మా మామయ్య స్టడీ రూం చిన్న మ్యూజియం లా ఉంటుంది. ఖనిజ ప్రపంచంలో ఎక్కడలేని నమూనాలూ అక్కడ కనిపిస్తాయి. జ్వలనీయ ఖనిజాలు, లోహపు ఖనిజాలు, అశ్మకపు ఖనిజాలు ఇలా రకరకాల ఖనిజాలు -- మీద పేర్లు అంటించిన సీసాల్లో గది నిండా ఉంటాయి.
ఈ ఖనిజ శకలాలే నా ప్రియ నేస్తాలు. నా తోటి కుర్రాళ్లతో సరదాగా గడపకుండా ఎన్నో సార్లు ఈ గ్రాఫైట్లని, ఆంత్రసైట్లని, లిగ్నైట్, పీట్ మొదలైన బొగ్గు జాతులని దుమ్ము దులుపుతూ కాల క్షేపం చేస్తుంటాను. ఇక బిట్యుమెన్లు, రెసిన్లు, సేంద్రియ రసాయన లవణాలు – వీటినయితే చిన్న ధూళి కణం కూడా పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఈ ఖనిజ సమూహంలో బంగారం వంటి లోహాలు కూడా ఉన్నా, వాటికి సామాన్యంగా ఉండే హెచ్చు విలువ ఇక్కడ ఇవ్వబడదు. సామాజికమైన నిమ్నోన్నతలు లేకుండా ఇక్కడ ఒక విధమైన శాస్త్రీయమైన సర్వసమానత్వం చలామణి అవుతుంటుంది.
ఆదుర్దాగా మామయ్య గదిలోకి ప్రవేశించిన నేను ఇవేవీ ఆలోచించే పరిస్థితిలో లేను. నా కంగారు అంతా ఆయన నన్ను ఎందుకు పిలిచారన్న దాని గురించే. అంతలో తన చేతిలో ఉన్న పుస్తకం మీద నా దృష్టి పడింది.
“బ్రహాండమైన పుస్తకం,” చేతిలో ఉన్న పుస్తకాని మెచ్చుకుంటూ అన్నాడు మామయ్య. “ఏం పుస్తకం అనుకున్నవ్?”
మామ్మయ్య కి ఏదైనా మంచి పుస్తకం దొరికితే ఇక సంతోషం పట్టలేం.
“చూశావా? ఇది సామాన్యమైన పుస్తకం కాదు. ఇవాళ ఉదయం హెవేలియస్ అంగడికి పోతే కనిపించింది.”
“అబ్బ, భలే!” ఉత్సాహం తెచ్చి పెట్టుకుంటూ అన్నాను.
ఓ పాత, చింకి, చెదలు పట్టిన, కాగితాలు చిరిగి పీలికలుగా ఊడొస్తున్న ఆ చిత్తు పుస్తకం గురించి ఇంత హడావిడా?
కాని దాని పొగుడ్తూ మామయ్య చేస్తున్న అష్టోత్తరం మాత్రం నిరాఘాటంగా సాగుతూనే ఉంది.
“చూశావా?” ప్రశ్నలు, సమాధానాలు తానే చెప్పుకు పోతున్నాడు. “దీని బైండింగు ఎంత ధృఢంగా వుందో. దీని వయసు ఎంత అనుకున్నవు? ఏడొందల ఏళ్లు! ఏడొందల ఏళ్లు గడిచినా వన్నె తగ్గకుండా ఎలా నిగనిగ లాడుతోందో చూడు,” పుస్తకాన్ని తెరిచి, మూసి చేస్తూ అన్నాడు.
పుస్తకం బైండింగ్ గురించి అంతగా మురిసి పోవాల్సింది ఏముందో నాకైతే అర్థం కాలేదు. అందులో ఏవుందో తెలుసుకోవాలి అనిపించింది.
“ఇంతకీ ఆ పుస్తకం పేరేంటో?” ఉండబట్టలేక అడిగాను.
(సశేషం...)
0 comments