కాని ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మా మామయ్య అపారమైన పాండిత్యం, పరిజ్ఞానం ఉన్నవాడు. ఇటు భౌగోళిక శాస్త్రవేత్త ప్రతిభ, అటు ఖనిజ శాస్త్రవేత్త సూక్ష్మదౄష్టి తనలోనే పోతపోసుకున్న ఘనుడు. సమ్మెట, దిక్సూచి, స్టీలు కడ్డీ, బ్లోపైప్, నైట్రిక్ ఆసిడ్ సీసా మొదలైన పరిశోధనా సామగ్రి చేతబట్టుకున్నడంటే ఇక మొత్తం ఖనిజ విజ్ఞాన లోకంలో మామయ్య సాటి రాగల ధీరుడు ఈ భూగోళం మీద ఇంకా పుట్టలేదు. ఇప్పటి వరకు కనుక్కొబడ్డ 63 మూలకాలూ అయ్యనకి పేరు పేరునా తెలుసు. అవి పెళుసుగా ఉంటాయా, కఠినంగా ఉంటాయా, వాటి రూపురేఖలు ఎలా ఉంటాయి, వేడికి సులభంగా కరుగుతాయా, కరగవా, దెబ్బ కొడితే మోగుతాయా లేదా, వాటి రంగేమిటి, రుచి ఏమిటి, వాసన ఏంటి – ఈ వివరాలన్నీ ఆయన మనసులో ఎప్పుడూ మెదుల్తూ ఉంటాయి.
వైజ్ఞానిక సదస్సులలో, సమావేశాలలో లీడెంబ్రాక్ పేరు, ప్రస్తావనలు పదే పదే వస్తుంటాయి. హంఫ్రీ డేవీ, హంబోల్ట్, కేప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్, జనరల్ సబీన్ వంటి ప్రముఖులు హాంబర్గ్ మీదుగా పోయినప్పుడు తప్పకుండా లీడెంబ్రాక్ ని సందర్శించి తీరవలసిందే. బెకరెల్, ఏబెల్మాన్, బ్రూస్టర్, డ్యూమాస్, మిల్నె-ఎడ్వర్డ్స్, సెయింట్ క్లార్ డెవిల్ వంటి మహామహులు కూడా రసాయన శాస్త్రంలో ఏదైనా సందేహం వస్తే మామయ్యనే సంప్రదిస్తారు. 1853 లో మామయ్య రాసిన “రసాయన దర్పణం’’ అనే గ్రంథం వెలువడింది. ఆది పండితులకి శిరోధార్యం అని వేరే చెప్పనక్కర్లేదు.
ఇవన్నీ కాక మా మామయ్య ఓ ఖనిజ మ్యూజియం కి అధికారి కూడా. ఈ మ్యూజియం ని ఎం.స్ట్రూవ్. అనే రష్యన్ రాయబారి స్థాపించాడు. ఖనిజాల మీద ఇలాంటి మ్యూజియం మొత్తం యూరప్లో మరెక్కడా లేదని చెప్పుకుంటారు.
ఇదండి ఇందాక నన్నలా రంకెలేసి పిలిచిన మా మామయ్య చరిత్ర. ఆయనది పొడవైన, ధౄఢమైన శరీరం. వయసు అరవై దగ్గర ఉంటుంది. ఆ పెద్ద పెద్ద కళ్ల జోళ్ల వెనుక కళ్లెప్పుడూ చంచలంగా కదులుతుంటాయి. ముక్కు కత్తిలా సూదిగా ఉంటుంది. అయితే ఆ ముక్కు సూదంటు రాయి లాంటిదని, దానికి అయస్కాంత షక్తి ఉందని, ఇనుప రజను దగ్గరికి తెస్తే చటుక్కున అకర్షిస్తుందని పోకిరి పిల్లలు చెప్పుకుంటూ ఉంటారు. వట్టి ఆకతాయిలు! లేకపోతే ముక్కు ఇనుముని ఆకర్షించడం ఏమిటండి? మా మామయ్య ముక్కు ఆకర్షించే పదార్థం ఒక్కటే – అది ముక్కుపొడుం!
0 comments