శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

భూమి చుట్టూ కక్ష్యలలో రకాలు

Posted by V Srinivasa Chakravarthy Saturday, November 30, 2013 0 comments



అయితే ఊరికే భూమి చుట్టూ ప్రదక్షిణ చెయ్యకుండా భూమిని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలంటే ఒక వస్తువు ఎంత వేగంతో ప్రయాణించాలి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే అసలు గురుత్వం ఎలా పని చేస్తుందో ఓ సారి పరిశీలించాలి.

ఒక వస్తువు యొక్క గురుత్వాకర్షణ బలం, ఆ వస్తువు నుండి దూరం పెరుగుతున్న కొద్ది వేగంగా తరిగిపోతుంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఆ వస్తువు నుండి దూరానికి వర్గ విలోమంగా (inverse square) తగ్గుతుంది.  అంటే భూమి నుండు దూరం రెండింతలు అయితే, గురుత్వాకర్షణ బలం నాలుగింతలు తగ్గుతుంది. దూరం మూడు రెట్లు అయితే బలం తొమ్మిది రెట్లు పడుతుంది.

భూమి ఉపరితలం వద్ద ఒక వస్తువు ‘పరిభ్రమణ  వేగం’తో కదిలితే అది భూమి చుట్టూ వృత్తాకార కక్ష్యలో తిరిగుతూ ఉంటుందని ఇందాక చెప్పుకున్నాం. ఆ వేగం విలువ సెకనుకి 7.9  కిమీలు. ఈ వేగాన్ని ‘ప్రథమ ఖగోళయాన వేగం’ (first astronautical velocity) అని కూడా అంటారు. ఖగోళ యానంలో మనం పరిగణించవలసిన వేగాలలో ఇది మొదటిది అన్నమాట. వేగం అంతకన్నా కాస్త పెంచితే ఆ వస్తువు భూమి నుండి శాశ్వతంగా దూరం కాదు గాని దాని కక్ష్య వృత్తా కార కక్ష్యకి బదులు దీర్ఘవృత్తాకార (elliptical)  కక్ష్యకి మారిపోతుంది. వేగం 11.2  కిమీ/సెకను వరకు కూడా దీర్ఘ వృత్తాకార కక్ష్య మాత్రమే అవుతుంది. కాని వేగం 11.2  కిమీ/సెకను ని మించిందంటే ఇక ఆ వస్తువు భూమి యొక్క గురుత్వాకర్షణ నుండి తప్పించుకుని శాశ్వతంగా భూమి నుండి దూరం అవుతుంది. అంటే భూమి నుండి పలాయనం అవుతుందన్నమాట. అందుకే ఈ వేగాన్ని ‘పలాయన వేగం’ (escape velocity) అంటారు. వస్తువు వేగం కచ్చితంగా  11.2 కిమీలు/సెకను అయితే దాని కక్ష్య పారాబోలా అవుతుంది. ఈ వేగాన్ని ‘ద్వితీయ ఖగోళయాన  వేగం’ (second astronautical velocity) అని కూడా అంటారు. ఖగోళ యానంలో మనం గుర్తించవలసిన రెండవ ముఖ్యమైన వేగం ఇది. ఆ వేగం పలాయన వేగం కన్నా ఎక్కువ అయితే ఆ వస్తువు యొక్క కక్ష్య ‘హైపర్ బోలా’ అవుతుంది.



(పై చిత్రంలో E1, E2 అని సూచించబడ్డ కక్ష్యలు దీర్ఘవృత్తాకర కక్ష్యలు.  C  అని సూచించబడ్డ కక్ష్య వృత్తాకర కక్ష్య. P అన్నది పారాబోలా ఆకరంలో ఉన్న కక్ష్య. H  అన్నది హైపర్ బోలా.)

భూమి ఉపరితలం వద్ద ఒక వస్తువు యొక్క పలాయన వేగం 11.2  కిమీలు/సెకను అన్నప్పుడు ఆ లెక్కలో సూర్యుడు ఉన్నట్టు మనం పరిగణించలేదు. కాని భూమిని వదిలి అంతరిక్షంలోకి లోతుగా పోవాలనుకునే వాహనం సూర్యుడి గురుత్వాకర్షణని కూడా తప్పించుకోవాలి. కనుక భూమి యొక్క ఆకర్షణే కాక సూర్యుడి ఆకర్షణ నుండి కూడా తప్పించుకోవాలంటే ఆ వస్తువు యొక్క వేగం 16.7  కిమీలు/సెకను అయ్యుండాలి. ఈ వేగాన్నే ‘తృతీయ ఖగోళయాన వేగం’ (third astronautical velocity) అంటారు.
గ్రహాంతర యానం చెయ్యగోరే వాహనం ఈ మూడవ ఖగోళ యాన వేగాన్ని భేదించగలగాలి.





సచేతనకి అచేతన అంటే గిట్టదు

Posted by V Srinivasa Chakravarthy Friday, November 29, 2013 0 comments




వాస్తవానికి దూరమైన అలాంటి చిత్రాన్ని (కల ద్వారా) ప్రదర్శించి అతడి అచేతన అతడికి ఏం చెప్పాలని చూస్తోంది? ఆ వ్యక్తితొను అతడి జీవితం తోను దగ్గరి సంబంధం వున్న ఓ దిగజారిన స్త్రీ అన్న భావనని అతడి అచేతన వ్యక్తం చేస్తోంది. అయితే అలాంటి భావనని అతడి భార్య మీద ఆపాదించడం వాస్తవాల దృష్ట్యా శుద్ధ తప్పు. కనుక ఆ వికృతమైన కలకి అర్థం మరింకేదో అయ్యుంటుంది.

మనలోని గ్రంథుల నిర్మాణం బట్టి ప్రతీ మనిషిలోను  స్త్రీ, పురుష అంశాలు కలగలిసి ఉంటాయని చెప్పే ఆధునిక జీవశాస్త్రం చెప్తుంది. కాని చాలా కాలం క్రితమే,  మధ్య యుగపు కాలంలో “ప్రతీ పురుషుడి లోను ఓ స్త్రీ దాగి వుంటుంది” అనే నానుడి చలామణిలో ఉండేది. మగవాడిలో ఉండే స్త్రీ అంశానికి నేను “anima” అని పేరు పెట్టాను. పురుషుడిలో దాగి వుండే ఈ స్త్రీ అంశం ఒక విధంగా ఆ వ్యక్తి తన పరిసరాలతో ఏర్పరచుకునే సంబంధాలకి, ముఖ్యంగా స్త్రీలతో ఏర్పరచుకునే సంబంధాలకి మూర్తిరూపం. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం బయటికి మామూలుగానే కనిపించొచ్చు. కాని “తన లోపల వున్న స్త్రీ” యొక్క అథమ స్థితిని అతడు బయటికి కనిపించకుండా దాచి ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు.
 పురుషుడిలో ప్రచ్ఛన్నంగా స్త్రీ తత్వం దాగి వుంటుందన్న భావనకి ప్రతిరూపం 'అర్థనారీశ్వర' అన్న భావన కావచ్చు

ఒకే వ్యక్తిలో స్త్రీ, పురుష తత్వాలు కలిసి వుండడం అనే భావనకి ప్రతిరూపం ఈ Crowned Hermaphrodite

ఇందాక చెప్పుకున్న రోగి విషయంలో సరిగ్గా అదే జరిగింది. అతడిలో స్త్రీ పార్శ్వం అంత గొప్పగా లేదన్నమాట. తన కల కూడా అతడితో అదే చెప్తోంది – “నువ్వో దిగజారిన స్త్రీ లాగా ప్రవర్తిస్తున్నావు సుమా!” అంటోంది. ఆ కలకి అతడు ఖంగు తిన్నాడు. (ఇలాంటి కలలని  చూసి మన అచేతన మనకి “నైతిక” ఆదేశాలు ఇస్తుందని భావిస్తే పొరబాటే అవుతుంది. అతడి కల అతణ్ణి “నీ ప్రవర్తన మార్చుకో” మని శాసించడం లేదు. అంతవరకు అతడి సచేతన మనస్సు అతడికి “నువ్వు చాలా పెద్దమనిషివి” అన్న అపోహ కల్పిస్తోంది. కాని అతడి అచేతన ఆ అపోహ మీద దెబ్బ కొడుతూ, అతడి చిత్తంలో ఉండే అసమతౌల్యాన్ని ఎత్తి చూపుతోంది.)

దీన్ని బట్టి స్వాప్నికులు (కలలు కనేవారు) తమ కలలని ఎందుకు పట్టించుకోరో, తమ కలలలోని సందేశాన్ని ఎందుకు లెక్కచెయ్యరో అర్థమవుతోంది. సచేతనకి అచేతన అంటే గిట్టదు. అలాగే సచేతనకి తెలియనితనం అంటే పడదు. తనకి తెలియని దాన్ని త్రోసిపుచ్చుతుంది. ఆదిమ తెగలలో తరచు కొత్త విషయాల పట్ల వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. దీన్నే మానవశాస్త్రవేత్తలు (anthropologists)  “misoneism” (నవ్యతాద్వేషం?) ఆంటారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఓ క్రూరమృగం ఎలా ప్రవర్తిస్తుందో, ఆదిమ తెగల వారు కూడా ఇంచుమించు అలాగే స్పందిస్తారు. కాని చిత్రం ఏంటంటే = “నాగరిక” జీవులు కూడా నూతన భావాల విషయంలో అలాగే ప్రవర్తిస్తారు. కొత్త భావాలు లోపలికి ప్రవేశించకుండా తమ మనసుల్లో బలమైన గోడలు ఏర్పాటు చేసుకుంటారు. అది నవ్య భావాల దాడి నుండి తమని తాము ఆత్మరక్షణ చేసుకునే ప్రయత్నం అన్నమాట. మనుషులు తమ కలలకి ఎలా స్పందిస్తారో చూసినప్పుడు, లేదా తమకి విభ్రాంతి కలిగించే ఆలోచనని ఎదుర్కున్నప్పుడు వారి స్పందన చూస్తే సరిగ్గా ఇదే కనిపిస్తుంది. తత్వ, విజ్ఞాన, సాహితీ రంగాల్లో  నూతన భావాలతో ముందుకు వెళ్లే యువతరానికి పాత భావాలని పట్టుకు వేళ్ళాడే ఛాందసుల అవరోధం, అభ్యంతరం ఎప్పుడూ ఉంటుంది. వైజ్ఞానిక రంగాలు అన్నిట్లోకి మనస్తత్వ శాస్త్రం వయసులో ఎంతో చిన్నది. ఎప్పుడూ అచేతనతో తలపడడానికి ప్రయత్నిస్తుంది కనుక అది ఎదుర్కునే అవరోధం, లేదా “misoneism”,  అంతా ఇంతా కాదు.








అధ్యాయం  37
లీడెన్ బ్రాక్ భౌగోళిక పురావస్తు ప్రదర్శన శాల

ఆ సమయంలో ప్రొఫెసర్ లీడెన్ బ్రాక్ గుండెలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో, ఎన్ని నదులు పోటెక్కి ప్రవహిస్తున్నాయో, ఎన్ని తుఫానులు చెలరేగుతున్నాయో చెప్పలేను. ఆయన ముఖంలో అలజడి, అలసట, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయొ. ఇంత శ్రమ పడ్డాక, ఇన్ని ప్రమాదాలు తప్పించుకున్నాక తిరిగి తిరిగి బయల్దేరిన చోటికే రావడమా? 

కాని మావయ్య త్వరలోనే తేరుకున్నాడు.
“విధి నన్నింత దారుణంగా దెబ్బ కొడుతుందా? పంచభూతాలన్నీ ఇలా కలిసికట్టుగా నా మీద దాడి చేస్తాయా? నా సత్తా వాటికి ఇంకా తెలీదేమో. నేనసలే మొండి వాణ్ణి. మడమ తిప్పకుండా పోరాడడం నా రక్తంలోనే వుంది. ఈ పోరాటంలో ప్రకృతి గొప్పదో, మనిషి గొప్పవాడో తేలిపోవాలి.”

ఓ బండ మీద నించుని పళ్లు కొరుకుతూ, పిడికిలి కోపంగా ఊపుతూ, శివాలెత్తిపోతున్నాడు మావయ్య. వెళ్లి ఏదో ఒకటి చెయ్యాలి. వేడి కొంచెం చల్లార్చాలి.
“మవయ్యా!” దగ్గరికి వెళ్లి నెమ్మదిగా అన్నాను. “ఆశకి కుడా అంతుండాలి. అసంభవాన్ని మనం సంభవం చెయ్యలేంగా? నాలుగు కట్టెముక్కల కట్ట మీద ఎక్కి ఐదొందల కోసుల దూరం పోటెక్కిన సముద్రం మీద ప్రయాణించడం అంటే మాటలా? అసలు ఇప్పటి దాకా ప్రాణాలతో ఉండడం అంటేనే గొప్ప.”
అలా ఓ పది నిముషాల పాటు అనునయిస్తూ ఏవేవో మాట్లాడాను. నా మాటలు మావయ్య చెవికి ఎక్కించుకుంటాడని కాదు. ఏదొ నా పిచ్చి నాది.

“పడవ సిద్ధమయ్యిందా?” రంకె వేశాడు మావయ్య.
ఇంత సేపు నేను పెట్టుకున్న మొర అంతా బూడిదలో పోసిన పన్నీరే. మరి మావయ్యది వజ్ర సంకల్పం. దాని కేసి తల బాదుకుంటే బొప్పి కట్టేది దానికి కాదు.
ఇది చాలనట్టు హన్స్ అప్పటికే పడవ మరమ్మత్తు పూర్తి చేశాడు. ఈ విచిత్ర జీవికి మావయ్య ఏం ఆలోచిస్తున్నాడో చెప్పకుండానే తెలుసుపోతోందో ఏంటో? దొరికిన సరంజామాతో ఓ పడవ లాంటిది సిద్ధం చేశాడు. గాలికి తెరచాప అప్పటికే రెపరెప లాడేస్తోంది.

వీళ్లిద్దర్నీ ఆపడం ఎలా? వీళ్ల మనసులు మార్చేదెలా? హన్స్ స్వామిభక్తి చూస్తుంటే నాకు ఒళ్లు మండిపోతోంది. వాళ్ల వెంటే తోకాడించుకుంటూ వెళ్లడం తప్ప నాకు వేరే మార్గం కనిపించడం లేదు.
అందరం బయల్దేరబోతుంటే ఉన్నట్లుండి మావయ్య నా భుజం మీద చెయ్యేసి,
 
“ఇవాళొద్దు. రేపు బయల్దేరుదాం,” అన్నాడు.
విధి బలీయం అని మనసులోనే అనుకున్నాను.
“ఏ కారణం చేతనో మరి విధి నన్ను ఈ తీరానికి లాక్కొచ్చింది. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన దాకా ఇక్కడి నుండి బయల్దేరేదే లేదు,” మావయ్య నిశ్చయంగా అన్నాడు.
(ఇంక వుంది)



హార్మోన్లతో కణాల "కబుర్లు"

Posted by V Srinivasa Chakravarthy Wednesday, November 27, 2013 0 comments



కణం లోపలి అంశాలే కావు, కణం చుట్టూ గోడలా వుందే … ఈ పై పొర… ఇందులో కూడా చాల విశేషం వుందండోయ్. గోడ అంటే మళ్లీ ఏంటో అనుకునేరు. దీని మందం కేవలం 0.0000001  మిల్లీమీటర్లు! మొదట్లో శాస్త్రవేత్తలు ఈ పొర కేవలం మీరు వెచ్చాలు తెచ్చుకునే  ప్లాస్టిక్ సంచీ లాంటిది  అనుకునేవారు. కాని తదనంతరం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో ఈ పొరని నిశితంగా పరిశీలించడం మొదలెట్టాక అర్థమయ్యింది దాని సత్తా ఏంటో. కణపొర (cell membrane)  అంటే వట్టి గోడ కాదు.  అందులో ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాలకి ద్వారపాలకులు ఉంటారు.  కణం అనే ఊళ్లోకి ఎవరు రావాలో, బయటికి ఎవరు పోవాలో అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఎవడు పడితే వాడు లోపలికి చొరవగా తోసుకురాకుండా ఈ ద్వారపాలకులు ఓ కన్నేసి ఉంచుతారు. అందుచేతనే కణం లోపలి పర్యావరణం అంతా కచ్చితంగా నియంత్రించబడుతుంది.  కణంలో వివిధ లవణాలు, నీరు, ఇతర కర్బన సంయోగాలు అన్నీ సరైన మోతాదులో ఉంచడానికి వీలవుతుంది.  అలా కట్టడి చెయ్యకపోతే జీవితం దుర్భరం అయిపోతుందన్నమాట.

ఇప్పుడు ప్రొటీన్లనే తీసుకోండి. అవి బయటి నుండి రావు. కణంలో  ఉండే కొన్ని కర్మాగారాలలో అవి ఉత్పత్తి అవుతాయి. వాటి తయారీకి కావలసిన ముడి సరుకు బయటి నుండి ఊళ్లోకి వస్తాయి. అలా ఊళ్లోకి వచ్చేది మన సరుకు, మంచి సరుకు అయితే ద్వారపాలకులు తలుపులు తీసి పట్టుకుంటారు. దొంగసరుకైతే టక్కున తలుపు లేసేస్తారు. అదన్నమాట.

ఈ రోజుల్లో ప్రతీ చోట సెక్యూరిటీ వాళ్ళు ఐ.డీ., ఐ.డీ అని యాగీ చేస్తుంటారు చూడండి. మేం కూడా కొంచెం అంతేనన్నమాట. మాలో ప్రతీ వాడికి ఓ ఐ.డీ. లాంటిది వుంటుంది. దగ్గరికి కొస్తున్నోడు మనోడో కాదో ఆ ఐ.డీ. చూసి పట్టేయొచ్చు. ఎవడు పడితే వాడు దూకుడు మీద దగ్గరికి కొచ్చేస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది కదండీ మరి. ఇప్పుడూ… ఓ సారి మీరే ఆలోచించండి… నేనేమో కళ్లలో ఉండే కడ్డీ కణం గాణ్ణి.  ఓ వెంట్రుక కణం గాడు వద్దన్నా వచ్చి అంటుకుపోతున్నాడు అనుకోండి. చెవుల్లో వెంట్రుకల గురించి విన్నాం గాని, కళ్ల లోంచి వెంట్రుకలు పొడుచుకొచ్చేస్తుంటే… భయమేయదటండి?

ఎప్పుడూ బోరు కొట్టకుండా మేం ఇరుగు పొరుగు కణాలతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. కబుర్లు అంటే మాటలతో కాదనుకోండి. అణువులని ఒకరి మీద ఒకరు విసురుకుంటూ చెప్పుకుంటాం. వట్టి కబుర్లేంటి ఏకంగా బృంద గానాలు పాడేసుకుంటాం. ఇప్పుడు మీ గుండెనే తీసుకోండి. అది పాపం అడ్డు అదుపు లేకుండా   నిముషానికి  72  సార్లు కొట్టుకుంటూ వుంటుంది కదా? అంటే ఏంటనుకుంటున్నారు? గుండె లో కణాలన్నీ కలిసికట్టుగా అలా ఒకే వేగంతో కొట్టుకుంటున్నాయన్నమాట. అలాంటి సామరస్యం ఈ “కబుర్ల” వల్లనే వీలయ్యింది. అదే గుండె కణాలన్నిటీ వేరు వేరుగా ఓ పళ్ళెం లో పేర్చి కొట్టుకోమన్నాం అనుకోండి. భావకవుల్లాగా ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఏదో  పాడేసుకుంటుంటాడు. ఒకడి పాటకి మరొకడి పాటకి మరి పొంతన వుండదు.

మీరు సెల్ ఫోన్లు వాడుకున్నట్టు దూర దూరాలకి సందేశాలు పంపడానికి మేం హార్మోన్లు వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీ ఒంట్లోనే షుగరు ఉల్లిపాయల ధరలాగా అలా పెరిగిపోతోంది అనుకోండి. మీలో  పాంక్రియాస్ అంజెప్పి ఉంటుంది లేండి.. ఆ గ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ కి జీవితంలో తెలిసిందొక్కటే. చక్కెర అణువులు కనిపిస్తే చావచితక బాదడం. అప్పుడు మీ ఒంట్లో చక్కెర తగ్గుతుంది. అలాగే మీరు ఉన్నట్లుండి మీ కంప్యూటర్ మీద విరక్తి పుట్టుకొచ్చి, లేచి అలా ఓ సారి జాగ్ చేసి రావాలని అనుకున్నారు అనుకోండి. మరి దానికి శక్తి కావాలిగా. అప్పుడు మీ ఒంట్లోని థైరాయిడ్ గ్రంథేమో హార్మోన్ల ద్వార మీ కణాలకి సందేశం పంపుతుంది – “మనోడు పరిగెడతాట్ట. కాస్త ఏటీపీ ఉత్పత్తి పెంచండ్రా బాబూ!”

ఇన్ని మంచి పనులు చేసే మాలంటోళ్లకి కూడా శత్రువులు ఉంటారండోయ్! వాళ్లని వైరస్ లు అంటారు (చిత్రం). వీటికి మంచి, చెడు, భయం, భక్తి ఏం ఉండవ్. అసలు వీటికి మైటోకాండ్రియా కూడా ఉండవ్. ఎప్పుడైనా మా ద్వారల వద్ద ఉండే ద్వారపాలకులు నిద్రపోయారనుకోండీ, లేదా పోయారనుకోండి. ఇదే అదను అనుకుని వీళ్ళు లోపలికి దూరిపోతారు. ఒక సారి లోపలికి వచ్చాక ఇక కోటలో పాగా వేసి సంతానాన్ని విపరీతంగా పెంచేస్తారు. ఇక అంత సంతానానికి తిండి పెట్టలేక పాపం ఆ కణం పెటేలున పేలిపోతుంది. అప్పుడు ఆ కణం పొట్ట చీల్చుకుని బయటికి వచ్చిన వైరస్ సంతతి ఇరుగు పొరుగు కణాల మీద పడతాయి. అలా ఈ వైరస్ లు ఒక కణం నుండి అవతలి కణానికి వ్యాపిస్తూ, సంఖ్యలో వృద్ధి చెందుతూ కోట్ల కణాలని నాశనం చేస్తూ పోతాయి. అరె! ఏంటి… భయపడిపోతున్నారేంటి? ఛ ఛ భలే వారే. వైరస్ లు రెచ్చిపోతే మేం ఊరికే కూర్చుంటామా? మాలో పోలీస్ కణాలు వెళ్లి ఈ వైరస్ లని చితక్కొట్టవూ? అవే లేకపోతే మీ గతేం అయ్యుండేదో ఓ సారి ఆలోచించండి.

సెల్ఫ్ డబ్బా అనుకోకపోతే ఓ మాటంటా నండి. మీరేమో ఉన్నది పట్టున ఒక బిలియన్ మంది. ఒక్క విషయం మీద కూడా అంతా కలిసి రాలేక అల్లకల్లోలం చేసుకుంటుంటారు. మరి మేమేమో 60  ట్రిలియన్ల కణాలం. అందరం ఎంత సామరస్యంగా (గడిగడికి మరొకడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేకుండా) ఎవడి పని వాడు చేసుకుంటూ,  ఎవడు, ఎక్కడ, ఎప్పుడు, ఏం చెయ్యాలో తెలుసుకుని ఆ పని శ్రద్ధగా చేసుకుపోతూ ఉంటాం.  ఎంతైనా మేం వేరు లేండి. మాలాగా ఉండడం… మీర తరం కాదులేండి పోండి!
(‘కణం’ అధ్యాయం సమాప్తం)











మెదడులో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క క్రియకి బాధ్యత వహిస్తుంది అని భావించాడు ఫ్రాన్జ్ గాల్. అంతేకాదు. మెదడులో ఆ ప్రాంతం యొక్క పరిమాణం ఆ వ్యక్తిలో ఆ లక్షణం యొక్క గాఢత మీద ఆధారపడి వుంటుంది అన్నాడు. ఉదాహరణకి మెదడులో ఒక ప్రాంతం వ్యక్తిలోని దయా గుణాన్ని శాసిస్తుంది అనుకుందాం (నిజానికి అలంటిదేం లేదు, కాని మరి గాల్ ఇలాంటి కమ్మని కథలే చెప్పేవాడు!). ఆ వ్యక్తి విపరీతంగా దయాగుణం గల వాడైతే అతడి మెదడులో ఆ ‘దయాగుణ ప్రాంతం’ బాగా విస్తారంగా ఉంటుందన్నమాట. అదే బాగా కుటిల, సంకుచిత స్వభావం గల వాడిలో అయితే అదే ప్రాంతం బాగా కుంచించుకుపోయి వుంటుంది. అక్కడితో ఆగక గాల్ తన వాదనలో మరో మెట్టు ఎక్కాడు. వ్యాకోచించిన మెదడు ప్రాంతాలు (ఇక వ్యాకోచించడానికి స్థలం లేక కాబోలు!) చుట్టూ వున్న కపాలం మీద ఒత్తిడి చేస్తాయి. దాంతో కపాలం యొక్క ఆకారంలో కూడా మార్పులు వస్తాయి. ఆ కారణం చేత విస్తారమైన ‘దయాగుణ ప్రాంతం’ ఉన్న వ్యక్తిలో ఆ ప్రాంతానికి పైన వున్న కపాలం కాస్త ఉబ్బెత్తుగా  ఉంటుందన్నమాట. కనుక తల మీద బొడిపెలు ఎక్కడెక్కడ వున్నాయో చూస్తే, దాని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చు అనేవాడు గాల్. (అందుచేత తిరుపతి నుండి తిరిగొచ్చిన వారి చరిత్ర అంతా ఓ తెరిచిన పుస్తకం అవుతుంది!). 


గాల్ రూపొందించిన ఈ చిత్రమైన శాస్త్రం పేరు Phrenology (మస్తక విజ్ఞానం). ఇదంటే గిట్టని వాళ్ళు దీన్ని bumpology (బొడిపెల శాస్త్రం) అని కూడా అనేవారు. ఆది నుండీ కూడా ఈ శాస్త్రాన్ని ఓ కుహనా శాస్త్రం గానే ఎరిగినవారు పరిగణించేవారు. అయినా జ్యోతిష్యం, హస్తసాముద్రికం మొదలైన రంగాల లాగానే ఈ రంగానికి ప్రజలలో ఒక వర్గం నుండి గొప్ప ఆదరణ ఉండేది. ఆ ఆదరణ ఇటీవలి కాలం వరకు కూడా నిలిచింది. (ఫ్రీనాలజీ ‘నిపుణుల’ ఆదాయం చూసి కన్ను కుట్టి కాబోలు, 2007  లో అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రం ఫ్రినాలజీ సేవల మీద పన్ను విధించింది!)

అశాస్త్రీయమే అయినా ఫ్రీనాలజీ ఓ ఆసక్తికరమైన ప్రక్రియ. తెలియక చేసినా అది సరైన దిశలోనే అడుగు వేసింది.  మెదడులో వివిధ క్రియలు వివిధ ప్రాంతాల చేత శాసించబడతాయి అనే విలువైన భావనకి అది శ్రీకారం చుట్టుంది. ఈ భావనకే “ప్రాంతీయకరణ” (localization)  అని పేరు. “అన్నిటికీ ఆత్మే మూలం” అనే సిద్ధాంతం కన్నా “మెదడులో వివిధ ప్రాంతాలు వివిధ క్రియలు నెరవేరుస్తాయి” అనే భావన మరింత శాస్త్రీయమైనది. ఎందుకంటే ఈ రెండవ సిద్ధాంతాన్ని ప్రయోగం చేసి పరీక్షించడానికి వీలుంది. అయితే భావన శాస్త్రీయమే అయినా అందులోని వివరాలు శాస్త్రీయం కావు. ఎందుకంటే మెదడులో ఏ భాగం ఏ పని చేస్తుంది అన్న ప్రశ్నకి సమాధానంగా ఫ్రీనాలజిస్టులు ఏవో నిరాధారిత ఊహాగానాలు అల్లారే తప్ప ఆ విషయాన్ని నిశితంగా, ప్రయోగాత్మకంగా తేల్చలేదు. అలా తేల్చాలంటే భౌతిక శాస్త్ర నియమాలని క్రమబద్ధంగా మెదడుకి ఆపాదించి పరీక్షించాలి. అయితే ఫ్రీనాలజీ పుట్టిన నాటీకి, అంటే పద్దెనిమిదవ శతాబ్దపు చివరి దశలో, భౌతిక శాస్త్రం యొక్క అభ్యున్నతి కూడా అంతంత మాత్రంగానే వుంది. అందుకే భౌతిక, జీవ శాస్త్రాలలో వివిధ రంగాలు పురోగమిస్తున్న కొద్ది, అందుకు సమాంతరంగా మెదడు పట్ల మన అవగాహన కూడా క్రమంగా పురోగమించింది.
విజ్ఞాన శాస్త్రంలో ఏఏ విభాగాలలో జరిగిన పురోగతి వల్ల నాడీ విజ్ఞానం ఎలా లబ్ది పొందిందో చూద్దాం.

శరీరనిర్మాణ శాస్త్రం (anatomy):
మెదడు యొక్క నిర్మాణం గురించి స్థూల పరిజ్ఞానం ఇంచుమించు రెండు వేల ఏళ్లుగా ఉంది. కాని మెదడు లోని సూక్ష్మం అంతా సూక్ష్మస్థాయిలో, అంటే కణాల స్థాయిలోనే వుంది. కనుక సూక్ష్మ ప్రపంచాన్ని చూడగల పరికరాల రూపకల్పన వల్ల మెదడుని సూక్ష్మ స్థాయిలో పరిశీలించడానికి వీలయ్యింది. రాబర్ట్ హూక్ నిర్మించిన సూక్ష్మదర్శిని (microscope)  సహాయంతో జీవప్రపంచాన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలించడానికి సాధ్యం అయ్యింది. ఈ కొత్త పరికరంతో హూక్ క్రిమికాటకాలు, పక్షి ఈకలు ఇలా జీవ ప్రపంచానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వస్తువులని స్పష్టంగా పరిశీలించాడు. తను చూసిన వింత లన్నిటినీ ఇంపైన చిత్రాలుగా వేసి Micrographia అనే పుస్తకంలో 1665  లో పొందుపరిచాడు.
హూక్ శంకుస్థాపన చేసిన ఈ సూక్ష్మదర్శక సాంప్రదాయాన్ని  ఆంటాన్ వాన్ లీవెన్హాక్ మరింత ముందుకు తీసుకుపోయాడు.  1683  లో ఓ రోజు ఇతగాడు తన సొంత ఉమ్మిని సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తున్నాడు. ఆ సందర్భంలో తనకి కనిపించిన దాన్ని ససేమిరా నమ్మలేకపోయాడు. “ఆ పదార్థంలో బోలెడన్ని చిన్ని చిన్ని జంతువులు చక చకా కదులుతున్నాయి,” అంటూ తను చూసిన దాన్ని అభివర్ణించాడు. ఆ ‘చిన్ని చిన్ని జంతువులని’ వర్ణించడానికి animalcules  అనే పదం వాడాడు. ఆ విధంగా లీవెన్హాక్ మొట్టమొదటి జీవకణాలని కళ్లార చూసివాడయ్యాడు. తదనంతరం ఓ నాడీ తీగని పరిచ్ఛేదించి ఆ పరిచ్ఛేదాన్ని సూక్ష్మదర్శినిలో చూశాడు.

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts