జర్మను ప్రొఫెసర్ అయినా మా మామయ్య కొద్దో గొప్పో ఆస్తిపరుడే అని చెప్పాలి. తన సొంత ఇల్లు ఉంది. ఆ ఇంట్లోని సభ్యులు – ఆయన, ఆయన పెంపుడు కూతురు గ్రౌబెన్, ఓ పదిహేడేళ్ల పనిపిల్ల, మార్తా, నేను. అనాథ నైన నేను ఆయన ప్రయోగశాలలో సహచరుడిగా పని చేస్తుంటాను.
చిన్నప్పట్నుంచి కూడా నాకు భౌగోళిక శాస్త్రం అంటే ఇష్టం. ఖనిజ శాస్త్రం మా రక్తంలో ప్రవహిస్తోంది కాబోలు. ఇక వేరే స్నేహితులు ఎవరూ పెద్దగా లేకపోయినా ప్రయోగశాలలో ఆ ఖనిజ నమూనాల సమక్షంలో హాయిగా జీవితం వెళ్ల బుచ్చుతూ ఉంటాను.
దీని బట్టి మనకి అర్థం అయ్యేది ఏంటంటే కోనిగ్స్ స్ట్రాసే సందులో, ఆ చిన్న ఇంట్లో కూడా మనుషులు సుఖంగా బతక గలరన్నమాట. మా మామయ్య ఎంత ముక్కోపి అయినా ఆయనకి నేనంటే ప్రాణం. అయితే చిక్కేంటంటే ఆ పెద్ద మనిషికి నిరీక్షణ అన్న పదానికి అర్థం తెలీదు. కిందటి ఏప్రిల్ లో ఆయన కిటికీ బయట బావుంటుంది కదా అని మిగ్నొనెట్ పూల మొక్కల జాడీలు వీలాడదీశాను. మొక్కలు వేగంగా పెరగాలని వాటి ఆకులని రోజూ కొద్ది కొద్దిగా సాగదీయడం మొదలెట్టాడు! ఆయన వేగం ముందు ప్రకృతిది మరీ మంద గతి అన్నమాట. ఇక అలాంటి మనిషితో వ్యవహరించాలంటే చెప్పింది చప్పున చెయ్యడం తప్ప వేరే మార్గాంతరం లేదు.
అందుకే ఆయన రంకె వినిపించగానే భక్తిగా ఆ రంకె వచ్చిన దిశలో పరుగు అందుకున్నాను.
(ఒకటవ అధ్యాయం సమాప్తం)
0 comments