ముందు చెక్కిలి తాకి "ఏం అనిపిస్తోంది" అని అడిగారు.
"మీరు నా బుగ్గని తాకుతున్నారు" అన్నాడు టామ్.
"ఇంకేవైనా అనిపిస్తోందా?"
"అదీ... మీకు కొంచెం చిత్రంగా అనిపించొచ్చు. మీరు నా భూతహస్తపు బొటన వేలిని తాకుతున్నట్టు అనిపిస్తోంది."
ఈ సారి Q-tipతో టామ్ పై పెదవి ని తాకారు.
"మీరు నా భూతహస్తపు చూపుడు వేలిని తాకుతున్నారు. అలాగే నా పైపెదవిని కూడా తాకుతున్నారు."
"బాగా ఆలోచించి చెప్పు," నిర్ధారణ కోసం అడిగారు.
"నిజంగానే. మీరు రెండు చోట్లా తాకుతున్నారు."
"మరి ఇప్పుడో?" అంటూ టామ్ కింద దవడని Q-tip తో తాకారు.
"అది నా చిటికెన వేలు," అన్నాడు టామ్.
అలా అతి సామాన్యమైన ప్రయోగం చేసి ఓ అధ్బుతమైన విషయాన్ని కనుక్కున్నారు డా. రామచంద్రన్. మొత్తం చేతి యొక్క మ్యాప్ ముఖం మీద కనిపించింది. సొమటో సెన్సరీ మ్యాప్ లో ముఖ ప్రాంతం, పోయిన చేతికి సంబంధించిన ప్రాంతాన్ని ఆక్రమించుకుంది అన్నమాట!
దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే మన దేహభావన మన సొమటో సెన్సరీ మ్యాప్ ల అమరిక మీద ఆధారపడి ఉంటుంది. మ్యాపులో ఏ ప్రాంతం ఉత్తేజితం అవుతుంది అన్నదాన్ని బట్టి శరీరంలో ఏ భాగం తాకబడుతోందో తెలుస్తుంది. ఉదాహరణకి కుడి చేతిని తాకినప్పుడు, మ్యాపులో కుడి చేతికి సంబంధించిన భాగం ఉత్తేజితం అవుతుంది. దీన్ని మరో విధంగా చెప్పాలంటే మ్యాపులో కుడి చేతి ప్రాంతం ఉత్తేజితం అయినప్పుడు, కుడి చెయ్యి తాకబడుతున్న అనుభూతి కలుగుతుంది. కాని కొన్ని అసాధారణ పరిస్థితుల్లో, మ్యాపులో వచ్చిన దోషాల వల్ల, మ్యాపులో అసహజంగా కొన్ని ప్రాంతాలు ఉత్తేజితం అయితే, ఏమీ లేకున్నా శరీరాన్ని ఎవరో తాకుతున్న అనుభూతి కలగొచ్చు! మ్యాపులో ఒక ప్రాంతం దెబ్బ తిన్నప్పుడు, దాని పొరుగు ప్రాంతాలు దాని క్రియలని చేపట్టి, దెబ్బ తిన్న ప్రాంతాలని ఆక్రమించుకుంటాయి. మ్యాపులో అలా కలిగిన దొషాల వల్ల మన దేహభావనలో మౌలిక మార్పులు రావచ్చు.
చిన్న ప్రయోగాలతో కూడా మన దేహభావనని ఎలా చెదరగొట్టొచ్చో ఈ ప్రయోగం వల్ల తెలుస్తుంది. ఈ ప్రయోగంలో అవతలి వాడి ముక్కు, మీ ముక్కు ఒక్కటే నన్న బలమైన భ్రాంతి కలుగుతుంది!
ముక్కు ప్రయోగం:
ఈ ప్రయోగంలో మీ స్నేహితులు ఇద్దర్ని కూడా పాల్గొనమని ఆహ్వానించండి. మీరు ఒక కుర్చీలో కూర్చుని మీ నేస్తాన్ని (ఈ వ్యక్తిని మొదటి నేస్తం అనుకుందాం) మీ ముందు మరో కుర్చీలో కూర్చోమని అడగండి. ఇద్దరూ (ఇద్దరి కుర్చీలు కూడా) ఒకే దిశలో తిరిగి ఉండాలి. ఇప్పుడు మీ రెండవ నేస్తాన్ని ఓ చిన్న పని చెయ్యమనాలి. ఆ రెండవ నేస్తం మీ కుడి చేతి చూపుడు వేలిని తీసుకుని, (మీ ముందు అటు తిరిగి కూర్చున్న) మీ ఒకటవ నేస్తం యొక్క ముక్కుని నెమ్మదిగా లయబద్ధంగా పదే పదే తాకాలి. ఇప్పుడు మీ రెండవ నేస్తం తన చూపుడు వేలితో మీ ముక్కుని కూడా అదే విధంగా లయబద్ధంగా తాకుతూ రావాలి. ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ముక్కు తాకబడుతున్న తీరులోని లయ, మీ మొదటి నేస్తం యొక్క ముక్కు తాకబడుతున్న తీరులోని లయ సరిగ్గా ఒకే విధంగా ఉండాలి. ఇలా కొద్ది నిముషాలు చేస్తే మీ ముక్కు ఓ తొండంలా బారెడు అయిన అనుభూతి కలుగుతుంది.
దీనికి కారణం ఇలా వివరించొచ్చు. ఈ ప్రయోగంలో, మీ కుడి చేతి చూపుడు వేలికి అందుతున్న స్పర్శానుభూతి లోని లయ, మీ ముక్కుకి అందుతున్న స్పర్శానుభూతి లోని లయ రెండూ సరిగ్గా ఒకేలా ఉన్నాయి. (మామూలుగా మీ ముక్కుని మీరు మీ వేలితో లయబద్ధంగా తాకుతున్నప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది.) కనుక మెదడు ఆ రెండు స్పర్శానుభూతులూ ఒకే వస్తువు నుండి పుడుతున్నాయని భావిస్తుంది. అంటే చాచిన మీ చేయి తాకుతున్న వస్తువు మీ ముక్కేనని భ్రమిస్తుంది. మరి ముక్కు పొడవు పెరిగితేనే అది సాధ్యం అవుతుంది. కనుక మీ ముక్కు చాంతాడంత పెరిగినట్టు భ్రమిస్తుంది.
ఈ చిన్న ప్రయోగం వల్ల అనుభూతిలో మార్పుల వల్ల దేహభావనలో ఎలా మార్పులు కలుగుతాయో అర్థమవుతుంది. ఇలాంటి ప్రయోగాలు చూస్తుంటే, అసలు ప్రపంచం యొక్క మన అనుభూతి నిజమా అబద్ధమా అన్న సందేహం కలుగుతుంది. దేహభావనని మార్చగలిగినప్పుడు, అసలు పదార్థభావన, లేదా ప్రపంచభావనని కూడా మార్చగలమా? అవతలి వాడి ముక్కు, నా ముక్కే నన్న భావన కలిగించినప్పుడు, ఈ కుర్చీ, పుస్తకం, ఈ ద్వారం నాలో భాగాలు అన్న భావం కలుగజేయగలమా? ఈ ప్రశ్నలకి ఆధునిక నాడీ శాస్త్రంలో సిద్ధంగా సమాధానాలు లేవనే చెప్పాలి. ఇతర రంగాల లో లాగానే, నాడీశాస్త్రంలో కూడా సరిహద్దుల వద్ద సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువగా మనకి మిగులుతాయి.
(భూత హస్తాలకి సంబంధించిన మరో ముఖ్యమైన సమస్య వాటి వల్ల పుట్టే భరించరాని నొప్పి. ఈ సమస్య విషయంలో కూడా డా. రామచంద్రన్ ఓ అత్యంత సరళమైన ’అద్దపు పెట్టె’ ప్రయోగం ద్వారా ఆ నొప్పిని కొన్ని సందర్భాలలో తొలగించగలిగారు. అది మరో పెద్ద కథ. వీలు చూసుకుని, బ్లాగర్ల ఆసక్తి బట్టి దాన్ని మరో సారి పోస్ట్ చేస్తాను.)
Reference:
V.S. Ramachandran and Sandra Blakeslee, "Phantoms in the brain." Oliver Sacks, 1998.
0 comments