మామూలుగా ఈ దేహభావన అంతో ఇంతో స్థిరంగానే ఉన్నా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అది విరూపం చెందే అవకాశం ఉంది. ఉదాహరణకి ప్రమాదంలోనో, యుద్ధం లోనో, శస్త్రచికిత్స వల్లనో కాళ్లు చేతులు కోల్పోయిన వారిలో ఈ దేహభావన విచిత్రంగా మార్పు చెందుతుంది. పోయిన అంగం ఇంకా ఉన్న భ్రమ మిగిలి ఆ వ్యక్తిని తెగ ఇబ్బంది పెడుతుంది. చేతిని పోగొట్టున వ్యక్తి ఆ లేని చేతితో "తలుపులు తెరవడం," వీడ్కోలుగా "టాటా చెప్పడం", బోరు కొట్టినప్పుడు బల్ల మీద "డప్పు వాయించడం" మొదలైనవి చెయ్యడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలా వాస్తవంలో చెయ్యి లేకపోయినా, చెయ్యి ఉన్నట్టుగా కలిగే సజీవమైన, భావనకే ఆధునిక నాడీశాస్త్రంలో "భూత హస్తం" (phantom limb) అని పేరు.
ఈ భూత హస్తం గురించిన ప్రప్రథమ కథనాలలో ఒకటి మనకి నెపోలియన్ ని ఓడించిన బ్రిటిష్ నౌకాదళాధికారి లార్డ్ నెల్సన్ జీవితంలో కనిపిస్తుంది. యుద్ధంలో నెల్సన్ కి చెయ్యి పోయింది. కాని ఆ అవిటి చేతి నుండి పొడుచుకు వచ్చినట్టు ఓ అదృశ్య హస్తం ఉన్న భావన ఉంటూనే ఉండేది. ఈ అదృశ్య హస్త "ఆత్మ యొక్క అస్తిత్వాన్ని నిరూపిస్తోంది" అని భావించేవాడు నెల్సన్.
అమెరికాలో అంతర్యుద్ధం జరుగుతున్న కాలంలో ఫిలాడెల్ఫియా నగరంలో సైలాస్ వియర్ మిచెల్ అనే డాక్టరు ఉండేవాడు. ఈ భూతహస్తం (phantom limb) అన్న మాటని ప్రతిపాదించింది మొదట ఇతడే. అప్పటికి ఇంకా ఆంటీ బయాటిక్ లు లేవు. యుద్ధంలో గాయాలు తగిలి, ఇన్ఫెక్ట్ అయిన చేతులు, కాళ్లని తీసేయడం పరిపాటిగా జరుగుతుండేది. ఆ విధంగా అవిటి వాళ్లయిన వాళ్లలో చాలా మందిలో ఈ భూత హస్తం, లేక భూతపాదం ఉన్న భావన ఉండేది. వాస్తవంలో లేని అవయవం ఇలా కదలడం, పనులు చెయ్యడం వాళ్లకి చాలా ఇబ్బంది కలిగించేది. అది చాలదన్నట్టు ఆ భూతహస్తంలో తరచు చెప్పలేనంత నొప్పి కూడా అనుభవమయ్యేది. కనుక ఈ భూతహస్తం అన్నది ఓ జటిలమైన వైద్యసమస్య అయ్యింది.
ఈ భూత హస్తం గాని, భూత పాదం గాని ఎందుకు ఏర్పడుతుంది అన్న విషయం గురించి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ఒకటి "తీరని కోర్కెల సిద్ధాంతం." చేయి పోగొట్టున్న వారిలో ఆ చేయి ఉంటే బావుంటుందన్న గాఢమైన కోరిక ఉంటుంది. కాని అది తీరనందున ఆ కోర్కె మరింత బలమై, గాఢమైన ఊహగా మారి అలాంటి భావన కలుగజేస్తుందని ఈ సిద్ధాంతం యొక్క వాదన.
మరో సిద్ధాంతం యొక్క వాదన ఇలా ఉంటుంది. చేయి పరిచ్ఛేదించబడ్డ చోట నాడులు ఖండించబడుతాయి. తెగిన ఈ నాడుల కొసల వద్ద గాయం కావడం వల్ల ఆ చుట్టుపక్కల నాడీ ధాతువు దెబ్బతిని అసహజమైన రీతిలో కాన్సర్ ధాతువు మాదిరిగా వృద్ధి చెందుతుంది. అలాంటి నాడీ ధాతువునే ’న్యూరోమా’ అంటారు. ఇలా దెబ్బ తిన్న నాడుల కొసల వద్ద ఉన్న న్యూరోమాలు స్వచ్ఛందంగా ఆ నాడుల వెంట మెదడుకి కృతక సంకేతాలు పంపిస్తుంటాయి. ఆ సంకేతాలని అందుకున్న మెదడు ఆ సంకేతాలు చేతి నుండి వస్తున్నాయన్న భ్రమకి లోనవుతుంది. ఇదీ సిద్ధాంతం.
ఈ సిద్ధాంతంలోని తర్కాన్ని మనం ఒప్పుకుంటే, దానికి చికిత్స న్యూరోమాలని తొలగించడమే అవుతుంది. అలాగే చేసి చూశారు గాని ఏమీ కాలేదు. తెగిన నాడి కొసని మరి కొంత పైకి కోసి చూశారు. ఫలితం లేదు. అవిటి చేతి మరి కొంచెం పైకి కోసి చూశారు. ఫలితం లేదు. భుజం వరకు తెగనరుక్కు పోయారు. ఫలితం లేదు. చేతుల నుండి సంకేతాలని మోసుకు పోయే నాడులు భుజాలని దాటి వెన్నుపూస లోకి ప్రవేశిస్తాయి. ఆ నాడులు వెన్నుపూసలోకి ప్రవేశించే ముఖద్వారం వద్ద నాడులని కోసి చేశారు. ఫలితం లేదు. ఇంకా పైనున్న మెదడుకి సమాచారం అందకుండా వెన్ను పూసనే కోసి చూశారు. ఇన్ని చేసినా ఫలితం లేదు. భూతహస్తం చెక్కుచెదరలేదు. దాంతో పాటూ కలిగే నొప్పి కూడా మాయం కాలేదు.
ఉన్న చేతిలో కలిగే నొప్పిని పోగొట్టడమే ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఇక లేని చేతిలో నొప్పిని పోగొట్టేదెలా? అసలింతకీ ఈ భూతహస్తం అంటే ఏంటి? అది ఎక్కడుంది? నిజంగా ఉన్నట్టా లేనట్టా? ఈ సమస్య గురించి చెన్నై లో పుట్టి పెరిగి, ప్రస్తుతం అమెరికాలో ’సాన్ డియాగో’ లో పని చేస్తున్న నాడీశాస్త్రవేత్త డా. వి.యస్. రామచంద్రన్ ఎంతో పరిశోధించి, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనుక్కున్నారు.
(సశేషం...)
chala asakti karanga undi, inka rayandi
Super concept..nice explanation.