5000 కాంతిసంవత్సరాల పరిధిలో విశ్వం
ఓరియాన్ భుజం
ఈ మ్యాపులో పాల పుంత (Milky Way) గెలాక్సీలో మనం ఉన్న విభాగం ప్రదర్శించబడుతోంది. సూర్యుడు ఉన్న భాగాన్ని ఓరియాన్ భుజం (Orion arm) అంటారు. ఇది గెలాక్సీ కేంద్రానికి మరింత దగ్గర్లో ఉన్న సాజిటేరియన్ భుజం కన్నా కాస్త చిన్నది. ఓరియాన్లో ఉండే తారలలో కంటికి కనిపించే ఎన్నో తారలని ఈ మ్యాపులో చూడొచ్చు. వాటిలో ముఖ్యమైన తారలు ఓరియాన్ రాశిలో ఉన్న ప్రధాన తారలే. అందుకే ఓరియాన్ రాశి పేరే ఈ భుజానికి కూడా పెట్టారు. ఈ తారలన్నీ కూడా అత్యంత ప్రకాశవంతమైన బృహత్తారలు, అతిబృహత్తారలూను. అన్నీ సూర్యుడి కన్నా వేల రెట్లు ప్రకాశం గలవి.
5000 కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న తారల సంఖ్య = 600 మిలియన్లు
ఈ మ్యాపులో అత్యంత ప్రకాశవంతమైన తార "రో కాసియోపియా" (rho Cassiopea) - ఇది మనకి 4000 కాంతిసంవత్సరాల దూరంలో ఉంది. కంటితో చూస్తే చాలా చిన్నగా, కాంతివిహీనంగా కనిపిస్తుంది గాని అది సూర్యుడి కన్నా 100,000 రెట్లు ప్రకాశవంతమైన అతిబృహత్తార.
ఈ మ్యాపులో కనిపించే మరో ముఖ్యమైన తార Polaris. ఇదే మన ధృవ తార. ఇది భూమి నుండి 430 కాంతిసంవత్సరాల దూరంలో ఉంది. భూమి అక్షం దీని గుండా పోతుంది కనుక ఇది ధృవ తార అవుతుంది అని మనందరికీ తెలుసు. అయితే ’ఇంద్రపదవి’ లా ఈ ధృవతార అనేది కూడా కొన్ని ప్రత్యేక తారలకి వచ్చే ఓ పదవి లాంటిది. భూమి అక్షం స్థిరంగా ఎప్పుడూ ఒకే దిశలో చూపిస్తూ ఉండదు. కాలానుగతంగా పదివేల ఏళ్ల స్థాయిలో నెమ్మదిగా మారుతూ ఉంటుంది.
గతంలో మనకి ధృవ తారగా ఉన్న తారలలో ఒకటి వేగా. కిందటి పోస్ట్ లో చెప్పుకున్న ఈ వేగా తార 12,000 ఏళ్ల క్రితం మనకి ధృవతారగా ఉండేదట.
కిందటి పోస్ట్ లో చెప్పుకున్న మరో పెద్ద తార Betelgeuse (ఆర్ద్ర) ని ఈ మ్యాపులో చూడొచ్చు.
పై మ్యాపులో కనిపించే ఓ ముఖ్యమైన విశేషం మన గెలాక్సీలోని ’భుజాలు’. మనం ఉండే పాలపుంత గెలాక్సీ ఓ సర్పిలాకార గెలాక్సీ (spiral galaxy). (గెలాక్సీల ఆకారాలలో రకాల గురించి వచ్చే పోస్ట్ లో). గిర్రున తిరుగుతున్న విష్ణు చక్రం లాగా ఉంటుంది చూడడానికి. ఆ చక్రంలోని అగ్నికీలల లాంటివి ఈ ’భుజాలు.’ మనం ఉన్న భుజం పేరు ఓరియాన్ భుజం. మనకి ఇ రుగు పొరుగు భుజాలైన సాజిటేరియస్ భుజం, పెర్సియస్ భుజాలు కూడా ఈ మ్యాపులో చూడొచ్చు.