ఊరు చూస్తుంటే నా ప్రేయసి స్మృతులే మనసులో మెదలుతున్నాయి. ఇద్దరం రేవులో కలిసి చేసిన షికార్లే గుర్తుకొస్తున్నాయి. రేవులో సద్దు చేయక నిద్దరోయే ఓడల పక్కగా, మనసుని మచ్చికచేసే పచ్చని పచ్చిక బాటల వెంట, తోటలో దాగి వున్న కోట దిశగా కలిసి వేసిన అడుగులే మదిలో మరి మరి మారుమ్రోగుతున్నాయి.
కాని నా ప్రేయసి ఇప్పుడు నాకు అందనంత దూరంలో ఉంది. మళ్లీ ఎప్పుడు చూస్తానో ఆమెని. అసలు ఈ జన్మలో మళ్లీ చూస్తాననే ఆశ లేదు నాకు.
ఈ దృశ్యాలేవీ మామయ్య మనసుని కరిగించ లేదన్న సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాని కోపెన్హాగెన్ కి నైఋతి భాగంలో ఉండే ’అమక్’ అనే ద్వీపం మీద ఉన్న ఓ చర్చి శిఖరం మామయ్య ని ఎందుకో ఆకర్షించింది.
ఊరు మధ్య లోంచి పారే పిల్ల కాల్వల మీద ప్రయాణించే చిన్న పడవ ఎక్కి కొద్ది నిముషాల్లో ఆ ప్రదేశానికి చేరుకున్నాం. పడవ దిగి నడుచుకుంటూ కొద్ది నిముషాల్లోనే చర్చిని చేరుకున్నాం. చూడడానికి ఆ చర్చిలో నాకేమీ అంత ప్రత్యేకత కనిపించలేదు. కాని దాని శిఖరం ఫ్రొఫెసర్ ని ఆకర్షించడానికి కారణం ఉంది. ఆ శిఖరం చుట్టూ గిరికీలు తిరిగే ఓ మెట్ల దారి పైపైకి ఆకాశం లోకి చొచ్చుకుపోతోంది.
"పద పైకి వెళ్దాం,” మామయ్య అన్నాడు.
"అమ్మో! నా కళ్లు తిరుగుతాయి," అన్నాన్నేను.
"అందుకే వెళ్దాం అంటున్నాను. ఎత్తుకి అలవాటు పడాలి."
"కాని..."
"నేనున్నాగా, పద."
ఆయన మాట వినక తప్పలేదు. సందుకి ఆ చివర్లో ఉండే కాపలా దారు మాకు చర్చి తాళం అప్పగించాడు. మా ఆరోహణ మొదలయ్యింది.
మామయ్య వడిగా నా ముందు మెట్లు ఎక్కుతున్నాడు. నేను భయం భయంగా వెనకే అనుసరిస్తున్నాను. మెల్లగా నాకు తలతిరగడం మొదలయ్యింది.
మెట్ల దారి గోపురం లోపలి భాగంలో ఉన్నంత సేపు ఏమీ అనిపించలేదు. కాని ఓ నూట యాభై మెట్లు ఎక్కాక దారి గోపురం బయటికి వచ్చింది. ఇక అక్కణ్ణుంచి మెట్లు గిరికీలు తిరుగుతూ మెట్లు పైపైకి పోతాయి. మొహం మీద చల్లని గాలి తగులుతోంది. పైకి పోతున్న కొద్ది దారి ఇరుకవుతోంది. మా ప్రాణాలు కాచే బాధ్యత మెట్లకి ఒక పక్క సన్నని ఊచదే! గిరికీలు తిరిగే మెట్ల దారి అనంతాకాశంలో కరిగిపోతున్న భావన...
"ఇక నా వల్ల కాదు," కరాఖండిగా చెప్పేశాను.
"మరీ ఇంత పిరికి వెధవ్వి అనుకోలేదు. రా పైకి," మామయ్య కరుగ్గా అన్నాడు.
విధి లేక బిక్కుబిక్కు మంటూ మెట్లు ఎక్కసాగాను. వీచే గాలికి నే పట్టుకున్న ఊచ నెమ్మదిగా ఊగుతున్న భావన. ఒక పక్క ఎముకలు కొరికే చలిగాలి.
మోకాళ్లలో వొణుకు పుడుతోంది. మెల్లగా నాలుగు కాళ్ల మీదకి దిగి జంతువులా పాకడం మొదలెట్టాను. తరువాత పాములా కడుపు మీద పాకడం మొదలెట్టాను. శరీరం వశం తప్పుతోంది.
చివరికి శిఖరాగ్రాన్ని చేరుకున్నాం. ఇందులో నా ఘనతేం లేదు సుమండీ! మామయ్య నా కాలరు పట్టుకుని లాక్కెళ్ళడం వల్లనే ఆ విజయం వీలయ్యింది.
"కళ్లు తెరిచి కిందికి చూడు," మామయ్య అరిచాడు. "ఇప్పట్నుంచే అగాధాలకి అలవాటు పడాలి."
కళ్ళు తెరచి చూశాను. ఆకాశం నుండి రాలి పడ్డట్టు కనిపించాయి ఇళ్లు. వాటి మీద ముసురుకున్న దట్టమైన పొగమంచు. నా నెత్తి మీద చింపిరి మేఘాలు. అదేం దృశ్య భ్రాంతో గాని, మేఘాలు నిశ్చలంగా ఉన్నట్టు, నేను ఈ చర్చి శిఖరం వేగంగా కదిలిపోతున్నట్టు అనిపించి గుండెల్లో దడ పుట్టింది.
ఒక పక్క దూరంగా పచ్చిక బయళ్ళు. మరో పక్క దూరంగా ఎండలో మిలమిల లాడే సముద్రం. పొగమంచులోంచి తేరిపార చూస్తే దూరంగా స్వీడెన్ తీరం మసకమసకగా కనిపిస్తోంది. హద్దుల్లేకుండా విస్తరించిన లోకమంతా నా చుట్టూ విచిత్రంగా పరిభ్రమిస్తున్నట్టు అనిపించింది.
తూలి పడకుండా నిలదొక్కుకోడానికి ప్రయత్నించాను. ఈ శిక్షణ ఓ గంట సేపు సాగింది. మామయ్య అనుమతి దొరికాక తిరిగి కిందికి దిగి నేల మీద నడుస్తుంటే పాదాలు ఉక్కుపాదాల్లా అనిపించసాగాయి.
"రేపు మళ్లీ వద్దాం," ప్రొఫెసర్ మామయ్య ప్రకటించాడు.
ఆ పాఠం వరుసగా ఐదు రోజుల పాటు ఆ పాఠమే మళ్లీ మళ్లీ నేర్చుకున్నాను. ఈ దిక్కుమాలిన శిక్షణ భవిష్యత్తులో ఎంత వరకు ఉపయోగపడుతుందో ఆ దేవుడెరుగు!
(ఎనిమిదవ అధ్యాయం సమాప్తం)
0 comments