ఓసారి ఓ తండ్రి, సైన్సు అంటే ఉత్సాహపడుతున్న తన కొడుకు గురించి ఫెయిన్మన్ కి రాస్తాడు. ఆ తండ్రి ఉత్తరం కింద ఇస్తున్నాం. దానికి ఫెయిన్మన్ జవాబు వచ్చే పోస్ట్ లో.
---
ప్రియమైన డా. ఫెయిన్మన్ గార్కి
ఈ ఉత్తరం మీకు కొంచెం చిత్రంగా అనిపించొచ్చు. కాని నా సమస్య ఏంటో మీకు అర్థమైతే నా ఉత్తరం మరీ అంత చిత్రంగా అనిపించకపోవచ్చు.
నాకో పదహారేళ్ల కొడుకు ఉన్నాడు. మరీ మహా మేధావి అనను గాని, లెక్కలు మొదలైన విషయాల్లో నా కన్నా చాలా ప్రతిభావంతుడు. అందరి లాగానే తను కూడా ఈ జీవన పోరాటంలో నెగ్గుకు రావాలని తాపత్రయపడుతున్నాడు. అయితే ఈ జీవితం ఓ చిక్కు సమస్య అని, మహా మహా వాళ్లకే అది అర్థం కాదని, పాపం వాడికి ఇంకా తెలీదు. సరే ఆ విషయం పక్కన పెడితే, మా వాడు లెక్కలు, భౌతిక, రసాయన శాస్త్రాల్లో బాగా చేస్తున్నాడు. రిమోట్ కంట్రోల్ మీద పని చేసే బొమ్మ విమానాలతో ఆడుకుంటూ ఉంటాడు. విమానం రెక్కలు ఎలా ఉంటే విమానం బాగా ఎగురుతుందో సమీకరణాలతో సహా వివరించే పుస్తకాలు చదువుతుంటాడు. అవైతే నాక్కూడా అర్థం కావు.
మా వాడు ఎలాగోలా కష్టపడి పైకి రావాలని తంటాలు పడుతున్నాడు. కొంచెం లావుగా ఉంటాడు. బెరుకుగా ఉంటాడు. ఆత్మవిశ్వాసం కాస్త తక్కువ. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి అప్పుడప్పుడు పెద్ద మొగాడిలా వ్యవహరిస్తుంటాడు. వచ్చే ఏడాది హైస్కూల్ కి వెళతాడు. ఇంకొన్నేళ్లు పోతే కాలేజిలో చేరతాడు. మంచి స్కూలు కెళ్లి చదువుకోవాలని వాడికి చాలా ఉంది. కాని ప్రస్తుతం వాడికి వచ్చే గ్రేడ్ల దృష్ట్యా ఆ అవకాశం అంత గొప్పగా ఉన్నట్టు కనిపించడం లేదు.
నేనేమీ వాణ్ణి రాచి రంపాన పెట్టే తండ్రిని కాను. వాడికి ఏది నచ్చితే అదే చదువుకోమంటాను. 1960 లో మా నాన్నగారి ఒత్తిడి మీద ఎలక్ట్రికల్ ఇంజినీర్ గా నా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టాను. ప్రస్తుతం నేను పని చేస్తున్నది అపరాధపరిశోధనా రంగం. కనుక తల్లిదండ్రుల వత్తిడికి లొంగిపోతే జీవితం ఎలా తెల్లారుతుందో నాకు బాగా తెలుసు. వాడు ఏ రంగంలోకి దిగినా నాకు ఫరవాలేదు. కాని ఆ రంగంలో వాడు రాణించాలన్నదే నా ఉద్దేశం. ఒక రంగంలో మనకి ప్రతిభ ఉన్నప్పుడు, ఆ రంగంలో బాగా చెయ్యాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నచ్చిన పనిలో పూర్తి శ్రద్ధ పెట్టి చెయ్యని వ్యక్తికి మనశ్శాంతి ఉండదని నా అభిప్రాయం.
గత రెండేళ్లుగా వాడి టీచర్ల నుండి నేను విన్న దాన్ని బట్టి మా వాడి పద్ధతి గురించి నాకు కొంచెం అర్థమవుతోంది. సైన్సులో తనకి ఆసక్తికరంగా అనిపించే ఏదైనా విషయాన్ని తీసుకుంటాడు. దాని గురించి వేగంగా వీలైనన్ని విషయాలు నేర్చుకుంటాడు. తరువాత ఇక దాన్ని పక్కన పెట్టి మరో విషయం మీదకి మళ్లుతాడు. ఈ పద్ధతిని కొంత మంది టీచర్లు ప్రోత్సహిస్తారట కూడా... మంచిదే గాని చిక్కేంటంటే బళ్లో పిల్లవాడికి ఎన్ని తెలుసు అన్నది ముఖ్యం కాదు. ఎన్ని మార్కులు వచ్చాయి అన్నదే ముఖ్యం. ఇక పరీక్షల్లో క్లాసులో చెప్పిన విషయాలే అడుగుతారు. అయితే క్లాసులో చెప్పే ప్రాథమిక విషయాలు మా వాడికి (వాడి పేరు మార్టిన్) మరీ సులభంగా అనిపిస్తాయి. తోటి పిల్లలకి తెలీని, నూతన అధునాతన విషయాలు మాత్రమే ఎప్పుడూ చదువుతూ కూర్చుంటాడు. కాని నూతన విషయాలు చదివితే మార్కులు రావు. క్లాసు పుస్తకాలు చదివితే వస్తాయి. టీచర్ చెప్పింది మాత్రం చదివితే వస్తాయి. ఇక్కడే వస్తోంది మరి సమస్య. నేనేమో క్లాసు పుస్తకాలు చదవమని వేధింపు మొదలెడతాను. వాడికేమో అది నచ్చదు. అదండీ పరిస్థితి.
కొన్ని నెలల క్రితం నాకో పుస్తకం దొరికింది. టైటిల్ ఆసక్తి కరంగా అనిపించింది. అట్ట మీద రచయిత ఫోటో ఉంది. ఆ పెద్దమనిషి ఎవరో చూడబోతే శాస్త్రవేత్తలాగే లేడు, ఓ కమేడియన్ లా ఉన్నాడు!
నేను, మార్టిన్ కలిసి ఆ పుస్తకం చదివాం. చాలా తమాషాగా ఉంది. ప్రతీ కథలోనూ ఓ అమూల్యమైన సత్యం ఉంది. అయితే అది కేవలం తమాషా కథల పుస్తకం కాదు. ఈ విశ్వం ఎలా పనిచేస్తుందో వర్ణిస్తుంది ఆ పుస్తకం! భలే తెలివిగా రాశారు ఎవరో. తదనంతరం ఛాలెంజర్ స్పేస్ షటిల్ ప్రమాదం గురించి, రోజర్స్ కమిషన్ గురించి వార్తల్లో చూశాం. అక్కడ ఈ పుస్తక రచయిత ఆ వార్తల్లో మాకు ప్రత్యక్షం అయ్యాడు. ఇందాక ఆ సరదా కథలు రాసిన పెద్దమనిషేనా, ఇక్కడ ’నాసా’ తన తప్పులు ఎలా దిద్దుకోవాలో సూచిస్తున్నది, శాసిస్తున్నది? అసాధ్యుడే!
ఆ వ్యవహారం అంతా చూస్తే నాకిలా అనిపించింది. ఈ పెద్దమనిషి ఎవరో సామాన్యుడు కాడు. పైగా నోబెల్ బహుమతి కూడా పుచ్చుకున్నాడు. వార్తల్లో తెగ కనిపిస్తున్నాడు. అతడు రాసిన పుస్తకం మా వాడు చదివేశాడు. చదవగానే పిల్లలకి ’వావ్’ అనిపించేలా ఉందా పుస్తకం. కనుక, అయ్యా, మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను.
సమస్యలు పరిష్కరించడంలో మీరు దిట్ట అని విన్నాను. ఇదీ నా "సమస్య." మీకు సైన్సులో మంచి ప్రవేశం ఉంది. కనుక మనుషుల మనసుల గురించి కూడా మీకు చాలా తెలిసే ఉంటుంది. ఓ పదహారేళ్ల పిల్లవాడు కాస్త దూకుడు తగ్గించుకుని, తన భవిష్యత్తు గురించి ఒక్క క్షణం శ్రద్ధగా ఆలోచించేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఆ పిల్లవాడు జీవితంలో తన కలలని సాకారం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి?
మిరే స్వయంగా మా అబ్బాయికి రాస్తే బావుంటుందేమో. జీవితం గురించి మీ అభిప్రాయం ఏంటో దయచేసి రాయండి. వైజ్ఞానిక జీవనం అంటే ఎలా ఉంటుందో కొంచెం వివరించండి. ఆ దిశలో ప్రయాణించాలంటే ఎలాంటి శిక్షణ పొందాలో సెలవివ్వండి. మీ ఇష్టం. మీకు ఏం తోస్తే అది చెప్పండి. ఆ పిల్లవాడి గురించి, వాడి శ్రేయస్సు గురించి ఎక్కడో, ఎవరో అజ్ఞాత వ్యక్తి పట్టించుకుంటున్నారని తెలిస్తే వాడు చాలా సంతోషిస్తాడు.
ఇట్లు
విన్సెంట్ ఏ. వాన్ డెర్ హైడ్
(ఫెయిన్మన్ సమాధానం వచ్చే పోస్ట్ లో)
0 comments