తెలిసిన వైజ్ఞానిక ధర్మాలని ఆధారంగా చేసుకుని, కంప్యూటర్ని ఓ సాధనంగా వాడుకుంటూ తన లక్ష్య సాధనలో మునిగిపోయాడు లారెంజ్. కంప్యూటర్ వాతావరణ నిర్మాణానికి ఉపక్రమించాడు.
బయటి వాతావరణాన్ని దేవుడి సృష్టించాడేమో గాని ఆ కంప్యూటర్ వాతావరణానికి తనే స్రష్ట. తనకి ఇష్టం వచ్చినట్టు ప్రకృతి ధర్మాలని మార్చుకోవచ్చు. అపర విశ్వామిత్రుడిలా తనకు నచ్చిన తీరులో ప్రకృతిని మలచుకోవచ్చు. ఉష్ణోగ్రత, పీడనం వంటి భౌతిక రాశుల మధ్య సంబంధాలని తెలిపేవే ప్రకృతి ధర్మాలు. ఆ ధర్మాలని గణిత సమీకరణాలుగా వ్యక్తం చేసి, వాటినే ప్రోగ్రాం రూపంలో కంప్యూటర్లో నడిపిస్తే, ఆకాశమంతా వ్యాపించే వాతావరణం నట్టింట నాట్యం చేస్తుంది! ఆ నాట్యం చేయించే పని మీదే ఉన్నాడు లారెంజ్!
లారెంజ్ ఓ వాతావరణ శాస్త్రవేత్త. చాలా మంది వాతావరణ శాస్త్రవేత్తల్లా కాక వాతావరణం అంటే చాలా ఇష్టం ఉన్నవాడు. దాన్ని లోతుగా శోధించాలనే కుతూహలం ఉన్నవాడు. ఫుట్టింది అమెరికాలో, కనెక్టికట్ రాష్ట్రంలో, వెస్త్ హార్ట్ ఫోర్డ్ అనే చిన్న ఊళ్లో. చిన్నతనంలో బయటికి వెళ్లి నేస్తాలతో ఆడే ఆటల కన్నా తన తండ్రితో కలిసి లెక్కల పజిల్స్ చెయ్యడం మీదే ఎక్కువ మక్కువ చూపించేవాడు. ఒకసారి వాళ్ళిద్దరికీ చాలా కఠినమైన చిక్కు లెక్క ఎదురయ్యింది. తర్వాత అసలు ఆ లెక్కకి పరిష్కారమే లేదని తేలింది. ఓ లెక్కకి పరిష్కారం లేదని నిరూపించటం కూడా ఒక విధంగా ఆ లెక్కని పరిష్కరించటమే అవుతుందని తండ్రి బోధపరిచాడు. 1938 లో జూనియర్ కాలేజి పూర్తి చేసి డార్ట్ మౌత్ కాలేజిలో లెక్కల్లో బియస్సీ చెయ్యాలని అనుకున్నాడు. కాని విధి రెండవ ప్రపంచ యుద్ధ రూపంలో అతడి తలుపు తట్టింది. వాయు సేనా విభాగంలో వాతావరణ సూచనలిచ్చే అధికారిగా వేశారు. వాతావరణ శాస్త్రంలో ఇదే అతడి మొదటి పరిచయం. యుద్ధం పూర్తయ్యాక వాతావరణ శాస్త్రాన్ని గణిత శాస్త్రపరంగా ఇంకా లోతుగా అధ్యయనం చెయ్యాలనుకున్నాడు. ముందుగా వాతావరణంలో వాయుసంచారం వంటి పాత సమస్యలను తీసుకుని అందులో సిద్ధాంతాలు వ్యాసాలు ప్రచురించాడు. అయితే వాతావరణం ఇలా ఎందుకుంది అన్నదానికి శాస్త్రీయ వివరణ ఇవ్వడం ఒక ఎత్తు. "వివరణ ఏదైతే ఎవడిక్కావాలి? ఇంతకీ రేపు ఏం జరుగుతుందో అది చెప్పు" అన్న ప్రశ్నకి సమాధానం చెప్పగలగడం మరో ఎత్తు. కనుక వాతావరణ మార్పులో జరగబోయేది చెప్పటం – భవిష్యత్ నిర్ణయం ( forecasting) – ఇదీ అసలు సమస్య. ఈ సమస్యనే సవాలుగా తీసుకుని ముందుకి సాగాడు లారెంజ్.
మరికొంత వచ్చే టపాలో...
రచయిత: డాక్టర్ వి.శ్రీనివాస చక్రవర్తి.

తెలుగు శాస్త్రవిజ్ఞానాభిమానులు, ఎంత అదృష్టవంతులో కదా!