమీకరణాలలో చిన్న దోషాలు కూడా ప్రమాదకరంగానే పరిణమిస్తున్నాయి. తన సమీకరణాలు ఎంతో సరళీకరింప బడినవని అతడికి బాగా తెలుసు. అయినా వాతావరణ గతులలోని సారాన్ని ఈ సమీకరణాలు పట్టుకున్నాయని అతడి నమ్మకం. మరి ఈ వైఫల్యానికి కారణం? లరెంజ్ నీరుగారి పోయాడు. ఇంత సంక్లిష్టమైన పరిణామం గల వాతావరణాన్ని అంచనా వెయ్యడం జరగని పని అని అప్పటికి ఊరుకున్నాడు.
“అంతకు ముందు వాతావరణ నిర్ణయంలో నెగ్గిన వారు ఎవ్వరూ లేరు. దీంతో గణిత శాస్త్ర పరంగా ఆ వైఫల్యానికి ఒక సంజాయిషీ దొరికింది,” అన్నాడు లారెంజ్ తన ప్రథమ ఫలితాల గురించి మాట్లాడుతూ. “అసలు వాతావరణాన్ని పూర్వ నిర్ణయం చెయ్యొచ్చు నన్న నమ్మకం ఎందుకు కలుగుతోంది అంటే భౌతిక ప్రపంచంలో ఎన్నో మార్పులని మనం కచ్చితంగా ముందే ఊహించొచ్చు. ఉదాహరణకి గ్రహణాలు, గ్రహగతులు, కెరటాల రాకపోకలు – మొదలైన వాటన్నిటినీ కచ్చితంగా నిర్ణయించొచ్చు. అసలు కెరటాల రాకపోకల నిర్ణయం అయితే అదొక సమస్య అనే ఎప్పుడూ అనుకోలేదు. అది కేవలం వాస్తవ జ్ఞానం అనుకునేవాణ్ణి. అలల గతి కూడా వాతావరణం లాగానే చాలా క్లిష్టమైనదే. రెండిట్లోనూ రాశులు చక్రికంగా మారుతుంటాయి. వచ్చే ఏడాది కూడా ఎండా కాలంలో చలికాలంలో కన్నా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అది వాస్తవ జ్ఞానం. అదే నమ్మకంతో వాతావరణసమస్యను కూడా ఎదుర్కోవడం మరి సహజమే.”
1950లు, ’60 లలో వాతావరణం మీద సంపూర్ణ విజయం సాధించే దినం దగ్గర పడుతోందన్న ఆశాభావం బలంగా ఉండేది. వాతావరణ పూర్వనిర్ణయంలోనే కాదు, నియంత్రణలో కూడా రకరకాల ఊహాగానాలతో పత్రికలు హోరెత్తిపోయేవి. రెండు ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాలు పక్వానికి వస్తున్న రోజులవి. ఒకటి కంప్యూటర్ పరిజ్ఞానం, రెండవది సాటిలైటు పరిజ్ఞానం. ఈ రెండిటి మేళవింపులో ఉన్న బలం సత్ర్పయోజనాలకి దారి తీస్తుందన్న గుర్తింపులోనే ‘విశ్వజనీన వాతావరణ పరిశోధనా పథకానికి’ శ్రీకారం చుట్టటం జరిగింది. అనుకున్న పరిణతులన్నీ జరిగితే ఇక ప్రకృతి ఆట కట్టే! తుఫానులు, భూకంపాలు వీటి పేరుతో ప్రకృతి చేసే అరాచకాలలో ఇకపై క్రిమికీటకాల్లా మనిషి నశించడు. మనుపటి బానిసత్వాన్ని విడిచి అధినేత అవుతాడు. ప్రకృతికి ప్రభువవుతాడు. నియంతగా ప్రకృతి గతులని శాసిస్తాడు. తటపటాయిస్తున్న వర్షామేఘాన్ని చిటపటమని కురవమని చిటికేసి చెప్పొచ్చు. మన ఆశలకి అనువుగా విశ్వమంతటినీ వీలుగా మలచుకోవచ్చు. దేవుళ్లా దర్జాగా బతకొచ్చు!
0 comments