చీకటి మరింత నలుపెక్క సాగింది. చలిగాలుల తాకిడికి నరాలు జివ్వు మంటున్నాయి. దూరంగా తీరం మీద మినుకు మినుకు మంటున్న కాంతులు కూడా నెమ్మదిగా అదృశ్యం అవుతున్నాయి. అనంతమైన చీకట్లోకి కళ్లుపొడుచుకు చూస్తున్న లైట్ హౌస్ కాంతి అలల మీద ఉండుండి వెలుగు బాటలు వేస్తోంది. మా యాత్రలో ఆ దశ గురించి నాకు ఇంకేమీ గుర్తులేదు.
(కోపెన్హాగెన్ లో రోసేన్ బర్గ్ ఉద్యానవనం)
మర్నాడు ఉదయం ఏడింటికి కోర్సోర్ లో ఆగాం. ఇది జీలాండ్ పశ్చిమతీరం మీద ఒక చిన్న నగరం. అక్కడ ఓడ దిగి మళ్ళీ రైలెక్కాం.
మూడు గంటల ప్రయాణం తరువాత డెన్మార్క్ రాజధాని చేరుకున్నాం. మామయ్యకి ఆ రాత్రంతా కంటి మీద కునుకు ఉంటే ఒట్టు. రౌతు గుర్రాన్ని అదిలించినట్టు, పాదాలతో వేగం పెంచమని రైలు బండిని అసహనంగా అదిలిస్తున్నట్టు ఉన్నాడు.
"అదుగో ఆ చప్పుడు విను!" ఒక్కసారిగా అరిచాడు మామయ్య.
మా ఎడమ పక్క ఆసుపత్రి లాంటీ ఓ పెద్ద భవనం కనిపించింది.
"అదో పిచ్చాసుపత్రి," రైల్లో మా పక్కన కూర్చున్న ఒకాయన వివరించాడు.
భలే! ఇది సరిగ్గా మాలాంటి వాళ్లు చేరాల్సిన చోటే! ఆసుపత్రి పెద్దదే గాని, ప్రొఫెసర్ లీడెన్బ్రాక్ గారికి ఉండే వీరపిచ్చి ఇందులో ఇముడుతుందా అని నాకో సందేహం.
మర్నాడు ఉదయం కోపెన్హాగెన్ లో దిగాం. సామానంతా బండికెక్కించి మాతో పాటు ఫినిక్స్ హోటల్ కి మోసుకుపోయాం. స్టేషన్ ఊరవతల ఉండడంతో హోటల్ చేరుకోవడానికి అరగంట పట్టింది. స్నానం కూడా ప్రశాంతంగా చెయ్యనివ్వకుండా, మామయ్య నన్ను బరబర బయటికి లాక్కెళ్ళాడు.
హోటల్ లో పోర్టర్ కి ఇంగ్లీష్, జర్మన్ భాషలు వచ్చు. కాని మామయ్య బహుభాషా కోవిదుడు కదా! వాడితో శుద్ధమైన డేనిష్లో మాట్లాడి హడలగొట్టి, ఉత్తర పురావస్తువుల మ్యూజియం కి దారి ఎటో కనుక్కున్నాడు.
ఆ మ్యూజియంలో భద్రపరచబడ్డ ప్రాచీన రాతి ఆయుధాలు, పాత్రలు, మణి మాణిక్యాలు మొదలైన వస్తువుల సహాయంతో ఆ దేశపు ప్రాచీన చరిత్రని పూర్తిగా చిత్రించొచ్చు. ఆ మ్యూజియం క్యురేటర్ ఓ మహాపండితుడు. పేరు ప్రొఫెసర్ థామ్సన్. హాంబర్గ్ లోని డేనిష్ దూతకి ఇతడు మిత్రుడు.
తనతో తెచ్చుకున్న పరిచయ పత్రాన్ని ఆయనకి అందించాడు మామయ్య. అది చదవగానే థామ్సన్ గారు మా ప్రొఫెసర్ మామయ్యని ఆదరంగా పలకరించారు. అంతే కాదు ఆయన మేనల్లుడినైనా నన్ను కూడా కొంచెం మర్యాద చేశారు. మా యాత్రకి సంబంధించిన అసలు రహస్యం గురించి ఆయనకి చెప్పలేదన్న సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఆయన దృష్టిలో నేను, మామయ్య ఊరికే ఉబుసుపోక కోసం ఐస్లాండ్ అందాలు తిలకించడానికి వచ్చిన అమాయక పర్యాటకులం!
ఎం. థామ్సన్ తన సహకారంతో, రేవుకి వెళ్ళి ఐస్లాండ్ కి ఓడలు ఎప్పుడు బయలుదేరుతున్నాయో కనుక్కున్నాం.
ఐస్లాండ్ వెళ్లడానికి మార్గాలన్నీ మూసుకుపోతే ఎంత బావుణ్ణు అన్న ఆశాభావం నాలో ఇంకా ఏదో మూల నక్కి ఉంది. కాని ఆ ఆశా భావం కూడా అంతలోనే కుక్కినపేనులా చచ్చిపోయింది. జూన్ 2 వ తేదేన, వల్కిరా అనే చిన్న ఓడ రెయిక్ జావిక్ కి బయల్దేరుతోంది. ఓడ కెప్టెన్ పేరు ఎం. యార్న్. ఓడ ఎక్కిన ఉత్సాహంలో మామయ్య ఆయనతో కరచాలనం చేసి పాపం ఆ చేతిని పిప్పి చేసినంత పని చేశాడు. కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. ఐస్లాండ్ కి వెళ్లడానికి ఇంత సంబరపడిపోడానికి ఏవుందో అతడికి అర్థం కాలేదు. కెప్టెన్ జీవితంలో అది రోజూ చేసే ఓ మామూలు పని. మామయ్యకి అది జీవన పరమార్థం. మామయ్య ఉత్సాహాన్ని గుర్తించిన కాప్టెన్ టికెట్టు వెల రెండింతలు చేశాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలని పట్టించుకునే స్థితిలో లేడు మామయ్య.
"మంగళవారం ఉదయం ఏడింటికల్లా ఓడ లో హాజరు కావాలి," అదనంగా వచ్చిన డాలర్ నోట్లని జేబులో దోపుకుంటూ అన్నాడు కెప్టెన్.
కెప్టెన్ చూబించిన అపారమైన కరుణకి కృతజ్ఞతలు చెప్పి మళ్లీ ఫినిక్స్ హోటల్ కి చేరుకున్నాం.
"మరేం ఫరవాలేదు," మామయ్య సర్దిచెప్తూ అన్నాడు. "అసలు ఓడ దొరకడమే అదృష్టం. పద ముందు ఏదైనా తిని, బయటపడి ఊరు చూసొద్దాం."
ముందుగా కొంగెన్స్-నై-టొర్ అనే స్థలానికి వెళ్ళాం. అక్కడ ఉన్న రెండు పెద్ద తుపాలు చూశాక ఆకలేసి, దగ్గర్లోనే ఉన్న ఓ ఫ్రెంచ్ రెస్టరాంట్ కి వెళ్ళాం. దాన్ని విన్సెంట్ అనే ఓ ఫ్రెంచ్ వంటవాడు నడిపిస్తున్నాడు. మనిషికి నాలుగు మార్కులు చొప్పున ముట్టచెప్పి ఇద్దరం షుష్టుగా టిఫిన్ చేశాం.
ఊరి అందాలు చూడడం నాకెంతో సంతోషంగా అనిపించింది. మామయ్య నన్ను ఆదరాబాదరాగా లాక్కెళ్ళాడన్న మాటే గాని తను అసలు ఏమీ పట్టించుకున్నట్టే లేదు. మరీ అంత పెద్దదిగాని రాజ గృహాన్ని గాని, పదిహేడవ శతాబ్దానికి చెందిన వంతెనని గాని, థొర్వాల్డ్ సెన్ గౌరవార్థం నిర్మించిన విశాల సమాధి మంటపాన్ని గాని, లేక తోటలో ఉన్న రోసెన్బర్గ్ బొమ్మరిల్లు ని గాని, పాతకాలపు ఎక్స్చేంజి ని గాని, అందమైన ఆ భవంతి శిఖరం చుట్టూ పెనవేసుకున్న కంచు డ్రాగన్లని గాని, సముద్రపు గాలికి తెరచాపల్లా చేతులు అల్లార్చే వాయుమరలని గాని - మామయ్య ఇవేవీ సరిగ్గా చూడలేదు.
ఊరు చూస్తుంటే నా ప్రేయసి స్మృతులే మనసులో మెదలుతున్నాయి. ఇద్దరం రేవులో కలిసి చేసిన షికార్లే గుర్తుకొస్తున్నాయి. రేవులో సద్దు చేయక నిద్దరోయే ఓడల పక్కగా, మనసుని మచ్చికచేసే పచ్చని పచ్చిక బాటల వెంట, తోటలో దాగి వున్న కోట దిశగా కలిసి వేసిన అడుగులే మదిలో మరి మరి మారుమ్రోగుతున్నాయి.
(సశేషం...)
0 comments