"ఏంటి గ్రౌబెన్?"
"అదో మరపురాని యాత్ర అవుతుంది అనిపిస్తోంది."
ఆది విని నేను ఓ అంగుళం ఎగిరి పడ్డాను.
"అవును ఆక్సెల్! ఓ మహానుభావుడి మేనల్లుడు తప్పకుండా పూనుకోవాల్సిన యాత్ర ఇది. సత్తా ఉన్న వాడు ఏదైనా ఘనకార్యం సాధించి తన ప్రత్యేకతని నిరూపించుకోవాలి."
"ఏంటి నువ్వు అంటున్నది? ఇలాంటి పిచ్చి పని నుండి తప్పుకోమని చెప్పవేం గ్రౌబెన్?"
"లేదు ఏక్సెల్. అసలు సంతోషంగా నేను కూడా నీతో పాటు వచ్చేదాన్ని. కాని నేను వస్తే నీకో భారమే అవుతాను."
"అదేంటి అలా అంటున్నావ్?"
"అవును. అది నిజం."
"ఆడాళ్లూ!" మనసులోనే అనుకున్నాను. "నిజంగా మీ మనసులని అర్థం చేసుకోవడం ఎంత కష్టం? మీరు భయస్థులని మేం అనుకుంటాం గాని మీ కన్నా ధైర్యవంతులు ఈ భూమి మీద ఉండరు. మీ చర్యలు హేతువుని అతిక్రమిస్తాయి. ఇంత చిన్న అమ్మాయి అంత ప్రమాదకరమైన యాత్రలో బయల్దేరమని నన్ను ప్రోత్సహిస్తోందా? అంతే కాక ధైర్యంగా తను కూడా వస్తానంటోందా? తనకి ప్రాణానికి ప్రాణంగా అనుకునే నన్ను వెళ్లమని ప్రోత్సహిస్తోందా?"
నా మనసంతా అలజడితో నిండిపోయింది. అంత కన్నా ముఖ్యంగా తనంత ధైర్యం నాకు లేకపోయిందే నని సిగ్గుగా అనిపించింది.
"రేపటికి నీ మనసు మారకపోతుందా?" తన మనసు తెలుసుకుందామని అడిగాను.
"అయ్యో నా పిచ్చి ఏక్లెల్! ఇవాళ ఏమన్నానో, రేపూ అదే అంటాను."
ఇద్దరం చేతులు పట్టుకుని అలా కొంచెం సేపు మౌనంగా నడిచాం. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ తలచుకుంటుంటే నా గుండె బద్దలయ్యేలా ఉంది.
అయినా జులై నెల కాలెండ్స్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఈ మధ్యలో ఏ మహత్యమో జరిగి మా మామయ్య మనసు మారకపోతుందా? అని ఆలోచించసాగాను.
కోనిగ్స్ స్ట్రాసే లో ఇంటికి తిరిగి చేరే సరికి చీకటి పడింది. ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉంటుందని ఆశించాను. మామూలుగా అయితే మామయ్య ఆపాటికి నిద్రపోతాడు. మార్తా ఎప్పట్లాగే నిర్విరామంగా వస్తువుల దుమ్ము దులుపుతూ ఉంటుంది.
కాని మామయ్య గొప్ప అసహనశీలి అన్న విషయం మర్చిపోయాను. ఇల్లంతా పోర్టర్లతో కోలాహలంగా ఉంది. పాపం మార్తాకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.
"ఒరేయ్! ఏక్సెల్! ఎక్కడ చచ్చావ్ రా?" అల్లంత దూరం నుండే మామయ్య దండకం అందుకున్నాడు. "నీ పెట్టెలు సర్దుకోకుండా ఎక్కడ మాయమయ్యావ్? నా కాగితాలు కూడా ఇంకా సర్దలేదు. నా పెట్టె తాళం ఎక్కడ పెట్టావ్? నా గెయ్టర్ (*) లతో ఏం చేశావ్?"
(*) గెయ్టర్ లు: పాంట్ అడుగు భాగాన్ని, బూట్లని కప్పే ఒక విధమైన తొడుగు. గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు ఇవి వేసుకుంటారు.
నేను దిగ్భ్రాంతితో అక్కడి జరిగే తంతంతా చూస్తూ ఉండిపోయాను.
"మనం నిజంగా... వెళ్తున్నామా?" నా నోట్లోంచి అప్రయత్నంగా మాటలు వచ్చాయి.
"ఇంకా సందేహమా? అయినా ఇలాంటి సమయంలో ఇంట్లో కూర్చుని ఏర్పాట్లు చూసుకోకుండా, షికారు కెళ్తావని ఎలా అనుకుంటాను?"
"నిజంగా వెళ్తున్నామా?" ఆశ చావక మరో సారి అడిగాను.
"అవును. ఎల్లుండి తెల్లారే బయల్దేరుతున్నాం."
ఇంక విన్లేకపోయాను. సూటిగా నా గదిలోకి వెళ్లాను.
ఉన్న కాస్త ఆశా ఇక చచ్చిపోయింది. రోజంతా మామయ్య ఈ విషాద యాత్రకి అవసరమైన సరంజామా అంతా కొనడంలో హడావుడిగా ఉన్నాడు. త్రాటి నిచ్చెనలు, ముళ్లు వేసిన తాళ్లు, టార్చిలు, ఫ్లాస్క్ లు, ఇనుప కొక్కేలు, కొండలెక్కడానికి వాడే ఇనుప కమ్మీలు, గొడ్డళ్లు - ఇంట్లో ఎటు చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఈ సరంజామా అంతా మొయ్యడానికి కనీసం పది మంది కావాలేమో.
ఆ రాత్రంతా ఓ పీడకలలా గడిచిపోయింది. మర్నాడు మేలుకొలుపు చాలా త్వరగానే వచ్చింది. ఎవరు పిలిచినా తలుపు తెరవనని భీష్మించుకున్నాను. కాని "నా బంగారు ఏక్సెల్," అన్న సంగీతం లాంటి పిలుపుకి స్పందించకుండా ఉండేదెలా?
గదిలోంచి బయటికి వచ్చాను. నిద్రలేక ఎర్రబారిన కళ్లు, నిస్సత్తువతో పాలిపోయిన మొహం... నా దీనావస్థని చూసి గ్రౌబెన్ మనసు వెన్నలా కరిగిపోతుందని అనుకున్నాను.
"హాయ్ ఏక్సెల్!" ఉత్సహంగా పలకరించింది. "రాత్రి బాగా నిద్రపోయినట్టున్నావ్. కొంచెం ఉత్సాహంగా కనిపిస్తున్నావు."
"అవునా?" నమ్మలేనట్టు అడిగాను.
వెంటనే అద్దం వద్దకి వెళ్లి చూసుకున్నాను. నిజంగానే అనుకున్న దాని కన్నా మెరుగ్గా కనిపించాను. నా కళ్లని నేనే నమ్మలేకపోయాను.
"ఏక్సెల్!" వివరంగా చెప్పుకుంటూ వచ్చింది. "మీ మామయ్య, నేను ఇందాక చాలా సేపు మాట్లాడుకున్నాము. ఆయన గొప్ప వివేకవంతుడు, ప్రతిభాశాలి, అనుభవజ్ఞుడు. ఆయన రక్తం నీలో ప్రవహిస్తోంది. ఆయన పథకాలు, ఆశలు అన్ని నాతో ఏకరువు పెట్టారు. ఈ లక్ష్యాన్ని ఎందుకు, ఎలా సాధించాలని అనుకుంటున్నాడో అన్నీ చెప్పారు. ఆయన విజయం సాధిస్తారని నాకు ఏకోశానా సందేహం లేదు. ఓ గొప్ప వైజ్ఞానిక లక్ష్యానికి ఇలా జీవితాన్ని అంకితం చెయ్యడం ఓ గొప్ప అదృష్టంగా భావించాలి ఏక్సెల్! ఈ ప్రయాస వల్ల ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ ని వరించే గౌరవంలో నువ్వూ పాలుపంచుకుంటావు. ఈ మహాయాత్ర నుండి నువ్వు తిరిగి వచ్చాక ఆయనకి సమానుడివి అవుతావు. మగాడివి అనిపించుకుంటావు. స్వతంత్రుడివి అవుతావు. రారాజువి అవుతావు. నా స్వామి... "
ఆ మాటలు అంటూనే ఆమే చెక్కిలి ఎర్రబారింది. దాంతో నేను తెప్పరిల్లాను. మేం ఈ యాత్ర మీద బయలుదేరుతున్నామని ఇంకా నమ్మ బుద్ధి కావడం లేదు.
0 comments