ఓ పెద్ద సభలో ట్రాన్స్పోర్టర్
లో ప్రయాణించగోరే పోటీదార్ల ఇంటర్వ్యూ జరుగుతుంది. శాస్త్రీయ విషయాల మీద ఎల్లీ అద్భుతంగా
సమాధానాలు చెప్పే సభని మెప్పిస్తుంది. ఇక చివరిగా ఒక పెద్దాయన ఒక ప్రశ్న అడుగుతాడు
–
“డాక్టర్ ఏరోవే! మీరు దైవాన్ని నమ్ముతారా?”
ఎల్లీకి ఒక్క క్షణం ఆ ప్రశ్న అర్థం కాదు.
“మీరు అధ్యాత్మికతని నమ్ముతారా?” ఈ ప్రశ్న వచ్చిన దిక్కులో
చూసి ఉలిక్కి పడుతుంది ఎల్లీ. అది అడిగింది పామర్ జాస్. ఏంటి ఇతగాడి ఉద్దేశం?
“నేను నైతిక జీవనాన్ని
నమ్ముతాను. ఇక దైవం మాటకి వస్తే ఒక శాస్త్రవేత్తగా కచ్చితమైన ఆధారాలు ఉండే విషయాలని
తప్ప వేరే విషయాల జోలికి పోను. అయినా ఇదొక వైజ్ఞానిక కార్యం. ఇందులో దేవుడి ప్రసక్తి
ఎందుకు వస్తోందో అర్థం కావడం లేదు,” అంటుంది కాస్త విసుగ్గా.
“తప్పకుండా వస్తుంది. మీరు ఈ ప్రయాణంలో కేవలం ఓ శాస్త్రవేత్తగా
వెళ్లడం లేదు. మొత్తం మానవ జాతికి ప్రతినిధిగా వెళ్తున్నారు. మనుషుల్లో తొంభై శాతం
మంది ఏదో ఒక రకంగా దేవుడు అన్న భావనని సమ్మతిస్తారు. దేవుడే లేడని నమ్మే మీరు మమ్మల్ని
అందరినీ వెర్రి వాళ్ల కింద జమకడుతున్నట్టే కదా? మరి మా ప్రతినిధిగా మీరు ఎలా వెళ్ళగలరు?”
అందుకు ఎల్లీ సమాధానం చెప్పలేక పోతుంది. పోటీలో తను ఎంపిక కాదు. ఇంతలో డ్రమ్లిన్ వంతు వస్తుంది.
“ఈ ప్రయాణం చెయ్యడం ఈ దేశం, ఈ ప్రజలు నాకు ఇస్తున్న గొప్ప
మన్ననగా భావిస్తున్నాను, ఈ అవకాశం దేవుడి ఆశీర్వాదంగా దీన్ని సవినయంగా స్వీకరిస్తున్నాను…” ఈ తరహాలో ఏవో కమ్మని రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తాడు.
ఆ సమాధానాలు అందరికీ నచ్చుతాయి. డ్రమ్లిన్ ఎంపిక అవుతాడు.
దాంతో ఎల్లీ కాళ్ల కింద నేల చీలినట్టవుతుంది. రాజకీయం గెలిచింది,
విజ్ఞానం ఓడిపోయింది. ఏ మాత్రం నమ్మకం లేకపోయినా కేవలం తాత్కాలిక లాభం కోసం ఏవో పొడి
పొడి మాటలు మాట్లాడిన వాళ్లు ఎంపిక అయ్యారు. మనసులో నమ్మిన దాన్ని నిజాయితీగా చెప్పిన
పాపానికి తాను ఓడిపోయింది.
ఎల్లీ కోపానికి మరో ముఖ్యమైన కారణం కూడా వుంది. తను అంతగా
నమ్మిన పామర్ జాస్, తనని అర్థం చేసుకున్నాడని అనుకున్న పామర్ జాస్ కూడా సభలో అలా తనకి
ప్రతికూలంగా మాట్లాడడం సహించలేకపోయింది. నమ్మిన స్నేహితుడు ఇలా ద్రోహం చేస్తాడని కలలో
కూడా అనుకోలేదు. ఇక ఆ నాటి నుండీ తనకి, పామర్ కి మధ్య తెగతెంపులు అయిపోయినట్టే భావించింది.
‘ట్రాన్స్ పోర్టర్’ అని
వ్యవహరించబడే ఆ కొత్త నౌక నిర్మాణానికి అయ్యే ఖర్చు ఆకాశాన్నంటేలా వుంది. కనుక
అమెరికా దేశంతో పాటు మరి కొన్ని దేశాలు ఆ భారాన్ని భరించి, ఉమ్మడిగా నౌకా నిర్మాణానికి
పూనుకుంటారు.
ట్రాన్స్పోర్టర్ నిర్మాణం ఫ్లారిడాలో కేప్ కెనావెరల్ వద్ద
జరుగుతుంటుంది.
ఆ ట్రాన్స్ పోర్టర్ యంత్రాంగంలో మూడు పెద్ద పెద్ద వలయాలు ఉంటాయి.
వాటిలో అత్యధిక స్థాయిలో కరెంటు ప్రవహిస్తుంటుంది. అందువల్ల వాటి మధ్య తీవ్రమైన అయస్కాంత
క్షేత్రం ఉత్పన్నం అవుతుంది. ఆ క్షేతం లోంచి పడేలా ట్రాన్స్పోర్టర్ ని పై నుండి కింద పడేస్తారంతే! తార నుండి వచ్చిన సందేశంలో
మరి సరిగ్గా అలాగే ఆదేశాలు వున్నాయి. అలా కిందకి వదిలేసిన ట్రాన్స్పోర్టర్ గతి ఏమవుతుందో
– అది అంతరిక్షంలోకి దూసుకుపోతుందో, లేక ఊరికే ఏట్లో పడిపోతుందో… కచ్చితంగా ఏం జరుగుతుందో
ఎవరికీ తెలీదు. రకరకాల ఊహాగానాలు మాత్రం నడుస్తుంటాయి.
ఒక పక్క నిర్మాణం కొనసాగుతుండగా మీడియా ఈ వ్యవహారం గురించి
హోరెత్తిస్తూ ఉంటుంది. ప్రజలలో ఒక వర్గంలో,
ముఖ్యంగా మత ఛాందస వాదులలో ఈ వ్యవహారం పట్ల క్రమంగా ప్రతికూలత పెరుగుతూ ఉంటుంది. తార
నుండి వచ్చిన సందేశం ‘దేవుడి సందేశం’ అన్నట్టుగా ఆ వర్గం వారు ప్రచారం చేస్తుంటారు.
కనుక ఆ సందేశం ప్రకారం నౌకని నిర్మించి దేవుడి వద్దకి వెళ్లే ప్రయత్నం మత విరుద్ధం
అన్న అంశం మీద వీళ్లు నిరసన వ్యక్తం చేస్తుంటారు.
మతఛాందసులని పట్టించుకోకుండా ప్రభుత్వం నౌకా నిర్మాణం కొనసాగిస్తుంటుంది.
అది నచ్చని మతఛాందస వాదం తీవ్రవాదానికి దిగుతుంది. ఆ వర్గంలో ఒకడు రహస్యంగా నిర్మాణదశలో
వున్న నౌక లోకి ప్రవేశించి బాంబులతో దాన్ని పేల్చేస్తాడు. ఆ ప్రమాదంలో నౌకా నిర్మాణాన్ని
పర్యవేక్షిస్తున్న డ్రమ్లిన్ మరణిస్తాడు.
ఈ హఠాత్పరిమాణంతో ఎల్లీ ప్రపంచం పూర్తిగా తల క్రిందులవుతుంది.
(ఇంకా వుంది)
Fantastic conversion.Very very nice.
Thank you Anonymous garu. Have you seen the movie?