రెండు రోజుల క్రితం చంద్రయాన్ చంద్రుడి మీద నీటిని కనుక్కున్న విషయం గురించి టీవీ9 రిపోర్ట్ చేసింది. యాంకర్ ఎవరో ఆ వృత్తాంతం గురించి చాలా ఆసక్తికరంగా చెప్పింది. భవిష్యత్తులో చందమామ మీద స్థావరాలు ఏర్పరుచుకుంటే ఎలా ఉంటుంది మొదలైనవి చర్చించారు.
టీవీ చానెళ్లలో సైన్స్ రిపోర్టింగ్, ముఖ్యంగా ఇలా నాటకీయంగా, ఉత్సాహంగా సైన్స్ ని రిపోర్ట్ చేసే ఒరవడి ఇటీవలి కాలంలోనే కనిపిస్తున్నట్టుంది. తెలుగులో సైన్స్ రిపోర్టింగ్ యుగం నిస్సందేహంగా మొదలయ్యింది...
అయితే ఆ షోలో కొన్ని సాంకేతిక దోషాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక చోట "కొన్ని కోట్ల కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న మార్స్ వంటి గ్రహాలు..." అంటుంది యాంకర్. అది తప్పు. మరి నేను తప్పు విన్నానేమో నని కూడా నాకో సందేహం! అలాగే "ఒక కేజీ హీలియమ్ ఖరీదు కొన్ని కోట్లు ఉంటుంది" అంటుంది. అర్థంగాక నెట్ లో చూస్తే అది "హీలియం-౩ (ఐసోటోప్)" అని మామూలు హీలియం కాదని తెలిసింది.
చంద్రయాన్ చందమామ మీద మంచుని కనిపెట్టిన వృత్తాంతాన్ని గురించి క్లుప్తంగా...
--
గతంలో తెలిసిన దాని కన్నా చంద్రుడి గురించి మరింత భోగట్టా రాబట్టాలన్న ఉద్దేశంతో ఇస్రో పంపించిన వ్యోమనౌక చంద్రయాన్ ఈ ఏడాది ఆగస్ట్ లో అదుపుతప్పింది. దాంతో రెండేళ్ళు ఉంటుందనుకున్న మిషన్ పది నెలలలో అంతం కావాల్సి వచ్చింది. చందమామ మీద రాలిపడ్డ చంద్రయాన్ వ్యోమనౌక భారతీయ త్రివర్ణ పతాకాన్ని చంద్రుడి ఉపరితలం మీదకి చేర్చింది. ఆ విధంగా చంద్రుడి మీదకి జెండా చేర్చిన దేశాల్లో ఇండియా నాలుగవ దేశం అయ్యింది.
చందమామ మీద కూలిపోతున్న సమయంలో, 25 నిముషాల పాటు సాగిన అవరోహణా మార్గంలో, చంద్రయాన్ చంద్రుణ్ణి మరింత దగ్గర్నుండి ఎన్నో విలువైన చిత్రాలు తీసింది. ఆ చిత్రాల విశ్లేషణ బట్టి చంద్రుడి మీద నీరు ఉన్నట్టు స్పష్టంగా తెలిసింది.
1960 లలో అమీరికా కి చెందిన అపోలో మిషన్లు తెచ్చిన మట్టిని బట్టి చంద్రపదార్థం పూర్తిగా నిర్జలమైన, ఎండు పదార్థం అనుకున్నారు. కాని చంద్రయాన్ తీసిన చిత్రాలలో చందమామ నుండి ప్రతిబింబించబడ్డ కాంతిని విశ్లేషిస్తే అందులో నీటి అణువుల చేత గ్రహించబడే పరారుణ కిరణాలు లోపిస్తున్నట్టు తెలిసింది. అంటే చంద్రుడి మీద నీటి అణువులు ఉన్నాయన్నమాట.
చంద్రయాన్ లో వున్న, నాసా సరఫరా చేసిన, మూన్ మినరాలజీ మాపర్ (M3) అనే పరికరం ఆ సమాచారాన్ని సేకరించింది. కనుక ఈ ఘనతలో అమెరికా కూడా పాలుపంచుకుంటోంది.
"చంద్రుడి మీద నీరు అంటే సరస్సులు, సముద్రాలు ఊహించుకోకూడదు" అని హెచ్చరిస్తుంది యూ.ఎస్.ఏ.లో బ్రౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త కార్లె పీటర్స్. "చంద్రుడి ఉపరితలం మీద రెండు మిల్లీమీటర్ల పైపొరలో మాత్రం చిక్కుకున్న నీటి అణువులు, హైడ్రాక్సిల్ అణువులు గుర్తించబడ్డాయి." బ్రౌన్ విశ్వవిద్యాలయం, జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీతో కలిసి M3 ని తయారుచేసింది.
ఒక క్యూబిక్ మీటర్ మట్టిలో ఒక లీటర్ నీరు ఉందని అంచనా. అంత తక్కువ మోతాదులో ఉన్న నీటిని మట్టి నుండి ఎలా వెలికి తియ్యాలన్నదే ఇప్పుడు సమస్య.
"ఈ దశాబ్దంలోనే ఇదో అతిముఖ్యమైన ఆవిష్కరణ. మరో దశాబ్దకాలం వరకు ఇది అంతరిక్ష పర్యటన యొక్క తీరుతెన్నులని పూర్తిగా మార్చేస్తుంది," అని వ్యాఖ్యానించాడు చంద్రుడి మీద పరిశోధనలు జరిపే ఓ శాస్త్రవేత్త.
చంద్రుడి మీదకి నీరు ఎలా వచ్చింది/వస్తోంది?
అతి పలచనైన వాతావరణం గల చంద్రుడి మీద నీరు ఎలా ఉత్పన్నమవుతోంది అన్న ప్రశ్నకి శాస్త్రవేత్తలు ఒక వివరణ ఇస్తున్నారు. సూర్యుడి నుండి హైడ్రోజెన్ అయాన్లని మోసుకు వస్తున్న సౌరపవనాలు చంద్రుడి మట్టిలో ఉండే ఆక్సయిడ్లతో (ఐరన్, సిలికాన్ మొదలైన ఖనిజాలకి సంబంధించినవి) చర్య జరిపినప్పుడు, హైడ్రోజెన్ ఆ మట్టిలో ఉన్న ఆక్సిజన్ తో కలిసి నీరు ఉత్పన్నమవుతోంది అంటుంది ఈ సిద్ధాంతం.
వట్టి నీరే కాదు - అదనంగా హీలియం-౩
హైడ్రోజెన్ అయాన్లతో బాటు సూర్యుడి నుండి చంద్రుడికి కొట్టుకొచ్చే పదార్థంలో హీలియమ్-౩. చంద్రుడి మీద ఈ పదార్థం దొరికే ఎన్నో ప్రాంతాలని ఇస్రో గుర్తించింది. "ఈ విషయం మీద చంద్రయాన్-2 లో మరిన్ని వివరాలు సేకరిస్తాం," అంటున్నారు ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్.
చంద్రుడి మీద సమృద్ధిగా దొరుకుతుందని భావింపబడుతున్న ఈ హీలియమ్-3 భూమి మీద కేంద్రక సంయోగం (nuclear fusion) మీద పని చేసే రియాక్టర్లకి ఇంధనంగా కొన్ని వందల ఏళ్ల పాటు సరిపోతుందని అంచనా. ఉదాహరణకి ఒక్క స్పేస్ షటిల్ తేగల హీలియమ్-3 పదార్థం మొత్తం అమెరికా దేశానికి ఒక ఏడాది పాటు విద్యుత్ సరఫరా చెయ్యగలదట.
ఈ హీలియం-3 ఖరీదే కిలోకి 4 మిలియన్ డాలర్లు, అంటే ఇంచుమించు 19 కోట్ల రూపాయలు.
భవిషత్తులో పర్యవసానాలు:
- చంద్రుడి మీద నీరు పుష్కలంగా ఉంటే అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకోడానికి సౌకర్యంగా ఉంటుంది. అక్కడ మానవ నివాసానికి ఉపయోగపడుతుంది.
- నీరు ఉంటే చంద్రుడి మీద కొంత ప్రాథమిక వృక్ష సంపదని పెంచొచ్చు.
- చంద్రుడి మీద పుష్కలంగా దొరికే సౌరశక్తితో ఆ నీటిని భేదించి, హడ్రోజెన్ పుట్టించి, విద్యుత్తును, రాకెట్ ఇంధనాన్ని కూడా తయారుచెయ్యొచ్చు.
చంద్రుడి మీద స్థావరాలు ఏర్పడితే, అక్కడ నీరు, విద్యుత్తు, రాకెట్ ఇంధనం లభ్యమైతే, భవిష్యత్తులో చంద్రుణ్ణి దాటి ఇంకా దూరాలకి, పొరుగు గ్రహాలకి, ప్రయాణించే వ్యోమనౌకలకి చందమామ అనువైన మజిలీగా పనికొస్తుంది.
http://en.wikipedia.org/wiki/Chandrayaan-1
http://economictimes.indiatimes.com/ET-Cetera/Buoyant-Isro-eyes-moons-helium-to-meet-earths-energy-needs/articleshow/5059131.cms
0 comments