కిందటి పోస్ట్ లో మనం ఉంటున్న పాలపుంత గెలాక్సీ ఓ సర్పిలాకారపు గెలాక్సీ అని చెప్పుకున్నాం. పువ్వుల ఆకారాలలో తేడాలు ఉన్నట్టుగానే గెలాక్సీల ఆకారాలలో కూడా ఎంతో వైవిధ్యం ఉంటుంది. గెలాక్సీలలో కొన్ని ముఖ్యమైన ఆకార భేదాలు:
1) సర్పిలాకార గెలాక్సీలు (spiral galaxies): గిర్రున తిరిగే విష్ణు చక్రం ఆకారం లాంటి గెలాక్సీలు ఇవి. వీటిలో సాంద్రమైన కాంతి గల కేంద్రం చుట్టూ కాంతి రేఖలు సుడులు తిరుగుతున్నట్టు ఉంటాయి. ప్రకాశవంతమైన కేంద్రంలో హెచ్చు సాంద్రతలో తారలు ఉంటాయి. కేంద్రం దళసరిగా, పొంగినట్టుగా (bulge) ఉంటుంది. ఇక కొన్ని సర్పిలాకారపు గెలాక్సీలలో కేంద్రం వద్ద ఒక కమ్మీ (bar) ఉన్నట్టు ఉంటుంది. వీటిని barred spiral గెలాక్సీలు అంటారు.
2) దీర్ఘవృత్తాకార గెలాక్సీలు (elliptical galaxies): ఇవి సాగదీసిన చక్రంలా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. వీటి దీర్ఘవృత్తీయత (ellipticity - ఎంతగా సాగదీయబడి ఉన్నాయి అన్న లక్షణం) బట్టి వీటిని మళ్లీ వర్గీకరిస్తారు. (చిత్రంలో కనిపిస్తున్నది ESO 325-G004 అనే దీర్ఘవృత్తాకార గెలాక్సీ)
3) కటకాకార గెలాక్సీలు (Lenticular galaxies): ఇవి కటకం (lens) ఆకారం గలిగి ఉంటాయి. (కావాలంటే వీటిని కందిగింజతో కూడా పోల్చుకోవచ్చు. కందిగింజకి lentil అన్న పేరు కూడా lens నించే వచ్చింది). వీటిలో సర్పిలాకార గెలాక్సీల లాంటి ప్రత్యేకమైన అంతరంగ నిర్మాణం ఉండదు.
(చిత్రంలో NGC 5868 అనే ఓ అందమైన కటకాకార గెలాక్సీని చూడోచ్చు. హద్దుల్లేకుండా విస్తరించి ఉన్న నల్లని నేపథ్యంలో మౌనంగా భాసించే ఆ కాంతిసీమని చూస్తున్నప్పుడు చెప్పలేని పరవశం కలుగుతుందేమో.
ఖగోళానికి సంబంధించిన కొన్ని చిత్రాలు మనసుని ఇట్టే దోచుకుంటాయి. కనుక విజ్ఞానాన్ని పక్కన పెట్టి కేవలం కళా దృష్టితో చూసినా ఖగోళం ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇవి గాక పై ఆకారాలలో ఏ ఆకారంతోనూ పోలని ’అవిస్పష్టాకార గెలాక్సీలు’ (irregular galaxies) ఉన్నాయి.
(చిత్రం లో NGC 1427A అనే అవిస్పష్టాకార గెలాక్సీ చూడొచ్చు. ఇది 52 మిలియన్ కాంతిసంవత్సరాల దూరంలో ఉంది).
గెలాక్సీల ఆకృతికి వాటి వయసుకి సంబంధం ఉంటుంది.
తొలి దశలలో గెలాక్సీలు ఎక్కువగా దీర్ఘవృత్తాకారం లోను, కటాకాకారంలోను ఉంటే, తదుపరి దశలలో సర్పిలాకారం లోను అవిస్పష్టాకారం లోను ఉంటాయి.
http://en.wikipedia.org/wiki/Galaxy_morphological_classification
http://en.wikipedia.org/wiki/Lenticular_galaxy
http://en.wikipedia.org/wiki/Elliptical_galaxy
http://en.wikipedia.org/wiki/Irregular_galaxy
0 comments