మీ కళ్లలో నాలాంటోళ్లు - ఒకరు ఇద్దరు కారండి – మొత్తం 250 మిలియన్ల కడ్డీ కణం గాళ్ళు ఉంటారన్నమాట. ఇప్పుడు
కాంతి కణం గభాల్న మీద పడ్డప్పుడు దాన్ని విద్యుత్ సంకేతంగా మార్చడానికి ఒక ప్రత్యేకమైన
వర్ణద్రవ్యం (pigment) ఉంటుంది. ఒక్కొక్క కడ్డీ కణంలో ఈ పిగ్మెంట్ అణువులు ఓ 30 మిలియన్లు
ఉంటాయి మరి. ఈ పిగ్మెంట్ అణువులే కాంతికి స్పందించి దాన్ని విద్యుచ్ఛక్తిగా మారుస్తాయి.
మరి ఒక కణంలో అన్ని పిగ్మెంట్ అణువులు ఉన్నాయంటే ఆ కణం బోలెడంత విద్యుచ్ఛక్తిని పుట్టిస్తుంది
కదా? మరి అంత విద్యుచ్ఛక్తి గాల్లోంచి ఏదో మెరుపులా ఊడి పడదు కదండీ మరి. దానికి కావలసిన
శక్తంతా… మైటో కాండ్రియా అని జెప్పి ఉంటాయి లేండి మిరపకాయి బజ్జీల్లా… వాటి లోంచి వస్తుందన్నమాట.
వీటికి శక్తి ఎక్కణ్ణుంచి వస్తుందని అడగరేం? ఇవి మన రక్తం నుండి వచ్చే గ్లూకోసు, ఆక్సిజను
తీసుకుని వాటి నుండి ఏటీపీ (ATP) అనే అణువును తయారు చేస్తాయి. దీని పూర్తి పేరు Adenosine
TriPhosphate. ముద్దుగా ఏటీపీ అనేస్తూ ఉంటారు.
మన దేశంలో ఎలాగైతే రూపాయి చేతిలో పెడితే గాని పని జరగదో, మీ దేహంలో ప్రతీ కణం లోను
ఈ ఏటీపీ లేకపోతే పని జరగదు. ఎంత మహమ్మారి కణమైనా ఏటీపీ లేకపోతే పప్పుసుద్దలా పడుకోవడం
తప్ప పీకేది, పాకేది ఏం వుండదు.
ఏటీపీ అణువును
ఓ చిన్న బ్యాటరీలా ఊహించుకోవచ్చు. బాటరీ లో కాస్తంత శక్తి వున్నట్టే ఈ ఏటీపీ అణువులో
ఓ చిటికెడు శక్తి వుంటుందన్నమాట. ఎక్కడ శక్తి అవసరమైనా అక్కడికి ఈ ఏటీపీ అణువులు చేరిపోతాయి.
గుండె కొట్టుకోడానికైనా, రెప్ప వేయడానికైనా, తిన్నది అరగడానికైనా, తినడానికైనా, అనడానికైనా
… శరీరంలో శక్తి అవసరమైన ఏ సందర్భంలోనైనా ఆ శక్తి ఈ ఏటీపీ అణువుల నుండే వస్తుంది. మీరు
ఏమీ చెయ్యకుండా హాయిగా నిద్రపోతున్నప్పుడు కూడా మీ శరీరంలోని మా కణసోదరులు తెగ శ్రమపడిపోతూ
ఈ ఏటీపీ అణువులని తెగ తగలేస్తుంటారన్నమాట. నిద్దరోతున్నప్పుడు మీ దేహాన్ని వెచ్చగా
ఉంచాలన్నా, మీ తలలో కలలు గలగలా కదలాడాలన్నా, గుండె కొట్టుకోవాలన్నా, నెత్తురు ఉరకలు
వెయ్యాలన్నా – ఏటీపీని మండించి శక్తిని పుట్టించాల్సిందే. ఆ విధంగా మీ శరీరంలో ఏటీపీని
తగలెట్టే కార్యక్రమం నిరంతరాయంగా మీరు ఉన్నంత కాలం కొనసాగుతూనే ఉంటుంది.
ATP అణు విన్యాసం
మా కణ సోదరులు
అందరిలోనూ (ఇంచుమించు) ఈ మిరపకాయ బజ్జీ మైటోకాండ్రియాలు ఉంటాయి. అయితే అవి లేని కొందరు
అభాగ్యపు తమ్ముళ్లు లేకపోలేరు. ఉదాహరణకి రక్త కణాలు. ఓ టొమాటోని చప్టా చేసినట్టు ఉంటాయి
ఈ కణాలు. ఈ కణాలకి ఊరికే నెత్తుటి నదిలో కొట్టుకుపోవడం (అలా కొట్టుకుపోతూ ఆక్సిజన్
ని మోసుకుపోవడం) తప్ప పెద్దగా పనేం వుండదు. అందుకే ఈ కణాలలో మైటోకాండ్రియా ఉండవు.
మా కణాలందరి
లోకి ప్రత్యేకమైన కణం అండ కణం. ప్రతీ వ్యక్తికి అది తల్లి దగ్గర్నుండి వస్తుంది. ఫలదీకృతమైన
అండకణం పదే పదే విభజన చెందుతుంది. అలా కణాల సంఖ్య పెరిగి ఒక దశలో సుమారు రెండు ట్రిలియన్
కణాలు ఉండే పాపాయిగా మారుతుంది. అప్పుడే మీ బంధువులందరూ చేరి “అరె! అచ్చం అమ్మపోలిక
(లేక నాన్న పోలిక!)” అంటూ సంబరపడిపోతుంటారు. ఒక్క కణం నుండి అన్ని కణాలు అంత తక్కువ
సమయంలో పుట్టుకు రావడమే ఓ పెద్ద అద్భుతం. అది చాలనట్టు అసలా అండకణంలోనే ఎంతో సమాచారం
దాగి వుంటుంది. శరీరాన్ని ఓ ఇల్లుగా ఊహించుకుంటే ఆ ఇంటిని కట్టడానికి కావలసిన ‘బ్లూ
ప్రింట్’ లాంటిది ప్రతీ కణం లోను దాగి వుంటుంది. ఓ కాలేయాన్ని నిర్మించాలన్నా, గుండెను
నిర్మించాలన్నా, కండరాలని, ఊపిరి తిత్తులని … ఏ దేహాంగాన్ని నిర్మించాలన్నా దానికి
కావలసిన సమాచారం అంతా కణంలో దాగి వుంటుంది. ఒక వ్యక్తి తెలివి తేటలు, రూపురేఖలు, ఇలా
ఎన్నో లక్షణాలు కణం లోతుల్లో ఉండే సమాచారంలో దాగి వుంటాయి.
అండ కణం అంటే
ఏదో కోడిగుడ్డులా పిడికెడు ఉంటుందని ఊహించుకోకండేం? అండకణం కూడా కణమే. కనుక కంటికి
కనిపించనంత చిన్నది. మరి అంత చిన్న అండకణంలో ఓ తిమింగలాన్ని నిర్మించడానికి కావలసిన
సమాచారం అంతా దాగి వుందంటే నమ్మబుద్ధి కాదుకదూ? అలాగే ఓ కుందేలుని నిర్మించాలన్నా,
ఓ ఎలుగుబంటిని నిర్మించాలన్నా, అంతెందుకు మీ బోటి మహానుభావులని నిర్మించాలన్నా దానికి
కావలసిన సమాచారం అంతా ఆ బుల్లి అండకణంలో దాగి వుంటుంది. మనలో శక్తి ఏటీపీ అనే అణువులో
దాగి వున్నట్టే, ఈ సమాచారం కూడా కణంలో ఓ ప్రత్యేకమైన అణువులో దాగి వుంటుంది.
(ఇంకా వుంది)
బాగా చెప్పారు
శ్రీనివాస చక్రవర్తి గారూ,
మీ వ్యాసాలు అన్నీ చాలా బాగుంటున్నాయి. ఐదో క్లాస్ లో ఉన్న మా పాపకు మీ వ్యాసాల్లో కొన్ని (ఆమె వయసుకు స్థాయికి తగ్గవి..) బాగా ఇష్టం.
మైటో కాండ్రియా అన్న పదం ఎనిమిదో క్లాస్ లో విన్న గుర్తు. కణం బొమ్మ గీయడానికి ఎన్ని తంటాలో అప్పట్లో!
సుజాత గారు
మీ పాపకి ఈ కింది పోస్ట్ లు కూడా నచ్చుతాయేమో ఓ సారి చూపించండి.
ఒకటి “భూమి గుండ్రంగా వుంది” అనే పిల్లల సైన్స్ నాటకం.
మరొకటి ‘సాలీడుకి జ్యామితి తెలుసా?’ అనే వ్యాసం.
మూడవది ఓ చిన్న సైన్స్ జోక్ (అది నిజంగా జరిగిన సంఘటన)
http://scienceintelugu.blogspot.in/2009/05/1.html
http://scienceintelugu.blogspot.in/2009/05/2.html
http://scienceintelugu.blogspot.in/2009/05/3.html
http://scienceintelugu.blogspot.in/2009/05/4.html
http://scienceintelugu.blogspot.in/2009/05/5.html
http://scienceintelugu.blogspot.in/2009/06/blog-post_07.html
http://scienceintelugu.blogspot.in/2009/06/blog-post_23.html
శ్రీనివాస చక్రవర్తి గారూ,
థాంక్ యూ! ఇవన్నీ వచ్చేనెల సెలవుల్లో తప్పక చూపిస్తాను. ప్రస్తుతం ఆమె స్కూల్లో సైన్స్ ఫేర్ కి ప్రయోగాలు చేసే హడావుడిలో ఉన్నది :)