ఈ భూతహస్తాల గురించి పుక్కిటి పురాణాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కొన్ని కథలలో వాస్తవానికి తగు మోతాదులో ఊహాగానం జోడించడం జరిగిందేమో అనిపిస్తుంది. అలాంటిదే ఓ వృత్తాంతం కొంచెం అవాస్తవికంగా అనిపించినా ఆసక్తికరంగా ఉంటుంది.
చెయ్యి తీసేసిన ఓ వ్యక్తికి చాలా మందిలో లాగానే భూహస్తపు అనుభూతి మొదలయ్యింది. కాని చిత్రం ఏంటంటే ఆ భూతహస్తాన్ని ఏదో కొరుకుతున్న, దొలిచేస్తున్న భావన కూడా కలిగేదట. ఆ వ్యక్తి బెంబేలు పడి డాక్టర్ ని సంప్రదించాడట. డాక్టర్ కి ఈ విడ్డూరం ఏంటో అర్థం కాలేదు. ఇంతలో రోగికే ఓ ఆలోచన వచ్చి అడిగాడట, "ఇంతకీ తీసేసిన నా చెయ్యి ఎక్కడుంది డాక్టర్?" అని.
"నాక్కూడా తెలీదు బాబూ. సర్జన్ అని అడగాలి," అన్నాట్ట డాక్టర్.
అతగాడు వెళ్లి సర్జన్ ని అడిగితే "మామూలుగా ఇలా తీసేసిన అవయవాలని మార్చురీ కి పంపిస్తామే" అన్నాట్ట ఆయన.
కనుక ఆ వ్యక్తి వెళ్లి మార్చురీలో పని చేసే వ్యక్తిని అడిగాట్ట, "నా తీసేసిన చేతిని ఏం చేశారు?" అని.
"మామూలుగా అయితే అంగనాశని (incinerator) లో పడేస్తాం, లేదా పెథాలజీ విభాగానికి విశ్లేషణకి పంపిస్తాం," అన్నాట్ట మార్చురీ అధికారి.
ఆ వ్యక్తి అలాగే పెథాలజీ విభాగానికి ఫోన్ చేసి "నా చెయ్యి ఎక్కడుంది?" అని అడిగాడు.
"ఈ మధ్య అవయవాలు మరీ ఎక్కువ రావడంతో స్థలం లేక, తోటలో పాతిపెట్టాం!" అన్నాట్ట పెథాలజీలో పని చేసే వ్యక్తి. ఇద్దరూ చేతిని పాతిపెట్టిన చోటకి
వెళ్ళి తవ్వి చూశారట. అక్కడ పేడపురుగులు దొలిచేస్తూ కనిపించిందట అతడి చేయి!
"బహుశా అందుకే నా చేతిని ఏదో దొలిచేస్తున్న అనుభూతి కలిగిందేమో" అనుకున్నాట్ట ఆ వ్యక్తి.
తరువాత ఆ చేతిని బయటికి తీసి అవయవనాశిని లో వేసి పూర్తిగా నాశనం చేశాకనే చేతిని దొలిచేస్తున్న అనుభూతి మాయమయ్యిందట!
పై వృత్తాంతం ఊరికే రాత్రి పూట పిల్లల్ని భయపెట్టడానికి పనికొచ్చే కథలా బాగానే ఉంటుందేమో గాని, అలాంటి కథలు శాస్త్రీయ పరిశోధనకి పెద్దగా పనికిరావు. వాటికి బదులుగా డా. రామచంద్రన్ తన క్లినిక్ లో చూసిన పేషెంట్ ల వృత్తాంతాలు మరీ అంత విపరీతంగా లేకపోయినా, వాటి నుండి ఎంతో నేర్చుకోవచ్చు.
ఉదాహరణకి డా. రామచంద్రన్ ని స్వయంగా సంప్రదించడానికి వచ్చిన, భూతహస్తం గల, ఓ వ్యక్తి సంగతి చూద్దాం. ఈమెకి పుట్టకతోనే చేతులు లేవు. భుజంలో ఉండే హ్యూమరస్ అనే ఎముకలో సగం మాత్రమే ఉంది. మోచేతి నుండి మణికట్టు వరకు ఉండే రేడియస్, అల్నా ఎముకలు అసలే లేవు. ఈమె కృత్రిమ చేతులు వాడుతుంది. వచ్చీ రావడంతోనే ఆమె రామచంద్రన్ ని సూటిగా అడిగింది:
"చూడండి డాక్టర్! మీరు ఏమి అడగాలని అనుకుంటున్నారో నాకు తెలుసు. నాకు భూతహస్తం ఉందో లేదో మీకు తెలుసుకోవాలనుంది. అంతేగా?"
"అవును, నిజమే. ఈ భూతహస్తం మీద మేము చాలా ప్రయోగాలు చేస్తున్నాం. వాటి గురించి..." ఆమె సూటిగా అడిగేసరికి ఏం అనాలో తెలీక కొంచెం తడబడ్డాడు డాక్టర్.
"సరే అయితే. ఇదుగోండి. నాకు చిన్నప్పట్నుంచి చేతుల్లేవు. నాకు తెలిసిన దగ్గర్నుండి ఇవే నా చేతులు," అంటూ తన కృత్రిమ చేతులని తీసి బల్ల మీద పెట్టింది. "అయినా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు భూతహస్తాలని అనుభూతి చెందుతున్నాను."
"మీకు నిజంగా భూతహస్తాలు ఉన్నాయని ఏంటి నమ్మకం?" తిరిగి అడిగాడు డాక్టర్.
"ఏంటంటే ఇదుగో నేను మీతో మాట్లాడుతుంటే అవి కదులుతున్నాయి. నేను ఏదైనా వస్తువుని చూబిస్తుంటే అవి ఆ వస్తువు దిక్కుగా వేలితో చూబిస్తున్నాయి. మరో విషయం డాక్టర్ ..." ఆగి మళ్లీ తనే అంది.
"వీటి గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. నా చేతులు మామూలుగా ఉండాల్సిన దాని కన్నా పొట్టిగా ఉన్నాయి. అసలికైతే నా భూతహస్తపు వేళ్లు ఈ కృత్రిమ హస్తంలో సరిగ్గా ఒక గ్లోవ్ లో లాగా ఇమిడిపోవాలి. కాని నా భుజం ఆరు అంగుళాలు పొట్టి. కనుక ఈ కృత్రిమ హస్తం అంత సహజంగా అనిపించదు. చికాగ్గా ఉంటుంది. కృత్రిమ హస్తాలు చేసే ప్రోస్తెటిస్ట్ ని చేతులు కొంచెం పొట్టిగా చెయ్యమంటాను. మరీ అంత పొట్టిగా ఉంటే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుందన్నాడు. కనుక మధ్యేమార్గంగా మామూలుగా కన్నా కొంచెం చిన్నగా ఉండే చేతులు చేసిచ్చాడు."
పై వృత్తాంతం బట్టి ఈ భూహస్తాల అనుభూతి ఎంత సజీవంగా, వాస్తవంగా ఉంటుందో తెలుస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఈ అదృశ్య హస్తాలలో ఎన్నో సార్లు విపరీతమైన నొప్పి కూడా అనుభవమవుతుంది. దీని గురించి తెలుసుకోవడం వైద్యరంగంలో ఓ పెద్ద సవాలుగా పరిణమించింది.
(సశేషం...)
0 comments