"మామయ్యా, నిజంగా మనం బయలుదేరుతున్నామా?"
"ఇంకా సందేహం ఎందుకు అల్లుడూ?"
"సందేహించడం లేదు. కాని ఇంత తొందర ఏం వచ్చింది అని అడుగుతున్నాను."
"కాలం మనకోసం ఆగదు అల్లుడూ. ప్రచండ వేగంతో ముందుకు దూసుకుపోతోంది."
"కాని ఇది ఇంకా మే 16 మాత్రమే. జూన్ చివరికి ఇంకా చాలా దూరం ఉంది..."
"నీకేమైనా మతి పోయిందా? ఐస్లాండ్ ఏవైనా పక్కనుందా, రెండు రోజుల్లో పరుగెత్తి చేరుకోవడానికి? నువ్వు నిన్న ఠక్కున మాయం కాకుండా ఉండి ఉంటే నిన్ను కూడా నాతో కోపెన్హాగెన్ లో ఉన్న లిఫ్ఫెండర్ అండ్ కో ఆఫీస్ కి తీసుకేళ్లే వాణ్ణి. కోపెన్హాగెన్ నుండి రెయిక్ జావిక్ కి ప్రతీ నెలా 22 వతారీఖున
మాత్రమే నెలకో సర్వీసు ఉందని నువ్వే స్వయంగా తెలుసుకుని ఉండేవాడివి."
"అయితే ఇప్పుడేంటట?"
"అయితే ఏంటీ అంటావా? జూన్ 22 దాకా ఆగితే మరీ ఆలస్యం అయిపోతుంది. స్కార్టారిస్ శిఖరం యొక్క నీడ స్నెఫెల్స్ అగ్నిబిలం మీద పడే దృశ్యాన్ని మనం చూడలేం. కనుక వీలైనంత త్వరగా కోపెన్హాగెన్ ని చేరుకోవాలి. పద. వెళ్లి సామాను సర్దుకో."
దీనికిక సమాధానం చెప్పలేక పోయాను. మేడ మీద నా గదికి వెళ్లాను. గ్రౌబెన్ కూడా నా వెనక వచ్చింది. యాత్రకి కావలసిన వస్తువులన్నీ తనే జాగ్రత్తగా సర్దింది. తనసలు ఏమీ చలించినట్టు కనిపించడం లేదు. నేను దరిదాపుల్లో ఉన్న ఏ లుబెక్ కో, హెలిగోలాండ్ లో బయల్దేరితే ఎంత మామూలుగా ఉంటుందో అలాగే ఉంది. ఉద్విగ్నతతో చేతులు వణకడం లేదు. యథాలాపంగా తమ పని చేసుకుపోతున్నాయి. మాటలో తడబాటు లేదు. పైగా ఆ యాత్ర ఎందుకంత ముఖ్యమో కారణాలు వివరిస్తోంది! తను పక్కనే ఉన్నందుకు ఒక పక్క సంతోషంగానే ఉన్నా తన పనులకి, పట్టుదలకి కోపం వస్తోంది. నాలో ఏ క్షణామైనా అగ్నిపర్వతం బద్దలయ్యేలా ఉంది. కాని ఆమె నిర్లక్ష్య వైఖరి చూసి బావుండదని పాపం ఆ అగ్నిపర్వతం బద్దలయ్యే ఉద్దేశం మానుకుంది.
సామానంతా సిద్ధం అయ్యింది. నేను మెట్లు దిగి కిందకి వచ్చాను. రోజంతే ఎవరో సాంకేతిక నిపుణులు, ఎలక్ట్రీషియన్లు మొదలైన వాళ్లు తీర్థప్రజగా వస్తూనే ఉన్నారు. మార్తాకి ఇదంతా చాలా చికాకుగా ఉంది.
"అయ్యాగారికి ఏవైనా పిచ్చెక్కిందా?" నన్ను పక్కకి పిలిచి రహస్యంగా అడిగింది.
అవునన్నట్టు తలూపాను.
"నిన్ను కూడా తనతో తీసుకెళ్తున్నారటగా?" మళ్లీ అడిగింది.
మళ్లీ తలాడించాను.
"ఎక్కడికో?"
వేలితో కిందకి చూబించాను.
"అయ్యో నేలమాళిగ లోకా?" ఆశ్చర్యంగా అడిగింది మార్తా.
"కాదు. ఇంకా కిందకి," కొంచెం బాధగా అన్నాను.
చీకటి పడింది. సమయం ఎంతయ్యిందో తెలుసుకోవాలన్న్ ఉత్సాహం కూడా చచ్చిపోయింది. ఆ రాత్రంతా ఏవేవో భయాలు నన్ను వేధించాయి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి అగాధాలలో చిక్కుకుపోయినట్టు పీడకలలు. ప్రొఫెసర్ మామయ్య నన్ను పట్టుకుని ఏవో రహస్య సొరంగ మార్గాల వెంట బిరబిర ఈడ్చుకుపోతున్నాట్ట. ఉల్కలా నిస్సహాయంగా ప్రచండ వేగంతో కింద పడిపోతున్నానట. నా బతుకే రాలిపోతోంది, కాలిపోతోంది. ఇలాంటి యాతనామయ రాత్రికి అంతంలో ఐదు గంటలకి ఠక్కున తెలివి వచ్చింది. ఒళ్లంతా నిస్సత్తువ ఆవరించింది. మెల్లగా కాళ్లీడ్చుకుంటూ కిందకి దిగాను. మామయ్య అప్పటికే ఆవురావురని టిఫిన్ చేస్తున్నాడు. ఆయన్ని చూస్తే ఒళ్లు మండిపోయింది. పక్కనే గ్రౌబెన్ కూడా ఉంది. కనుక ఏమీ అనలేకపోయాను. కాని ఆకలి లేదు. ఏమీ తినలేకపోయాను.
ఐదున్నరకి బయట బండి చక్రాల చప్పుడు వినిపించింది. ఓ పెద్ద గుర్రపు బగ్గీ ఇంటి ముందు ఆగింది. ఆల్టోనియా స్టేషన్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. మా మామయ్య సిద్ధం చేసిన నానా విధ విచిత్ర వస్తుసంజాతం అంతా బండి లోకి ఎక్కించబడింది.
"ఇంతకీ నే పెట్టేది?" నా వైపు చూసి ఓ సారి కేకేశాడు.
"ఇదుగో ఇక్కడే ఉంది," అన్నాను కాస్త తడబడుతూ.
"అయితే మరి తొందరగా కదులు. లేకపోతే రైలు అందదు."
విధికి ఎదురొడ్డి పోరాడడం ఇంక అనవసరం అనుకున్నాను. పైకి నా గదికి వెళ్లి నా పెద్ద "పోర్ట్ మాంటో" ని దొర్లించుకుంటూ కిందికి దిగి వచ్చాను.
మామయ్య గ్రౌబెన్ కి బాధ్యతలు అప్పగించే కార్యక్రమంలో ఉన్నాడు. నా ప్రేయసి మాత్రం నిమ్మకి నీరెత్తి నట్టు హాయిగా ఉందనిపించింది. మామయ్యకి వీడ్కోలు చెప్పి, నా దగ్గరికి వచ్చి సున్నితంగా నా బుగ్గలకి తన పెదాలని తాకించింది. ఆ క్షణం మాత్రం తన కళ్ల నుండి రెండు బొట్లు రాలడం చూసి మనసు ద్రవించి పోయింది.
"గ్రౌబెన్..." ఆవేదనగా అన్నాను.
"వెళ్లు ఏక్సెల్ వెళ్లు! నేను నీ దాన్ని, ఎప్పటికీ నీకే చెందిన దాన్ని. విజయుడివై తిరిగొచ్చి నన్ను పూర్తిగా సొంతం చేసుకో."
తనని ఒకసారి నా బాహువుల్లోకి తీసుకున్నాను. మౌనంగా వెళ్లి బండి ఎక్కి కూర్చున్నాను. మార్తా, గ్రౌబెన్ లు ద్వారం వద్ద నించుని మాకు వీడ్కోలు చెప్పారు. డ్రైవర్ అదిలించగానే గుర్రాలలో చలనం వచ్చింది. కాసేఫట్లోనే మా బండి ఆల్టోనియా కి వెళ్లే దారి వెంట దూసుకుపోసాగింది.
(అధ్యాయం 7 సమాప్తం)
0 comments