క్రిందటి పోస్ట్ లో మన పాలపుంతకి ఉపగెలాక్సీల సంగతి చూశాం. వాటిలో మెగలానిక్ మేఘాలు నిజంగా ఉపగెలాక్సీలు కావని, దరిదాపుల్లో ఉన్న పొరుగు గెలాక్సీలని కూడా చెప్పుకున్నాం.
మనకి దరిదాపుల్లో ఉన్న గెలాక్సీలలో అతి పెద్ద గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీ.
చార్లెస్ మెసియర్ అనే ఖగోళశాస్త్రవేత్త గోళాకార రాశులకి (globular clusters) పేర్లు పెట్టాడని ముందు చెప్పుకున్నాం. తన పేరు మీదే వాటికి M1, M2,.. ఇలా వరుసగా పేర్లు పెట్టడం జరిగింది. ఆ నామకరణ కార్యక్రమంలోనే ఆయన 1764 లో ఒక గోళాకార రాశికి M31 అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. అయితే ఆ తారారాశిని చాలా కాలం క్రితమే క్రీ.శ. 964 లో పెర్షియన్ ఖగోళశాస్త్రవేత్త అబ్దుల్ అల్ సూఫీ గుర్తించినట్టు ’స్థిర తారల పుస్తకం’ (Book of Fixed Stars) అనే తన పుస్తకంలో రాసుకున్నాడు. అల్ సూఫీ ఆ తారారాశిని ’చిన్ని మేఘం’ అని పిలుచుకున్నాడు.
1887 లో ఇంగ్లండ్ కి చెందిన ఐసాక్ రాబర్ట్స్ అనే ఖగోళశాస్త్రవేత్త తన సొంత వేధశాల (observatory) నుండి ఈ M31 ని పరిశీలించి ఫోటోలు తీశాడు. ఆ ఫోటోల బట్టి ఆ తారారాశికి సర్పిలాకార నిర్మాణం ఉందని అర్థమయ్యింది. అయితే అది మన గెలాక్సీలోనే ఉన్న ఓ తారా నీహారిక (nebula) అని అనుకున్నాడు.
అది తారానీహారిక కాదు
అయితే అది "చిన్ని మేఘమూ" కాదు, గోళాకార రాశీ కాదు, తారానీహారికా కాదు. మన గెలాక్సీని తలదన్నేటంత పెద్ద రాకాసి గెలాక్సీ అన్న గుర్తింపు గత శతాబ్దంలోనే పెరిగింది.
1917లో హెర్బర్ట్ కర్టిస్ అనే ఖగోళ శాస్త్రవేత్త మరింత మెరుగైన పద్ధతులతో M31 ని పరిశీలించి అది అంత వరకు అనుకున్న దాని కన్నా చాలా దూరంలో ఉందని తెలుసుకున్నాడు. మన నుండి M31 దూరం కనీసం 5,00,000 కాంతిసంవత్సరాలు ఉంటుందని అతడి అంచనా. అంటే మన పాలపుంత వ్యాసానికి ఐదు రెట్ల దూరంలో ఉందన్నమాట! కచ్చితంగా అది మన పాలపుంతలో భాగం కాలేదు. అంత దూరంలో ఉన్న ఈ సర్పిలాకార తారానీహారికలు నిజానికి మనకి ఎంతో దూరంలో ఉన్న పెద్ద పెద్ద గెలాక్సీలు అని, వాటిని అసలు "ద్వీప విశ్వాలు" గా ఊహించుకోవచ్చని వాదించాడు కర్టిస్.
తదనంతరం 1925 లో ఎడ్విన్ హబుల్ మరింత శక్తివంతమైన 100 ఇంచిల దూరదర్శినితో చేసిన పరిశీలనల పుణ్యమా అని, అంతవరకు M31 అనుకున్నది కేవలం తారా నీహారిక కాదని, పాలపుంతకి బయటగా ఉన్న ఓ స్వతంత్ర గెలాక్సీ అని రూఢి అయ్యింది. దానికి ఆండ్రోమెడా గెలాక్సీ అని పేరు పెట్టారు.
ఇటీవలి పరిశీలనలు
క్రమంగా ఇరవయ్యవ శతాబ్దంలోనే ఆండ్రోమెడా గెలాక్సీ గురించి సమాచారం, అవగాహన వృద్ధి చెందసాగింది. ఇటీవలి కాలంలో జరిగిన పరిశీలనలు గతంలో జరిగిన పరిశీలనలని మరింత నిర్దుష్టం చేశాయి. 2001 లో జరిగిన కొలతల వల్ల మన నుండి ఆండ్రోమెడా గెలాక్సీ దూరం 2.5 మిలియన్
(25,00,000) కాంతిసంవత్సరాలు అని తేలింది. మన పాలపుంత లాగానే ఆండ్రోమెడా కూడా ఓ సర్పిలాకార గెలాక్సీ. దాని వ్యాసం 2,20,000 కాంతి సంవత్సరాలు. అంటే పాల పుంత కన్నా రెండింతలు పెద్దది అన్నమాట! మన గెలాక్సీ లాగానే ఇది కూడా తన కేంద్రం చూట్టూ పరిభ్రమిస్తుంది. కేంద్రానికి దగ్గర్లో ఉన్న తారలు మరింత వేగంగాను, దూరంగా ఉన్న తారలు ఇంకా నెమ్మదిగాను కదులుతాయి.
భవిష్యత్తులో దుర్ఘటనా?
ఆండ్రోమెడా గురించిన ఇబ్బందికరమైన సత్యం (అది మీకు నాకు కాదనుకోండి!) ఒకటుంది.
సామాన్యంగా గెలాక్సీలు మన నుండి దూరంగా జరుగుతూ ఉంటాయి. దూరంగా ఉన్న గెలాక్సీలు మరింత ఎక్కువ వేగంతో మన నుండి దూరం అవుతుంటాయి. ఇలా దూరం ఎక్కువవుతున్న కొలది, సాపేక్ష వేగం కూడా ఎక్కువ కావడాన్నే హబుల్ నియమం అంటారు. దాన్ని బట్టి మన విశ్వం వ్యాకోచిస్తోందని అర్థమవుతుంది. అయితే ఆండ్రోమెడా గెలాక్సీ దూరంగా జరక్కపోగా మన గెలాక్సీ దిక్కుగా 100 -140 km per sec వేగంతో దూసుకొస్తోంది. మరో 2.5 బిలియన్ (2,500 000 000) సంవత్సరాలకి ఈ రెండు మహా గెలాక్సీలు ఢీకొంటాయి. ఆ పరిణామం జరిగినప్పుడు, భూమి, సౌరమండలాల రాత ఎలా ఉందో ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. పరిస్థితులు విషమించినప్పుడు నాయకులు పార్టీలు మార్చినట్టు, ఆ సన్నివేశంలో సౌరమండలం పాలపుంతని విడిచి, ఆండ్రోమెడాలో కలిసిపోవచ్చని ఓ సిద్ధాంతం ఉంది.
(సశేషం...)
http://en.wikipedia.org/wiki/Andromeda_Galaxy
0 comments