పాలపుంతకి ఉపగెలాక్సీలు
కిందటి పోస్ట్ లో పాలపుంత చుట్టూ పరిభ్రమించే సాజిటేరియస్ మరుగుజ్జు గెలాక్సీ గురించి చెప్పుకున్నాం. మన పాలపుంతకి అలాంటి మరిన్ని ఉపగెలాక్సీలు ఉన్నాయి. అయితే సూర్యుడి నుండి 50,000 కాంతిసంవత్సరాల దూరంలో ఉన్న ఉపగెలాక్సీ అదొక్కటే.
సూర్యుడి నుండి 5,00,000 కాంతి సంవత్సరాల దూరం వరకు పరిశీలిస్తే కనిపించే 12 ఉపగెలాక్సీలని పై చిత్రంలో చూడొచ్చు. ఈ మొత్తం ఉపగెలాక్సీలలోని తారలన్నీ కలుపుకుంటే వాటి సంఖ్య కొన్ని పదుల మిలియన్లు మాత్రమే ఉంటుంది. పాలపుంతలో ఉన్న తారల సంఖ్యతో పోల్చితే ఇది ఏ మూలకీ రాదు.
వీటిలో అర్సా మేజర్ -2, బూట్స్ మరుగుజ్జు గెలాక్సీలని ఇటీవలే 2006 లో కనుక్కున్నారు. ఇవి చాలా బలహీనమైన కాంతి గల గెలాక్సీలు. అతి శక్తివంతమైన దూరదర్శినులతో మాత్రమే వాటిని గమనించడానికి వీలవుతుంది. అర్సా మేజర్-1 కూడా ఈ మధ్యనే 2005 లో కనుక్కొబడింది. ఇది కూడా చాలా బలహీనమైన కాంతి గలదే.
ఇక తక్కిన ఉపగెలాక్సీలన్నీ ఇరవయ్యవ శతాబ్దంలో కనుక్కోబడ్డవే. స్కల్ప్ టర్ మరుగుజ్జు గెలాక్సీ, ఫోర్నాక్స్ గెలాక్సీలు 1937 లో కనుక్కోబడ్డాయి. వీటిలో తారలు చాలా మటుకు ముసలి తారలే. వాటి సగటు వయసు 3 నుండి 10 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. (సూర్యుడి వయసు 4.5 బిలియన్ సంవత్సరాలు. అసలు విశ్వం వయసే 13.5-14 బిలియన్ సంవత్సరాలు).
ఈ ఉపగెలాక్సీలన్నీ మన పాలపుంత చుట్టు పరిభ్రమిస్తుంటాయని ముందు చెప్పుకున్నాం. అయితే రెండు ఉపగెలాక్సీల విషయంలో మాత్రం అవి నిజంగా మన ఉపగెలాక్సీలా, లేక కేవలం పొరుగు గెలాక్సీలా అన్న వివాదం ఒకటుంది. అవి - పెద్ద మెగలానిక్ మేఘం (Large Magellanic Cloud), చిన్న మెగలానిక్ మేఘం (Small Magellanic Cloud).
ఈ మెగలానిక్ మేఘాలకి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ మేఘాలు పాలపుంతకి కొంచెం అడుగున ఉన్నట్టు పైన మ్యాప్ లో చూడొచ్చు. వీటిని మొట్టమొదట గమనించిన వారు ఖగోళవేత్తలు కారు - నావికులు! దక్షిణ భూభాగంలో యాత్రలు చేసే నావికులు పలువురు వీటిని గమనించారు. ఉదాహరణకి 1519–1522 కాలంలో సంపూర్ణ భూప్రదక్షిణ చేసిన మెగాలెన్ నౌకాదళంలో ఆంటోనియో పిగాఫెటా అన్నవాడు వీటిని తారారాశులుగా చూసినట్టు ఆధారాలు ఉన్నాయి. మెగాలెన్ పేరు మీదే వీటికి ఆ పేరు పెట్టారు. యూరోపియన్ నావికులు వీటి సహాయంతో సముద్రయానం చేసే వారట. అయితే తక్కిన తారల లాగానే ఇవి కూడా మామూలు తారలే అనుకున్నారు గాని, అవి మన గెలాక్సీకి బయట ఉన్న చిన్న గెలాక్సీలని అప్పుడు ఎవరూ ఊహించలేకపోయారు.
సైన్స్ ఫిక్షన్ సినిమాల లోను, టీవీ సీరియళ్ల లోను, పుస్తకాల లోను కూడా ఈ రెండు మేఘాలు చోటు చేసుకున్నాయి.
పెద్ద మెగలానిక్ మేఘం: ఇది మన పాలపుంత నుండి రమారమి 1,60,000 కాంతిసంవత్సరాల దూరంలో ఉంటుంది. దీని వ్యాసం 14,000 కాంతిసంవత్సరాలు. దక్షిణ భూభాగంలో ఆకాశంలో కనిపించే గెలాక్సీలలో ఇది అత్యంత ప్రకాశవంతమైన గెలాక్సీ. ఇందులో కొన్ని బిలియన్ల తారలు ఉన్నాయి.
చిన్న మెగలానిక్ మేఘం: దీని దూరం రమారమి 200,000 కాంతిసంవత్సరాలు. వ్యాసం 7,000 కాంతిసంవత్సరాలు.
మొదట్లో ఈ రెండు మేఘాలు కూడా ఉపగెలాక్సీలే అనుకున్నా, తదనంతరం ఇవి కేవలం పొరుగు గెలాక్సీలని, అవి మన చుట్టూ పరిభ్రమించడం లేదని తెలిసింది. కనుక మెగలానిక్ మేఘాలు మనకి అత్యంత సమీపంలో ఉన్న పొరుగు గెలాక్సీలు.
మరి కొంచెం అవతలికి వెళ్తే (అంటే ఓ 50 లక్షల కాంతిసంవత్సరాలు అన్నమాట!) మరిన్ని పొరుగు గెలాక్సీలు తారసపడతాయి. వాటిలో మన గెలాక్సీని తలదన్నేటంత పెద్ద గెలాక్సీలు కూడా ఉన్నాయి. విపరీతమైన దూరాల నుంచి చూడడం వల్ల మొదట్లో వాటి సత్తా అర్థం కాలేదు గాని, పోగా పోగా వాటి పరిమాణం గురించి తెలిసి ఖగోళవేత్తలు ఆశ్చర్యపోయారు.
ఆ రాకాసి గెలాక్సీల గురించి వచ్చే పోస్ట్ లో...
0 comments