శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

నేను… మీ శరీరాన్ని

Posted by V Srinivasa Chakravarthy Thursday, November 7, 2013



నేను… మీ శరీరాన్ని

I’m Joe’s Body  అనేది శరీరం గురించి, దేహ క్రియల గురించి రాయబడ్డ ఓ అద్భుతమైన పుస్తకం. దీని రచయిత JD Ratclliffe. దేహక్రియలు (అంటే  physiology)  మీద పుస్తకం అంటే ఎంత పుస్తకపఠనా పరాయణులైనా ఆత్రంగా తీసి చదివే అవకాశం కన్నా ‘బోరు’ మని ఏడ్చే అవకాశమే ఎక్కువ. కాని ఈ పుస్తకం చాలా ప్రత్యేకం. శరీరంలో ప్రతీ అంగం గురించి అత్యంత ఆసక్తికరంగా, సమంజసమైన, సందర్భోచితమైన హాస్యాన్ని చొప్పిస్తూ అద్బుతంగా రాశాడు రచయిత.
దీన్ని Readers’ Digest  వాళ్లు ప్రచురించారు.  అందులో ‘కణం’ గురించిన అధ్యాయం యొక్క స్వేచ్ఛానువాదం…


కణం
హలో! నా పేరు కణం, జీవకణం. కణం అంటే అదేదో ఇంత చిన్నిగా ఉంటుందని చులకన చెయ్యకండేం. నేనో పెద్ద నగరం లాంటి దాన్ని. నాలో డజన్ల కొద్ది విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు ఉంటాయి. రహదార్లు ఉంటాయి. రవాణా సదుపాయాలు ఉంటాయి. సమాచార మాధ్యమాలూ ఉంటాయి.  ముడి సరుకుని దిగుమతి చేసుకోవడం, వాటి నుండీ ఉత్పత్తులు తయారు చేసుకోవడం, ఆ పరిణామంలో పుట్టిన వ్యర్థాలని తగు రీతిలో వొదిలించుకోవడం – ఇవన్నీ నాలో అనుక్షణం జరుగుతుంటాయి. నాలో గొప్ప నగర పాలక వ్యవస్థ కూడా వుంది. దీంతో నాలోకి ఏ ఆగంతుకులూ ప్రవేశించకుండా కట్టుదిట్టం చేసుకున్నాను.



ఇంత చిన్న శాల్తీలో ఇంత తతంగమా?  నమ్మబుద్ది కావడం లేదు కదూ? నాలోని ఈ మహానగరాన్ని చూడాలంటే అసలు సిసలైన మైక్రోస్కోప్ కావాలండోయ్. మీ శరీరంలో నేనో కణాన్ని. నా లాగా ఇంకా మీ శరీరంలో… ఓ 60,00,00,00,000 కణాలు ఉంటాయన్నమాట. జీవ పదార్థంలోని ఓ మౌలికమైన అంశం కణం.

కణం, కణం అంటే మేమంతా అచ్చం ఒక్కలాగే ఉంటామని ఊహించుకోకండి. గండుపిల్లికి గంగిరెద్దుకి ఎంత తేడా ఉంటుందో, మాలో కూడా అంత వైవిధ్యం ఉంటుంది. మేం రకరకాల సైజుల్లో వస్తాం. మాలో కొందరు జమాజట్టీల్లాంటి వాళ్లు ఉన్నారు. ఆ మహాకణాలైతే ఆస్ట్రిచ్ పక్షి గుడ్డు అంత ఉంటాయి. అలాగే మాలో చాలా చిట్టి కణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఓ గుండి సూది మొన మీద మాలాంటోళ్లని ఓ 10 లక్షల మందిని వరసాగా కూర్చోబెట్టేయొచ్చన్నమాట. సైజులోనే కాక షేపులో కూడా మరి తేడాలున్నాయండి  - పళ్ళేల్లాగ, కడ్డీల్లా, బంతుల్లా … రకరకాల ఆకారాలు మావి.

నిజం చెప్పాలంటే నండి, మేమే గాని పూనుకోక పోతే మీరు పెద్దగా ఊడబొడిచేదేం ఉండదండి. ఆఫీస్ కని బయల్దేరుతూ మీరు స్టయిల్ గా ల్యాప్ టాప్ బాగ్ భుజానికి ఎత్తుకుంటారు చూడండి. అదంతా మీ చేతుల్లో చేవ అనుకుంటారేమో. కాదండి బాబు. అది చేసేది మావాళ్లే. కండరాల్లో ఉండే చాంతాడంత కణాలు.

ఇవళ బాస్ తో మీటింగ్… కనుక నీలం చొక్కా వేసుకోవాలా, తెల్ల చొక్కా వేసుకోవాలా అని మీరు బుర్ర బాదేసుకుంటూ ఉంటారు చూడండి. అప్పుడు మా వాళ్లు – అదేలేండి మెదడులో మా న్యూరాన్ సోదరులు – తర్జనభర్జనలు పడిపోతుంటారన్నమాట.

అలాగే మీరు మీటింగ్ లో కాస్త ఇదిగా కనిపించాలని ఇవాళ ఇలాగైనా గడ్డం గీసుకోవాలని నిర్ణయించుకున్నారనుకోండి. అక్కడ పన్లోకి దిగేది తలలోని మా న్యూరాన్ నేస్తాలు,  చేతిలోని మా కండరపు తీగ తమ్ముళ్లూను. అసలంతెందుకు… మీరు గీసే ఆ గడ్డం మరెవరో కాదండి. కీర్తిశేషులైన మా వెంట్రుక కణ వీరులే!

ఇక నా విషయానికొస్తే నన్ను rod cell  అంటే కడ్డీ కణంగాడు అంటారండి.  నేను మీ కళ్లలో ఉంటానన్నమాట. మీరు ఓ ఆమావాస రాత్రి పూట, సుభ్రంగా తినేశాక, ఆరుబయట నడుం వాల్చేసి, పైన మినుకుమినుకు మంటున్న తారని చూస్తూ పడుకున్నప్పుడు, ఆ తార నుండి వచ్చిన ఓ చిన్న కాంతి చుక్క మీ కంట్లోకి దూరినప్పుడు, నేనా చిన్నారి కాంతి బొట్టుని జారిపోకుండా భద్రంగా పట్టుకుని, దానికి ఓ విద్యుత్ సంకేతంగా మార్చేసి, ఆ  సంకేతాన్ని మీ మెదడుకి పంపితే, అప్పుడు మీ మెదడు “అబ్బ! తార!” అని కళ్లింత చేస్తుందన్నమాట!

(ఇంకా వుంది)

3 comments

  1. Anonymous Says:
  2. చాలా చాలా బాగుందండీ.
    పోస్ట్ చేసిన తేదీని కూడా పైన వ్రాస్తారని కోరుకుంటూ ....:-)

     
  3. Sujata M Says:
  4. Love this love this.. Super effort. I have this book with me for years. I really feel its quite useful. I congratulate you for your good thinking and hard work, which serves a good purpose.

     
  5. Thank you anonymous garu, Sujata garu!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts