ఈ ప్రశ్నకి శాస్త్రీయంగా సమాధానం చెప్పటానికి కావలసిన స్టాటిస్టిక్స్ నా వద్ద లేవు. కానీ ప్రపంచంలో సైన్స్ రంగంలో బాగా పురోగమించిన దేశాలలో, సంపన్న దేశాలలో (మరి సైన్సు సామర్ధ్యానికి, సపత్తికి సంబంధం ఉంది) చాలా మటుకు సైన్సు చదువు అ దేశపు భాషలలోనే నిర్వహించబడుతోంది.
ఈ మధ్యనే ఓ కొరియన్ నేస్తంతో ఈ ప్రస్తావనే వచ్చింది.
"కొరియా లో సైన్స్ సమాచారం అంతా కొరియన్ భాషలోనే ఉంటుందా?" అడిగాను.
"అవును. కొన్ని అత్యాధునిక అంశాలని మాత్రం ఇంగ్లీషు లో చదువుకోవలసి వస్తుంది. కానీ చాల మటుకు కొరియన్ లోనే ఉంటుంది."
"మరి ఇంగ్లీష్ కి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవటం మీకు సమస్య అనిపించలేదా?"
"అప్పుడప్పుడు అనిపిస్తుంది. అందుకే ప్రభుత్వం తప్పనిసరిగా ఇంగ్లీష్ లో సైన్స్ బోధన జరగాలని కొంతకాలం నిర్బంధం పెట్టింది. దాంతో సైన్స్ అర్థం చేసుకోవటం కన్నా ఇంగ్లీషు అర్థం చేసుకోవటం పెద్ద సమస్య అయిపోయింది పిల్లలకి," నవ్వుతు అన్నాడు.
"మరి పారిభాషిక పదాల సంగతి ఏం చేస్తారు?" అడిగాను.
"అన్ని కొరియన్ లోనే తర్జుమా చేసుకుంటాం. కొన్ని సార్లు చాల కష్టం అవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్, కొరియన్ భాషలు చాల భిన్నమైన భాషలు. సమానార్థం గల పదాలని ఎంచుకోవటం కష్టం. అ మధ్యన ఓ హంగేరియన్ మిత్రుడు ఈ విషయం గురించే మాట్లాడుతూ అన్నాడు. హంగేరియన్ భాషలో సైన్స్ పరిజ్ఞానం అంత సమగ్రంగా లభ్యం అవుతుందట. యురోపియన్ భాషల మధ్య ఉండే సహజ సాన్నిహిత్యమే దీనికీ కారణం. మరి మీ భాషల సంగతి ఏమిటి?"
"అదృష్టవశాత్తు మా భాషలలో చాల వాటికి సంస్కృతం ఆధారంగా ఉంటుంది. సంస్కృతానికి యురోపియన్ భాషలకి సంబంధం ఉంది."
"మరి మీ భాషల్లో సరైన సైన్స్ పరిభాష ఉందా?" అడిగాడు నా కొరియన్ నేస్తం.
"నాకు తెలిసినంత వరకు సమగ్రంగా లేదు. పాఠ్య పుస్తకాలలో వాడిన పదాలని సమీకరిస్తూ నిఘంటువులు ప్రచురించాలి. కానీ నాకు తెలిసి అలాంటి ప్రయత్నలేవి పెద్దగా జరగలేదు. ఇలాంటివి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుని చెయ్యాలి. ఒక శాస్త్రవేత్తల బృందాన్ని, ఒక భాష కోవిదుల బృందాన్ని పిలిచి ప్రతి సైన్సు రంగంలో సమగ్రమైన నిఘంటువులు తాయారు చెయ్యాలని పురమయిమ్చాలి."
"ఏం? మరి మి ప్రభుత్వం అలాంటివి చెయ్యడా?"
"ప్రభుత్వం ఎన్నో చెయ్యదు? ఇదొక లెక్కా?"
"అవున్లే. ప్రపంచం అంతట రాజకీయ నాయకులు ఇతరత్రా ఎన్నో విషయాలతో బిజీగా ఉంటారు," అంటూ నవ్వుతూ అన్నాడు నా స్నేహితుడు.
రాజకీయ నాయకుల ప్రస్తావనతో మా సంభాషణకి ఉపసంహారం జరిగింది.
జపనీజ్ భాషలో కూడా ఇదే ఒరవడి కనిపిస్తుంది. అత్యాధునిక అంశాల మిద కూడా కూలంకషంగా జపనీజ్ లో రాసిన పుస్తకాలు దొరుకుతాయి. ఇంగ్లీష్ లో మేటి వైజ్ఞానిక పత్రికలలో ప్రచురించే ప్రఖ్యాత జపనిజ్ శాస్త్రవేత్తలు కూడా తాము పరిశోధిస్తున్న ఉన్నత సైన్సు విషయాల గురించి ఎంతో బాధ్యతాయుతంగా జపనీజ్ లో పుస్తకాలు రాస్తుంటారు. పెద్ద నగరాలలో తప్ప ఇంగ్లీషు తెలిసిన వారి సంఖ్య చాల తక్కువ. మరి ఇంగ్లీషు లో భాష సామర్థ్యం అంత బలహీనంగా ఉన్న దేశం ప్రపంచంలో రెండవ సుసంపన్న దేశంగా నిలిచింది అంటే ఆ ఆదర్శం నుండి మనం నేర్చుకోవలసినది ఎంతైనా ఉంది.
మరైతే ఇంగ్లీష్ ని పూర్తిగా బహిష్కరించి, సైన్సు చదువంతా భారతీయ భాషల్లోనే జరగాలంటావా? అంటే కాదనే అంటాను. సైన్సులో ఇంగ్లీషు ఉండాలి, భారతీయ భాషలూ ఉండాలి. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంతవరకు - ఇవే ఈ విషయంలో పూర్తిగా తేలని చిక్కు ప్రశ్నలు. వీటికి సమాధానాలు నావద్ద కూడా సిధ్ధంగా లేవు.
పని చేస్తూ పోతుంటే స్పష్ట ఏర్పడుతుందని ఆశ.
-చక్రవర్తి
ఆ అవసరం ఉంది అని ప్రభుత్వాలకీ తెలుసు, కానీ ఆలా చేస్తే ఇంగ్లీష్ పట్టు తగ్గిపోతుంది. అప్పుడిక అదీ,ఇదీ అని ఇంగ్లిష్ వాడు మభ్యపెట్టలేడు. అందుకే ఇదంతా.
ఇది ప్రభుత్వాలకతీతంగా జరుగుతున్న కుట్ర.