గాల్లో ఎగిరే
వాహహాన్ని విమానం అన్నట్టే అంతరిక్షంలో ఎగిరే వాహనాన్ని అంతరిక్షనౌక అని, లేదా వ్యోమ
నౌక అని అంటాం. అలాగే గాల్లో ప్రయాణించడానికి
సంబంధించిన శాస్త్రాన్ని వైమానిక శాస్త్రం (aeronautics) అన్నట్టే అంతరిక్షంలో ప్రయాణించే శాస్త్రాన్ని ఖగోళయాన
శాస్త్రం (astronautics) అంటారు. ఈ ఖగోళయాన శాస్త్రానికి పునాదిగా రెండు పురాతన శాస్త్రాలు
ఉన్నాయి – అవి ఖగోళశాస్త్రం (astronomy) మరియు
రాకెట్ శాస్త్రం (rocketry).
గ్రహాలు సూర్యుడి
చుట్టూ తిరుగుతాయని, భూమి చుట్టూ కాదని కోపర్నికస్ నిరూపించాడు. గ్రహచలనాలలో అంతర్లీనంగా
వున్న కొన్ని నియమాలని గుర్తించిన కెప్లర్ వాటిని సూత్రీకరించాడు. గ్రహాలు మాత్రమే
కాక సమస్త ఖగోళ వస్తువుల చలనాలని వర్ణించగల మౌలిక భౌతిక సూత్రాలని కనుక్కున్నాడు న్యూటన్.
గాల్లోకి విసరబడ్డ వస్తువు, తగినంత బలంగా విసరబడినట్టయితే అది తిరిగి భూమ్మీద పడకుండా
భూమి చుట్టూ ఓ కృత్రిమ చందమామలా పరిభ్రమణం చేస్తూ ఉండే అవకాశం వుందని న్యూటన్ ఆనాడే
సూచించాడు. అంతేకాకుండా ఆ వస్తువుని ఇంకా బలంగా విసిరితే అది పూర్తిగా భూమి ఉపరితలాన్ని
వొదిలేసి అంతరిక్షంలోకి ప్రవేశించే అవకాశం కూడా ఉందని గుర్తించాడు న్యూటన్.
కోపర్నికస్ సిద్ధాంతం,
కెప్లర్ నియమాలు, న్యూటన్ నియమాలు – ఇవన్నీ కూడా ఆధునిక ఖగోళయాన శాస్త్రానికి ఎంతో
ముఖ్యమైనవి. చంద్రుడు, భూమి, గ్రహాలు మొదలైన వస్తువులు అంతరిక్షంలో కదిలినట్టే అంతరిక్షనౌకలు
కూడా అంతరిక్షంలో కదులుతాయి. రెండిటినీ శాసించే నియమాలు ఒక్కటే.
ఓసారి రాకెట్ల
చరిత్రని క్లుప్తంగా సమీక్షిద్దాం. మనకి తెలిసినంత వరకు చరిత్రలో మొట్టమొదట రాకెట్లని
వినియోగించిన వాళ్లు చైనీయులు. మన దీపావళి రాకెట్లని పోలిన తారాజువ్వలని పండగ దిన్నాల్లో కాల్చే ఆచారం చైనాలో అనాదిగా వస్తోంది.
ఇక మధ్యయుగంలో చైనాలో రాకెట్లని యుద్ధప్రయోజనాలకి వాడిన దాఖలాలు వున్నాయి.
అయితే ఈ
రాకెట్లలో ఇంధనం పొడిరూపంలో వుంటుంది. పదహారో శతాబ్దపు చివరి దశల్లో సంకీర్ణ ఇంధనాన్ని
(పొడి + ద్రవం) వాడిన రాకెట్ల యొక్క వర్ణన, వాటిని ప్రకటించే చిత్రాలు ఉన్నాయి. పదిహేడవ
శతాబ్దపు మధ్యలో రాకెట్లని తమ గతిలో స్థిరపరిచేందుకు గాను చిన్న రెక్కలని (fins) వాడినట్టుగా
అప్పటి రాకెట్ల చిత్రాలు చెప్తున్నాయి.
పదిహేడవ శతాబ్దపు
తొలి దశలలో రష్యా రాకెట్ తయారీలో మొదటి అడుగులు వేసింది. అంతరిక్షంలో రాకెట్ యానం గురించి
సిద్ధాంతాన్ని రూపొందించిన అగ్రహామి ‘కె.ఇ. సియోల్కోవ్ స్కీ’ (1857-1935). ఖగోళయాన
శాస్త్రానికి ఇతడే పితామహుడు అని చెప్తారు. ద్రవ్య ఇంధనం మీద పని చేసే రాకెట్ల మొట్టమొదటి
డిజైన్లు ఇచ్చింది కూడా ఇతడే. ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించిన ఎందరో అగ్రగాములు
ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖులు… ఫ్రాన్స్ కి చెందిన రాబర్ట్ ఎనాల్ట్ – పెల్టెరీ,
జర్మనీకి చెందిన హర్మన్ ఓబెర్త్, అమెరికాకి చెందిన రాబర్ట్ గోడార్డ్, జర్మనీకి చెందిన
ఈ. సాంగర్ మొదలైనవారు.
గోడార్డ్ రూపొందించిన
ద్రవ్య ఇంధనపు రాకెట్ 1926 లో గాల్లోకి ఎగిరింది.
వెనకటి సోవియెట్ లో మొట్టమొదటి ద్రవ్య ఇంధనపు రాకెట్ 1933 లో గాల్లోకి లేచింది.
1930 లలో ఎగరేయబడ్డ రాకెట్లు ఎగిరిన అత్యున్నత ఎత్తు
కేవలం 13
కిమీలు. 1952 నాటికి ఆ రికార్డు 217 కిమీలకి, 1955
నాటికి 288 కిమీలకి పెరిగింది.
మరింత సంక్లిష్టమైన
నిర్మాణం గల, సంకీర్ణ ఇంధనం మీద పని చేసే రాకెట్ల వినియోగంతో మరింత మెరుగైన ఫలితాలు
వచ్చాయి. ఇలాంటి రాకెట్లు 1950 ల చివరి దశలో
1000 కిమీలు పైగా ఎత్తుకి ఎగిరాయి. అయితే మన
లక్ష్యం గ్రహాంతర యానం అయితే ఈ దూరం ఏపాటిదీ కాదు. మనకి అతి దగ్గర్లో ఉన్న ఖగోళనేస్తం
చంద్రుడు కూడా ఆ దూరానికి కొన్ని వందల రెట్ల దూరంలో వున్నాడు. ఇక అతి దగ్గరి గ్రహం
ఆ దూరానికి కొన్ని పదుల వేల రెట్ల దూరంలో వుంది.
మరింత మెరుగైన
రాకెట్ల వినియోగంతో ఆ దూరాన్ని ఎలా దాటాలో ముందు ముందు చూద్దాం.
(ఇంకా వుంది)
Interesting topic. Waiting for the remaining parts.
Thanks for the efforts.
Srinivas